Others

రైతుకు పొంచి ఉన్న విపత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులు గట్టెక్కేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వాలు గుర్తించలేక పోతున్నాయి. రైతుల ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచేందుకు రాయితీల విస్తృతి పెరుగుతున్నా వారి కష్టాలు తీరడం లేదు. జనాభాలో అత్యధిక శాతం మంది వ్యవసాయానే్న జీవనాధారంగా బతుకులీడుస్తున్న దేశం మనది. రైతుల మనుగడకు, వారి కష్టాలు తీరేందుకు ‘ఉపాయం చెప్పవయ్యా అంటే ఉరితాడు తెచ్చుకో అన్నట్లు’గా ఉన్నాయి మన పాలకుల విధానాలు.
వ్యవసాయ విధానాల రూపకల్పనలో రైతులు, విధానకర్తల మధ్య తగినంత చర్చ జరగడం లేదు. ప్రభుత్వాలు ఇచ్చే ఋణమాఫీ, రైతుబంధు లాంటి పథకాలతో పాటు గిట్టుబాటు ధరలు ఇచ్చేందుకు పాలకులు చొరవ చూపాలి. ఎం.ఎస్.స్వామినాథన్ కమిటీ సిఫారసుల్ని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేస్తే సంక్షోభంలో ఉన్న రైతుల్ని ఆదుకొనే అవకాశం ఉంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చగల ఆ సిఫారసులను ఆచరణలో అమలు చేయాలి. అప్పుడే యువ రైతులు వ్యవసాయ రంగానికి ఆకర్షితులౌతారు. ప్రధానంగా పంటల మద్దతు ధర నిర్ధారణ ఎం.ఎస్.స్వామినాథన్ సూచించిన ఫార్ములా- ‘సీ 2ప్లస్ 50 శాతం’ సేకరణ ధరలకు అత్యంత ఆమోదయోగ్యమైన విధానం. రైతుల ఆర్థిక స్థితిగతులు మార్చగల స్వామినాథన్ సిఫారసుల్ని అమలుచేయక పోవడాన్ని పాలకుల చిత్తశుద్ధి లోపంగా భావించాలి.
అన్నదాతలు చెమటోడ్చి ఆరుగాలం చేస్తున్న వ్యవసాయం లాభాలబాట పట్టించడంలో పాలకులు విఫలం చెందుతున్నారు. దీనికి నిదర్శనం అన్నదాతల ఆర్థిక స్థితిగతులు మారకపోవడమే. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. విత్తనాలు నాటినపుడు మొదలయ్యే కష్టాలు పంట చేతికివచ్చి మార్కెట్‌లో వాటిని అమ్ముకునేవరకు కొనసాగడం నిత్యకృత్యంగా మారింది. అన్ని దశల్లోనూ దోపిడీ వల్ల రైతులకు గిట్టుబాటు ధరలేకుండా పోతుంటే పాలకులు, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. పురుగుమందులు, రసాయన ఎరువులు రైతులను నష్టాల బారిన పడేయడంతోపాటు పర్యావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్నాయి. పంటలకు, పర్యావరణానికి మేలుచేసే కోట్లాది సూక్ష్మజీవులు భూమిలోనూ, ప్రకృతిలోనూ ఉంటాయి. వీటికి హాని కలిగించే లామ్డాసైహోలథ్రిన్, డెల్లామిత్రిన్, సైపర్ లాంటి ప్రమాదకర రసాయనాలను కలిపి బయో మందులు తయారుచేస్తున్నారు. దీంతో పంటకు మేలుచేసే పురుగులు, సూక్ష్మజీవులు నశించి, పంటలపై చీడపీడలను అదుపుచేయలేని స్థితివల్ల దిగుబడులు తగ్గుటున్నట్లు శాస్తవ్రేత్తలు అంచనా వేస్తున్నారు. పత్తి విత్తనాల్లో, పురుగుమందుల్లో కల్తీ, అధిక ధరలను పెంచుకుపోతున్న వ్యాపారుల దోపిడీకి పాలకులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాల మూలంగా రైతులు నష్టపోతున్నారు.
