AADIVAVRAM - Others

రంగుల ‘రణరంగం’లో వినీత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి ‘అందం’ ఆరాధనీయం.. ఆ ప్రకృతికి ప్రతిరూపంగా భావించే స్ర్తి ‘అందం’ అంతే స్థాయిలో తన్మయత్వానికి గురి చేస్తుంది. ప్రకృతి అందం.. స్ర్తి అందం బింబ ప్రతిబింబాలన్నా తప్పు కాదు. అందుకే స్ర్తి అందాన్ని నిరపేక్షకంగా చూడాలని విజ్ఞులు అంటారు. అందానికి పరవశించి పోయి తన ‘వశం’ చేసుకోవాలని, దక్కకపోతే ‘ఆసిడ్’ పోయడం పరమ దుర్మార్గం... దారుణం.. రాక్షసత్వం.. నిందనీయం.
చిత్రకారిణి పాముల వినీత ఈ రకమైన అభిప్రాయం, ఆలోచనలు, మానసిక స్థితి, భావోద్వేగంతో బొమ్మలు గీస్తున్నారు. ‘ఆసిడ్’ దాడిలో మసై పోయిన చెల్లెమ్మల గాథలు తెలుసుకుని.. విని చెమ్మగిల్లిన కళ్లతో కాన్వాసుపై, అక్రలిక్ షీటుపై ఆ బాధామయ బాలికల వేదనను, ఆ రాక్షసత్వాన్ని నిందించాలని చెప్పకనే చెబుతూ ఆమె కొన్ని సంవత్సరాలుగా చిత్రిక పడుతున్నారు.
కాలిబొగ్గయిన వారి మొఖాలను చార్‌కోల్ (బొగ్గు)తో ఆమె సంకేతంగా చిత్రాలు గీశారు. బొగ్గును కాల్చితే ఎర్రబడుతుందని, ఇనుమును సైతం కరిగిస్తుందని తన ‘చార్‌కోల్’ బొమ్మలతో ఆమె బాధితుల్లో చైతన్య అగ్గిని రాజేస్తున్నారు. నిజాయితీగా సహానుభూతిని ప్రకటిస్తున్నారు. అలా ఆసిడ్ దాడులకు గురై.. మానసికంగా చితికిపోయి, ఆత్మస్థైర్యం కోల్పోయి, బయటకు రాలేక కుంగిపోయి.. జీవితాన్ని ముగించాల్సిన అవసరం లేదని కొందరు బాధితులు ఆయా మెట్రో నగరాల్లో ‘్ఫ్యషన్ పరేడ్’లలో పాల్గొనడాన్ని స్వాగతిస్తూ కొండంత ధైర్యాన్ని తన వంతుగా అందిస్తున్నారు. చిత్రకళ మాధ్యమం ద్వారా సానునయ దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు. రంగుల సహకారాన్ని అందిస్తున్నారు. స్ర్తి వాదానికి తన వంతు గొంతుకను కలుపుతున్నారు. బిగ్గరగా అందరికీ వినిపించాలని ఆరాటపడుతూ అక్రలిక్ షీట్‌పై నిరసన స్వరాన్ని, భావాన్ని భాస్వరంలా మండిస్తున్నారు.
మహిళపై హింసను సహించేది లేదని, అందాన్ని తుంచేసే తుచ్ఛమైన, రాక్షసమైన భావనకు భరత వాక్యం పలకాలని ఆమె ఎంతో ‘ఆర్తి’తో తన భావాల్ని రంగుల్లో పలికిస్తున్నారు. స్ర్తి అందం.. సౌందర్యం ఆకారంలో, పొంగులో, ‘రంగు’లో ఉండదని అంతః సౌందర్యం చూడ్డం అలవాటు చేసుకోవాలని ఆమె చెప్పకనే చెబుతున్నారు.
