AADIVAVRAM - Others

మళ్లీ జన్మించు మహాత్మా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భరతమాత బానిస సంకెళ్లను సత్యం, అహింస అనే ఆయుధాలతో తెంచి భారతీయుల హృదయాలలో జాతిపితగా సుస్థిర స్థానం సంపాదించుకున్న మహనీయుడు మహాత్మాగాంధీ. జన బాహుళ్యంలో మహాత్ముడిగా కొనియాడబడుతున్న ధన్యజీవి గాంధీజీ. బాకులూ, తుపాకులతో పని లేకుండా అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన ధీశాలి. మహాత్ముడు చూపిన సత్యం, అహింస అనే మార్గాలు నేటికీ ప్రపంచ జనావళిలో మనోబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి. ప్రపంచ మహనీయులెందరో మహాత్మాగాంధీని కొనియాడారు. గాంధీజీ జీవిత చరిత్రను తెలియజేస్తూ లెక్కలేనన్ని పుస్తకాలు ప్రపంచంలోని అనేక భాషల్లో వెలువడినాయి. గాంధీజీపై ఆంగ్ల భాషలో నిర్మించిన చలనచిత్రం సంచలనాన్ని సృష్టించింది. ముఖ్యంగా గాంధీజీ ఆత్మకథ భారతదేశంలోని 16 భాషల్లో అనువదించారు. మహాత్ముని గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా మనకు తెలియని ఇంకా అనేక విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఒక సామాన్య వ్యక్తి అతీత శక్తిగా మారి దైవాంశ సంభూతుడిగా పూజలందుకోవడం ఊహాతీతమైన విషయం. అది బాపూజీకే సొంతం. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకడం, మురికివాడలను మొదలుకుని పాకీ దొడ్లను శుభ్రం చేయడం, కుల మతాలన్నీ ఒకటే అని ప్రజల్ని చైతన్యపరచడం, సత్యం, అహింసా, సత్యాగ్రహ సిద్ధాంతాలతో కరడుగట్టిన హృదయాలను సైతం కరిగించడం ఇత్యాది సులక్షణాలన్నీ బాపూజీ ప్రపంచ మానవాళికి అందించారు. ఈ ఏడాది అక్టోబర్ 2కు గాంధీజీ 150వ జయంతిని పూర్తి చేసుకుని 151లో అడుగిడుతున్న నేపథ్యంలో వారిని గుర్తు చేసుకుంటూ...
బాల్యం
గాంధీజీ అసలు పేరు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ. వీరు 2 అక్టోబర్ 1869 శుక్ల నామ సంవత్సరం భాద్రపద బహుళ ద్వాదశి శనివారం గుజరాత్‌లోని పోరుబందర్ గ్రామంలో ఒక సామాన్య సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. పుతలీబాయి, కరంచంద్ గాంధీ వీరి తల్లిదండ్రులు. పదేళ్ల వయస్సులోనే గాంధీజీ అంటరానితనంపై వాదించారు. పాకీ పని చేసేవారికి ఎందుకు తాకరాదని ప్రశ్నించారు. చిన్నతనం నుండే తల్లిదండ్రులంటే అమితమైన గౌరవం. ఒకసారి సత్యహరిశ్చంద్ర నాటకం చూశారు. ఇకపై అసత్యమాడరాదని నిర్ణయించుకున్నారు. గతంలో చేసిన తప్పులను మననం చేసుకునేవారు. వాటిని కాగితంపై రాసి తండ్రికి చూపించి ఇకపై తప్పు చేయనని చెప్పేవారు. గాంధీజీ నిజాయితీకి తండ్రి చాలా సంతోషించేవారు. చిన్నతనం నుండి ఆయన నీతికథలు వినేవారు. గాంధీజీ 13 ఏళ్ల వయసులోనే కస్తూరిబాయితో బాల్య వివాహం జరిగింది. ఈ దంపతులకు నలుగురు సంతానం. వారు హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ. గాంధీజీకి ఆడ సంతానాన్ని కోరుకున్నారు. అయితే ఆడపిల్ల కలగలేదు. గాంధీజీ తాత ఉత్తమచంద్ గాంధీ. వీరు పోరుబందరులోని సంస్థానానికి దివానుగా ఉండేవారు. గాంధీజీ తండ్రికి నలుగురు భార్యలు. ముగ్గురు భార్యలు సంతానం కలగకుండానే చనిపోయారు. నాల్గవ భార్య పుతలీబాయి. ఈమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. కుమారులలో చివరివాడు గాంధీజీ. ఈ ముగ్గురు సోదరుల వివాహం ఒకేసారి జరగడం విశేషం. బాపూజీని చిన్నతనంలో ‘మొనియా’ అని పిలిచేవారు. బాల్యం నుండి గాంధీజీ చదువు, నడవడి, యెడల అమితమైన శ్రద్ధ చూపేవారు. విద్యార్థి దశలోనే ఆయన ఉపకార వేతనాన్ని పొందారు. కాలినడకతోనే పాఠశాలకు వెళ్లి వచ్చేవారు. అదే అలనాటి జీవితాంతం కొనసాగించారు. గాంధీజీ చేతిరాత బాగుండేది కాదు. లెక్కలు బాగా చేసేవారు. ఎంతో ప్రయాసతో సంస్కృత భాషను నేర్చుకున్నారు. పాఠశాల స్థాయిలోనే పారసీ భాషను బోధించడంతో నేర్చుకోక తప్పలేదు.
