సబ్ ఫీచర్

అడిగోపుల అభ్యుదయ కవిత్వ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేజీలు : 134, వెల: రూ.100
- ప్రతులకు -
ప్రజాశక్తి హౌస్,
కార్ల్‌మార్క్స్ రోడ్, విజయవాడ - 520 002
*
నాలుగు దశాబ్దాలకు పైగా నిశ్శబ్దంగా..అభ్యుదయ దృక్పథంతో.. కవిత్వాన్ని పండిస్తూ.. ఇరవై ఒక్క గ్రంథాలకు జీవంపోసి.. తమ రచనల ద్వారా సాహితీ లోకాన్ని సుసంపన్నంచేస్తున్న అడిగోపుల వెంకటరత్నమ్ రచనా వైచిత్రిని.. పరామర్శిస్తూ విమర్శకులు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఓ గ్రంథాన్ని వెలువరించారు.. ‘‘అడిగోపుల అభ్యుదయ కవిత్వం’’ పేరుతో ప్రకటింపబడిన ఈ గ్రంథంలో అడిగోపుల కవిత్వాన్ని చక్కగా విశే్లషిస్తూ.. ఇంతవరకు అడిగోపుల వెలువరించిన కవితా సంపుటాల్లోని మధురిమలను పాఠక లోకానికి అందించడానికి కొండ్రెడ్డి చేసిన ప్రయత్నం ప్రశంసనీయం.. సామాజిక చింతనతో.. సమకాలీన సంఘటనలను ఆలంబన చేసుకుని.. అభ్యుదయ భావాలతో అడిగోపుల ఆవిష్కరించిన కవిత్వాన్ని కొండ్రెడ్డి తమ ప్రతిభాపాటవాలతో.. ఈ గ్రంథాన్ని రూపకల్పన చేశారు. అడిగోపుల ఇరవై ఒక్క కావ్యాల్లోని.. భావధారను కొండ్రెడ్డి తనదైన శైలిలో విశే్లషిస్తూ ఈ పుస్తకంలో నిక్షిప్తంచేశారు. అడిగోపుల నిరంతర కవితాయానాన్ని.. అడిగోపుల వాపపక్ష భావజాలాన్ని.. సామాజిక చైతన్యంకోసం.. ఆయన పండించిన కవిత్వాన్ని కొండ్రెడ్డి ఈ గ్రంథంలో అడుగడుగునా ప్రస్తావించిన తీరు అభినందనీయం.
అడిగోపుల కవిత్వంతోపాటు.. ఆయనయొక్క ఆత్మగౌరవాన్ని.. ఉత్తమ వ్యక్తిత్వాన్ని.. ఏ ప్రలోభాలకు లొంగని ఆయన గొప్పతనాన్ని కొండ్రెడ్డి సందర్భోచితంగా ఆయా కవితలను ఉదహరిస్తూ విశే్లషించారు.. ఈ గ్రంథంలో.. అడిగోపుల అరిగిపోయిన కవి కాడనీ.. ఆగిపోయిన కవి అని అసలే అనలేమని... కొండ్రెడ్డి తేల్చిచెప్పిన తీరు బాగుంది.. కవిత్వం నిర్వర్తించాల్సిన నిజమైన పాత్రను ఎరిగినవాడు అడిగోపుల అని.. కొండ్రెడ్డి నొక్కివక్కాణించారు. స్పష్టమైన వస్తునిర్దేశంతో రాస్తున్న అలుపెరుగని అక్షర యోధుడిగా అడిగోపుల వారిని మనముందు నిలపడంలో కొండ్రెడ్డి సఫలీకృతులైనారు. సంపూర్ణమైన మానసిక స్వేచ్ఛతో, వర్తమానంలో జీవిస్తూ సమకాలీన జీవన విధానాలకు సమస్యలను అన్వయించుకుంటూ.. అడిగోపుల కవితా లోకంలో వేస్తున్న అడుగులను.. ఆలోచనలను.. అవినీతిపై ఆయన సంధించిన అక్షర అస్త్రాలను ఈ విశే్లషణా గ్రంథంలో చూడగలం. 1984 నుండి 2019 దాకా.. అడిగోపుల ప్రకటించిన ఇరవై ఒక్క గ్రంథాల్లో అభ్యుదయ భావాలకే పెద్దపీటవేసిన సంగతిని కొండ్రెడ్డి తమ పరిశీలనాత్మక పటిమను జోడించి.. పాఠక మహాశయులకు ఇట్టే అర్థమయ్యేరీతిలో ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు. అడిగోపుల కవిత్వంలోని తాత్త్వికతను, సామాజిక చింతనను...పాలకుల దమన నీతిని సున్నితంగా ఎత్తిచూపే ఆయన పోరాట పటిమను.. జనాన్ని చైతన్య పరచాలన్న ఆయన అంతరంగాన్ని కొండ్రెడ్డి రేఖామాత్రంగా ఈ గ్రంథంలో ఆవిష్కరించారు. అడిగోపుల గ్రంథాల్లోని ఆణిముత్యాలను చక్కని విశే్లషణతో పాఠక లోకానికి అందించారు.
