AADIVAVRAM - Others

మతసామరస్యానికి ప్రతీక గూగూడు క్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహరం వేడుకల వివరాలు...
1-9-2019 ఆదివారము - శ్రీ కుళ్ళాయిస్వామివారి ప్రథమ దర్శనము
2-9-2019 సోమవారము - స్వామివారి నిత్యపూజ నివేదిక
3-9-2019 మంగళవారము - స్వామివారి అగ్నిగుండము ఏర్పాటు
4-9-2019 బుధవారము - స్వామివారిని చావిడిలో నిలుపుట
5-9-2019 గురువారము - స్వామివారి నిత్యపూజ నివేదన
6-9-2019 శుక్రవారము - స్వామివారి ఐదవ సరిగెత్తు
7-9-2019 శనివారము - స్వామివారి నిత్యపూజ నివేదన
8-9-2019 ఆదివారము - స్వామివారి ఏడవ చిన్న సరిగెత్తు, రాత్రికి దేవుని మెరువణి
9-9-2019 సోమవారము- స్వామివారి నిత్యపూజ నివేదన, విడిది దినము
10-9-2019 మంగళవారము- స్వామివారి గ్రామోత్సవము, పెద్ద సరిగెత్తు, రాత్రికి దేవుణి మెరువణి, అగ్నిగుండ ప్రవేశము
11-9-2019 బుధవారము- స్వామివారి అగ్నిగుండ ప్రవేశము, సాయంత్రం 4 గంటలకు జలధికి వెళ్ళుట
13-9-2019 శుక్రవారము - స్వామివారి చివరి దర్శనము
భిన్నత్వంలో ఏకత్వంలా మత సామరస్యానికి ప్రతీకగా మొహరం పండుగను జరుపుకుంటారు. హిందూ, ముస్లీం అనే భావన లేకుండా నిర్వహించుకునే మొహరం పండుగ ప్రారంభం అయితే అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరికీ గుర్తుచ్చే గ్రామం గూగూడు. ఈ గ్రామంలో జరిగే మొహరం వేడుకలు చూసి తరించడానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలనుంచి ఇసుకవేస్తే రాలనంతగాలక్షల మంది హాజరవుతారు. రామాయణపు ఇతిహాసపు గుర్తుగా, అరణ్యవాసము సమయంలో శ్రీరాముడు నడయాడిన నేలగా, గృహ మునీశ్వరుడు తపస్సు చేసిన స్థావరంగా గూగూడు క్షేత్రం చరిత్రకెక్కింది. కుళ్ళాయిస్వామిని, పక్కనే వున్న ఆంజనేయ స్వామిని కులమతాలకు అతీతంగా దర్శించుకునే స్థానం గూగూడు.
గూగూడు క్షేత్రం చరిత్ర
(ప్రస్తుతం వాడుకలో వున్న ఆధారాల ప్రకారం)..
400 సంవత్సరాల క్రితం చండ్రాయునిపేట అనే గ్రామంలో విశ్వబ్రాహ్మణులైన రామాచారి, లక్ష్మణాచారి అనే శిల్పులు నివసిస్తూ వుండేవారు. ఈ సోదరులు అందమైన శిల్పాలు చెక్కడంలో పేరొందిన వారు. వారి కళా నైపుణ్యంతో శిల్పులుగా ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు పొందారు. అయినా వారిలో ఏదో నిరుత్సాహం. ఒకరోజు రామాచారి లక్ష్మణాచారిలు మాట్లాడుకుంటూ మనకు ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా ఏదో అశాంతి వెంటాడుతోంది. ఏదో ఒకటి చరిత్రలో నిలిచిపోయే పనిని చేయాలని ఇద్దరు అన్నదమ్ములు నిర్ణయించుకున్నారు. దీక్షలు, ఉపవాసాలను ఆచరించి పంచలోహాలతో ఒక పీరును తయారు చేశారు. దానిపై అతి శక్తివంతమైన బీజాక్షరాలను లిఖించి ప్రాణప్రతిష్ట చేయాలని గ్రామంలోకి ఆ పీరుని తీసుకెళ్ళడంతో గ్రామప్రజలందరూ ఆ పీరుని చూసి రామా, లక్ష్మణాచారులు చాలా గొప్పపని చేశారని ప్రశంసించారు. ఆ పీరుని ఓ చిన్న చావిడిలో పెట్టి అందరూ ఆనందంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అదే రాత్రి గ్రామంలో హఠాత్తుగా మంటలు చెలరేగి తీవ్ర నష్టం వాటిల్లింది. ఎన్నడూ లేనివిధంగా ఇలా జరిగిందేమిటని గ్రామపెద్దలు అలోచనలో పడిపోయారు. కొన్నాళ్ళకు వర్షాలు కురవక ఆ గ్రామానికి