AADIVAVRAM - Others

హైదరాబాద్ కీర్తి పతాక ఎయిరిండియా ఎంఆర్‌ఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది అంతర్జాతీయ శంషాబాద్ విమానాశ్రయం. ప్యాసింజర్ టెర్మినల్ నుంచి తాము ఎక్కాల్సిన విమానం కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. అంతలో ఆకాశం నుంచి ఒక పెద్ద మేఘమే భూమిపై వాలుతున్నట్టుగా అనిపించే అతి పెద్ద విమానం ఒకటి ల్యాడింగ్ అయింది. అన్ని ప్యాసింజర్ టెర్మినల్స్‌లో కూర్చున్నవారంతా ల్యాడ్ అయిన విమానం వైపే చూపు మరల్చుకోకుండా ‘అబ్బో ఎంత పెద్ద విమానమో’ అని ఆశ్చర్య పోతున్నారు. అది ఎయిరిండియాకు చెందిన బోయింగ్-777 విమానం. ఇదొక పుష్పక విమానం లాంటిదే. దీంట్లో సుమారు నాలుగు వందల మంది ప్రయాణికులకు సీటింగ్ సదుపాయం కలిగి ఉంటుంది. ఒక్కో మాడల్‌ను బట్టి 314 నుంచి 396 సీట్లు ఉంటాయి. మరి ఇంత పెద్ద విమానానికి ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే ఏ అమెరికాకో, బ్రిటన్‌కో వెళ్లాల్సి ఉంటుందేమో అనుకుంటాం. కానీ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద విమానాలకు కూడా రిపేర్లు చేసే సర్వీస్ సెంటర్ హైదరాబాద్‌లోనే ఉందంటే కాస్త ఆశ్చర్యకరమే. కానీ ఇది శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్ ఇండియా నెలకొల్పిన దీనిని ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌గా పిలుస్తారు. వాడుకలో దీనిని ఎమ్మార్వోగా (మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాలింగ్) వ్యవహరిస్తారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఎమ్మార్వోలు హైదరాబాద్, కోల్‌కత్తా, తిరువనంతపురం, నాగ్‌పూర్, ఢిల్లీ, ముంబైలో ఉన్నప్పటికీ వీటిలో హైదరాబాద్ ఎమ్మార్వో మేటి. ఇక్కడికి వివిధ దేశీయ విమానాలే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఎన్నో విమానయాన సంస్థలకు చెందిన విమానాలు మరమ్మత్తుల కోసం వస్తాయి. ఖతార్ ఎయిర్‌వేస్, శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్, సౌది ఎయిర్‌వేస్, థాయి ఎయిర్‌లైన్స్, కువైట్ ఎయిర్ వేస్, బంగ్లాదేశ్ ఎయిర్ లైన్స్ తదితర విమానాలకు వంట్లో సుష్తి వస్తే హైదరాబాద్ బాటనే పడుతాయంటే అతిశయోక్తి కాదు. శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడంతో ఇక్కడికి వచ్చే విమానాలకు ఇక్కడే రిపేర్లు జరగాలన్న ఉద్దేశంతో 2013లో ఎమ్మార్వోను రూ.79 కోట్ల వ్యయంతో నెలకొల్పారు. ఈ గ్యారేజికి ప్రస్తుతం ఒకేసారి రెండేసి ఎ-319, ఎ-320, ఎ-321 ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్స్‌కు రిపేర్లు చేసే సామర్ధ్యంతో పాటు ఒక్కో బోయింగ్-777, బోయింగ్ 747 విమానానికి రిపేర్ చేయగలుగుతారు. ఇందులో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన 350 మంది ఇంజనీర్లు పని చేస్తున్నారు. విమానాల హెవీ మెయింటెన్స్, లైన్ మెయింటెనెన్స్, ఇంజన్ రిప్లేస్‌మెంట్/ఓవరాలింగ్, కంపొనెంట్ ఓవరాలింగ్, ల్యాడింగ్ గేర్ రిపేర్ సౌకర్యంతో పాటు పై రంగాలలో శిక్షణ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎన్‌ఎస్ చక్రవర్తి ఆంధ్రభూమి ప్రతినిధికి వివరించారు. ఇంకా అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి సంపన్న దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు కూడా త్వరలో ఇక్కడ రిపేర్లు చేయగలిగిన సామర్థ్యానికి చేరుకోగలుగుతామని జనరల్ మేనేజర్ వై శ్రీనివాస్‌రావు ధీమా వ్యక్తం చేశారు. అయితే అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన ఎయిర్‌లైన్స్ విమానాలు ఇక్కడికి రిపేర్ల కోసం రావాలంటే హైదరాబాద్ ‘ఎమ్మార్వో’కు ‘ఈసా’ (యురోపియన్ యూనియన్ ఎయిర్ సెఫ్టీ ఏజెన్సీ ధృవీకరణ పత్రం అవసరం. దీని కోసం ఎయిర్ ఇండియా ఇప్పటికే ప్రక్రియ మొదలు పెట్టిందని అది వచ్చాక హైదరాబాద్ ఎమ్మార్వోకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించనుంది. ఈ సెంటర్‌కు ఇప్పటికే బెస్ట్ ఎయిర్‌ప్లేన్ ఇంజనీరింగ్ ఎమ్మార్వో ఇన్ ఇండియా-2011, వన్ స్టాప్ షాప్ ఇండియా ఎమ్మార్వో-2013 అవార్డులను హైదరాబాద్ ఎమ్మార్వో దక్కించుకుంది. అలాగే ఇథోపియన్ ఎయిర్‌లైన్స్, బంగ్లాదేశ్‌కు చెందిన బీమన్ ఎయిర్‌లైన్స్, కెన్యా ఎయిర్‌వేస్, ఇండియన్ నెవీ హెలిక్యాప్టర్ నుంచి ప్రశంసా పత్రాలను అందుకుంది.