1976నుంచే అడిగోపులగారు కవిత్వం రాస్తున్నప్పటికీ.. తమ తొలి కవితా సంపుటిని 1984 ‘‘సూర్యోదయం’’ పేరుతో తెచ్చారనీ... మొట్టమొదటి కావ్యంలోనే ఆయన అభ్యుదయ, ప్రగతిశీల భావాలను పుణికిపుచ్చుకుని... దౌర్జన్యాలపై ధ్వజమెత్తిన తీరును కొండ్రెడ్డి సోదాహరణంగా వివరించారు. అడిగోపుల ప్రజల పక్షాన నిలిచి.. పాలకులపై.. సమాజంలోని దమననీతిపై విరుచుకుపడ్డారనీ.. హాస్యం.. పరిహాసానికి గురికాని రీతిలో.. వ్యంగ్యం వంటి అస్తశ్రస్త్రాలతో.. కవిత్వాన్ని సుసంపన్నంచేసిన సంగతిని ఈ పుస్తకం ద్వారా విడమరిచి చెప్పారు. ‘‘కాంతిని కనాలంటే/ కళ్ళుతెరవాల్సిందే/ కర్మసిద్ధాంతాన్ని కాల్చాలంటే/ అగ్గిపుల్ల గీయాల్సిందే’’ అంటూ అడిగోపుల విరుచుకుపడ్డ అంశాన్ని కొండ్రెడ్డి ప్రస్తావించిన తీరు బాగుంది. అడిగోపుల 1985లో వెలుగులోకి తెచ్చిన గ్రంథం ‘‘ఎన్నాళ్లీ చరిత్ర’’లోని కవిత్వ ప్రవాహాన్ని విపులంగా విశే్లషించారు.