ఇంగ్లండ్ పయనం
గాంధీజీ మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత సాధించారు. బారిస్టర్ చదవడానికి ఇంగ్లండ్ పంపమని గాంధీజీ కుటుంబ శ్రేయోభిలాషి మాన్జీదవే సూచించారు. పదమూడవ ఏట పెళ్లి చేసుకున్న గాంధీజీ 18వ ఏట ఇంగ్లండ్ వెళ్లారు. గాంధీజీ బాల్యంలో ఒకసారి మాంసాన్ని తిన్నారు. ఇటువంటి కారణాల వల్ల తల్లి పుతలీబాయి ఇంగ్లండ్ పంపడానికి సందేహించారు. గాంధీజీ చేత మూడు ప్రమాణాలు చేయించి లండన్ పంపమని బెనర్జీ స్వామి సూచించారు. దీంతో మాంసము, మద్యం, స్ర్తిని ముట్టనని గాంధీజీ మూడు ప్రమాణాలు చేశారు. అప్పుడు తల్లి ఇంగ్లండ్ ప్రయాణానికి అంగీకరించారు. గాంధీజీ ఇంగ్లండ్ వెళ్లడానికి వృషభానందుడు ఆర్థిక సహాయాన్ని చేశారు. బారిస్టర్ విద్యాభ్యాసానికై ఇంగ్లండ్ వెళ్లిన గాంధీజీ శాకాహారిగానే ఉన్నారు. ఎప్పుడూ మద్యం సేవించలేదు. పరస్ర్తిని తాకలేదు. తల్లికిచ్చిన మాట ప్రకార జీవితాన్ని సాగించి బారిస్టర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 1891లో భారతదేశానికి తిరిగి వచ్చారు. గాంధీజీ ఇంగ్లండ్ నుండి తిరిగి వచ్చాక బొంబాయి హైకోర్టులో కొన్నాళ్లు న్యాయవాదిగా పని చేశారు. ఆ సమయంలోనే గాంధీజీ దంపతులకు పిల్లవాడు కలిగాడు. బాపూజీ ధనవంతుల వద్ద ఫీజు తీసుకుని పేదవారి కేసులను ఉచితంగా వాదించేవారు. ఇంగ్లండ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చి ఏడాది తిరగకుండానే బొంబాయికి చెందిన దాదా అబ్దుల్లా కంపెనీ కేసు వాదించడానికి గాంధీజీ ఒంటరిగా దక్షిణ ఆఫ్రికాకు వెళ్లవలసి వచ్చింది.