తాను సబ్జెక్టు కనుగుణంగా రూపాన్ని ఎంచుకుంటానని, శైలి అదే అవతరిస్తుందని ఆమె అంటున్నారు. తన రంగుల మిశ్రమం సమస్య తీవ్రతను బట్టి ఉంటుందని, ‘కథనం’ చెప్పాలనుకుంటే తన శైలి మరో రూపంగా ఉంటుందని ఆమె చెబుతున్నారు. ఆబ్జెక్టివ్ పెయింటింగ్‌లో, అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్‌లోనూ ఆమె తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వాస్తవికత అంశంలోనూ తానేమిటో రుజువు చేసుకున్నారు. వాటర్ కలర్స్‌లో వైవిధ్యం ప్రదర్శించారు. పెన్ అండ్ ఇంక్‌తో అనేక దృశ్యాలను కళ్లకు కట్టారు. ఆసిడ్ దాడికి గురికాని స్ర్తి శరీరాన్ని సీతాకోక చిలుక ప్రతీకగా చిత్రించారు. ‘ఆమె’ శరీరం అంతటా, చివరకు బుగ్గల్లోనూ రంగుల రెక్కలతో సీతాకోక చిలుకలు పుట్టుకొచ్చే వైనాన్ని చిత్రించారు. ఆ అమాయక చూపుల్లో కల్మషం లేదు. తానో సీతాకోక చిలుకనని, చిదిమేస్తే, ఆసిడ్ పోస్తే ఎలా?.. అని నిలదీస్తున్నట్టు ఆ చూపులు వీక్షకులను గుచ్చుకుంటాయి. దీనికి భిన్నంగా బేల చూపులతో ఆసిడ్ దాడిలో తల వెంట్రుకలు సైతం కోల్పోయి, కాలిపోయి ‘నుసి’ అయిన మహిళ చిత్రం ‘జెక్స్‌స్టా పొజిషన్’ రీతిలో కనిపిస్తుంది. నలుపు (కాలిన మసి) తెలుపు (మిగిలిన చర్మం)లో రూపొందించిన ఆ చిత్రం వెనకాల ‘కాలిన కాగితం’ కనిపిస్తుంది. దాన్ని భూగోళం అనుకోవచ్చు. మరొకటని కూడా అనుకోవచ్చు.. అది వీక్షకుల దృష్టి కోణానికి ఆమె వదిలేశారు. ఆ నలుపు తెలుపు చిత్రం ఎన్నో భావాలను పలుకుతోంది. బాధను వ్యక్తపరుస్తోంది. దుఃఖాన్ని దిగమింగిన వైనాన్ని తెలుపుతోంది. ఇదేనా ‘మీ నిర్వాకం’ అని నిలదీసినట్టుగానూ ఉంటుంది.. ఆ బొమ్మ కళ్లలోకి తప్పు చేసిన వారు కళ్లు పెట్టి చూసి తట్టుకోలేరు. అంత తీక్షణత అందులో కనిపిస్తుంది. ఆగ్రహం తొంగి చూస్తోంది.
రసాయనం (ఆసిడ్)తో మాడిమసైన చర్మంపై మల్లెలు పూయించి బాధితురాలికి చిత్రకారిణి సంఘీభావం తెలుపడం శ్లాఘనీయం. చిత్రకారిణికి జోహార్లు పలకకుండా ఉండలేం!