కరువుకాటకాలు వెంటాడాయి. అదేవిధంగా రామాచారి ఒక్కగానొక్క కుమారుడు నీళ్ళలో పడి చనిపోయాడు. ఇలా గ్రామంలో ఏదో ఓ విధంగా నష్టం వాటిల్లుతూ గ్రామస్తులను కష్టాలు వెంటాడసాగాయి. గ్రామపెద్దలందరూ రచ్చబండపై కూర్చొని రామాచారి, లక్ష్మణాచారులు తయారు చేసిన పీరు గ్రామంలోకి వచ్చినప్పటినుంచే గ్రామానికి అరిష్టంగా మారిందని నిర్థారించారు. వెంటనే రామాచారి, లక్ష్మణాచారిలను పిలిచి గ్రామంలో ఏర్పాటు చేసినప్పటినుంచి కష్టనష్టాలను తెలియజేసి ఆ పీరును గ్రామంలోనుంచి దూరంగా తీసుకెళ్ళాలని ఆదేశించారు. గ్రామస్తులందరి మాటే తమ మాటగా భావించి అన్నదమ్ములిద్దరూ అందుకు అంగీకరించారు. అయితే దానిని ఎక్కడ తీసుకెళ్ళి వేయాలో అర్థం కాక సంకోచింపసాగారు అందరూ. అప్పుడు గ్రామపెద్ద వచ్చి పీరుని గ్రామానికి పశ్చిమ దిశగా తీసుకెళ్ళాలని దాన్ని తీసుకెళ్ళే సమయంలో అది పూర్తీగా మోయలేనంత బరువెక్కుతుందని అప్పుడు అక్కడే దాన్ని వదిలివేయాలని తెలిపారు. ఎంతో భక్తిశ్రద్ధలతో తయారు చేసిన ఈ పీరు కారణంగా తమ గ్రామానికి నష్టం చేకూరిందన్న బాధతో రామాచారి, లక్ష్మణాచారిలు పీరుని తీసుకుని ప్రయాణం ప్రారంభించారు. ఆ ప్రాంతంలోనే వున్న గంగన్నపల్లి పరిసరాల్లో వున్న ఓ దిగుడుబావి వద్దకు చేరుకోగానే ఆ పీరు చాలా బరువెక్కింది. అప్పుడు ఆ పీరుని ఆ బావిలో పడవేశారని పూర్వీకుల కథనం.
ఎన్నో ఏళ్ళ తర్వాత తిరుమల కొండన్న అనే వ్యక్తి తనకున్న గొర్రెలను మేపుకుంటూ పీరు వున్న బావిలో నీళ్ళు తాగడానికి వెళ్ళాడు. ఆ సమయంలో మెరుపులతో కూడిన ఆకాశవాణి ద్వారా నన్ను తీసుకెళ్ళు నేనూ వస్తాను అన్న శబ్దం వినిపించింది. భయభ్రాంతులతో తిరుమల కొండన్న గ్రామంలోకి పరుగులు తీసి ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు చెప్పడంతో అందరూ కొండన్నను పిచ్చివాడిలా చూస్తూ హేళన చేశారు. కొండన్న కూడా ఏదో జరిగిందిలే అనుకుని మిన్నకుండిపోయాడు. అయితే కొండన్నకు ప్రతిరోజూ ఆ బావి నుంచి తనను తీసుకెళ్ళాలనే కల వస్తూవుండేది. ఇలా కొన్నాళ్ళకు కొండన్న అనారోగ్యానికి గురయ్యాడు. గ్రామపెద్ద కొండన్నను పలకరిస్తూ ఎందుకు నువ్వు అనారోగ్యానికి గురవుతున్నావని అడగగా తనకు కలలో వస్తున్న పీరు విషయం వివరించాడు. అప్పుడు ఆ గ్రామపెద్ద కొండన్నను హేళన చేశాడు. అదేరోజు రాత్రి ఆ గ్రామపెద్దకు కూడా ఆ బావిలో వున్న పీరు కలలోవచ్చి నన్ను తీసుకెళ్ళరా అంటే హేళన చేస్తావా అని హెచ్చరించినట్లు అనిపించింది. మరుసటి రోజున ఆ గ్రామపెద్ద తిరుమల కొండన్నను తీసుకుని మరికొందరి గ్రామస్తులతో కలిసి పీరు వున్న దిగుడు బావివద్దకు వెళ్ళారు. కొండన్న బావిలోకి దిగి భక్తిశ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థించగా బావిలోని పీరు వచ్చి కొండన్న చేతిలో పడింది. ఈ పీరు చాలా మహిమాన్వితమైనదని గ్రామస్తులు గుర్తించి గ్రామంలో వున్న చిన్న చావిడిలో వున్న పీర్ల మధ్య ఆ పీరుని ప్రతిష్టించి పెద్ద కుళ్ళాయిస్వామిగా పూజలు చేయడం ప్రారంభించారు. ఏవైనా సమస్యలతో వెళ్ళిన వారు అక్కడ మొక్కుకుంటే వారికి మంచి జరుగుతూవచ్చింది. కాలక్రమేణా స్వామివారిపై నమ్మకం పెంచుకున్న అశేష ప్రజానికం కుళ్ళాయిస్వామిని దర్శించుకోవడం జరుగుతోందని చరిత్ర చెబుతోంది.