దక్షిణ ఆఫ్రికాలో గాంధీజీ
గాంధీజీ దక్షిణ ఆఫ్రికాలోని ప్రిటోరియాకు ఒంటరిగా వెళ్లారు. అక్కడ తల్లి, భార్య లేని లోటు ఆయనకు కనిపించింది. ప్రిటోరియాలో అడుగడుగునా వివక్షతను చవిచూశారు. అక్కడ శే్వత, నల్ల జాతీయులని వర్ణ వివక్షత ఉండేది. వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగాలలో తెల్లజాతీయులదే పైచేయి. తెల్లదొరల పాఠశాలల్లోకి నల్లవారిని అనుమతించరు. రైళ్లల్లో సైతం తెల్లవారితో కలసి ప్రథమ శ్రేణి బోగీలో ప్రయాణం చేయకూడదు. తెల్లవారి సమీప గృహాలలో కూడా ఇతరులు నివసించరాదు. వారిలా టోపీలు ధరించి హుందాగా ఎవరూ కనిపించకూడదు. పెద్దపెద్ద హోటళ్లలో నల్లజాతీయులను రానిచ్చేవారు కాదు. భారతదేశంలో పేద వారిని తెల్లదొరలు ఉద్యోగాలిస్తామని ఎరజూపి ప్రిటోరియాకు తీసుకుని వెళ్లి బానిసలుగా, కూలీలుగా మార్చి హీనంగా చూడటం మొదలుపెట్టారు. ఈ విధంగా దక్షిణ ఆఫ్రికాలో అనేక మంది భారతీయులు నివాసం ఏర్పరచుకున్నారు. శే్వత జాతీయులు ఎన్ని హింసలు పెట్టినా భారతీయులంతా భయంతో నోరు మెదపకుండా జీవించేవారు. పశువుల కంటే హీనస్థితిలో వున్న భారతీయుల జీవితాలను చూసి గాంధీజీ చలించిపోయారు. అటువంటి తరుణంలో చీకట్లో చిరుదివ్వెలా మహాత్మాగాంధీ అక్కడి వారికి తారసపడినారు. స్వీయానుభవంతో వారి హక్కుల సాధనకై గాంధీజీ నడుం బిగించారు. బానిసలుగా బ్రతుకుతున్న అన్ని వర్గాల వారిని ఒక వేదికపై తెచ్చి ఒక సంఘాన్ని స్థాపించారు. వీరందరికీ సమాజంలో న్యాయమైన స్థానం కల్పించాలని కార్యాలయాలకు వినతి పత్రాలను పంపేవారు. ప్రిటోరియాలోని రక్షక భటులు వీరందరినీ లాఠీలతో తరిమికొట్టారు. ఆ సమయంలో గాంధీజీ ప్రజలకు చెప్పిన తారకమంత్రం ఒకటే ‘ఒక చెంపను కొడితే మరో చెంపను చూపించండి’. తెల్లవారు ఎవరిని హింసించినా ఎదురు తిరగరాదు. హింసతో ఏమీ సాధించలేమని ప్రజలకు బోధించారు. గాంధీజీ అహింసా సిద్ధాంతానికి తెల్లదొరలు అవాక్కయ్యారు. అప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు అవలంబించని ఇటువంటి పరిస్థితుల్ని తెల్లవారు చూడలేదు. ఈ విషయం విన్న అనేక దేశాల వారిని గాంధీజీ అహింసా వాదం ఆశ్చర్య చకితుల్ని చేసింది. ఈలోగా 1896లో గాంధీజీ తక్కువ మంది ప్రయాణం చేయదగిన పోన్‌గోలా స్టీమర్‌లో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ కాలంలోనే బొంబాయిలో ఉన్న గాంధీజీ బావకు జబ్బు చేసింది. సోదరితోపాటు బావను కూడా రాజ్‌కోటకు పిలుచుకుని వచ్చి చాలా ఉపచారాలు చేశారు. అయినా వ్యాధి తీవ్రత పెరగడంతో ఆయన కన్నుమూశారు.
ఆ తరువాత గాంధీజీ 1897లో భార్యాబిడ్డలతో దక్షిణ ఆఫ్రికాకు వెళ్లారు. దర్బన్ అనే ప్రాంతంలో కుటుంబ సమేతంగా నివసిస్తూ శే్వత జాతి దురహంకారంపై పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఈ చర్య శే్వత జాతీయులకు నచ్చలేదు. వారు గాంధీజీపై ఆగ్రహం వ్యక్తపరిచారు. అయినా గాంధీజీ పట్టువదలని విక్రమార్కునిలా 22 మే 1894లో ‘నేటాల్ ఇండియన్ కాంగ్రెస్’ను స్థాపించి ఆఫ్రికాలోని నల్లజాతీయుల హక్కులకై పోరాడారు. దక్షిణ ఆఫ్రికాలో ఫినిక్స్ పేరుతో ఒక ఆశ్రమాన్ని కూడా స్థాపించారు. ఒకవైపు న్యాయవాదిగా కొనసాగుతూ మరోవైపు దక్షిణ ఆఫ్రికాలోని నల్లజాతి హక్కుల కోసం పోరాడేవారు. అహింసా మార్గంలో పోరాటం కొనసాగించినప్పటికీ జైలుశిక్ష తప్పలేదు. ఆ తరువాత 1901లో గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చి జరిగిన కాంగ్రెస్ సభలకు హాజరయ్యారు. ఏడాది పాటు భారతదేశంలో ఉండి అనంతరం 1902 డిసెంబర్‌లో తిరిగి దక్షిణ ఆఫ్రికాకు తన పోరాటాన్ని కొనసాగించారు. ఇలా అనేక ఏళ్ల పాటు దక్షిణ ఆఫ్రికాలో గాంధీజీ అహింసాయుత పోరాటం జరిపారు. నల్లజాతి సంక్షేమం కోసం గాంధీజీ స్థాపించిన ఫినిక్స్ ఆశ్రమంలో ప్రతి ఆదివారం సర్వమత ప్రార్థనలు జరిపేవారు. దీంతో దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం భారతీయులపై అనేక ఆంక్షలను విధించింది. అక్కడి ప్రభుత్వం ‘బ్లాక్ ఆర్డినెన్స్’ పేరుతో నల్ల చట్టాన్ని చేసింది. దీంతో 13వేల మంది భారతీయులు ప్రిటోరియాలోని ఒక మసీదులో సమావేశమైనారు. ఈ పోరాటంలో గాంధీజీకి రెండు మాసాల జైలుశిక్షను విధించారు.
దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహం
దక్షిణ ఆఫ్రికా కేప్‌టౌన్‌లోని అత్యున్నత న్యాయస్థానం 1913లో ఒక తీర్పునిచ్చింది. దాని ప్రకారం హిందూ, ముస్లిం, పారశీక ప్రజలు క్రైస్తవ సంప్రదాయం ప్రకారమే వివాహాలు చేసుకోవాలి. దీన్ని వ్యతిరేకించిన గాంధీజీ ‘సత్యాగ్రహం’ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహం అనే పదం తొలిసారిగా పుట్టింది. దక్షిణ ఆఫ్రికాలో 11 సెప్టెంబర్ 1906లో ప్రారంభమైన సత్యాగ్రహోద్యమం ద్వారా శాంతియుతంగా ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని, ఆత్మగౌరవానికి భంగం కలిగే ఏ శాసనానికి తలొగ్గరాదని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గాంధీజీకి మళ్లీ జైలుశిక్ష పడింది. జైలు నుండి విడుదల కాగానే గాంధీజీ తన అహింసాయుత పోరాటం ప్రారంభించారు. శే్వత ప్రభుత్వం చేసేది లేక అనేక సమస్యలను పరిష్కరించింది. ఈ విధంగా గాంధీజీ దక్షిణ ఆఫ్రికాలో అనేక విజయాలు సాధించి జగద్విఖ్యాతి పొందారు.
భారతదేశానికి తిరిగి రాక
అనంతరం 1915లో గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చి బ్రిటిషు వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపి వారి ఆగ్రహానికి గురై పలుమార్లు జైలుకు వెళ్లారు. అంటరానితనాన్ని నిరసించి హిందూ ముస్లిం భారుూ భారుూ అనే నినాదంతో ముందుకు సాగుతూ చరఖా, ఖాదీ వస్త్రాలను ప్రోత్సహించారు. మద్యపానాన్ని మానమని హితవు పలికారు. స్ర్తి స్వాతంత్య్రం కోసం గాంధీజీ ఎనలేని కృషి చేశారు. ఆ మీదట గాంధీజీ భారత ప్రజల క్షేమం కోసం కృషి చేశారు. అహ్మదాబాద్ సమీపాన చరబ్ అనే చిన్న గ్రామంలో 25 మే 1915లో సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్థాపించారు. గాంధీజీ స్థాపించిన సబర్మతీ ఆశ్రమం, వార్ధా ఆశ్రమం ఆయన ఆశయాలకు ప్రతిరూపాలే. అదే సమయంలో గాంధీజీ గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. అనతి కాలంలోనే గాంధీజీ స్వరాజ్య ఉద్యమంలో పాల్గొని అందరి ప్రశంసలందుకుని జాతీయ నాయకుడిగా ఎదిగారు. గాంధీజీకి రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్, అబుల్ కలాం ఆజాద్ ఇత్యాది నాయకులంతా గాంధీజీకి అత్యంత సన్నిహితులైన పిదప (మిగతా 15వ పేజీలో)

జాతీయోద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి 1921 నాటికి తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అనంతరం 1922లో గాంధీజీ రెండేళ్లపాటు జైలులో గడిపారు. ఈ కాలంలో కాంగ్రెస్ అతివాద, మితవాద వర్గాల మధ్య భేదాలు బలపడినాయి. హిందూ ముస్లిం వైషమ్యాలు పెచ్చుపెరిగిపోయాయి. గాంధీజీ జైలు నుండి విడుదలైన పిదప మూడు వారాలపాటు నిరాహారదీక్ష చేసి నిరక్షరాస్యత నిర్మూలన, అంటరానితనం, మద్యపాన నిషేధంపై పోరాటం చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా