Others

‘శాంతిదూత’ నోట మాటల తూటాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే భారత రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా ‘నోబెల్’ శాంతి పురస్కార గ్రహీత, పాకిస్తాన్ సాహస యువతి మలాలా యూసఫ్‌జియా మరోసారి ప్రధాన వార్తల్లోకి వచ్చింది. 370వ అధికరణాన్ని రద్దుచేయడం అన్నది పాకిస్తాన్‌కు జీర్ణించుకోలేని విషయం అన్న సంగతి అందరికీ తెలిసిందే. మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన మలాలా పాకిస్తానీ మహిళ. గనుక ఆమె తన దేశానికి అనుగుణమైన వ్యాఖ్యానాలు చేయడం ఆశ్చర్యకరం కాదు. నిజానికి మానవ హక్కులు అన్నవి పాకిస్తాన్‌లో భూతద్దం పెట్టి వెతికినా కనపడవు. నిత్యం సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి చొరబడే పాకిస్తానీ జిహాదీ మూకలు కశ్మీరులో జరిపే దారుణ మారణకాండ ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే. అలాంటిది కశ్మీరులో మానవ హక్కులను కాలరాస్తున్నారని మలాలా వ్యాఖ్యలు చేయడం చాలా విడ్డూరమైన విషయం.
జమ్మూ కశ్మీర్ గురించి ప్రస్తావిస్తూ తాను రాసిన బహిరంగ లేఖలో మలాలా- ‘పరస్పర దాడులతో ఒకరినొకరు బాధించుకోవలసిన అవసరం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ నేడు కశ్మీర్‌లోని మహిళలు, పిల్లల పరిస్థితి నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. అక్కడ జరుగుతున్న ఘర్షణల వల్ల వారికి రక్షణ కరువయ్యింది. అన్ని దక్షిణాసియా దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఈ విషయంలో తగిన విధంగా స్పందిస్తాయని ఆశిస్తున్నాను. మన మధ్యలో ఏవిధమైన అభిప్రాయభేదాలున్నప్పటికీ కశ్మీరులోని మహిళలు, పిల్లల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ మానవ హక్కుల పరిరక్షణ కోసం మనమంతా కలిసి పోరాడాలి. గత ఏడు దశాబ్దాలుగాఉన్న జమ్మూ-కశ్మీర్ సమస్య ఇకనైనా పరిష్కృతమై అక్కడ శాంతి నెలకొనాలి’ అని పేర్కొన్నారు.
అయితే కపట బుద్ధితో మలాలా తనకు తోచిన విధంగా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. మార్చి 2019లో పాకిస్తాన్‌లో ఇద్దరు హిందూ బాలికలను ముస్లిం యువకులు ఎత్తుకుపోయి బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. ‘నీ వయస్సువారే అయిన ఇద్దరు హిందూ బాలికలు పాకిస్తాన్‌లో కిడ్నాప్‌కు గురయ్యారు. కిడ్నాప్ చేసినవారు మీ మతానికి చెందినవారే. వారు ఆ బాలికలపై అత్యాచారం చేసి, బలవంతంగా మతం మార్చి పెళ్ళిచేసుకున్నారు. ఈ అత్యాచారం గురించి ప్రపంచానికి మీ స్పందన ద్వారా తెలియాలి’’ అంటూ కృష్ణ అనే వ్యక్తి మలాలాకు ట్విట్టర్‌లో పోస్టు పెడితే మలాలా అతడిని ట్విట్టర్‌లో ‘బ్లాక్’ చేసింది. అంతేకాదు.. భారతదేశాన్ని విమర్శిస్తూ మలాలా ఆ పోస్టుకు కామెంట్ పెట్టింది కూడా. ఇదీ నోబెల్ పురస్కార గ్రహీత అయిన మలాలా వైఖరి.
‘బీబీసీ ఉర్దూ’ టీవీ చానెల్ కోసం- 2009లో తాలిబాన్ల నీడన తన బతుకు ఎలా గడిపిందో వివరిస్తూ ఒక బ్లాగ్ రచనలో వెలిబుచ్చిన అభిప్రాయాల ద్వారా మలాలా అందరి దృష్టిలోనూ పడింది. తరువాత మలాలా జీవితం గురించి న్యూయార్క్ టైమ్స్ పత్రిక జర్నలిస్ట్ ఆడమ్ బి.ఎలక్ ఒక డాక్యుమెంటరీ తీశారు. నెమ్మది నెమ్మదిగా బాలికల విద్య గురించి పాకిస్తానీ చానెళ్ళలో మలాలా ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇది తాలిబన్లకు చికాకు తెప్పించింది. అక్టోబర్ 9, 2012న ఒక సాయుధ తాలిబన్ మలాలా ప్రయాణిస్తున్న స్కూలు బస్సులోకి ఎక్కి ఆమెపై కాల్పులు జరిపాడు. ఆ కాల్పులలో ఆమె నుదుటి ఎడమవైపు తీవ్రంగా గాయపడింది. మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు బర్మింగ్‌హామ్ (ఇంగ్లండ్)లోని క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్‌కి అక్టోబర్ 15న ఆమెను తరలించారు. ఇదంతా తెలిసిన ఐక్యరాజ్యసమితి ఆమెని ‘వీర బాలిక’గా పేర్కొంది. అప్పటి నుంచి ఆమె ఇంగ్లండులోనే ఉంటోంది. మలాలా విశ్వవిద్యాలయ విద్య పూర్తిచేశాక తాము తిరిగి పాకిస్తాన్‌కి వచ్చే విషయంలో ఆలోచిస్తామని ఆమె తల్లిదండ్రులు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ధీర వనితగా, యోధురాలిగా మలాలాపై ప్రశంసల వర్షం కురిసింది. క్వీన్ ఎలిజబెత్-2, బరాక్ ఒబామా వంటి అగ్రరాజ్యాల నేతలను కలిసి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆక్స్‌ఫర్డ్ యూనియన్‌లో, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో, లండన్‌లో జరిగిన బాలికల సదస్సులోను, అమెరికా, కెనడాల్లో జరిగిన ఎన్నో సమావేశాలలో మలాలా ప్రసంగాలు చేసింది.
