Others

‘కృత్రిమ మేధ’ నామ సంవత్సరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్రిమ మేధ (ఏఐ) నామ సంవత్సరంగా 2020ని పరిగణిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు ఇటీవల ప్రకటించారు. దీంతో ప్రజాజీవితంలో ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్ (కృత్రిమ మేధ)కు ఎంతటి ప్రాధాన్యత ఉందో తెలుస్తోంది. మారుతున్న కాలానుగుణంగా రూపాంతరం చెందాలన్న ‘సోయి’గల ఐటి మంత్రి కేటిఆర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
వ్యవసాయం, పట్టణ రవాణా, వైద్యం తదితర రంగాలలో కృత్రిమ మేధను ఉపయోగించి మంచి ఫలితాలు రాబట్టేందుకు నిశ్చయించారు. 2020 సంవత్సరమంతా కృత్రిమ మేధ కేంద్రంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నామని ప్రకటించారు. అనేక సదస్సులు, హ్యాక్‌థాన్లు జరగనున్నాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) అధ్యక్షురాలు దేబ్‌జానిఘోష్ కేటీఆర్‌తో భేటీ అయిన సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిలో ప్రపంచస్థాయి సంస్థలు ఏఐ రంగంలో పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డి) కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు ముందుకొస్తున్నాయని, పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నాయని ఆయన చెప్పారు.
అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞాన (ఎమర్జింగ్ టెక్నాలజీస్) రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. కృత్రిమమేధ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటి), మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యురిటీ, బ్లాక్‌చైన్ లాంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం తగు పురోగమన చర్యలు తీసుకుందని, ఈ విషయంలో సహకారం అందించడానికి ముందుకొచ్చిన నాస్కామ్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు, సంతోషం వ్యక్తపరిచారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ సంస్థలకు అవసరమైన వాతావరణాన్ని కల్పించడానికి, సహాయ సహకారాల్ని అందిస్తామని నాస్కామ్ అధ్యక్షురాలు హామీఇచ్చారు. నైపుణ్యాల్లో అంతరాలను తగ్గించడానికి నాస్కామ్ ప్రయత్నిస్తోంది.
ఏఐ, డేటా సైనె్సస్‌లకోసం ‘నాస్కామ్’ హైదరాబాద్‌లో ఒక కేంద్రాన్ని త్వరలో ఏర్పాటుచేయనున్నది. అలాగే ఖరగ్‌పూర్‌కు చెందిన ఐఐటి సైతం ఓ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తోంది. ఈ కేంద్రంలో ఏఐ కార్యక్రమాలపై ‘్ఫకస్’పెట్టనున్నారు. స్వీడన్‌కు చెందిన హెక్సగన్ కాపబిలిటీ సెంటర్ (హెచ్‌సిసిఐ) నాస్కామ్ సహాయంతో హైదరాబాద్‌లో పనిచేస్తోంది. ఈ కేంద్రం ఏఐపై ఉన్నత పాఠశాల ఆపై విద్యార్థులకు ఉచితంగా సేవలు అందిస్తున్నది. ఏఐ సబ్జెక్టులో నైపుణ్యం ఇప్పటికే ఈ కేంద్రంలో వందలాది మంది నిపుణులు పనిచేస్తున్నారు.
హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి సంస్థలు
హైదరాబాద్‌లో ఇప్పటికే ఎన్నో ప్రపంచస్థాయి సంస్థలు పనిచేస్తున్నాయి. వాటి పరిశోధనా కేంద్రాలూ ఉన్నాయి. వీటిలో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం, యాహూ, డెల్, ఫేస్‌బుక్ ప్రముఖమైనవి. ఇక దేశీయ సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), ఇన్‌ఫోసిస్, టెక్ మహేంద్రా, విప్రో, జెన్‌పాక్ట్ లాంటివి ఉన్నాయి. వీటన్నింటిలో కృత్రిమ మేధ (ఏఐ)కి చెందిన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక స్టార్టప్ సంస్థలు ఏఐ రంగంలో వివిధ ఆవిష్కరణలకై కృషిచేస్తున్నాయి. ‘నీతి ఆయోగ్’ సైతం ఈ విషయమై విధానపరమైన నిర్ణయం తీసుకుని ఆయా రాష్ట్రాలకు దిశానిర్దేశం చేస్తోంది.
2035 సంవత్సరం నాటికి 957 బిలియన్ డాలర్ల మార్కెట్ ‘ఏఐ’కి ఉందని అక్సెంబర్ అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది. వచ్చే సంవత్సరం చివరినాటికి దేశంలోని రిటైల్ కంపెనీల్లో 50శాతం సంస్థలు కృత్రిమ మేధను ఉపయోగిస్తాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా రిలయన్స్ సంస్థ డిజిటల్ సేవలన్నింటినీ ఒకే గొడుగుకిందకు తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. ఇది అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. ఇప్పటికే డిజిటల్ సేవల ముఖ చిత్రాన్ని ‘రిలయన్స్’మార్చేసిన సంగతి తెలిసిందే. రిలయన్స్ కేవలం టెలికమ్యూనికేషన్ రంగం పైనేగాక, కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్‌చెయిన్, మెషిన్ లెర్నింగ్ లాంటి ఆధునిక సాంకేతిక రంగాల్లోనూ పనిచేస్తోంది. మరిన్ని సేవలను అందించేందుకు కొత్తగా రూపొందించిన అనుబంధ సంస్థ కృషిచేయనున్నది.
