Others

అంతరిక్షంలోనూ సగం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆకాశంలోనే కాదు, అంతరిక్షంలోనూ సగం మేమే..’ అంటూ అమెరికా మహిళా వ్యోమగాములు చరిత్ర సృష్టించారు. ‘నాసా’కు చెందిన క్రిస్టినా కోచ్, జెస్సికా మెయిర్ ఇటీవల ‘స్పేస్‌వాక్’చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. వారి ధైర్యాన్ని, నైపుణ్యాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొనియాడారు. ఇది మార్నింగ్‌వాక్ లాంటిది కాదు. ఆషామాషీ నడక అంతకన్నా కాదు.. అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్‌కు సౌర విద్యుత్‌ను అందించే యూనిట్‌లోని బ్యాటరీ మరమ్మతుల కోసం స్పేస్‌వాక్ చేసిన వ్యోమగాములు వారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) నుంచి బయటకొచ్చి ఐదు గంటలపాటు మరమ్మతులు నిర్వహించడం ‘నాసా’ చరిత్రలో సరికొత్త అధ్యాయం. ఒకప్పుడు వంటింటికే పరిమిత మనుకున్న మహిళ ఇప్పుడు అంతరిక్షంలో నడిచి ‘మరమ్మతులు’ చేయడం ఓ గొప్ప ముందడుగు. ‘నాసా’ వ్యోమగామి క్రిస్టినాకోచ్ గత మార్చి నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటోంది. తోటి వ్యోమగామి జెస్సికా మెయిర్‌తో కలిసి ఆ కేంద్రం నుంచి వెలుపలికొచ్చి ఐదుగంటలకు పైగా శ్రమించి, ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా సురక్షితంగా పని ముగించుకుని తిరిగి తమ స్థానాలకు చేరుకున్నారు.
అమెరికాలోని మిషిగన్‌కు చెందిన క్రిస్టినా కోచ్ నార్త్ కెరలోనా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొంది, 2013లో ‘నాసా’వ్యోమగామిగా ఎంపికయ్యారు. నాలుగుసార్లు అంతరిక్ష యాత్రలు జరిపిన అనుభవం ఆమెది. ఇక జెస్సికాది అమెరికాలోని కారిబో ప్రాంతం. బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఫిజియాలజిస్టుగా పట్టా తీసుకున్నాక, ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్సిటీ నుంచి స్పేస్ స్టడీస్‌లో ‘పీజీ’చేశారు. ఈమె కూడా 2013లో ‘నాసా’ వ్యోమగామిగా ఎంపికయ్యారు. రెండుసార్లు అంతరిక్ష యాత్ర చేసిన అనుభవముంది. మొట్టమొదటిసారి కేవలం మహిళలు (ఆల్ ఉమెన్) ఇలా స్పేస్‌వాక్ చేసి మరమ్మతులు జరపడం చారిత్రక ఘట్టంగా అందరూ శ్లాఘిస్తున్నారు.
ఈ సందర్భంలో భారతదేశానికి చెందిన కల్పనా చావ్లాను స్మరించుకోవాలి. ఆమె భారత సంతతికి చెందినది. ‘నాసా’తరఫున అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యోమగామి. 2003లో జరిగిన ఓ ప్రమాదంలో మరణించారు. పంజాబ్‌లోని కల్నాల్‌కు చెందిన ఆమె సృష్టించిన చరిత్ర సదా గుర్తుండిపోతుంది. భారత సంతతికి చెందిన సునీల్ విలియమ్స్‌ను సైతం మరచిపోలేం. గతంలో ఎందరో మహిళా వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళారు. వీరిలో అమెరికాకు చెందినవారే ఎక్కువ మంది ఉండడం గమనార్హం.
2012లో చైనా అంతరిక్షంలోకి లియూయాంగ్ అనే మహిళను పంపించింది. ఆ విధంగా చైనా అంతరిక్షంలోకి మహిళను పంపిన మూడవ దేశంగా నిలిచింది. అమెరికా, సోవియట్ యూనియన్ (రష్యా) తరువాత చైనా ఈ ఘనతను సాధించింది. 2013లో ‘షెంజూ’ ప్రయోగం ద్వారా వాంగ్‌యాపింగ్ అనే మహిళను చైనా అంతరిక్షంలోకి పంపింది. 1963లో అప్పటి సోవియట్ యూనియన్ తన తొలి మహిళా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపింది. వాలింటినా టెరిష్కోవా అప్పుడు చరిత్రను సృష్టించారు. 1982లో మరో మహిళా వ్యోమగామి స్వేత్లానా సవిత్యయా అంతరిక్షంలోకి వెళ్ళింది.
ఇక కెనడా, ఫ్రాన్స్, భారత్, ఇరాన్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్‌లకు చెందిన మహిళా వ్యోమగాములు సోవియట్ లేదా అమెరికా వ్యోమనౌకల ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళారు. అనేక సవాళ్ళను ఎదుర్కొని నిలదొక్కుకున్నారు. వ్యోమగాములకు మానసిక (సైకలాజికల్) ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. ఒంటరితనం సైతం భయంకరంగా వేధిస్తుందట.