పైలెట్లకే పైలెట్ సీటీఈ
విమానాలను పైలెట్లు నడిపిస్తే వారిని సెంట్రల్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సీటీఈ) నడిపిస్తుంది. పైలెట్ శిక్షణ పొందిన తర్వాత విమానాలు నడపడం ఒక్కటే కాకుండా అవీ ప్రమాదాలకు గురైనప్పుడు ఏ విధంగా బయటపడాలో పైలెట్లకు శిక్షణ ఇచ్చే సంస్థనే సీటీఈ. ఎయిరిండియా దీనిని 50 సంవత్సరాల కిందట హైదరాబాద్ పాత బేగంపేట విమానాశ్రయానికి వెనుక వైపులో బోయినపల్లిలో నెలకొల్పింది. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పైలెట్ శిక్షణ తర్వాత కోర్స్ అప్‌గ్రేడ్ కోసం ఇదే కేంద్రంలో శిక్షణ పొందడం విశేషం. పైలెట్ శిక్షణ అనంతర కోర్స్‌లను ఇక్కడ ఎయిరిండియా నిర్వహిస్తుంది. ఇండియన్ ఎయిర్ లైన్స్‌కు ‘ఎయిర్ యూనివర్సిటీ‘ నెలకొల్పాలన్న కలను సీటీఈ తీర్చింది. పైలెట్లకు అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవహరించాలి దగ్గరి నుంచి కమర్షియల్ పైలెట్స్‌కు అవసరమైన శిక్షణతో పాటు ఎయిర్ హోస్టెట్స్‌కు కూడా ఇక్కడ శిక్షణ ఇస్తారు. విమాన ప్రమాదాలు మూడు రకాలు. విమానం అగ్ని ప్రమాదానికి గురి కావడం, నీళ్లలో కానీ, మైదానం, కొండలు, లోయలు, అడవి ప్రాంతాల్లో కానీ కూలినప్పుడు విపత్కర పరిస్థితుల నుంచి ప్రయాణికులతో పాటు తాను ఏ విధంగా బయట పడాలో ఇక్కడ ఇచ్చే శిక్షణ అత్యంత ముఖ్యమైంది. సముద్రం లాంటి ప్రదేశాల్లో విమానం కూలినప్పుడు ఏ విధంగా బయటపడాలో ప్రత్యక్షంగా పైలెట్లకు శిక్షణ ఇవ్వడానికి ఇక్కడి సీటీఈలో పెద్ద స్విమ్మింగ్‌పూల్ ఉంది. అలాగే విమానం కూలే సమయంలో ఏ విధంగా తప్పించుకోవాలో వివరించడానికి విమాన కాక్‌పీట్‌తో పాటు ప్యాసింజర్ సీటింగ్ రెండు వేర్వేరు పార్ట్ మోడల్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే విమానంలో షార్ట్ సర్క్యూట్ కానీ, మరేలాంటి అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు కానీ లోపల పొగ, మంచు కమ్ముకున్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో పైలెట్లకే కాకుండా ఎయిర్ హోస్టేస్స్ కూడా ఇక్కడ శిక్షణ ఇస్తారు. విమానంలో ఇంధనంగా తేలికపాటి కిరోసిన్ వాడుతారు. కిరోసిన్ మండి విమానంలో మంటలు వ్యాప్తి చెందడానికి 100 నుంచి 150 సెకండ్ల వ్యవధి పడుతుంది. ఆ లోగానే ప్రయాణికులు సురక్షితంగా బయట పడాలంటే ఇంధనం అంటుకోవడం కంటే తక్కువ సమయంలోనే బయటకు రావాలి. సాధారణంగా ప్రతి విమానానికి ఇరువైపుల నాలుగేసి ద్వారాలు (ఎమర్జెన్సీ కలుపుకొని) ఉంటాయి. ఎంత పెద్ద విమానమైన ఇరువైపుల ఉండే ఎనిమిది ద్వారాలు క్షణాల్లో తెరుచుకోవడం ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలుగుతారు. అన్ని ద్వారా తెరిచి 90 సెకండ్లలో ప్రయాణికులను ఏ విధంగా బయటికు తీసుకురావాలో కూడా ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎయిర్ ఇండియా పైలెట్లకే కాకుండా ఇతర దేశీయా, అంతర్జాతీయ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పైలెట్లు కూడా ఇక్కడి సీటీఈలో శిక్షణ పొందడానికి వస్తారు. 20 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో పచ్చని చెట్లు, పచ్చిక బయళ్ల మధ్య సీటీఈలో శిక్షణ అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది.