బ్రిటీష్ పాలనను వ్యతిరేకించారు. ప్రభుత్వ సంస్థలను బహిష్కరించడం, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలు వదిలేయడం, విదేశీ వస్తువులను బహిష్కరించడం, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం, శాసనోల్లంఘన, ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా అందరూ రాట్నాలపై నూలు వడకడం, ఖద్దరు దుస్తులు ధరించడం ఇత్యాది కార్యక్రమాలను సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని చౌరీచౌరాలో ఉద్రేకాలు పెల్లుబికి హింసకు దారితీసిన నేపథ్యంలో గాంధీజీ ఆ ఉద్యమాన్ని వెంటనే నిలిపివేశారు. భారత స్వాతంత్రయ సమర వీరులకు వ్యతిరేకంగా బ్రిటీష్ వారు 1919లో రౌలట్ చట్టం చేశారు. జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో జలియన్ వాలాబాగ్‌లో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అనేక మంది అమాయకపు భారతీయులను తుపాకీలతో కాల్చి చంపారు. ఒక్క భారతీయుడికి కూడా స్థానం లేకుండా సైమన్ కమీషన్‌ను బ్రిటిష్ వారు ఏర్పరిచారు. ఈ నేపథ్యంలో ఆంగ్లేయులకు భారతీయులకు మధ్య దూరం పెరిగింది. శాసనోల్లంఘనలో భాగంగా 6 ఏప్రిల్ 1930లో గాంధీజీ అహ్మదాబాద్ నుండి 400 కి.మీ. పాదయాత్ర చేసి దండి చేరుకుని సముద్రం నీటి నుండి ఉప్పును తయారుచేసి ఆంగ్లేయుల ఆగ్రహానికి గురయ్యారు. బ్రిటీష్ వైస్రాయి ఇర్విన్ - గాంధీజీ మధ్య 1931లో ఇర్విన్ ఒడంబడిక జరిగింది. ఇందులో భాగంగా 27 ఆగస్టు 1931లో పలు రాజకీయ పక్షాల వారితో గాంధీజీని రెండవ రౌండ్ టేబుల్ సమావేశం కోసం లండన్‌కు ఆహ్వానించారు. రౌండ్ టేబుల్ సమావేశం నిరాశపరచింది. అనంతరం గాంధీజీ తిరిగి భారతదేశానికి వచ్చి సహాయ నిరాకరణోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇర్విన్ తరువాత వచ్చిన లార్డ్ వెల్లింగ్టన్ భారతదేశానికి వైస్రాయిగా నియమితుడై అత్యంత కఠినంగా వ్యవహరించి గాంధీజీని అరెస్టు చేసి కారాగారానికి పంపాడు. జైలు నుండి విడుదలైన గాంధీజీ హరిజన్ పత్రికను, హరిజన సేవకు సంఘాన్ని స్థాపించి విభజించి పాలించే బ్రిటీష్ వారి దమన నీతికి వ్యతిరేకంగా భారతీయులంతా కలసిమెలసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం వార్ధాలో సేవాగ్రాంను ఏర్పాటు చేశారు. ఆ మీదట 7 నవంబర్ 1933 నుండి గాంధీజీ భారతదేశ పర్యటనకు బయలుదేరి పల్లెలు, పట్టణాలు తిరిగి తన ఉపన్యాసాలతో ప్రజల్ని చైతన్యపరిచారు. ఆ తరువాత 1934లో గాంధీజీ గాంధీ సేవా సంఘం, అఖిల భారత హరిజన సేవా సంఘం, హిందుస్థాన్ ప్రాథమిక విద్యా సంస్థ, అఖిల భారత చరఖా సంఘం, దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఇత్యాది అనేక సంస్థలను స్థాపించారు. ఏప్రిల్ 1919లో గాంధీజీ తొలిసారి విజయవాడలో ఉపన్యసించి తెలుగు వారిలో గొప్ప చైతన్యాన్ని తెచ్చారు.
