Others

చైనా ‘అభివృద్ధి’ ఆదర్శం కాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్టోబర్ 1నాటికి చైనా విప్లవం విజయవంతమై 70 ఏళ్లు గడిచాయి. ఈ 70 ఏళ్ల వార్షికోత్సవాన్ని ప్రజలంతా జరుపుకోవాలని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. చైనా విప్లవం విజయవంతమైందని ఆయన ఇపుడు మరోసారి గుర్తుచేశారు. వాస్తవానికి 70 ఏళ్ళ వార్షికోత్సవం సందర్భంగా చైనా తన రాజధాని బీజింగ్‌లో డాగ్జింగ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 12 బిలియన్ డాలర్లతో మెగా నిర్మాణం పూర్తిచేసి, ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘‘్ఫనిక్స్’’ పక్షి ఆకారంలో టెర్మినల్‌ను రూపొందించారు. ఇది మానవాద్భుతంగా భావిస్తున్నారు. మరిన్ని అత్యాధునిక ఆవిష్కరణల నేపథ్యంలో 5జీతో ఓ వెలుగు వెలిగిపోనున్న ‘హువావే’తో వార్షికోత్సవాలు జరుపుకుంటూ ఉండగా భారతదేశ మావోయిస్టులు మాత్రం 70 ఏళ్ళ క్రితంనాటి పరిస్థితి-ఆనాటి ప్రాభవాన్ని తలచుకుని తన్మయత్వం చెందుతూ 70 ఏళ్ళ చైనా విప్లవ వార్షికోత్సవాన్ని జరుపుకోవాలంటున్నారు. ఇదెంత విడ్డూరం? చైనా విప్లవాన్ని విజయవంతం చేసుకున్న ప్రజలు... అక్కడి పార్టీ అత్యద్భుతమైన విమానాశ్రయాన్ని, వివిధ ఆవిష్కరణలతో, సాంకేతిక అభివృద్ధితో, అంతరిక్ష విజయాలతో జరుపుకుంటూ ఉంటే... ఇక్కడి మావోలు మాత్రం 1946లో చైనా కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమై 1949 అక్టోబర్ 1న ముగిసిన విప్లవాన్ని, ఆనాటి విజయాన్ని స్మరిస్తూ ఉండాలని సలహా ఇస్తున్నారు. చైనా దృక్పథానికి, భారత మావోయిస్టులకు ఎంత వ్యత్యాసం ఎంత ఉందో దీంతో అవగతమవుతోంది. చైనావారు ‘‘వర్తమానం’’లో జీవించేందుకు ఇష్టపడి దూసుకుపోతుంటే, భారత మావోయిస్టులు మాత్రం భూతకాలంలో చిక్కుకుని కలలు కంటున్నారు, కవితలు అల్లుతున్నారు.
చైనా సమాజం ‘్ఫనిక్స్’ పక్షిలా ఫ్యూడల్ వ్యవస్థనుంచి నాల్గవ పారిశ్రామిక విప్లవం ఫలితాలను అందిపుచ్చుకుని ఆకాశమే హద్దుగా సాగిపోతూ ఉంది. వారు నిర్మించిన త్రీ గోర్జియస్ డ్యాం కాని, అంతర్జాతీయ విమానాశ్రయం గాని, అంతరిక్షంలోకి పంపిన ‘లాంగ్‌మార్చ్’గాని పరికిస్తే ప్రపంచమే విస్తుపోతోంది. ఇంత ‘అభివృద్ధి’ ఎలా సాధ్యమని ఆశ్చర్యపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఒకప్పుడు ఆంగ్లంలో ఒక ముక్కరాని ‘జాక్‌మా’ అలీబాబా అనే ఆన్‌లైన్ సంస్థను స్థాపించి ఇప్పుడు ప్రపంచస్థాయి సంస్థగా రూపొందించారు. ఇప్పుడతను ప్రభావశీల వ్యాపార వేత్తగా, దార్శనికుడిగా గుర్తింపు పొందారు. సాంస్కృతిక విప్లవకాలం (1966-76)లో జన్మించిన ఓ మహిళ ఆధ్వర్యంలో అటు షాంఘై, ఇటు బీజింగ్‌లో ఆకాశహర్మ్యాలను నిర్మిస్తూ చరిత్ర సృష్టిస్తోంది. తన భర్తతో కలిసి ఆమె చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పరిశీలిస్తే వర్తమాన చైనా ‘పల్స్’ ఏమిటో తేటతెల్లమవుతోంది. పాశ్చాత్య దేశాల్లోనూ కనిపించని రీతిలో ఆకాశాన్ని తాకే అత్యాధునిక భవనాలు శరవేగంగా వెలుస్తున్నాయి. ఆ రెండు నగరాల రూపురేఖల్ని వారు పూర్తిగా మార్చేశారు. 