వ్యోమగాములుగా ఎంపికైనవారు అనేక పరీక్షల్లో ఉత్తీర్ణులు కావల్సి ఉంటుంది. 1978లో ‘నాసా’ మహిళలకు అంతరిక్ష కార్యక్రమం ప్రారంభించాక వారు శిక్షణ కోసం ఆసక్తిని ప్రదర్శించడం పెరిగింది. అమెరికానుంచి తొలి మహిళా వ్యోమగామిగా ‘సాలీరైడ్’నిలిచారు.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక 2014లో ఎలెనా సెరోవా తొలి మహిళా వ్యోమగామిగా అంతరిక్షంలోకి వెళ్ళింది. కెనడా నుంచి 1992లో రొబెర్టా బాండర్ అనే మహిళ తొలిసారి అంతరిక్షంలోకి వెళ్ళింది.
వివిధ విధులు నిర్వహించేందుకు అంతరిక్షంలోకి మొత్తం 59 మంది మహిళలు వెళ్ళినట్టు తెలుస్తోంది. అనుకోని ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు వదిలారు. (వీరి శాతం బహు తక్కువ). వీరిలో కల్పనా చావ్లా ఒకరు. అయినా ఆమె సాహసం ఎందరో మహిళలకు, యువతులకు స్ఫూర్తినిచ్చింది. ఆ స్ఫూర్తితో ఎందరో అంతరిక్షంలోకి వెళ్ళేందుకు అవసరమైన ‘విద్య’ను అభ్యసించారు. ఎన్నో కలలుకన్నారు.
అమెరికాలో అంతరిక్ష యాత్రల కోసం పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థ స్పేస్-ఎక్స్ సిఈఓగా ఒక మహిళ పనిచేస్తోంది. గ్విన్నీ షాట్‌వెల్ ఆ సంస్థ రోజువారి కార్యకలాపాల్ని నియంత్రిస్తోంది. మంచి వ్యాపారవేత్తగా గుర్తింపు పొందింది. స్వతహాగా ఆమె ఇంజినీర్ కూడా. ఈ సంస్థ ‘‘అంతరిక్ష రవాణా’’కోసం పనిచేస్తున్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అవసరమైన వాటిని ఈ సంస్థ చేరవేస్తుంది. ‘నాసా’కు సేవలందిస్తున్నది. అంగారక గ్రహంపైకి మనుషులను తీసుకెళ్ళే బృహత్తర కార్యక్రమంలో ఆ సంస్థ ఇప్పుడు శ్రమిస్తోంది. షాట్‌వెల్ ఈ స్పేస్-ఎక్స్ సంస్థలో చేరకముందు ఏరో స్పేస్ కార్పొరేషన్‌లో దశాబ్దకాలం పనిచేసింది. ఆమె కెరీర్ అంతా ‘స్పేస్’తో ముడిపడి ఉండటం గమనార్హం. ఆమె ‘వరల్డ్ టెక్నాలజీ అవార్డు’ను అందుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లోనూ ఎందరో మహిళలు పనిచేస్తున్నారు. ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఓ మహిళ వ్యవహరించింది. ఆమెను ముద్దుగా ‘్భరత రాకెట్ మహిళ’గా నిలుచుకుంటారు. ఆమెనే లక్నోకు చెందిన రితూ కరిదల్.
అంగారక గ్రహంపైకి వెళ్ళే మిషన్ ప్రాజెక్టులో మరో మహిళా శాస్తవ్రేత్త మినాల్ సంపత్ పనిచేస్తున్నారు. ఆమె రోజుకు 18 గంటలు ఆ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు. మరో సీనియర్ మహిళా శాస్తవ్రేత్త టి.కె.అనురాధ. కలకత్తాకు చెందిన వౌమితా దత్తా అనే మరో మహిళా శాస్తవ్రేత్త అంతరిక్ష ప్రయోగాల పరికరాలను భారత్‌లోనే తయారీకి ఉద్దేశించిన బృందంలో పనిచేస్తోంది. గత ఇరవై ఏళ్లుగా నందిని హరినాథ్ ‘ఇస్రో’లోని వివిధ విభాగాల్లో సేవలందిస్తోంది. ఎందరో మహిళా శాస్తవ్రేత్తలు, ఇంజినీర్లు నిరంతరం పనిచేస్తున్నందున ‘ఇస్రో’ ప్రతిష్టాత్మకమైన ఎన్నో ప్రయోగాలను నిర్వహించగలుగుతోంది. చంద్రయాన్, మంగళ్‌యాన్ ప్రాజెక్టుల్లోనూ మహిళల స్వేదం దాగుంది. వారి మేధ కనిపిస్తోంది.
తిరువనంతపురంలోని అంతరిక్ష విజ్ఞాన అధ్యయన సంస్థ ఇలాంటి మరో తొమ్మిది అధ్యయన- పరిశోధన సంస్థల్లో యువతులు చదువుతున్నారు. తమ జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. భవిష్యత్ మహిళా శాస్తవ్రేత్తలుగా ఎదిగేందుకు ఆరాటపడుతున్నారు. ఈ వాతావరణం ఇప్పుడు అనేక దేశాల్లో కనిపిస్తోంది. ఇలా మహిళలు- ‘ఆకాశమే కాదు, అంతరిక్షంలోనూ సగం తామేన’ని చాటిచెబుతున్నారు.

-వుప్పల నరసింహం 99857 81799