Others

కర్మ ఫలితాలే సుఖదుఃఖాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్మమున బుట్టు జంతువు
కర్మమున వృద్ధి పొందు గర్మమున జెడుం
గర్మమె జనులకు దేవత
కర్మమె సుఖదుఃఖములకు కారణమనఘా
ఈ పద్యంమహాభారతంలో కనబడుతుంది. ప్రారబ్ద కర్మ అనుభవించక తప్పదు. బ్రహ్మాదులైనా సరే ప్రారబ్దకర్మ అనుభవించి తీరవలసిందే. ఇంద్రుడు బ్రహ్మహత్యాదోషమునకు భయపడి తామర కొలనులో దాగినను ఆయనకు ఆ కర్మ అనుభవించక తప్పలేదు.
దైవేచ్ఛకు పురుషుడు తలవంచి తీరవలసిందే. ఇహపర సుఖాలకు కర్మమే మూలకారణం అవుతుంది.
ప్రాప్తవ్యా నే్యవ ప్రాప్నోతి
గంత వ్యానే్యవ గచ్ఛతి
లబ్ధ వ్యానే్యవ లభతే
దుఃఖానిచ సుఖానిచ అని ఉత్తర రామాయణమునందు శ్రీరాముడు లక్ష్మణునితో చెప్తాడు. గత జన్మలో చేసిన సుకృత, దుష్కృత కర్మముల ఫలితం మానవులు అనుభవించి తీరవలసిందే. మానవులు పొందవలసిన సంపదలు పొంది తీరుతారు అంటే అది ఆ కర్మవలనే. వెళ్లవలసిన ప్రదేశాలకు పోయి తిరిగి రావలసినది కూడా ఆయా కర్మల ఫలితమే. అనుభవించవలసిన సుఖదుఃఖాలు అనుభవించక తప్పదు. సుందరీమణులు, భవనాలు, రాజభోగాలు, దాచిన ధన సంపదలు, అనుభవించువాడిని కూడా కాలమనే మృత్యుదేవత కరుణించదు.
కొందరు ఈ జన్మలో ఐశ్వర్య సంపదలు, భోగభాగ్యాలు అనుభవించుచుండును.దీనికి కారణం వారుగత జన్మలో చేసుకొన్న పుణ్యఫలితం అయి ఉంటుంది. వారు ఈజన్మలో దుర్మార్గులు కూడా ఉండి ఉండవచ్చు. ఈ జన్మలో ధర్మానికి దూరులుగా, అకృత్యాలను చేసే వారిగాను, అన్యాయాన్ని మాత్రమే చేసేవారిగాను కూడా ఉండవచ్చు. కానీ వారికి ఉన్న భోగభాగ్యాలు చూసి సమాజంలోని మిగిలిన వారు - వారు ఇన్ని అన్యాయాలు చేసినా, అక్రమాలకు ఒడిగట్టుతున్నా కూడా వారికి భోగభాగ్యాలకు కొదువ లేదు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వాపోతుంటారు. దేవుడికి వారు వీరు అన్నభేదాలుండవు. దేవుడు నిస్సంగుడు, నిరంజనుడు, కానీ ఎవరు చేసుకొన్న కర్మకు తగిన ఫలితాన్ని మాత్రమే దేవుడు వారికి అందిస్తూ ఉంటాడు. పూర్వజన్మలో చేసిన పుణ్యఫలితం వల్ల ఈ జన్మలో సంపదలు అనుభవించినా చివరకు ఈ జన్మలో చేసిన పాపఫలితం వారికి ఎదురవుతుంది. తప్పక వారు ఆ పాపఫలితాన్ని అనుభవించి తీరుతారు. సమాజం అపుడు వారిని చూస్తుంది. అపుడు తగిన ఫలితం అనుభవించాడు అని అంటుంది.
రామాయణంలో మండోదరి రావణుడు చనిపోయిన తరువాత ఆయన శవాన్ని చూసి ‘‘నాథా మంచి చేసేవారికి మంచి జరుగుతుంది. పాపాత్ములకు పాపమే సంభవిస్తుంది. నీవు చేసిన కర్మఫలితంగానే నీకీ దుర్గతి పట్టింది. ’’ అని విలపిస్తుంది.
శ్రీరామ వనవాసం, బలి చక్రవర్తి బంధీ అగుట, పాండవుల అరణ్యవాసం యదు వంశ నాశనము, నలుడు రాజ్య భ్రష్టుడు అగుట, రావణుని మరణమూ ఇవన్నీ కాల ప్రభావం వల్ల జరిగినవే.మనుష్యులు ఎపుడు కర్మబద్దులు అవుతారు కానీ స్వతంత్రులుగా ఉండనేరరు. వారిని కాలమే నడిపిస్తూ ఉంటుంది.
పుత్ర కళత్రాది సంబంధములు తెగిపోవునవే. చెట్టు నుండి పండిన పండు నేల రాలినట్లు మానవులకు మరణం తప్పదు. మృత్యుదేవత నీడవలె వెంటాడుచునే ఉంటుంది. కాలమునకు అంటే విధికి బంధువులు, మిత్రులు అను పక్షపాతధోరణి ఉండదు. అందుకే ఋణానుబంధరూపేణ... అన్నారు కదా.
సృష్టిలో అన్ని ప్రాణులకు ఏది ఎప్పుడు లభించాలో అది అపుడే లభిస్తుంది. నీరు పల్లానికి ప్రవహించినంత తేలికగా ప్రయత్న రహితంగా లభిస్తుంటుంది.
శాంతి పర్వంలో నముచి అను రాక్షసుడు ఇంద్రునికి ఈ విషయమే చెప్తాడు. మిత్రులు శుభాలు గలిగిస్తే శత్రువులు అశుభాలు కలిగిస్తూ ఉంటారు. మనప్రయత్నమే ముంటుంది? మానవులకు ఒక్కోసారి అనుకోకుండా దుఃఖం వాటిల్లుతుంది. దుఃఖంలో సర్వాన్ని కోల్పోవడం కూడా జరుగుతుంది. ఆ మనుష్యులకే తిరిగి అనుకోని సందర్భంలోనే సుఖాలు వచ్చి తీరుతాయి. ఆ సుఖాల వల్ల పోయిన సంపద, బంధువులు ఇత్యాదులన్నీ వచ్చి తీరుతాయి. అపుడు వారు ఏ పూర్వజన్మ పుణ్యమో ఇంత మంచి జరుగుతోంది అని కూడా అనుకొంటూ ఉంటారు.
ఇంతకీ మనిషికి సుఖమైనా, దుఃఖమైనా వచ్చింది అంటే అది పూర్వజన్మ సుకృత దుష్కృత కర్మఫలితమే.
కనుక ఈ జన్మలో భగవంతుడు ఇచ్చిన వివేక విచక్షణాదులను ఉపయోగించుకుంటూ మంచి చెడు తారతమ్యం తెలుసుకొని వీలైనన్ని మంచి పనులు చేస్తూ బతకాలి. కాలపురుషుడు పాశం వేసేదాక హరినామస్మరణ చేస్తూనే ఉండాలి. ఒకరికి మంచినే చేయాలి కానీ ఎట్టి పరిస్థితులలోను కీడు చేయకూడదు. దీనివల్లనే మరుజన్మను పొందినపుడు శుభాలను అనుభవించవచ్చు. దీనిని ఎల్లవేళలా మనిషి గుర్తుపెట్టుకుని పుణ్యకార్యాలను చేయడానికి అహర్నిశలూ కష్టపడుతూ ఉండాలి.

- ఆర్. రామారావు.. 9492191360