1949 అక్టోబర్ 1నాటి బీజింగ్, షాంఘై నగరాలు ఇవేనా? అని విస్తుపోయేంతగా మారిపోయాయి. 21వ శతాబ్దపు మీగడ అంతా ఇప్పుడు ఆ నగరాల్లో దర్శనమిస్తోంది. అన్ని రంగాల్లో ఈ విప్లవాత్మక మార్పులు జరుగుతున్న నేపధ్యంలో భారత మావోయిస్టులు ఇస్తున్న పిలుపునకు ‘ప్రాసంగికత’ కనిపిస్తోందా? అసలు భారత మావోలు ఏ కాలంలో జీవిస్తున్నారు? అన్న సంశయం కలుగుతోంది
చైనాలో 70 ఏళ్ళ క్రితం జరిగిన ‘లాంగ్‌మార్చ్’ను ఇక్కడి మావోలు దండకారణ్యంలో ‘రిప్లికేట్’ చేయాలనుకుంటున్నవారు.. చైనా ఇప్పుడు అంతరిక్షంలో ‘లాంగ్‌మార్చ్’ రాకెట్‌ను పంపి అటు చంద్రుడిపై, అంగారక గ్రహంపై పాగావేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతిని మావోలు విస్మరిస్తున్నారు. అంతరిక్షంలో తనదైన ఒక ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్న విషయాన్ని తమ సౌకర్యార్థం విస్మరించి, ఇప్పటికీ 1946-49 కాలం నాటి కలలు కనడం సబబేనా? ప్రజలు సైతం ఆ కలల్నే కనమని చెప్పడం న్యాయమేనా?
చైనా విప్లవ విజయాన్ని 2019 సంవత్సరంలో ఆదర్శంగా తీసుకోవాలా? లేక 2019లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆదర్శంగా తీసుకోవాలా? చైనా ప్రగతిపథంలో దూసుకుపోతూ అమెరికాను సైతం అధిగమించాలని ఆరాటపడుతూ ‘కసి’గా వివిధ కార్యక్రమాలను రూపొందించి, ఆచరణలో పెట్టి విజయం సాధిస్తుండగా భారత మావోయిస్టులు మాత్రం అలాంటి అభివృద్ధి పెట్టుబడిదారుల అభివృద్ధి, సామ్రాజ్యవాద అభివృద్ధి, దోపిడీదారుల అభివృద్ధి.. దాన్ని ధ్వంసంచేసి 1946-49లో మావో గుర్రాలపై పయనించినట్టు, కాలి నడకన లాంగ్‌మార్చ్ చేసినట్టు ఇక్కడ దండకారణ్యంలో చేద్దాం, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేద్దాం... రండి...తరలి రండి- అంటూ దశాబ్దాలుగా పిలుపునిస్తున్నా ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నది. గొర్రె తోక బెత్తెడు అన్న చందంగా జనతన సర్కారు దశాబ్దాలుగా కొనసాగుతోంది. మరి ఇదే సమయంలో చైనా దూకుడు ఎలా ఉందో తెలుసుకోలేరా? కళ్ళుండి చూకలేక పోతున్నారా? మిళమిళ మెరిసిపోతున్న బీజింగ్, షాంఘై నగరాలను, అక్కడి ప్రజల నూతన ఆవిష్కరణలను, ఆర్తిని, ప్రపంచాన్ని అందుకని ఒక అడుగు ముందుండి ‘‘మార్చ్’’చేయాలని పడుతున్న తపన, శ్రమ మావోలకు కనిపించక పోవడం విషాదం.. విడ్డూరం. జూదశాలలకు నిలయమైన ‘మకావో’నుంచి చైనా మెయిన్‌లాండ్‌కు సముద్రంలో నిర్మించిన పొడవైన వంతెన ఏమి తెలియజేస్తున్నదో ఇక్కడి మావోలకు అర్థమవుతోందా? బీజింగ్-షాంఘై నగరాల మధ్య నడుస్తున్న అత్యంత వేగవంతమైన రైళ్లు ఏం సూచిస్తున్నాయి? అక్కడి మెట్రోరైళ్లు, స్టేషన్లు ఏమిచాటుతున్నాయి? హాంకాంగ్‌లోని ప్రజాస్వామ్య ఉద్యమం దేన్ని సూచిస్తోంది?