1987లో ‘బానిసత్వం’ అమ్మబడును’’గ్రంథాన్ని వెలువరించి అడిగోపుల పోరాట స్ఫూర్తిని నింపారనీ.. నిజాయితీ, నిబద్ధతగల కవిగా పేరొందారని కొండ్రెడ్డి పేర్కొన్నారు. ఈ గ్రంథంలోని ‘‘మేడే’’ కవిత యొక్క ప్రాశస్త్యాన్ని క్షుణ్ణంగా విశే్లషించారు. ‘‘శ్రామిక రాజ్యం వచ్చిననాడే/ సుఖశాంతి సౌభాగ్యం సంభవమని/ చాటిననాడే/ అదే మేడే అని అడిగోపుల తేల్చిచెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. 1988లో అడిగోపులకలంనుండి జాలువారిన ‘మరణానికి రెండు ముఖాలు’లోని గ్రంథాలయంపై రాసిన కవితను చక్కగా వివరించారు. ‘నిశ్శబ్దంలేని లైబ్రరీలో/ నిశ్శబ్దం బోర్డుల్ని చూస్తూ/ శబ్దంలో నిశ్శబ్దాన్ని వెతుక్కుంటూ/ స్తబ్దంగా ఒక మూల కూర్చుంటున్నా’’ అంటూ అడిగోపుల కవితను కొనసాగించిన తీరును కొండ్రెడ్డి కొనియాడారు. ‘‘విప్లవానికి పురిటిగది’’ కవితాసంపుటిని 1990లో తెచ్చారనీ... ఈ కవితా సంపుటిలోని కవితా ధార ఒక ఉద్ధృతమైన ప్రవాహంగా కొనసాగించారని గ్రంథకర్త అభిప్రాయపడ్డారు. ‘‘రుచి మరిగిన నాలుక/ ద్వంద్వగీతి పాడుతుంది/ రంగుల వలయంలో చిక్కిన కళ్ళు/ శే్వతవర్ణం చూడ్డం మానేస్తాయి’’ అంటూ అడిగోపుల రాసిన తీరును మెచ్చుకున్నారు. 1991లో వచ్చిన అడిగోపుల ‘‘అశ్వవీధిలో అగ్నిగానం’’, 1992లో వచ్చిన ‘‘యుద్ధమంటే మాకు భయంలేదు’’, ఆయన 1994లో వెలువరించిన ‘‘మట్టివౌనం వహించదు’’, 1996లో ప్రకటించిన ‘‘మహాపథం’’, 1998లో వెలువరించిన ‘‘రాతిచిగుళ్ళు’’గ్రంథాల్లోని అభ్యుదయ భావధారను చక్కగా విశే్లషించారు. అంతేగాక కొండ్రెడ్డి ఈ గ్రంథంలోని ‘‘పునరపి’’ అనే కవితను ప్రస్తావించారు. 2000లో వచ్చిన ‘‘అదృశ్యకుడ్యం’’, 2002లో వెలువరించిన ‘‘సంకెళ్ళుతెగిన చప్పుళ్ళు’’, 2004లో వచ్చిన ‘‘శే్వతపత్రం’’, 2006లో ప్రకటించిన ‘‘విశ్వగీతం’’, 2009లో వెలువరించిన ‘‘రంగుల చీకటి’’ గ్రంథాల్లోని అడిగోపుల రచనా తీరుతెన్నులను కొండ్రెడ్డి చర్చించారు. 2011లో వచ్చిన ‘‘రేపటి వర్తమానం’’, 2013లో ప్రకటించిన ‘‘రెక్క విప్పిన రాగం’’, 2013లో వెలువరించిన ‘‘రేపటి జ్ఞాపకం’’, 2017లో ప్రకటించిన ‘‘ముందడుగు’’ మరియు 2019లో అడిగోపుల వెలువరించిన ‘‘పదండి ముందుకు’’ గ్రంథాలను పరామర్శించారు.
గ్రంథ సమీక్షలు, గ్రంథ పరామర్శ చేయడంలో.. విశేష అనుభవమున్న కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి అడిగోపుల 21 గ్రంథాలను రేఖామాత్రంగా ఈ గ్రంథంలో పరామర్శించారు. అయితే.. సాహిత్య విమర్శను సమర్ధంగా చేయగల కొండ్రెడ్డి అడిగోపుల అభ్యుదయ కవిత్వధారను యింకా ప్రభావ వంతంగా..లోతుగా.. పరిశోధనాత్మకంగా ఆవిష్కరిస్తే బాగుండేదన్న భావన పాఠకుల్లో వచ్చే అవకాశముంది. గత నాలుగు దశాబ్దాలుగా తమ అభ్యుదయభావాలతో.. ఆధునిక తెలుగు వచన కవితకు సొబగులు అద్దుతున్న అడిగోపుల వెంకటరత్నమ్ కవిత్వదర్శనాన్ని ఈ గ్రంథం ద్వారా పాఠకులకు అందించిన కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి అభినందనీయులు!

- దాస్యం సేనాధిపతి, 9440525544