ఆ ‘చిత్రం’ చూపులు ప్రశాంతంగా.. నేరాన్ని క్షమించిన ఔన్నత్యంతో, గొప్ప మానసిక ధైర్యం, శక్తిని కూడదీసుకుని ‘చల్లని’ చూపుతో దర్శనమిస్తుంది. ఇది కూడా నలుపు తెలుపులో ఉండటం విశేషం. ఈ రెంటిని పక్కపక్కనే పెట్టి చూస్తే ఓ స్ర్తి ఆసిడ్ దాడికి గురయినప్పుడు.. అనంతరం తేరుకుని క్షమాగుణంతో తన మిగిలిన సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసి, అంతః సౌందర్యం కళ్లల్లో పొంగుకు రాగా ప్రశాంతంగా చూసే ఆ చూపు ఏ ‘మొనాలీసా’ చూపునకు తక్కువ కాదనిపిస్తుంది. ఆ చిరునవ్వు అంతే తాత్వికతను కురిపిస్తుంది. ఇంతటి అంతర్మథనం.. అంతః శోధన, ఆవేదన.. ఆక్రందనను, స్ర్తి అంతః సౌందర్యాన్ని అటు కాన్వాసుపై, అక్రలిక్ షీట్‌పై, కాగితంపై కురిపిస్తున్న చిత్రకారిణి పాముల వినీత 1989 సంవత్సరంలో హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలోని హయత్‌నగర్‌లో జన్మించారు. తండ్రి శేషగిరి సైతం చిత్రకారుడు కావడంతో తన బాల్యం నుంచే రంగులు, కాగితాలు, కాన్వాసులు పట్టుకుని పెరిగింది. తండ్రి నుంచి ప్రేరణ పొంది, తండ్రి దారిలో పయనమవ్వాలనుకుని చిత్రలేఖనాన్ని చిన్నప్పటి నుంచే సాధన చేయగలిగింది. హైస్కూలు విద్య వనస్థలిపురంలో కొనసాగింది. ఇంటర్ అక్కడే పూర్తయ్యాక జెఎన్‌టియులో బిఎఫ్‌ఏ కోర్సులో చేరి 2010 సంవత్సరంలో పూర్తి చేశారు. అనంతరం ఎంఎఫ్‌ఏ కూడా అక్కడే 2012లో పూర్తి చేశారు. ఈ ఏడు సంవత్సరాల అధ్యయనంలో, సాధనలో, అభ్యాసంలో ఏడేడు లోకాల రంగుల రహస్యాలను ఆమె తెలుసుకున్నారు. ప్రింట్ మేకింగ్‌లోనూ తనదైన ‘ముద్ర’ చూపించారు. ‘ఇన్‌స్టాలేషన్స్’ చేశారు. అసంఖ్యాక స్కెచ్‌లు గీశారు. తొలి రోజుల్లో స్ర్తి గర్భంలో పిండం కదలికల్ని చిత్రించారు. మొత్తం మీద స్ర్తివాద జెండా ఓ చేత.. కుంచె మరో చోట పట్టుకుని రంగుల రణరంగంలోకి ఆమె అడుగిడారు. స్ర్తి చైతన్యాన్ని నేల నలుచెరగులా చాటేందుకు సంకల్పం చెప్పుకుని పయనిస్తున్నారు. ఈ ప్రస్థానంలో ‘గాయా’లైనా, ఎవరైనా గులాబీలు అందించినా, సానుకూల వచనాలు పలికినా, విమర్శల వర్షం కురిపించినా తన మార్గం మాత్రం ఆడపిల్లకు అండగా నిలబడటమే నంటున్నారు. ముఖ్యంగా ఆసిడ్ దాడులకు, ఇతరత్రా దాడులకు గురైన స్ర్తిలకు తన మాధ్యమం ద్వారా మేరు పర్వతంలా అండగా నిలుస్తున్నారు.
‘తెలంగాణ జాగృతి’ 2019 సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్భంగా నిర్వహించిన ‘ఆర్ట్ క్యాంప్’లో పాముల వినీత పాల్గొని తానో రంగుల గౌరమ్మగా వెలిగింది. అటు ముంబయ్, బరోడా తదితర నగరాల్లో జరిగిన గ్రూపు ప్రదర్శనల్లో ఆమె తన చిత్రాలను ప్రదర్శించి ప్రత్యేక ప్రశంస లందుకున్నారు. భవిష్యత్ బంగారు రంగుల బతుకమ్మలా ఉంటుందని ఆమె ఆశిస్తున్నారు.

పాముల వినీత.. 7799931777

-వుప్పల నరసింహం 9985781799