నాటి గృహ మహర్షి ఆశ్రమమే గూగూడుగా మారింది.
శ్రీరాముడి భక్తుడైన గృహ మహర్షి ఆశ్రమం ఏర్పాటు చేసుకుని నివాసం వుండేవాడు. ఎల్లప్పుడూ శ్రీరాముడి నామస్మరణ చేసుకుంటూ పూజలు చేసుకుంటూ గృహమహర్షి తపస్సు ఆచరించుకునేవాడు. ఆ సమయంలో శ్రీరాముడు సీత, లక్ష్మణులతో కలిసి అరణ్యవాసం వెళ్తూ తన భక్తుడున్న గృహ మహర్షి ఆశ్రమాన్ని దర్శించాడు. తన రాముడు తన ఆశ్రమానికి వచ్చాడని ఆనందంతో తబ్బిబ్బిపోయిన గృహ మహర్షి తన జన్మధన్యమైందని శ్రీరాముడి పాదసేవ చేసుకున్నాడు. ఇంకా కొద్దిరోజుల పాటు తన ఆశ్రమంలోనే వుండాలని గృహుడు శ్రీరాముడిని కోరాడు. అయితే అరణ్యవాసం ముగిసిన తర్వాత తిరిగి నీ ఆశ్రమానికి వస్తానని చెప్పి శ్రీరాముడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. తన రాముడు తన ఆశ్రమానికి వస్తాడని గృహ మహర్షి కొనే్నళ్ళపాటు తపస్సు చేసుకుంటూ ఎదురుచూడసాగాడు. ఇలా కొనే్నళ్ళు గడిచాయి. అయితే ఇక శ్రీరాముడు తిరిగి తన ఆశ్రమానికి ఇక రాడేమోనని బాధతో గృహుడు ఓ అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసుకుని అందులో దూకి ఆత్మాహుతి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఆ అగ్నిగుండంలో దూకే ముందు గృహ మహర్షి కళ్ళుమూసుకుని శ్రీరాముణ్ణి తలుచుకున్నాడు. అరణ్య వాసంలో వున్న శ్రీరాముడు తన భక్తుడు గృహుడి పరిస్థితిని దివ్యదృష్టితో గమనించి గృహ మహర్షి అగ్నిగుండంలో ఆత్మాహుతి చేసుకోకుండా కాపాడాలని ఆంజనేయుడికి ఆజ్ఞాపించాడు. వెంటనే ఆంజేయస్వామి గృహ మహర్షి వద్ద ప్రత్యక్షమై అగ్నిగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకోకూడదని కొద్దిరోజులకు శ్రీరాముడు మీ ఆశ్రమానికి వస్తానని వర్తమానం పంపారని గృహమహర్షి ఆత్మాహుతి చేసుకోకుండా అడ్డుకున్నాడు ఆంజనేయుడు. కొన్ని రోజుల తర్వాత శ్రీరాముడు గృహ మహర్శి ఆశ్రమానికి వచ్చి దర్శనమిచ్చి వెళ్ళాడు. అయినా కొన్నాళ్ళపాటు ఆంజనేయ స్వామి గృహ మహర్షి వద్దే వున్నట్లు, ఆనాటి గృహ మహర్షి ఆశ్రమమే గూగూడుగా మారిందని చరిత్ర చెబుతోంది. అదేవిధంగా ప్రస్తుతం కుళ్ళాయిస్వామి కొలువై వున్న చావిడి ముందు వున్న అగ్ని గుండం గృహ మహర్షి ఏర్పాటు చేసిందని, చావిడికి పక్కనే వున్న ఆంజనేయస్వామి ఆలయం గృహ మహర్షివెంట వున్న ఆంజనేయస్వామి వారే కొలువయ్యారని ఇతిహాసాల్లో వున్నట్లు భక్తాదులు నమ్ముతున్నారు.
అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం, నార్పల మండలంలో గూగూడు గ్రామం వుంది. కుళ్ళాయిస్వామి కొలువైనప్పటి నుంచి గూగూడు గ్రామంలో ఎటువంటి కరువు రాకుండా పచ్చని పంటలను తీస్తున్నామని ఆ గ్రామ రైతులు చెప్తారు. ప్రతి ఏడాది మొహరం నెలలో 10రోజుల పాటు జరిగే గూగూడు కుళ్ళాయి స్వామి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా జనం తరలివచ్చి స్వామివారిని, పక్కనే వున్న ఆంజనేయుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. హిందువులు పెద్దకుళ్ళాయిస్వామి, చిన్నకుళ్ళాయి స్వామిగా ఇక్కడ కొలువైన పీర్లను పిలుచుకుంటే హసేన్, హుసేన్‌లు గా ముస్లీములు చదివింపులు చేసుకుంటారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే మొదటిరోజు కుళ్ళాయిస్వామివారి ప్రథమ దర్శనం, 8వరోజున చిన్నసరిగెత్తు దేవుడి మెరవణి, పదవరోజున స్వామివారి గ్రామోత్సవం, పెద్దసరిగెత్తు, రాత్రికి దేవుణి మెరువణి, 11వ రోజున స్వామివారి అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాలను తిలకించడానికి లక్షల మంది భక్తాదులు ఆసక్తి కనబరచడం విశేషం. భగభగ మండే అగ్నిగుండంలో స్వామివారి సునాయాస నడక, ఆయనవెంట ఇతర చిన్న పీర్లు వెళ్ళడమే స్వామి వారిలో అత్యంత మహిమలు వున్నాయనడానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకుంటారు. 7తరాల నుంచి దూదేకుల కులానికి చెందిన వారు ఇక్కడ ముజావర్లుగా వ్యవహరిస్తున్నారు. కుళ్ళాయిస్వామి వారిని ప్రతిష్టించిన మొదట బాబాసాహెబ్ ఆ తర్వాత అతని కుమారులు మనవళ్ళు, మునిమనవళ్ళైన బడప్ప, చిన్నహుసేన్, రోషన్‌సాహెబ్, గూడూసాబ్, పెద్దకుళ్ళాయప్ప, హుసేన్‌లు ముజావర్లుగా స్వామివారి సేవ చేస్తున్నారు. స్వామివారికి ఇప్పటివరకు భక్తాదులు సమర్పించుకున్న బంగారం రెండు కిలోల 9096 గ్రాములు, వెండి 1109 కిలోలు, నగదు 1.24 కోట్లు ఉన్నట్లు దేవాదాయశాఖ అధికారుల ద్వారా తెలిసింది. గూగూడు చాలా చిన్న గ్రామం కావడంతోపాటు బ్రహ్మోత్సవాల సమయంలో భక్తాదుల సౌకర్యం కోసం దేవాదాయ శాఖ ఎటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోకుండా వుంటుండటంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షల మంది భక్తాదులు గ్రామం చుట్టూ వుండే గుట్టలు, పొలాల్లో వుండాల్సి వస్తోంది. మొహరం పండుగ అంటే గూగూడు, గూగూడు అంటే కుళ్ళాయిస్వామి, ఆంజనేయస్వాముల జంట ఆలయాల స్మరణ, రాముడు నడయాడిన నేలగా విరాజిల్లుతున్న గూగూడు క్షేత్రం దేవాదాయశాఖ మరింత అభివృద్ధి పరిచి అన్ని సౌకర్యాలతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా వుందని భక్తాదులు విన్నవించుకుంటున్నారు.

- నల్లమాడ బాబ్‌జాన్, 85000 83799