Others
కాటగలసిన వూరు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నాలుగేండ్లు వలసపక్షినై పోయవచ్చేసరికి
నే పుట్టి పెరిగిన వూరొకటి కాటగలిసిపోయందిక్కడే
ఇక్కడ నా మూలాలుండేవి, ఆనవాల్లుండేవి, జ్ఞాపకాలుండేవి
చిన్నప్పుడు నా చేయ పట్టుకుని
నాన్నలా నడిపించుకుని వెళ్లిన మట్టితోవ
కనుమరుగయంది
నాలుగులైన్ల నల్లని డాంబర్ రోడ్
పింజర తొవ్వని మింగేసి
నాలుగు రోడ్ల కూడలిలో సుట్టసుట్టుకుని పడుకుంది
దానిమీంచి ఏ దిక్కుకు పోవాల్నో దిక్కుతోస్తలేదు
నా వూరికి నేను దారి వెదుక్కునే దుస్థితి
బాటెంబడి వింజామరలై పచ్చని గాలుల్ని విసిరే
పైర్ల జాగలో ప్లాట్లు వెలిసినవి
జిట్టరేగుపండ్ల చెల్కలు
తలపై జొన్నకంకుల పింఛాలు ధరించిన జొన్నచేండ్లు
తాత మీసాలు వేసుకున్న మక్కచేండ్లూ
ఓ పురాజ్ఞాపకం.
వూరి తలాపున పెద్ద దిక్కోలె పెద్దగుట్టుండేది
జారుడుబండపై జారిన జ్ఞాపకాల్ని
ముక్కలుగా నరికి లారీలకెత్తుతుండ్రు
భూమాత వక్షస్థలిని పేల్చి పెకలిస్తుండ్రు
గుట్ట ఆవసంలో గూళ్ళు కట్టుకున్న
పక్షులు, జీవులు ఏ పరాయ పంచన జేరినవి
మిఠాయ పొట్లాన్ని చిటారుకొమ్మన కట్టుకుని దీపస్తంభాల్లా
ఇరువైపులా నిలబడి తలలూపుతూ
స్వాగతం పలికే చెలులు చెట్లను ఛిద్రం జేసిండ్రు
దారినపోయే దాహార్తుల దూపతీర్చ నేనున్నానని
నీటి స్తన్యాన్ని అందించే అమ్మచెరువు
బోర్లేసిన తపుకై ఎత చెప్పుకుంటుంది
కట్టపై కూర్చుని కవితలల్లుకున్నచోట
శిథిల చెదల వేటు
పాడువడ్డ పాడి, కబేళాలకు తరలుతున్న పశుసంపద
ప్యాకెట్లలో పాలు - సీసాల్లో నీళ్ళు అమ్ముతున్న వైనం
నడుస్తున్న కొద్దీ పాదాల్లో దిగబడుతున్న
నాగరికత ముండ్లు
ఆరుబయట ఆటలాడుకునే బాల్యం
సినిమా హాల్లో ఈలలై మోగుతున్నది
యవ్వనం.. సిటీ షికార్లయ తిరుగుతున్నది
బార్లలో బీరు సీసాలై దొర్లుతున్నది
సాయంకాలం అరుగుల మీద కూర్చుని
వావివరసల పలకరింపుల్తో పులకరింపజేసే ఆప్యాయతలు
టీవీ ముందర బాసింపట్టేసుక్కూర్చున్నవి
పురిపోసలు ఉరితాడ్లయ
మొగ్గాలసప్పుడు ఆగిన శాలోల్లవాడోలె
వూరు మూగవోయంది.
వృత్తుల్తో పాటు వూరూ ధ్వంసమైంది
కాటగలిసింది ఊరా! మనిషా!