అక్టోబర్ 2013లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిసిన సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ‘పాకిస్తాన్‌లోని తాలిబన్ ప్రభావిత ప్రాంతాలపై డ్రోన్ల ద్వారా జరపతలబెట్టిన దాడుల గురించి ఒబామా పునరాలోచించాలి’ అంటూ మలాలా అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. తీవ్రవాదులను విద్యావంతులను చెయ్యడం ద్వారా మాత్రమే ఉగ్రవాద సమస్యకు పరిష్కారం చేకూరుతుందని ఆ సభలో ఆమె అంది. సరిగ్గా ఆనాటి నుండే మలాలా నిజస్వరూపం బయటపడటం మొదలయ్యింది.
తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడి, మృత్యువుతో పోరాడి ఎట్టకేలకు బతికి బట్టకట్టిన మలాలా ఆ తాలిబన్లపైనే దాడులు చేయవద్దని అమెరికా అధ్యక్షునికి సూచన చేస్తోంది. దీనినేమనుకోవాలి? ఆమె సంకుచిత మనస్తత్వం అనుకోవాలా? నిజానికి జీహాదీ ఉగ్రవాద ముఠాల నాయకుల్లో చాలామంది ఉన్నతస్థాయి విద్యను అభ్యసించినవారే. ఇది ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు. ఉగ్రవాదులకు సంబంధించిన వార్తా నివేదికలను చదివితే ఆ విషయాలు తెలుస్తాయి.
మలాలా తండ్రి సంపన్నవర్గానికి చెందినవారు. ఆయన ‘‘ది మలాలా ఫౌండేషన్’’ సంస్థ పేరుతో వివిధ సంస్థల నుండి, సెలబ్రిటీల (వీరిలో ప్రముఖ సినీ నటి అంజెలీ నాజోలీ కూడా ఉంది) నుండి భారీగా విరాళాలు సేకరించారు. 2018 జూన్ నెలలో లెబనాన్ బెకావేలీలో సిరియా శరణార్థుల కోసం ఈ సంస్థ ఒక పాఠశాల నెలకొల్పింది కూడా.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా మలాలా ఎన్నో అవార్డులను, రివార్డులను, ప్రశంసలను అందుకుంది. ప్రపంచంలోని అత్యున్నత పురస్కారమైన నోబెల్ శాంతి బహుమతిని కూడా ఆమె అందుకుంది. ఎన్నో దేశాలు పర్యటిస్తూ ఉపన్యాసాలు ఇస్తూ, టీవీ చానెళ్ళలో ఇంటర్వ్యూలు ఇస్తూ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ని విమర్శిస్తూ ఆమె రకరకాలుగా విరాళాలు సేకరిస్తుంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మలాలా గాని, ఆమె తండ్రి గాని సిరియాలోను, ఇరాక్‌లోను ముస్లిమేతర మహిళలపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో నోరైనా మెదపడం లేదు. ఇస్లామీ శక్తుల చెరనుండి యజిది (ఇరాన్, సిరియా, టర్కీలలో నివసిస్తున్న ఒక జాతి) బాలికలను విడిపించడానికి ఆమె ఐక్యరాజ్యసమితిని కోరలేదు కూడా. కానీ ఇదే మలాలా తీవ్రవాద విషయంలో ముస్లింలపై విమర్శలు చేయవద్దని ఉపన్యాసాలిస్తోంది. 370వ అధికరణాన్ని రద్దుచేయడం పూర్తిగా భారతదేశ అంతర్గత విషయం. దీనిపై మాట్లాడే అధికారం మలాలాకు ఎంతమాత్రం లేదు. కాని ఆమె 370వ అధికరణం రద్దువల్ల మానవ హక్కులు కశ్మీరులో మంటగలసి పోతున్నాయని వివిధ దేశాలలో ఉపన్యాసాలిస్తోంది. ఇదీ నోబెల్ శాంతి పురస్కార గ్రహీతగా మలాలా తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్న తీరు!

-ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690