Others

అహింసావాది.. మన మహాత్ముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరాయి పాలన చెర నుండి మన దేశాన్ని విముక్తి చేయడానికి కృషి చేసిన మహానుభావులలో మొదటగా స్మరించదగినవారు మహాత్మాగాంధీ. సత్యం, అహింస సిద్ధాంతాలతో సామాన్య ప్రజల్లో సైతం జాతీయ భావాలను రేకెత్తించి బ్రిటీష్ వారి గుండెల్లో గుబులు పుట్టించిన దృఢ చిత్తుడు ఆయన. బ్రిటీష్ పాలకుల నియంతృత్వ పాలనకు కళ్ళెం వేసిన మహామేధావి. వివేకం, వివేచనతో లక్ష్యసాధనలో విజయం సాధించిన ధీశాలి గాంధీజీ. చిన్నతనంలో తల్లివద్ద విన్న పురాణేతిహాసాలు ఆయనపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఉన్నత విద్యానంతరం ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ చదివి ఉత్తీర్ణులైనారు. 1893లో న్యాయవాద వృత్తికై దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ జాతి వివక్ష ఎక్కువగా ఉండేది. శే్వత జాతీయులు నల్లజాతీయులను చాలా హీనంగా చూసేవారు. నల్ల జాతీయుడు అనే కారణంతో గాంధీజీని మొదటి తరగతి రైలుపెట్టె నుండి దింపివేసి అవమానించారు. ఇది తెల్లవారి జాత్యాహంకారానికి ఒక ఉదాహరణ మాత్రమే. గాంధీ అక్కడి భారతీయులు దుస్థితిని చూసి చలించిపోయారు. దక్షిణాఫ్రికాలోని నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడి వారిలో రాజకీయ, సామాజిక స్పృహ కల్పించి స్వాతంత్య్రేచ్ఛకు పునాది వేశారు గాంధీ.
1914లో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత గాంధీజీ ఇక్కడి పరిస్థితులను చూశాక స్వాతంత్య్రోద్యమ ఆవశ్యకతను గుర్తించారు. ఈ ఉద్యమంలో ఆయనకు అనేకమంది ప్రముఖులు అండగా నిలిచారు. చంపారన్ సత్యాగ్రహోద్యమం, విదేశీ వస్తు బహిష్కరణోద్యమం, సహాయ నిరాకరణోద్యమం, దండియాత్ర, శాసనోల్లంఘనోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం మొదలైనవి గాంధీజీ నాయకత్వంలో విజయవంతంగా జరిగి, భారతదేశ స్వాతంత్య్ర సాధనలో కీలకపాత్ర వహించాయి. స్వాతంత్య్రోద్యమంలో భాగంగా లాఠీ దెబ్బలు భరించి, అనేకమార్లు జైలుకుకూడా వెళ్లారు. అయినప్పటికీ తను నమ్ముకున్న అహింసనూ సత్యాన్నీ వదిలిపెట్టలేదు.
స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనడమే కాకుండా దేశాభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్న అనేక సమస్యలపై కూడా గాంధీజీ దృష్టి సారించారు. దళితులను హరిజనులుగా భావించి అస్పృశ్యత నివారణ కోసం కృషిచేశారు. వయోజన విద్య, మద్యపాన నిషేధం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయదారుల అభ్యున్నతి వంటి అనేక నిర్మాణాత్మక కార్యక్రమాల్లో గాంధీజీ పాలుపంచుకున్నారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్, పాకిస్తాన్‌లుగా ఏర్పడటంతో గాంధీజీ తీవ్రంగా కలతచెందారు. హిందూ, ముస్లింలు సమైక్యతతో జీవించాలని సత్యాగ్రహం చేసిన మహానీయుడు గాంధీజీ. దేశ స్వాతంత్య్రం కోసం అహర్నిశలు కృషిచేసిన గాంధీని 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. గాంధీజీ స్మృతి చిహ్నంగా అతని స్మారక స్థలాన్ని ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఏర్పాటుచేశారు. గాంధీజీ స్థాపించిన సబర్మతీ ఆశ్రమం ఆయన ఆశయానికి ప్రతి రూపం. ఆశ్రమంలో తన పనిని తానే స్వయంగా చేసుకునేవాడు. విద్య అనేది పనిని కల్పించే విధంగా ఉండాలని భావించారు. వృత్తివిద్యలను ప్రోత్సహించారు. గాంధీజీ ప్రతిపాదించిన విద్యా విధానం పలువురి మన్ననలు పొందింది. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని భావించి గ్రామ స్వరాజ్యం కోసం కృషి చేశారు. రక్తం పారించకుండా సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అనే ఆయుధాలతో రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్య ఆధిపత్యాన్ని మన దేశం నుండి పారదోలి భారతీయులందరికీ స్వేచ్ఛను ప్రసాదించి జాతిపితగా నిలిచారు. గాంధీజీ ఔన్నత్యాన్ని ప్రస్తావిస్తూ ప్రఖ్యాత శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ‘‘ఇటువంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు’’అని అన్నాడు. అటువంటి మహానీయుని ఆశయ సాధనకు చిత్తశుద్ధితో కృషిచేయాల్సిన బాధ్యత భారతీయులుగా మనందరిపైనా ఉంది.

-కందుకూరి భాస్కర్ 94415 57188