AADIVAVRAM - Others

మనసు మల్లెపూవై...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈటీవీలో ఇష్టమైన పాట స్వరాభిషేకంలో రమ్యబెహ్రా మరియు సమీరా భరద్వాజ్ పోటాపోటీగా.. ఇద్దరూ.. గాత్రాల్ని సమన్వయం చేసుకుంటూ చాలా హుషారుగా, ఉల్లాసంగా.. శృతిబద్ధంగా.. మాధుర్యప్రదంగా.. శ్రావ్యంగా గానం చేస్తున్నారు. ఏయే పనులున్నా, అన్నింటిని ఆపేసుకుని కూర్చుంది టీవీ ముందు సుభద్ర.. తనకెంతో ఇష్టమైన ‘సుందరాంగ మరువగలేను..’ -సంఘం’ చిత్రంలోని పాట. ఆ పాటకున్న మధురిమలేమోగానీ.. తియ తీయని తేనియ ఊటలు తొణికిసలాడేవి. లాస్యంగా ఆనాటి యువ హృదయాల పెదవులపై.. కూనిరాగాల ఆలాపనల మోమును వికసింపచేసేవి పూరేకులవోలె.
ఆనాటి స్వప్నాల వరకు తీసుకువెళ్లారు ఈ యువ గాయనీమణులు సుభద్రని. బహుశా తను అప్పుడు ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. సంఘం సినిమాలో తనను ప్రధానంగా ఆకర్షించింది ఆ మధువొలికే.. యువ మనసును తట్టి కుదిపే.. ఆ నటీ శిరోమణులు శ్రీమతి అంజలీదేవి, వైజయంతి మాల.. హావభావాలు ఆ యవ్వన పరువపు కదలికలు తెరపైన.. వారికి వత్తాసు పలుకుతూ అంతే మాధుర్యంతో గానం చేసిన శ్రీమతి పి.సుశీల, ఎం.ఎస్.రాజేశ్వరి గాయనీమణులు.
కుమారి సుభద్రగా.. అంతటితో ఆగలేదు శ్రీమతి సుభద్ర.. ఆనాటి.. ఆ ప్రాయపు సొగసులు, సోయగాలు, తలపులు, తలుపులు తోసుకుని ఆనాటి వలపులు, తపనలు.. పయ్యదపై జారుతున్న పయిట సవరింపులు, మన్మథ మదనులెవరైనా.. తారసపడితే రెప్పలార్చి, మనసునేమార్చే కన్నుల, కనుకొసల కదలికలు గుర్తుకొస్తున్నాయి.
సహాధ్యాయి అయిన సులక్షణ్ తనకి చాలా చేరువగా.. చొరవగా.. ఏదైనా.. ఒక మాట.. వీణియ తీవెలు మీటినటుల.. హృదయంలో కదలిక.. కన్నులకవి చేరి.. ఆపై కన్నులటు ఇటు ఆ కొసల ఈ కొసల కదలికల తనకగుపించక రెప్పలే మార్చుకొనే ప్రయత్నం.. ఆ పాట్లు.. అగచాట్లు.. అయినప్పటికీ.. క్లాసులో తన కదలికలనే గమనించే తొందరలు.. గుర్తుకొస్తున్నాయి సుభద్రకి.
ఆట్టే సమయం పట్టలేదు. ఈ గుండె ఊసులు ఒకరినొకరు తెలుసుకోవడానికి. అలా పరిచయమైన కన్నుల బాసలు.. కన్నుల పలకరింపులతో ఆగక.. తనువంత పులకింతలై... సరసున ఈదే చేపల తుళ్లింతలై.. ఒకరిని చూడక ఒకరు మనలేరు అన్న స్థితికి చేరారు.. ఎంతో చేరువయ్యారు. అలా సుభద్ర కనె్నమనసు సులక్షణ్‌కి అంకితమయ్యింది. చదువు ముగిసినాక వివాహానికి ఒప్పందం కుదుర్చుకున్నారు ఇరు కుటుంబాలు.
కాలగమనంలో ఐదేళ్లు ముందుకొస్తే సులక్షణ్ మెడిసిన్ పూర్తి చేశాడు.. సుభద్ర ఎం.ఏ. పట్టా పుచ్చుకుంది. సులక్షణ్ పి.జి. చేయడానికి యు.ఎస్. వెళ్లే ముందే వివాహం జరిగిపోయి సుభద్ర శ్రీమతి అయింది సులక్షణ్‌కి. వాకిట్లో ఎవరో వచ్చిన అలికిడి అయి సుభద్ర సాగిపోతున్న గతానికి కామా పెట్టి.. వర్తమానంలోకి వచ్చి బయటికి వెళ్లి చూసింది. కాలేజీ పిల్లలు.. అంటే.. సుభద్ర ట్యూషన్ పిల్లలు ఒక్కరొక్కరే రాసాగారు. సుభద్ర వారిని ఎంగేజ్ చేయడం మొదలెట్టి క్లాసు తీసుకుంది.
