Others

‘సామాజిక కవి’ జాషువా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజానికి, సాహిత్యానికి విడదీయరాని అవినాభావ సంబంధం ఉం టుంది. సమాజంలో నెలకొని ఉన్న సమస్యలే సాహిత్యరూపంలో ప్రతిబింబిస్తాయి. వివిధ రకాల అణిచివేతల వల్ల, సంఘర్షణల వల్ల సమాజంలో ఉద్యమాలు ప్రారంభవౌతాయి. ఉద్యమాల ప్రభావం సాహిత్యంపైన, సాహిత్య ప్రభావం ఉద్యమాలపైన తప్పనిసరిగా పడుతుంది. భారత స్వాతంత్య్ర ఉద్యమం, హరిజనోద్ధరణ ఉద్యమం ఇందుకు నిదర్శనాలు. వివిధ రకాల మత సంస్కరణోద్యమాల ప్రభావం సాహిత్య రంగంపై పడి ప్రజలలో చైతన్యం కలిగించడానికి అనేక రచనలు వెలువడ్డాయి. తెలుగు సాహిత్యంలో దళితుల దయనీయ స్థితిని సాహిత్య వస్తువుగా తీసుకొని అనేకమంది కవులు తమ రచనల ద్వారా అణగారిన వర్గాల ఆత్మగౌరవాభివృద్ధికి కృషిచేసి, వారిలో చైతన్యం రగిలించడానికి అహరహం ప్రయత్నించారు. అలాంటి గొప్ప కవులలో ముందు వరుసలో నిలిచినవారు గుర్రం జాషువా.
తన జీవిత అనుభవాలనే కవితా వస్తువుగా చేసుకొని విలక్షణమైన కవితా మార్గాన్ని ఏర్పరచుకున్న కవి జాషువా. పేదరికం, కుల మత భేదాలు తన గురువులని ఆయన చెప్పుకున్నారు. పేదరికం తనకు సహనాన్ని, కుల మత భేదాలు ప్రతిఘటించే శక్తిని ఇచ్చాయని జాషువా అన్నారు.
జాషువా 1895 సెప్టెంబర్ 28న వీరయ్య, లింగమ్మ దంపతులకు గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. జాషువా తల్లిదండ్రులది కులాంతర, మతాంతర వివాహం. జాషువా బాల్యంలోనే కుల వివక్షకు గురికావడంతో ఆతర్వాతి కాలంలో ఆయన రాసిన కవిత్వం మీద కూడా ఆ ప్రభావం ఎంతగానో పడింది. కుల వివక్షతో అనేక అవమానాలు ఎదురైనా తనకున్న అపారమైన పాండిత్యంతో అరుదైన కవిగా గుర్తింపును పొంది, ఛీత్కారాలు పొందిన చోటనే అనేక సత్కారాలు పొందారు. జాషువా ఏ సాహిత్యప్రక్రియలో రచనలు చేసినా, తనకంటూ ఒక ప్రత్యేకతను తెలుగు సాహితీ ప్రపంచంలో ఏర్పర్చుకోవడం ఆయన పాండితీ వైదుష్యానికి నిదర్శనమని చెప్పవచ్చు.
జాషువా ఉపాధ్యాయుడిగా, మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా, ఆ తర్వాత యుద్ధ ప్రచారశాఖలో అసిస్టెంట్ ఆఫీసరుగా, ఆలిండియా రేడియోలో స్పోకెన్ వర్డ్ ప్రొడ్యూసర్‌గా వివిధ వృత్తులలో పనిచేశారు. ఆ తర్వాత శాసన మండలి సభ్యుడి (ఎమ్మెల్సీ)గా కూడా ఎన్నికై ప్రజాసేవ చేశారు. జాషువా రచనలలో ప్రధానంగా పద్య కావ్యాలు, నాటకాలు, నవలలు, ఖండ కావ్యాలు ఉన్నాయి. కుల మత వైషమ్యాలకు తావులేని సమాజం రావాలని ఆయన ఆకాంక్షించాడు. మానవత్వానికి సంబంధించిన వివిధ అంశాలను కవితావస్తువుగా తీసుకొని రచనలు చేశారు. తన రచనల ద్వారా వర్ణవ్యవస్థను ఎండగట్టారు. ఒక మతం మరొక మతంతో పోటీపడుతూ ప్రజలను మోసగిస్తున్నాయి కానీ ప్రజలంతా ఐకమత్యంగా ఉండే మార్గాన్ని మాత్రం ఏ మతం చెప్పడం లేదని తన ఆవేదనను వెలిబుచ్చారు జాషువా. మతం పేరుతో జరుగుతున్న అన్యాయాలను, శ్రామికులను దోచుకునే సామ్రాజ్యవాద శక్తులను, స్ర్తిల అణచివేతను, అంటరానితనాన్ని, రాజకీయాల్లో నిలకడలేని స్థితిని తన రచనల ద్వారా ఖండించారు. జాషువా తన రచనతో సామాజిక చైతన్యాన్ని కలిగించాలని కోరుకున్నాడు. దేశభక్తి, మానవతావాదం జాషువా రచనలలో ప్రస్ఫుటంగా కనబడుతుంది.
గబ్బిలం, ఫిరదౌసి, బాపూజీ, నేతాజీ, శివాజీ, స్వయంవరం, క్రీస్తుచరిత్ర, నాగార్జునసాగర్, నా కథ, రుక్మిణీ కళ్యాణం మొదలైనవి జాషువా ప్రసిద్ధ రచనల్లో కొన్ని. ప్రాచీన పద్యరూపానికి ఆధునిక వస్తువును జోడించి తనకంటూ ఒక ప్రత్యేక శైలిని సొంతం చేసుకున్న కవి గుర్రం జాషువా. అందుకే జాషువా కవిత్వం నిత్యనూతనంగా వుంటూ ఆధునిక కవులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. కవితా విశారద, కవికోకిల, కవి దిగ్గజ, మధుర శ్రీనాథ, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి మొదలగు బిరుదులెన్నో జాషువా పాండిత్యానికి నిదర్శనంగా నిలిచాయి. శతావధాని చెల్లపిళ్ళ వెంకటశాస్ర్తీ జాషువాకు గండ పెండేరం తొడిగి సత్కరించారు. జాషువా తను రాసిన క్రీస్తుచరిత్ర రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. జాషువా సాహిత్య ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1970లో పద్మభూషణ్ బిరుదునిచ్చి సత్కరించింది. 1971 జూలై 24న జాషువా పరమ పదించినప్పటికీ ఆయన కవిత్వం మాత్రం తెలుగు పాఠకుల హృదయాలలో చిరకాలం సజీవంగానే ఉంటుంది.

-కందుకూరి భాస్కర్