అనేక పోరాటాల అనంతరం 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహం తరువాత చివరి ఉద్యమం క్విట్ ఇండియా అని చెప్పవచ్చు. భారతదేశాన్ని వదలండి అన్న నినాదంతో ఆ ఉద్యమం తీవ్ర స్థాయి చేరి పెద్ద ఎత్తున హింస కొనసాగింది. గాంధీజీతోపాటు కాంగ్రెస్ కార్యవర్గాన్నంతా 9 ఆగస్టు 1942లో అరెస్టు చేశారు. గాంధీజీని పూణె జైలుకు పంపారు. ఆ సమయంలో ఆయన కార్యదర్శి మాధవ దేశాయ్ మరణించారు. గాంధీజీ సతీమణి కస్తూరిబాయి 18 మాసాల కారాగార వాసం అనంతరం మరణించారు. బాపూజీ ఆరోగ్యం బాగా క్షీణించడంతో 1944లో ఆంగ్లేయులు ఆయనను కారాగారం నుండి విడుదల చేశారు. మన దేశానికి 1946లో ఎన్నికలు జరిగాయి. చాలాచోట్ల కాంగ్రెస్ విజయం సాధించడంతో నెహ్రూ ప్రధానిగా ఇంటీరియం ప్రభుత్వం ఏర్పడింది. ముస్లింలీగ్ కూడా అనేక చోట్ల విజయం సాధించింది. ముస్లిం లీగ్ ప్రభుత్వంలో చేరడానికి నిరాకరించింది. పాకిస్తాన్ ఏర్పాటు చేయాలనేది జిన్నా ఆకాంక్ష. హిందూ ముస్లిం గొడవలు ప్రారంభమైనాయి. బీభత్సం, రక్తపాతం, హత్యలు జరిగాయి. ఇన్ని గొడవల మధ్య 14 ఆగస్టు 1947న పాకిస్తాన్ ఆవిర్భవించింది. ఆ మరుసటి రోజే 15 ఆగస్టు 1947న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. హిందూ ముస్లిం సఖ్యత కోసం బాపూజీ తీవ్ర కృషి చేసి చివరకు వౌన వ్రతానికి పూనుకోవడంతో చాలావరకు గొడవలు సద్దుమణిగాయి. గాంధీజీ 30 జనవరి 1948లో ప్రార్థనా సమావేశానికి బయలుదేరారు. అభా, మను అనే ఇద్దరు యువకుల భుజాలపై చేతులు వేసి వారిని నడిచే కర్రల వలే ఆధారంగా చేసుకొని బాపూజీ నడుస్తున్నారు. అక్కడకు నాధూరాం గాడ్సే అనే అతను గాంధీజీకి నమస్కరించాడు. అతని చేతుల మధ్య పిస్టల్ తీసి గాంధీజీపై అతి సమీపంగా కాల్పులు జరిపాడు. గాడ్సే కాల్పులు జరిపిన వెంటనే గాంధీజీ కుప్పకూలారు. ఒక అహింసా శిఖరం నేలకొరిగింది. భారతజాతి మొత్తం కన్నీరు మున్నీరుగా విలపించింది. నిజానికి గాంధీజీపై అనేక పర్యాయాలు హత్యా ప్రయత్నం జరిగింది. 1934లో ఒకసారి, 20 జనవరి 1948లో కూడా గాంధీజీపై హత్యా ప్రయత్నాలు జరిగినప్పటికీ తృటిలో తప్పించుకున్నారు. మహాత్ముడి సమాధి ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో నిర్మించారు. నేటికీ ఆయన అభిమానులు అక్కడికి వెళ్లి గాంధీజీకి నివాళులర్పిస్తుంటారు.
ఆయుధంగా అహింస
భారత స్వాతంత్య్ర సమరంలో అనేక మంది అనేక రకాలుగా పోరాడారు. ఈ సమరంలో భగత్‌సింగ్, చంద్రశేఖర ఆజాద్, జననమే కానీ మరణం తేదీ లేని నేతాజీ ఇలా అనేక మంది చిరు ప్రాయంలోనే ప్రాణత్యాగం చేశారు. వారంతా గొప్పవారే. వారి త్యాగాలకు వెల కట్టలేము. అయితే గాంధీజీ ఎంచుకున్న హింసకు తావులేని అహింసా సిద్ధాంతం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆ సిద్ధాంతం పాటించటం వల్లనే సామాన్య మనిషిగా పుట్టిన గాంధీజీ నేడు ప్రపంచ దేశాలచే భారత జాతిపితగా కొనియాడబడుతున్నారు. గాంధీజీకి సత్యం, అహింస సిద్ధాంతాల గురించి వివరించి చెప్పిన వ్యక్తి రాజా చంద్ర. కొల్లాయి గట్టిన ఈ అర్ధ దిగంబర స్వామి అందరి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయన పాటించిన అహింసా సిద్ధాంతం చాలా గొప్పది. మహావిష్ణువుకు ప్రీతికరమైన ఎనిమిది పుష్పాలు అహింస, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, సహనం, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం. గాంధీజీ ఎంచుకున్న అహింస విష్ణువుకు ఇష్టమైన మొట్టమొదటి పుష్పం. ఒక జీవిని చంపడం, ఒకరికి ఇష్టంలేని పనిని బలవంతంగా చేయించి తద్వారా దుఃఖాన్ని కలిగించడం, ఇతరుల మనసుకు బాధ కలిగించడం ఇత్యాదివి హింసా ప్రవృత్తులు. హింసను మూడు రకాలుగా పేర్కొన్నారు. మానసిక హింస, వాచిక హింస, కాయిక హింస. పాపభీతి, మనోనిగ్రహం లేకపోవడం, ఇతరులకు హాని తలపెట్టడం మానసిక హింస. కఠినంగా మాట్లాడటం, అసత్యం పలకడం, ఇతరులను నొప్పించడం వాచిక హింస. ఒక జీవిని చంపడం, పరస్ర్తి సహవాసం, మాంసభక్షణ, జీవులను గాయపరచడం, చెడు పనులు చేయడం ఇత్యాదివి కాయిక హింస క్రిందకు వస్తాయి.