పత్తిరైతులు నకిలీ విత్తనాలు, ఎరువుల ధరలతో కష్టాల పాలవుతూ, మార్కెట్లో మద్దతు ధర లభించే వరకూ దోపిడీకి గురవుతున్నారు. నానాటికీ పత్తిపంట విస్తీర్ణం పెరుగుతున్నా రైతులకు లాభాలు దక్కడం లేదు. పంటలకు మద్దతు ధర ఇప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అన్నదాతలకు చేరడం లేదు. ఈ ఏడాది పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ.5,550/-గా కేంద్రం నిర్ణయించింది. కొత్త పత్తి పంటను రైతులు మార్కెట్టుకు తేవడం మొదలైంది. తీరా తొలి పంట ఉత్పత్తికి మార్కెట్‌లో మద్దతు ధరను వ్యాపారులు చెల్లించిన దాఖలాలు లేవు. ఇప్పుడిప్పుడే వస్తున్న కొత్త పత్తికి మద్దతు ధర లేకపోవడాన్ని బట్టి చూస్తే పంట దిగుబడి పూర్తిస్థాయిలోకి వచ్చాక రైతులకు మద్దతు ధర లభించడం ఎండమావుల్లో నీళ్లను వెతుక్కున్నట్లే!
మార్కెట్‌లో కనిష్టంగా క్వింటాలుకు రూ.4,221 నుంచి గరిష్టంగా రూ.5211 వరకు అతి కష్టంమీద చెల్లిస్తున్నారు. దూదిలో తేమ (పేరా)సాకుతో ధరను వ్యాపారులు బాగా తగ్గిస్తున్నారు. ఇక పత్తిరైతు క్వింటాలు పత్తి పంటకు సాగు వ్యయం రూ.9502గా అంచనా వేశారు. వ్యవసాయశాఖ ప్రభుత్వానికి తెలిపిన ప్రకారం 2017-18లో 51-95 లక్షల టన్నుల పత్తి పంట దిగుబడి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది ఎక్కువగా రానుంది.
తెలంగాణ ప్రభుత్వం కేంద్రం తరఫున ‘్భరత పత్తి సంస్థ’ (సీ.సీ.ఐ.) మద్దతు ధరకు పత్తిని కొంటుంది. అలాకొనే కేంద్రాలను 340 ఏర్పాటుచేయాలని కోరింది. ఇవి సరిపోవు, ఇంకా పెంచాలని రైతులు భావిస్తున్నారు. అందులో వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటుచేసినవి 34 మాత్రమే! మిగిలిన 306 కేంద్రాలను జిన్నింగ్ మిల్లులో పెట్టాలని నిర్ణయించారు. మిల్లు యాజమాన్యాలు మద్దతు ధర ఇస్తారనేది అందని ద్రాక్షేనని రైతులు భావిస్తున్నారు. కొత్త పత్తికే మద్దతు ధర అందడం లేదు. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా మార్కెట్లకు పత్తి పంట వస్తే, పత్తి పంట అంతటికీ మద్దతు ధర ఇస్తారనడాన్ని రైతులు నమ్మలేకపోతున్నారు. ప్రభుత్వం పత్తిరైతుకు మద్దతు ధర చెల్లించి పత్తి కొనుగోలు చేసేలా వెంటనే జాగ్రత్త తీసుకోవాలి. అందరికీ మద్దతు ధర ఇచ్చినా క్వింటాలుకు రైతు పెట్టిన వ్యయాన్ని ప్రభుత్వ లెక్కల ప్రకారం 9502/-. కేంద్రం ఇస్తున్న మద్దతు ధర రూ.5,550/- ఈ లెక్కన చూసినా క్వింటాలుకు 4,000/- నష్టాన్ని రైతు పెట్టుబడిలోనే భరిస్తున్నారు. ఇలా వ్యయాన్ని లెక్కించినపుడు నష్టాల బారిన రైతాంగం పడక తప్పదు.