బ్లాక్ బాక్స్ అనగానే అది విమానాల్లో ఉండే పరికరమన్నది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడైనా విమాన ప్రమాదం జరిగితే అక్కడికి చేరుకునే దర్యాప్తు బృందం మొదట వెతికేది మృతదేహాల కోసమో, విమాన శకలాల కోసం కాదు. బ్లాక్ బాక్స్ కోసమే. బ్లాక్ బాక్స్ దొరికిందంటే ఆ ప్రమాదం ఎలా జరిగిందో తెలిసిపోతుంది. విమానాల్లో అత్యంత ముఖ్యమైన బ్లాక్ బాక్స్ సమాచారాన్ని విశే్లషించే కేంద్రం కూడా శంషాబాద్ ఎమ్మార్వో కేంద్రంలోనే ఉండటం మరో విశేషం. బ్లాక్ బాక్స్ అంటే బ్లాక్ కలర్‌లో ఉండవచ్చు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. బ్లాక్ బాక్స్ ఆనేది ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. ప్రతి విమానంలో బ్లాక్ బాక్స్ తప్పని సరిగా ఉంటుంది. విమానం ప్రమాదానికి గురైనప్పుడు అతి తక్కువగా దెబ్బ తినే అవకాశం ఉన్నచోట సురక్షితంగా దీనిని అమరుస్తారు. బ్లాక్ బాక్స్ రిసివర్ స్పీకర్లు మాత్రమే కాక్‌పీట్‌లో ఉంటాయి. బ్లాక్ బాక్స్‌లను యుఎస్‌ఏకు చెందిన ఫేయిర్ చైల్డ్ అనే సంస్థ తయారు చేస్తుంది. ఆకాశంలోనే విమానం పేలిపోయినా, సముద్రంలో పడిపోయినా, ఎత్తుతైనా కొండలు, లోతైనా లోయల్లో పడినా బ్లాక్ బాక్స్ మాత్రం చెక్కు చెదరకుండా ఉండేలా అత్యంత పటిష్టంగా దీనిని తయారు చేస్తారు. 1100 డిగ్రీల వేడికైనా తట్టుకొని చెక్కు చెదరకుండా ఉంటుంది. నాలుగు నుంచి ఐదు కిలో మీటర్ల నీటి అడుగులోతులో అయినా 30 రోజుల పాటు ఏ మాత్రం పాడవకుండా ఉండేలా దీనిని రూపొందిస్తారు. సముద్రం వంటి లోతైన నీటిలో బ్లాక్ బాక్స్ పడిపోతే అందులోని రసాయన పదార్థం కరిగిపోయి దీని ఆనవాలు తెలియజేసే విధంగా చమురులాంటి పదార్థం నీటిపై తేలాడే విధంగా డిజైన్ చేస్తారు. నీటిపై తేలేడే చమురులాంటి పదార్థం ద్వారా అంతరిక్షంలో నుంచి బ్లాక్ బాక్స్‌ను కనుక్కునే అవకాశం ఉంటుంది. అలాగే దట్టమైన అడవిలో కానీ, కొండలు, లోయలు వంటి ప్రదేశాల్లో పడిపోతే బ్లాక్ బాక్స్ నుంచి వెలువడే రేడియషన్ వాయు తరంగాలతో అంతరిక్షం నుంచి గుర్తించే విధంగా డిజైన్ చేస్తారు. ప్రమాదానికి రెండు గంటల ముందు పైలెట్, కో-పైలెట్ మధ్య జరిగే సంభాషణ బ్లాక్ బాక్స్‌లో రికార్డు అవుతుంది. వారి సంభాషణను విశే్లషించి ప్రమాదం ఎలా జరిగిందో ప్రాథమికంగా గుర్తిస్తారు. బ్లాక్ బాక్సే కాకుండా విమానంలో మరో రికార్డింగ్ పరికరం ఉంటుంది. దీనిని ఎఫ్‌డిఆర్ (ఫ్లైట్ డాటా రికార్డర్) అంటారు. దీనిని కూడా యుఎస్‌ఏకు చెందిన హోనివెల్ సంస్థ తయారు చేస్తుంది. ఇది విమానం డాటా పారామీటర్లను రికార్డు చేస్తుంది. ఇంజన్ అయిల్ ప్రెషర్, పవర్, వాయు వేగం, దిశలను రికార్డు చేస్తుంది. విమాన ప్రమాదం జరిగినప్పుడు సాంకేతిక లోపాలు ఏమైనా జరిగితే ఎఫ్‌డిఆర్ ద్వారా తెలుసుకుంటారు.

-వెల్జాల చంద్రశేఖర్ 98499 98092