1978లో చైనాలో ప్రారంభమైన సంస్కరణలు, వాటిని మరింత చిక్కగా కొనసాగిస్తున్న ప్రస్తుత పాలకులు, తదనుగుణంగా సాధిస్తున్న అభివృద్ధిని చూసేందుకు నిరాకరిస్తే అదెలా ‘వాస్తవికత’ అనిపించుకుంటుంది? చైనాలో గణనీయమైన- విప్లవాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో భారీ సంస్కరణలు ప్రారంభించినవేళ తెలంగాణలో అంతకు 30 ఏళ్ళ క్రితంనాటి చైనాను ఆదర్శంగా తీసుకుని ‘‘నక్సలైట్’’పార్టీ (పీపుల్స్‌వార్) ఆవిర్భవించింది. భారత మావోయిస్టుల (నక్సలైటు) ఎంత వెనుకంజలో ఉన్నారో, వారి ఆలోచనలు ఎంత పురాతనమైనవో దీనివల్ల తేటతెల్లమవుతోంది. ఈ 40 ఏళ్ళలోనూ అదే ధోరణి అనుసరిస్తామని చెప్పడం ఏ రకంగా విజ్ఞత అనిపించుకుంటుంది?
నిన్న మొన్నటివరకు చైనా జీడీపీ రెండంకెలను తాకింది. కొన్ని పరిస్థితుల కారణంగా ఆ ‘‘గ్రోత్’’ కొంత తగ్గింది. దాన్ని ఎలా అధిగమించాలని ఆరాటపడుతుండగా ఇక్కడ మావోయిస్టులు మాత్రం 1949 సంవత్సరంనాటి గ్రోత్‌రేటు సరిపోతుందని, రెండు శాతం ఉంటే చాలని సెలవిస్తున్నారు. ఇదీ వారి విజన్. ఈ విజన్‌తో భారత ప్రజలను సుఖసంతోషాలతో, భోగభాగ్యాలతో తులతూగేలా పాలిస్తామని దండకారణ్యంలో ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇది సవ్యమైన దృక్పథంగానే తోస్తున్నదా? అసలు వర్తమానంలో ‘మార్కెట్ రహిత ఎకానమీ’ గూర్చి ఊహించడం దాన్ని సాధించేందుకు మర తుపాకులు- మందు పాతరలు ఉపయోగించడం ఎంతటి హాస్యాస్పద అంశం?
గూగుల్, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, హువావే, టాటా కంప్యూటర్ సర్వీసెస్ (టిసిఎస్), ఇన్ఫోసిస్, విప్రో.. ఇట్లా వివిధ దేశాల సంస్థలు పరిశోధన- అభివృద్ధికి మిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చుచేస్తూ మానవ జీవితాన్ని సులభతరం- సరళతరం చేసేందుకు అహోరాత్రులు కష్టపడుతుండగా, ఆ ‘‘సంస్కృతి’’మొత్తం ప్రపంచాన్ని కమ్మేస్తుండగా, సమాజం మొత్తం ‘‘రీడిజైన్’’అయిన వేళ మావోయిస్టుల ‘మార్కెట్ రహిత ఎకానమీ’ మాటకు మాన్యత ఉంటుందా?... ఈ ప్రాథమిక విషయాన్ని సైతం పట్టించుకోకుండా, సమాజం పూర్తిగా రూపాంతరం చెందిన దృశ్యాన్ని చూసేందుకు నిరాకరిస్తూ 70 ఏళ్ళ చైనా విప్లవ వార్షికోత్సవాలను జరుపుకోవాలని, భారత మావోయిస్టుపార్టీని బలోపేతం చేయాలని పిలుపునివ్వడం ఎంతటి భావ దారిద్య్రమో ఎవరికివారే యోచించాలి. గతం కాదు... వర్తమానం, భవిష్యత్ ముఖ్యమని, ప్రజల్ని అటువైపు నడిపించడం కీలకమని మావోలు ఇంకెప్పుడు గుర్తిస్తారో?..

-వుప్పల నరసింహం 99857 81799