AADIVAVRAM - Others

‘మట్టిమనుషుల’కు రంగుల హంగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక ‘కానె్సప్ట్’ను తీసుకుని దాని మూలాల్లోకి వెళ్లి, దర్శించి, తాదాత్మ్యం చెంది చిత్రరచన చేయాలని చిత్రకళను బోధించే ఆచార్యులు తమ విద్యార్థులకు చెబుతారు. వారి మాటను చిత్రకారిణి పూస ఆండాలు తు.చ తప్పకుండా పాటించారు. తనదైన ప్రత్యేక శైలిలో బొమ్మలు గీశారు.
ఆమె గీసిన బొమ్మల్లో మహిళలు లావుగా.. గుండ్రంగా మొరటుగా కనిపిస్తారు. నిజ జీవితంలో తాను చూసిన, దర్శించిన మహిళలనే ఆమె తీసుకున్నారు. లావుగా, బరువుగా ఉండటం వల్ల వారిలో ఓ రకమైన ‘ఆత్మన్యూనతా’ భావం ఉంటుందని చిత్రకారిణి గమనించారు. కాని ఆ లావుదనంలో, భారీకాయంలోనూ అందం ఉందని, తెలియని ఓ ఆకర్షణ ఉందని నిరూపించేలా ఆండాలు ‘కుంచె’ పట్టారు. తెలంగాణ మూలవాసుల్లో ఇలాంటి వారు కనిపిస్తారు. ఒక వయసొచ్చాక, సంసార బాధ్యతలు నిర్వర్తించాక మహిళలు లావుగా మారడం కొందరికి అంతగా ఆకర్షణీయంగా కనిపించకపోయినా ఆండాలు మాత్రం వారికి అండగా నిలిచి తనదైన నైపుణ్యంతో వారిని కాన్వాసు పైకి తీసుకొచ్చి కొత్త కోణంలో వారిని దర్శిస్తున్నారు. వీక్షకులను దర్శింపజేస్తున్నారు.
గ్రామాల్లోని శ్రమజీవుల్లో కొందరు ఈ రకంగా కనిపిస్తారు. ముతక చీరలు, ముతె్తైదువతనం, పెద్దబొట్టుతో ‘పెద్దరికం’తో అగుపిస్తారు. కానీ ఇతరుల దృష్టిలో వారి శరీర ఆకారం భిన్నంగా ఉండటంతో వారిలో ఆత్మన్యూనతా భావం కనిపిస్తుందని చిత్రకారిణి అంటున్నారు. వారిలో ఆ భావం తొలగించేందుకు తన వంతు ప్రయత్నం చేయదలచుకున్నానని ఆమె అంటున్నారు.
అలాంటి వారిని చిత్రకారిణి తన మనసులో నిలుపుకుని, ఆవాహన చేసుకుని ఆ మూల వాసుల ఆకారాల్ని అటు కాగితంపై కాన్వాసుపై పదేపదే చిత్రించారు. చాలా స్వల్ప మార్పులతో అనేక కాన్వాసులను అలంకరించారు. ఆ ‘మట్టిమనిషి’ రూపమే వర్ణ చిత్రాల్లో దర్శనమిస్తుంది.
వాస్తవానికి ఆనాటి మూలవాసి ఆకారాన్ని ఈనాటి తరానికి ఆ చిత్రకారిణి పరిచయం చేస్తున్నారు. ‘అందవికారం’ అని ముద్ర వేసినా అందులోనూ అందం ఉందని చూడమని ఆండాలు చెబుతున్నారు. ‘కాకిపిల్ల కాకికి ముద్దు’ అన్న మాట బహుళ ప్రాచుర్యంలో ఉంది. కాకి నల్లగా ఉందని దాని ప్రాధాన్యతను కాదనలేం కదా?.. అన్నది చిత్రకారిణి అభిప్రాయం. అందుకే లావుగా.. నల్లగా, గుండ్రంగా కనిపించినా ఆమెనే తన ‘కథానాయిక’గా చిత్రకారిణి ఎంచుకుని కాన్వాసు పైకి తెచ్చారు. పల్లె వాతావరణంలో పెరిగిన తన ‘కథానాయిక’ కళ్లలో అమాయకత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ చూపుల్లో రాశీభూతమైన బేలతనం గోచరమవుతుంది. కూర్చున్న తీరులో కూడా తనదైన ‘ముద్ర’ కనిపిస్తోంది. నుదుట బొట్టు, మెడలో తాళిబొట్టు అందులో ఎర్రకెంపు.. నల్లపూసలు అచ్చం తెలంగాణ మూలవాసి రూపం అచ్చు గుద్దినట్టుగా కనిపిస్తుంది. శరీర ఛాయ సైతం కారు నలుపు కావడం, కాళ్లకు చెప్పులు లేకపోవడం, మెట్టెలు మాత్రం కనిపించడం చూస్తే ఇదొక కళాత్మక రూపమా?.. సృజనాత్మక అంశమా?.. అపురూపమైన రం గుల పొందికనా?.. అని అనిపించినా.. ఆండాలుకు మాత్రం ‘అందులోనూ సౌందర్యం ఉంది’ అని ఠక్కున సమాధానమిస్తారు. ఆ ధైర్యమే ఆమెను ముందుకు నడిపిస్తోంది.. ఇదే తన ‘సిగ్నేచర్ వర్క్’ అని గర్వంగా చాటుకుంటోంది.