సర్వకాల, సర్వావస్థలలో ఇతర ప్రాణులకు ఏ రకమైన కష్టాన్ని కలిగించకుండా ఉండటమే అహింస. గాంధీజీకి ముందే జైనులు, బౌద్ధులు ఇత్యాది అనేక మతాలలోని ఆధ్యాత్మిక ఆలోచనల్లో అహింసా సిద్ధాంతం పేర్కొన్నారు. బుద్ధ భగవానుడు అహింసా ప్రవచనాలను బోధించింది మన దేశంలోనే. జైన మతస్థులు సూక్ష్మ జీవులు చనిపోతాయని మూతికి వస్త్రం కట్టుకునేవారు. ఇస్లాం అనే పదానికి అర్థమే శాంతి, అహింస. ముస్లిం అంటే శాంతి కాముకుడు అని అర్థం. ఏసుక్రీస్తు అహింసను బోధించి శాంతిక చిహ్నం అయ్యారు. అయితే అహింసను భారీ స్థాయిలో స్వాతంత్య్ర పోరాట సమయంలో ఉపయోగించిన వ్యక్తి గాంధీజీ. అప్పట్లో హింసా ప్రవృత్తి పెరిగిపోయింది. స్వాతంత్య్ర సంగ్రామం నాటికి ఆధునిక ఆయుధాలు వచ్చేశాయి. ఈ తరుణంలో అహింసా సిద్ధాంతం ద్వారా స్వరాజ్యం తెచ్చుకున్న భారతదేశం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఆయన చాలా నిరాడంబరంగా జీవించారు. కేవలం అహింస ద్వారానే మానవ సమాజం హింస నుండి బయట పడగలుగుతుంది. కుల, మత, జాతి, స్ర్తి, పురుష భేదాలు లేని సమాజాన్ని స్థాపించాలనేదే గాంధీజీ ఆశయం.
అందరికీ పని, కూడూ, గూడు, వస్త్రం, విద్య, వైద్యం లభించడమే గ్రామ స్వరాజ్యం. ఆయన జీవితాశయం స్వరాజ్యంతోపాటు సురాజ్య సాధనే అత్యంత ప్రియమైనదిగా భావించారు. ఆయన కోరుకున్న స్వరాజ్యం పేదవాడి స్వరాజ్యం. పేదవాడి కనీస అవసరాలు తీరినప్పుడే పరిపూర్ణ స్వరాజ్యం లభించినట్లని ఆయన భావన. మనం ప్రేమను ఇస్తే అది తిరిగి వస్తుంది అని చాటి చెప్పిన మహనీయుడు.
సత్యాగ్రహం
సత్యం కోసం జరిపే పోరాటమే సత్యాగ్రహం. గాంధీజీ ఆయుధాలలో ఇది ఒకటి. అహింస మూల ధర్మంగా సహాయ నిరాకరణ, ఉపవాస దీక్షను ఆయుధాలుగా చేసుకుని చేసిన ధర్మ పోరాటమే ఈ సత్యాగ్రహం. సత్యాగ్రహం అన్న మాటలో కోపం అనే అర్థం కూడా ఉంది. నిజానికి ఇందులో ఎలాంటి కోపతాపాలకు, దౌర్జన్యాలకు తావులేదు. సత్య అంటే నిజం కోసం అని అర్థం. ఆగ్రహం అంటే పట్టుదల చూపించడం. సత్యం కోసం ఆత్మార్పణ చేయడం అని అర్థం. సత్యాగ్రహం అనేది అత్యంత శాంతియుతంగా సాగింది. తమ కోర్కెలు నెరవేర్చుకోవడానికి, డిమాండ్ల సాధన కోసం అత్యంత శాంతియుతంగా చేసిన పోరాటమే సత్యాగ్రహం. దీన్ని ఆయుధంగా చేసుకుని గాంధీజీ ఆంగ్లేయులను గడగడలాడించాడు. నేటికీ ఇది సర్వసాధారణంగా మనకు కనిపిస్తుంది. చాలామంది తమ కోర్కెల సాధన కోసం ఇప్పటికీ నిరాహారదీక్షలు, ఆమరణ నిరాహారదీక్షలు, ఉపవాస దీక్షలు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ సత్యాగ్రహంలో భాగమే. సత్యం కోసం జరిపే రాజీలేని పోరాటమే సత్యాగ్రహం. తమ నిరసనను తెలియజేసే అహింసా మార్గమే సత్యాగ్రహం. సత్యాగ్రహ ప్రాముఖ్యతను ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి ఏడాది గాంధీజీ జన్మదినోత్సవమైన అక్టోబర్ 2న ఆయన స్మారకార్థం అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవంగా జరపాలని నిర్ణయించడం ప్రతీ భారతీయుడు గర్వించదగిన విషయం.