సీ2ప్లస్ 50 శాతం అంటే ఇందులో రైతు చెల్లించేసిన వ్యయాలు, కుటుంబ శ్రమ విలువ, సొంత మూలధనం ఆస్థుల విలువపై వడ్డీ, భూమికి చెల్లించే కౌలు విలువ వంటి వ్యయాలన్నీ జతచేర్చి ‘సీ2’గా వ్యవహరిస్తారు. వీటికి 50 శాతం అదనంగా రికలిపి ‘కనీస మద్దతు ధర’ నిర్ణయించాలనేది ఈ ఫార్ములా సూచిస్తుంది. ఇది అన్ని పంటలకూ వర్తింపచేసి మద్దతు ధర నిర్ణయిస్తే, రైతాంగానికి చాలా మేలు జరగడం వల్ల ఆత్మహత్యలని నివారించవచ్చును. ఈ సిఫారసుల అమలుకు పూనుకొని, సంక్షోభం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. రైతులు పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరను కల్పించాల్సి ఉంది. రైతులు తాము పండించిన పంటలకు ధరలను నిర్ణయించుకోలేని స్థితిలో చట్టాలు చేసి పాలకులు పాలన సాగిస్తున్నారు. రాయితీలు మాత్రమే కాదు, మార్కెట్ల మాయాజాలం, కల్తీ విత్తనాలు, పురుగు మందులు.. ఇలా అన్ని స్థాయిల్లో దోపిడీని నివారించినప్పుడే రైతులు వ్యవసాయం చేయగలుగుతారు. ఈ సంవత్సరం భారీగా పత్తి ఉత్పత్తి రాబోతున్నవేళ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకోక పోతే రైతుల విపత్కర పరిస్థితికి కారకులవుతారని గమనించాలి.
రైతుల పంటలకు స్వామినాథన్ సిఫారసుల మేరకు పెట్టుబడికి కనీసం 150 శాతం వచ్చేలా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించాలి. ఆ ధరకు మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోలు చేయని ఎడల ఎలాంటి షరతులు పెట్టకుండా రైతుల వద్దనుండి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి. రైతు పెట్టుబడికి- మద్దతు ధరకు మధ్య క్వింటాలుకు రూ.4000/- అయితే వ్యవసాయం చేస్తూ నష్టపోతున్నందువల్లనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కార్పొరేటు శక్తులకు దేశీయ వ్యవసాయాన్ని ధారాదత్తం చేయాలనే కుట్ర జరుగుతుంది. ఏ రకం ఉత్పత్తులకు నష్టం జరిగినా- అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించి వారికి అండగా నిలబడాలని రాజ్యాంగం చెప్పింది. అన్ని ఉత్పత్తులకు అండగా ఉంటున్న పాలకులు రైతు ఉత్పత్తులకు ఎందుకు అండగా ఉండరు. రైతుకు బిచ్చం వేసినట్టు కేంద్రం మద్దతు ధర రూ.100 లేదా రూ. 200 పెంచుతూ పోవడం భావ్యం కాదు. రైతులే వ్యవసాయ ఉత్పత్తులకు పెట్టుబడి పెట్టి ప్రభుత్వ విధానాల వలన నష్టపోతున్నారన్నది నిజం కాదా? మట్టిని నమ్ముకున్న రైతు నోట మట్టికొట్టే విధానాలు మారనంతకాలం రైతు కుటుంబాల్లో వెలుగులు రావు. నేడు పత్తి మద్దతు ధరకు, ఉత్పత్తి వ్యయానికి మధ్య అగాధాన్ని వెంటనే పూడ్చాలి. వ్యవసాయాన్ని లాభాల బాట పట్టించాలి. రైతు ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత పాలకులదే.

-మేకిరి దామోదర్ 95736 66650