సమాజంలో విప్లవాత్మక మార్పులకు నాందిపలికే సరికొత్త ప్లాట్‌ఫాంలను ఏకంచేసి మరింత సమర్ధవంతంగా నడిపించేందుకు రిలయన్స్ కొత్త అనుబంధ సంస్థ పనిచేయబోతోంది.
రిలయన్స్ పేర జరిగే ఏ కార్యక్రమమైనా భారీస్థాయిలో ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు కృత్రిమమేధ, బ్లాక్‌చెయిన్, మెషిన్ లెర్నింగ్‌పై ‘దృష్టి’సారించి ముందుకు సాగితే సరికొత్త ఫలితాలు రావడం ఖాయం. ఆ ఫలితాలు తెలుగునేలపై సైతం కనిపించనున్నాయి. డిజిటల్ సేవల అంశమై రిలయన్స్ గూగుల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్ లాంటి బడా సంస్థలతో పోటీ పడబోతున్నదని వినికిడి..
ద్విముఖ విప్లవం
కృత్రిమమేధ, 5జి ఈ రెండు ద్విముఖ విప్లవంగా భావిస్తున్నారు. ఈ రెండు పరిజ్ఞానాలు ఒకదానికొకటి పూర్వకంగా పనిచేయనున్నాయి. గతంలో ఎన్నడూలేనంతగా కృత్రిమమేధపై అనేక సంస్థలు పెద్దఎత్తున పెట్టుబడులుపెట్టి సరికొత్త సారాంశాన్ని వెలికితీసేందుకు పనిచేస్తున్నాయి. సమాజంలోని అన్ని పార్శ్వాలను ప్రభావితంచేసే రీతిలో కృత్రిమమేధను మలచుకుంటున్నారు. తదనుగుణంగా హైదరాబాద్‌లోని మాదాపూర్, నానక్‌రామ్‌గూడ, కొండాపూర్, ఉప్పల్‌లోని సెజ్‌లలో నాలుగు ఐటి, ఐటి ఆధారిత కంపెనీల స్థాపనకు సంబంధిత అధికారులు ఇటీవల అనుమతించారు. ఇందులో చెన్నైకి చెందిన ష్నైడల్ సంస్థ రూ.10 కోట్ల పెట్టుబడితో ఐటి పరిశ్రమను నెలకొల్పనున్నది. పుణెకు చెందిన మరో సంస్థ జెడ్‌ఎఫ్ రూ.37 కోట్ల పెట్టుబడితో తన యూనిట్‌ను నానక్‌రామ్‌గూడలో స్థాపించనున్నది. నాగపూర్‌కు చెందిన ఏసెంట్ బిజినెస్ సొల్యూషన్స్ రూ.81కోట్ల పెట్టుబడితో తన సంస్థను ప్రారంభించనున్నది. అలాగే హైదరాబాద్‌కు చెందిన టిటిఈసీ రూ.21 కోట్లతో పరిశ్రమను స్థాపించనున్నది. ఈ సంస్థలవల్ల వేలాది మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లభించనున్నాయి. ఇదిలా ఉండగా బద్వేలులో ఐటి క్లస్టర్ రాబోతోందని ఐటిశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎలిమినేడులో 600 ఎకరాల్లో ఏరోస్పేస్ పార్క్ రాబోతోందని, ముచ్చర్లలో ఫార్మా క్లస్టర్ రానున్నదని, లాజిస్టిక్ పార్కులు మరిన్ని రాబోతున్నాయని మంత్రి ప్రకటించారు. వీటన్నిటా ‘ఏఐ’ తప్పక కనిపిస్తుంది.
కొసమెరుపు
రెండు రోజుల్లో జర్మనీ చాన్సలర్ డాక్టర్ అంజెల మెర్కెల్ దేశ రాజధానికి రానున్నారు. ప్రధాని మోదీతో సమావేశమై ‘కృత్రిమ మేధ’ భాగస్వామ్యంపై చర్చించనున్నారు. ఆమెతోపాటు జర్మనీకి చెందిన బడా పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. అనేక ఒప్పందాలు కుదరనున్నాయి. వాటిలో కృత్రిమ మేధకు చెందిన అంశమూ ఉండటం గమనార్హం. దాని ప్రభావం తప్పక తెలుగు రాష్ట్రాలపైనా పడనున్నది.

-వుప్పల నరసింహం 99857 81799