సుభద్ర టెర్రస్‌లో కూర్చుని విద్యుత్ దీప కాంతులలో మెరిసే మందారాల్ని.. వాటిపై వాలే భ్రమరాన్ని.. అవి చేసే ఝుమ్.. ఝుమ్మనే నాదాన్ని గమనిస్తూ, తను.. మొదటి రాత్రి సులక్షణ్‌ని కలవాలనే (తనలోని) తొందరల్ని.. పంచెకట్టులో పొడగరి సులక్షణ్.. గ్లాస్కో జుబ్బా వేసుకుని.. నటరత్న, నటసామ్రాట్‌లకి ఏ మాత్రం తీసిపోని గ్లామర్‌తో, పర్సనాలిటీతో.. అన్నిటికి మించి తను వలచి.. తనని వలపింప చేసుకున్న సులక్షణ్ వాళ్లకి మించే తనకి.
సులక్షణ్ నోట ఒక మాట.. పెదవిపై నుంచి గుండె గొంతుకల మేళవింపుతో ‘సుభద్ర’ పిలుపు.. శతకోటి వీణలు శృతిచేయగా వచ్చిన శ్రావ్యగానం...
ఓ కనుసైగ.. ఆ చేతిస్పర్శ.. చిన్నవిగానే అనిపించినా.. జివ్వుమన్నది ఒళ్లు.. కెవ్వుమన్నది గుండెల్లో హరివిల్లు.. ఆలుమగలకవి జన్మంత స్ఫురణకు తెచ్చుకునే అనుభూతులు.. బంగరు భవిష్యత్తుకవి విరిసిన మందారాలు, ఎన్నటికి వాడని ప్రేమ ఉద్దీపనలు...
ఓ రాత్రివేళ మాగన్నుగా సులక్షణ్ చెవిలో గుసగుసలా ‘ఎలా రా నిన్ను విడిచి వెళ్లాలి..’ అంటూ మూలిగాడు. నిజమే.. నాకూ అనిపిస్తోంది ‘ఎలా’ అని. కానీ ఈ ‘ఎలా’కి ఆ కాలమే బదులు తెలపాలి.. విరహానికి వెనె్నలే సాక్ష్యమవ్వాలి.. ఇది విధివ్రాత, మమ్ము విడదీయక విధాత.. అనటానికి నోరెలా వస్తుంది.. ఇది మనం గీసుకున్న గీత.. సులక్షణ్.. తప్పదు.. ఓ కవి చెప్పినట్లు ‘విరహము’ కూడా సుఖమే కాదా.. నిరతము చింతన మధురము కాదా.. వియోగ వేళల..’ ఇలా వ్రాసుకుంటూ పోయాడు. కలముతో కాగితమీద.. చూద్దాం.. వియోగమంత మధురమో.. అంటూ సులక్షణ్‌ని అనునయించింది సుభద్ర.
ఇంతలో సుభద్రకి నిద్ర ముంచుకొచ్చింది వర్తమానంలో.. గతానికి తెర దిగింది తాత్కాలికంగా. మళ్లీ ఎప్పుడో.. గతంలోకి.. చూద్దాం.. తెర లేచే వరకు ఏం చేద్దాం...
ఆఁ! మూడు రాత్రులు ముచ్చటగా గడిచిపోయినయ్.. ఫార్మల్‌గా సుభద్రని తల్లిదండ్రులు.. సులక్షణ్ తల్లిదండ్రులకి అప్పగించేసి ఆ కార్యక్రమం అయిందనిపించేశారు ముచ్చటగానే. సుభద్ర అత్తవారింట్లో కంఫర్ట్‌గానే ఫీలయ్యింది. అర్థం చేసుకునే అత్తమామలు.. అమితంగా అక్కున చేర్చుకునే ఆడబడుచు.. మించి ప్రేమనందించే సులక్షణ్.
