Others

ఆహార భద్రత ప్రభుత్వం బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమిపై ఉన్న జీవరాశి బ్రతకడానికి ఆహారం తీసుకోవాలి. ఆహారం అనేది మనిషి ప్రాథమిక అవసరాలలో అతి ముఖ్యమైనది. మంచి తిండి తిని మనిషి ఆరోగ్యంగా ఉన్నపుడే దేశ పురోగతికి పాటుపడుతాడు. అందుకే ప్రముఖ కవి గురజాడ అప్పారావు ‘‘తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్’’అని అన్నారు. మనం ఆహారంకొరకు పంటలపై, చెట్లపై, పశువులపై, జలవనరులపై ఆధారపడవలసి ఉంటుంది. అన్నపూర్ణ దేశంగా పిలువబడిన మన దేశంలో కూడా నేటికి చాలామంది బ్రతకడానికి కావలసిన కనీస ఆహార పదార్థాలను కూడా పొందలేకపోతున్నారు. మన దేశమేకాకుండా ప్రపంచంలోని చాలా దేశాలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యలలో ఆహారకొరత ఒకటి. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఇంకా 25 శాతం దేశాలు పేదరికం, ఆకలిని అనుభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 11.3 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. మన దేశంలో 50 శాతం శిశు మరణాలకు పౌష్టికాహార లోపమే ప్రధాన కారణమని పలు నివేదికలు చెపుతున్నాయి. ఆహారకొరత తీరాలంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి. ఈ భూమిపై వ్యవసాయానికి అనుకూలమైన విశాల భూభాగం ఉన్నప్పటికీ అనేక కారణాలవలన వ్యవసాయ భూమినంతా మనం సాగుచేసుకోలేక పోతున్నాం. ఆహారోత్పత్తికంటే జనాభా పెరుగుదల అధికంగా ఉండటంవలన ఆహార సమస్య మరింత తీవ్రరూపం దాలుస్తున్నది.
మన దేశంలో సుమారు డెబ్బై శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ క్రమక్రమంగా వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంవలన వారంతా ఇతర వృత్తులవైపు వెళ్తున్నారు. తద్వారా పంట పండించే రైతన్నల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. అందరికీ అన్నం పెట్టే రైతన్నకే అన్నం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. రైతుకు మంచి విత్తనాలు, ఎరువులు, నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించి పండిన పంటకు గిట్టుబాటు ధరలను పొందేలా చూడాలి. పండిన పంటకు మంచి ధర వచ్చేవరకు నిల్వచేసుకునే విధంగా గోదాములను ఏర్పాటుచేయాలి. రైతే పంట ధరను నిర్ణయించి తాను పండించిన పంటను అమ్ముకునే పరిస్థితి రావాలి. దళారి వ్యవస్థ ఉండకూడదు. అప్పుడే మధ్యతరగతి ప్రజలకు కూడా నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులోకి వస్తాయి. వాణిజ్య పంటలకంటే ఆహార పంటలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఆహార కొరత కొంతమేర తీరుతుంది. సరియైన ప్రణాళికతో రెండు, మూడు పంటలు కూడ పండించవచ్చును. మిశ్రమ పంటలు, సేంద్రీయ వ్యవసాయంపట్ల రైతులకు అవగాహన కల్పించాలి. అతివృష్టి అనావృష్టివల్ల పంటలు పండక ఉత్పత్తితగ్గుతుంది. భూసారాన్ని పరిరక్షించకపోవడం, అధిక రసాయనిక ఎరువులు వాడటంద్వారా కూడా రానురాను పంటల దిగుబడి తగ్గుతుంది. అంతేకాక వ్యాపారస్తులు ఆహార పదార్థాల కృత్రిమ కొరతను సృష్టించడం ద్వారా వాటి ధరలను పెంచుతున్నారు. ఆధునిక కాలంలో సామాన్య ప్రజలకు ఆహార ధాన్యాల ధరలు అందుబాటులో లేవు. ఉల్లి, టమాట మొదలు అనేక నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దిగువ మధ్యతరగతి వారికి కూడా ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వమే కొన్ని రాయితీలు కల్పించి ధరలు నిలకడగా ఉంచవచ్చు.
