Others

సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశానికి మొదటి ఉపరాష్టప్రతిగా, రెండవ రాష్టప్రతిగా పనిచేసిన భారతీయ తత్త్వవేత్త, రాజనీతివేత్త డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని (సెప్టెంబర్ 5)న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. వీరు సెప్టెంబర్ 5, 1888న మద్రాసులోని తిరుత్తణి గ్రామంలో వీరస్వామి-సీతమ్మ దంపతులకు జన్మించారు. వీరి బాల్యము, విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి, తిరుపతిలో గడిచిపోయాయి. 21 సం. వయసులో వీరు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు. తత్వశాస్త్రంలో ఇతని ప్రతిభను గుర్తించి మైసూర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి వీరిని పిలిపించి ప్రొఫెసర్‌గా నియమించారు.
విద్యార్థులు వీరి ఉపన్యాసాలను శ్రద్ధగా వినేవారు. కలకత్తా యూనివర్సిటీలో ఆచార్య పదవి చేపట్టమని డా ముఖర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్‌లు కోరారు. దానితో ఆయన కలకత్తా వెళ్ళారు. కలకత్తా యూనివర్సిటీలో వున్నపుడు ఆయన భారతీయ తత్వశాస్త్రం అన్న గ్రంథం రాశారు. ఈ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలు అందుకుంది. 1931లో డా సి.ఆర్.రెడ్డిగారి తర్వాత రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. 1931లో రాధాకృష్ణన్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఇంటలెక్చువల్స్ కోఆపరేటివ్ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. 1935 సం.లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్య మతాల గౌరవ అధ్యక్షులయ్యారు.
చైనా, అమెరికా దేశాలలో పర్యటించి అనేక ప్రసంగాలు చేశారు. 1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యులయ్యారు. 1947 ఆగస్టు 14న స్వాతంత్రోద్యమం సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది. 1949లో భారతదేశంలో ఉన్నత విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది. దానికి వీరు అధ్యక్షులైనారు. తర్వాత భారత తొలి ఉపరాష్టప్రతిగా 26 జనవరి 1952 నుండి 12 మే 1962 వరకు పనిచేశారు. తదనంతరం భారత రెండవ రాష్టప్రతిగా 14 మే 1962 నుండి 13 మే 1967 వరకు పనిచేశారు.
వీరి రచనలు: వేదాంతములలోని నియమాలు, ఉపయోగము ఒక తలంపు 1908లో, రవీంద్రుని తత్వము 1918లో, సమకాలీన తత్వముపై మతము యొక్క ఏలుబడి 1920లో, హిందూ జీవిత చరిత్ర దృక్కోణము 1928లో, నాగరికత యొక్క భవిష్యత్తు 1929లో, ఆదర్శవాది యొక్క జీవిత దృక్కోణము 1932లో, స్వాతంత్య్రం, సంస్కృతి 1935లో, భారతీయ హృదయము 1936లో, గౌతమబుద్ధుడు 1938లో, మహాత్మాగాంధీపై రచనలు 1939లో, భగవద్గీత 1948లో.
పొందిన గౌరవాలు: ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. 1931లో బ్రిటీష్ ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ‘సర్’ బిరుదు వరించింది. 1954లో మానవ సమాజానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతరత్న బిరుదు పొందారు. 1961లో జర్మనీ పుస్తక సదస్సు యొక్క శాంతి బహుమానం పొందారు.
చేపట్టిన పదవులు: 1929లో ఆక్స్‌ఫర్డ్‌లోని మాంఛెస్టర్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. దీనివలన వారు తులనాత్మక మతము అనే విషయంమీద ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. 1931 నుండి 1936 వరకు ఆంధ్రా యూనివర్సిటీ ఉపకులపతిగా పనిచేశారు. 1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. 1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేశారు. 1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం తరపున యునెస్కో బృందానికి అధ్యక్షత వహించారు. 1952లో యునెస్కో అధ్యక్షునిగా ఎంపికైనారు. 1962లో బ్రిటీష్ అకాడమీకి గౌరవ సభ్యులుగా ఎన్నికయ్యారు.
రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నపుడు విద్యార్థులకు శ్రద్ధ గా బోధించడం కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారు. ఆయన మైసూర్‌నుండి కలకత్తాకు ప్రొఫెసర్‌గా బదిలీ అయినపుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి తమ గురువును కూర్చోబెట్టి రైల్వే స్టేషన్ వరకు శిష్యులు లాక్కుంటూ వెళ్ళారు. రాధాకృష్ణన్ రాష్టప్రతిగా ఉన్నపుడు ఆయన శిష్యులు, అభిమానులు పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా, దానికి బదులు ఆరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని ఆయన కోరారు. ఆ రోజునుండి ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ మారింది.

- కామిడి సతీష్‌రెడ్డి