మహాత్ముని సూక్తులు
అనేక సందర్భాలలో మహాత్ముడు పలు ఉపన్యాసాలలో తన బోధన ద్వారా ప్రజల్ని చైతన్యపరిచారు. స్వేచ్ఛా భారత్ నుండి స్వచ్ఛ భారత్ వైపు అడుగు ముందుకు వేయాలని ఆయన ఆనాడే పిలుపునిచ్చారు. జీవితేచ్ఛ అహేతుకం కాదు. అది సహజం. సత్యం, అహింస దైవ స్వరూపాలు. జీవితం పట్ల అనురక్తి భ్రాంతి కాదు. వాస్తవం. అన్నింటిని మించి జీవితానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనానే్న ఓడించాలనుకోవడం పాపం. కాబట్టి ఆత్మహత్య మహా ప్రాపం అంటారు బాపూజీ. పశుబలమే శక్తికి చిహ్నమైతే మగవాడే బలవంతుడు. అలా కాక బలమన్నది నైతికమూ, మానసికమూ అయితే నిస్సందేహంగా మహిళలే శక్తిమంతులు. సత్యం భగవంతుడి కన్నా గొప్పది. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగు గోడలు కాదు. అందమనేది నడవడిలో ఉంటుంది. ఆడంబరంలో కాదు. పౌరులు నైతికాభివృద్ధే నిజమైన అభివృద్ధి. గురువును మించిన పాఠ్యగ్రంథం లేదని నిత్యం ఆయన విశ్వసించేవారు.
గాందీజీ కలలు కన్న దేశం ఇదేనా?
గాంధీజీ భారతదేశం ప్రపంచ స్థాయిలో అత్యున్నతంగా ఉండాలని ఎన్నో ఆశలు, ఆశయాలతో కలలు కన్నారు. నేడు ప్రతి విషయం దాదాపు ఆయన కలలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయని నిస్సంకోచంగా చెప్పవచ్చు. గాంధీజీ భిన్నత్వంలో ఏకత్వాన్ని కోరుకున్నారు. కేవలం భారతదేశంలోనే కాక ప్రపంచంలో మనుషులంతా సమానం అని భావించారు. నేడు కొందరు రాజకీయ నాయకుల మాయలో పడి మనం కులాల కంపులో, మతాల మత్తులో, ప్రాంతీయ భేదాలతో కొట్టుకు పోతున్నాము. గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నారు. గ్రామాలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని ఆయన అనేవారు. శోచనీయమేమిటంటే నేటికీ మన దేశంలోని అనేక గ్రామాలలో విద్య, వైద్యం సరిగా అందడం లేదు. మద్యం మాత్రం ఏరులై పారుతోంది.
* * *
ప్రపంచమంతా గాంధీజీ సిద్ధాంతాలను ప్రశంసిస్తున్నారు. చివరకు భారత కరెన్సీతోపాటు పోస్టల్ స్టాంపులపై కూడా గాంధీజీ చిత్రం చోటు చేసుకుంది. కానీ గాంధీజీని విమర్శించే వారు ఎక్కువగా మన దేశంలోనే ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. గాంధీజీని విమర్శించడం ఫ్యాషన్‌గా మారిపోయింది. ఆయనను విమర్శిస్తే ఎక్కువ పేరు వస్తుందనే ఆశతో విమర్శించే వారు కూడా లేకపోలేదు.
ఇటువంటివి పోవాలంటే మళ్లీ మహాత్ముడు జన్మించాలి. అయితే ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఆ కాలంలో లేవు. నేడు మహాత్ముడు తిరిగి జన్మించినా వీటిని చక్కదిద్దగలడా? అనే అనుమానం కలుగక మానదు. నేటి పరిస్థితులు మారాలంటే ఒక మహాత్ముని వల్ల కాదేమో? ప్రతి ఊరికి పదిమంది మహాత్ములు జన్మిస్తేనే గాంధీజీ కలలు కన్న భారతదేశాన్ని చూడటం సాధ్యపడుతుందేమో?
గాడి తప్పిన భారతదేశాన్ని సరైన పంథాలో నడిపించే మహాత్ముల అవసరం నేటి కాలంలో ఉంది. అందుకే ఓ మహాత్మా మళ్లీ జన్మించు.

-షేక్ అబ్దుల్ హకీం జానీ 9949429827