Others

శ్రద్ధతో చేసే శ్రాద్ధం. మహాలయ పక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదకాలం నాటినుండి భాద్రపద కృష్ణ పక్ష ప్రతిపద నుండి అమావాస్య వరకు పితృ పక్షంగా పిలువబడే పక్షం రోజులు పితృ కర్మలు ఆచరించడం తరతరాల వారసత్వంగా వస్తున్నది. దైవ గణాలకు సంబంధించి దక్షిణాయనం రాత్రి కాలం. దైవబలం తక్కువగా ఉన్న సమయాన, పితృగణాలు తిరిగి జన్మను పొందాలన్న కాంక్షతో, తమ శక్తులను ఏకీకృతం గావించి, కర్మాధికారం కలిగిన మానవుల వైపు చూస్తుంటాయి. మనుస్మృతి ప్రకారం ఆషాఢం లోని కృష్ణపక్షం నుండి ఐదు పక్షాలు అనగా భాద్రపద కృష్ణపక్షం వరకు పితరులు వంశీకుల నుండి అన్నాదులను కోరుతారు. స్కంద పురాణంలోని నాగరఖండం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నది.
సూర్యుడు కన్యలో ప్రవేశించింది మొదలుగా ఉన్న దినాలలో పితృదేవతలకు శ్రాద్ధం పెట్టాలి. తద్వారా పితృ గణాలకు సంతృప్తి కలుగుతుంది. హేమాద్రి పండిత విరచితమైన చతుర్వర్గ చింతామణి ఆధారంగా సూర్యుడు కన్యారాశిలో సంచారం చేసే పదహారు పగటి కాలాలు పితృ యజ్ఞం చేయాలి. తద్వారా గయాశ్రాద్ధం చేసిన ఫలితం దక్కుతుంది. పితృ గణాలు ఏడు. వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్విషదులు, హవిస్మంతులు, ఆజ్యపులు, సోమపులు, అంగిరసులు. పితృ పక్షాలలో ప్రతిరోజు శ్రాద్దం చేయాలని కాలామృతకారుడు నిర్ణయించాడు. వీలుకాకుంటే ఒక్క రోజైనా మహాలయ పక్ష విధి చేయాలి. ఒకప్పుడు దేవ, దానవుల మధ్య భీకర పోరు జరుగగా, ఆ యుద్ధం భాద్రపద బహుళ పాడ్యమి మొదలు అమావాస్య వరకు జరిగినట్లు, అందు దేవతలు (ఆర్యులు) క్రమముగా ఓడి పోయి, సన్యాసులు మొదలైన వారు మరణించినట్లు, ఆయా వీరులు మృతి చెందిన దినములకే యతి మహాలయం, శస్తహ్రత మహాలయం మొదలగు పేర్లు కలిగినట్లు, అమావాస్య నాటికి సంపూర్ణంగా ఆర్యులు పరాజితులై, స్వస్రాశ్రమాలకు పరుగులు తీసినట్లు, ఆర్య వీరులు మృతి చెందిన దినములు శ్రాద్ధ దినములుగా పరిగణింప బడుతున్నట్లు పురాణ కథనాలు. మహాలయ పక్షం ఆర్యులచే యుగాది, యుగాంతాది షణ్ణవతి (96) పితృ శ్రాద్ధ దినములలో చేర్పబడి నైమిత్తిక కర్మములైనాయి. పితృ దేవతలకు ప్రీతికరమైనవి సంవత్సరంలో 96దినాలు. 14మన్వాదులు, 16మహాలయాలు, 4యుగాదులు, 12సంక్రాంతులు, 12అమావాస్యలు, 13వ్యతీపాతములు, 13వైధృతులు, 12అన్వష్టకలు కలిపి 96 దినాలు. ‘‘శ్రద్ధయా దీయతే శ్రాద్ధం’’. అంటే శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం. మహాలయ విధి నాలుగు రకాలు. భౌతిక శరీరం మొదటిది. కనిపించేది రెండవది ప్రేత శరీరం. మూడవది ఆత్మ సూక్ష్మ శరీరం. ఈ మూడింటి ప్రతీకలు మహాలయ సంకల్పంలో చెప్పుకునే వసు, రుద్ర, ఆదిత్య రూపాలు. ఈ మూడు రూపాలలో పితరులకు, అగ్నిముఖం, బ్రాహ్మణ భోజనం, ఉపవాసం నాలుగు పద్ధతులలో శ్రాద్దం ఆచరణీయం. పితృ పక్షాలలో చివరి రోజైన భాద్ర పద అమావాస్యను మహాలయ అమావాస్య అని అంటారు. సంప్రదాయాచరణ పరుని జీవిత కాలంలో మహాలయ పక్షంలో నదీ తీరాలలో శ్రాద్ధ కర్మ చేయడం మహత్కార్యంగా భావిస్తారు. ఈక్రమంలో వారివారి పితరులు మృతి చెందిన తిథుల ప్రకారం భాద్రపద కృష్ణ పక్షంలో అదే తిథులతో పౌరోహితుల ద్వారా శ్రాద్ధ కర్మలను ఆచరించి, పిండ ప్రదానాలు చేయడం సంప్రదాయం. ఇలా చేయలేని వారు తిలాంజలితో పితృ తర్పణాలనైనా వదులుతారు.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494