ఆహార కొరత నివారణకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలి. కూలీల కొరతను అధిగమించడానికి, వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి, సేద్యంలో ఆధునిక పద్ధతులను, యాంత్రికీకరణను ప్రవేశపెట్టాలి. వ్యవసాయ పరిశోధనాలయాలను పెంచి పరిశోధనలకు పెద్దపీటవేస్తూ అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలను కనుగొనేలా ప్రోత్సహించాలి. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడి పెరగాలి. రైతులకు సులభ పద్ధతిలో రుణ సౌకర్యాన్ని కల్పించి, రైతుల ఆత్మహత్యలను నివారించాలి. సహకార సంఘాలలో, మార్కెట్ కమిటీలలో సంస్కరణలు చేపట్టి వాటిని రైతులకు మరింత అందుబాటలోకి తేవాలి. వ్యవసాయాన్ని పాఠ్యాంశంగా చేర్చడం ద్వారా వ్యవసాయం పట్ల రాబోవు తరాలకు అవగాహన కల్పించాలి. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగామార్చి యువకులు మేం ఉద్యోగం చేస్తాం అనే స్థాయినుండి వ్యవసాయంచేస్తాం అనే స్థాయికి ఎదిగేలా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిచేయాలి. చౌకధరల దుకాణం ద్వారా బియ్యంతోపాటు ఇతర నిత్యావసర సరుకులను, చిరు ధాన్యాలను దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి సబ్సిడీపై అందించాలి. ఎంతోమంది బడి ఈడు పిల్లలు కూడ నేడు పోషకాహార లోపంతో బాధపడుతూ వివిధ రకాల వ్యాధులకు గురిఅవుతున్నారు. బడిలోనే కూరగాయలు పండించి విద్యార్థులకు తాజా కూరగాయలతో కూడిన మధ్యాహ్న భోజనం అందేలా ఏర్పాటుచేయాలి. ఎవరి ఇంటివద్ద వారు కూరగాయలు, ఆకుకూరల తోటలను ఏర్పాటుచేసుకోవాలి. ప్రజలందరికీ ఆహారాన్ని అందించాలంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిని, పాడి సంపదను, మత్స్య సంపదను, కోళ్లను పెంచాలి.
ఆహార మరియు వ్యవసాయ నివేదిక ప్రకారం ప్రపంచంలో మూడింట ఒక వంతు ఆహారం వృథాఅవుతుంది. వివాహ మహోత్సవాలలో మరియు ఇతర ఫంక్షన్లలో, హోటళ్లలో ఆహార పదార్థాలను కావలసినకంటే ఎక్కువ వేసుకొని వృథాచేస్తున్నాము. ఆహార సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు ప్రజలంతా సహకరిస్తూ ఆహార పదార్థాల వృధాను అరికట్టినపుడే అర్ధాకలితో అలమటించేవారి ఆకలి తీరుతుంది. అన్నం పరబ్రహ్మస్వరూపం మనం వృధాగాపడేసిన ఆహారం మరొకరి ఆకలిని తీర్చుతుందనే విషయాన్ని గుర్తెరగాలి. హోటళ్లలో, వేడుకలలో మిగిలిన ఆహార పదార్థాలను ఆశ్రమాలకు, అనాథ శరణాలయాలకు పంపించే ఏర్పాట్లుచేయాలి. ఆహార కొరత ప్రాధాన్యతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి తన అనుబంధ సంస్థఅయిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఒ) ద్వారా ప్రపంచ ప్రజలందరికీ పౌష్టకాహారం అందించడం, జీవనప్రమాణాలను మెరుగుపరచడం, ఆహార వ్యవసాయ దిగుబడులను పెంచడం లక్ష్యంగా పనిచేస్తుంది. అందుకే ఈ సంస్థ ఏర్పడిన అక్టోబర్ 16ను ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహిస్తూ 1981నుండి ప్రతి ఏటా ఒక నినాదంతో ఆహార ప్రాధాన్యతను తెలియజేస్తూ వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. అందరికీ పోషకాహారం కల్పించడం, ఆహార ఉత్పత్తులు పెంచి ప్రస్తుత, భావితరాలకొరకు ఆహార భద్రతను కల్పించడానికి ఎఫ్‌ఏఓ కృషిచేస్తోంది. 2030నాటికి ప్రపంచాన్ని ఆకలినుంచి విముక్తిచేయడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తున్నది. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రజలందరికీ పౌష్టికాహారం లభిస్తేనే వారు ఆరోగ్యంగా ఉంటారు. అందుకే దేశ భవిష్యత్తు ప్రజలకు అంటే పౌష్టికాహార లభ్యతపైనే ఆధారపడి ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వాలు విస్మరించకూడదు. ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలుపరచాలి.

-కందుకూరి భాస్కర్ 94415 57188