ఈ మూలవాసి.. మట్టిమనిషి మహిళ ఇతర మహిళలతో ముచ్చట్లు పెడితే ఆమె ఆహాభావాలు ఎలా ఉంటాయి? తాను ఒంటరిగా కూర్చుని గత సంగతులు గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆమె ముఖ కవళికలు ఎలా ఉంటాయి? బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలాంటి తలుపు చెక్క ఉంటుంది. ఇలా వివరంగా వివిధ బొమ్మల్లో ఆండాలు వీక్షకులకు చూపించారు.
గోల్కొండ కోట దగ్గర బోనాల పండుగ సందర్భంగా ‘ఆమె’ సందడిని సైతం చిత్రకారిణి చిత్రించారు. బోనం.. మేక, ఆడపిల్లలు.. తోటి మహిళలు, పక్కన చెట్టు, దానిపై పాలపిట్ట ఇలా తెలంగాణ సంప్రదాయాన్ని రంగుల్లో చిత్రించారు. పండుగ పూట వారి వస్తధ్రారణలో, అలంకరణలో గల తేడాను, ‘బ్రైట్ కలర్స్’ ద్వారా ఆమె చూపించారు.
మరో పండుగ బతుకమ్మ.. తెలంగాణకు ప్రత్యేకమైన మహిళల పండుగను కాకతీయ తోరణం నేపథ్యంలో చెరువులో బతుకమ్మలను ‘సాగనంపుతున్న’ దృశ్యాన్ని చిత్రకారిణి చూపారు. 2019 సంవత్సరం బతుకమ్మ పండగ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఆర్ట్ క్యాంప్’లోనూ ఆమె పాల్గొని తనదైన శైలిలో బతుకమ్మను చిత్రిక పట్టారు.
ఇలా తెలంగాణ తత్త్వాన్ని, ముఖ్యంగా మహిళను, ఆమె ఆహాభావాలను, ఆంతరంగిక సౌందర్యాన్ని సమున్నతంగా నిలిపేందుకు చిత్రకళ మాధ్యమం ద్వారా కృషి చేస్తున్న పూస ఆండాలు కుటుంబం పూర్వపు మెదక్ జిల్లా మిర్‌దొడ్డి మండలం అల్వాల గ్రామానికి చెందినది. చాలా రోజుల క్రితమే హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 1976లో జన్మించిన ఆమె ఓ.యు. క్యాంపస్‌లోని బాలికల పాఠశాలలో హైస్కూల్ వరకు చదివారు. అక్కడే కళల పట్ల ముఖ్యంగా చిత్రరచనపై ఆసక్తి ఏర్పడింది. తన సోదరి వేసే బొమ్మలు చూసి అటు వైపు దృష్టి సారించింది. నాంపల్లిలోని బాలికల కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1999లో జెఎన్‌టియు లో బిఎఫ్‌ఏ ఎంట్రన్స్ పరీక్ష రాసి అందులో చేరారు. 2003 సంవత్సరం వరకు అక్కడ ఆమె కొత్త ప్రపంచాన్ని దర్శించారు. కాంపోజిషన్ ఎలా ఉండాలి?.. ఆబ్జెక్ట్ డ్రాయింగ్ ఎలా చేయాలి?... లైఫ్ స్టడీపై ఎలా శ్రద్ధ నిలపాలి? మినియేచర్ పెయింటింగ్ అంటే ఏమిటి? ల్యాండ్ స్కేప్ ఎలా కాన్వాసుపైకి తీసుకురావాలి? ఇట్లా అనేక శాస్ర్తియ అంశాలతోపాటు ‘హిస్టరీ ఆఫ్ ఆర్ట్’ గూర్చి తెలుసుకుంది. ఈ క్రమంలో తెలుసుకున్న మహారాష్టక్రు చెందిన ఎన్.ఎస్. బింద్రే శైలి అన్నా, అతను గీసిన ‘త్రీ ఉమెన్’ బొమ్మ అన్నా తనకెంతో ఇష్టమని ఆమె చెప్పారు.
అలాగే పాశ్చాత్య చిత్రకారుల్లో వాంగో అంటే ఎంతో ఇష్టమని, అతని సన్‌ఫ్లవర్ ఎన్నటికీ వాడిపోదని, అతని కీర్తి ఎన్నటికీ తరిగిపోదని ఆమె అభిప్రాయపడ్డారు.
తాను చార్‌కోల్, డ్రై పేస్టర్స్, ఆయిల్ పేస్టర్స్, అక్రలిక్ పెయింట్, వాటర్ కలర్స్.. ఇలా మిక్స్‌డ్ మీడియాలో పని చేస్తానని చెప్పారు. వాటర్ కలర్స్‌లో ఆమె పక్షులు, పూలు, ప్రకృతిని చిత్రించారు.
సాలార్‌జంగ్ మ్యూజియం, సృష్టి ఆర్ట్ గ్యాలరీ లాంటి చోట్ల వివిధ చిత్రకారులతో కలిసి తాను ‘షో’లను నిర్వహించానని 2009 నుంచి రెండు సంవత్సరాలు జెఎన్‌టియులోనే ఎంఎఫ్‌ఏ చేశాక తన ‘క్రాఫ్ట్’లో నాణ్యత పెరిగిందని, మరిన్ని మెరుగైన చిత్రాలు గీసే క్రమంలో ఉన్నానని, ప్రస్తుతం మైనార్టీ గురుకుల పాఠశాలలో ‘ఆర్ట్ టీచర్’గా పని చేస్తున్నానని భవిష్యత్‌లో ‘గ్రాండ్ షో’ ఏర్పాటు చేస్తానని ఆమె భరోసా కల్పిస్తున్నారు.

పూస ఆండాలు.. 8639159261 9848633966

-వుప్పల నరసింహం 99857 81799