సులక్షణ్ యు.ఎస్.కి వెళ్లడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. వెనె్నల రాత్రులు.. కాలచక్రంలో పరిభ్రమిస్తున్నాయ్. ఇవాళ్టి తీపి గుర్తులు రేపటికి దాచుకోవాలో.. రేపటి ఆశల దారులకై వేచి చూడాలో.. తెలిసీ తెలియని.. రేపటికై.. కలత చెందాలో.. కవి హృదయమైతే గడిచిన మధురస్మృతులు నెమరేసుకుంటే.. అదీ మధురమే అంటున్నది. కానీ వాస్తవంలో విడిపోవటం.. విరహానికి నాంది అని అనుకోవడానికి మనసు ఎంత మాత్రం సుముఖత చూపడం లేదు. కానీ ఇది నిజం.. నూటికి నూరుపాళ్లు సులక్షణ్, సుభద్ర విడిపోవడమనేది నిజం.
ఆ రోజు రానే వచ్చింది.. తెల్లవారితే ఫ్లైట్.. జెట్ వేగంతో కాలం కదిలిపోతోంది.. చివరిసారిగా ఇద్దరి సమాగమం.. ఏడాదికి పునరాగమనం.. వేడి నిట్టూర్పులతో.. నిద్రలేమితో ఆ రాత్రి తెల్లవారింది ఇద్దరికి. వదలి వెళ్లలేని మనస్తాపం సులక్షణ్‌దైతే, వదిలి ఉండలేని పరితాపం సుభద్రది. గుండె దిటవు చేసుకుని ఇద్దరు స్థిర అభిప్రాయానికి.. ఐమీన్.. ఏకాభిప్రాయానికి వచ్చి.. ఏడాదిని ఏకత్రాటిపై దాటేద్దామని ఒకరినొకరు సంభాళించుకున్నారు.
సుభద్ర సెండాఫ్ చెప్పేసింది ఇంటి దగ్గరే.. కారణం ఏర్‌పోర్ట్ వరకు తను కంట్రోల్ చేసుకోలేననుకున్నదో ఏమో! సులక్షణ్‌కే తెలుసు. సులక్షణ్ వెళ్లిన వెంటనే సుభద్ర బోర్ ఫీలవకుండా ఫుల్‌టైమ్ ఎంగేజ్ అయ్యింది. కాలేజీలో లెక్చరర్‌గా చేస్తూనే పిహెచ్.డికి అప్లై చేసింది. ఎక్కువ చదువులోనే కాలాన్ని వెళ్లదీస్తోంది. తన దగ్గరే చదివే విద్యార్థినీ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు పెట్టి వాళ్ల సందేహాలను తీరుస్తూ శిక్షణ ఇస్తోంది, సెలవులలో. అయినా సుభద్ర కనులు తెరిచినా.. కనులు మూసినా.. సులక్షణే ఆమే. ఆ మధుర స్మృతులు, ఆ.. ఓదార్పు.. రాత్రిళ్లు కలవరింతలౌతూనే ఉన్నయ్. ఆ మధుర ప్రణయాలు రేపటి ఆశల దీపాలకి చమురై ప్రమిదలు వెలిగిస్తూనే ఉన్నయ్.
ఇలా టైట్ షెడ్యూల్ చేసుకున్న సుభద్ర ఒంటరితనం.. దూరం పెట్టింది. సమయం దొరికిందంటే సులక్షణ్‌తో వీడియో కాల్స్‌లో బిజీ. సులక్షణ్ కూడా పగలంతా చదువు.. ఫ్రెండ్స్.. వీకెండ్స్ ఔటింగ్ ఇలా ఏడాది చివరికి చేరుకుంటున్నారు నూతన జంట.. ఇక మిగిలిందంతా వలపు పంటేగా మరి. రేపటి ఆశల్లో.. ఆశల పందిట్లో.. ఆశగా ఎదురుచూస్తున్నారు పునః సమాగమనానికి.
సులక్షణ్ స్మృతులలో.. తొలి రాత్రి.. తెల్లటి వస్త్రాలలో.. (మల్లె)పూల జడతో.. తెల్లటి నురగల పాలగ్లాసుతో తన గదిలోకి.. మదిలోకి.. జీవితంలోకి.. ప్రవేశించింది ప్రణయిని సుభద్ర. అదే తెల్లదనం విరిసిన దరహాసంతో సులక్షణ్ సుభద్రని.. (పాలగ్లాసుని తను పుచ్చుకుని) పూశయ్యపై కూర్చోబెట్టాడు. సుభద్ర స్ర్తి సహజమైన సిగ్గు ముంచుకొచ్చి నేలచూపులకు లోనయ్యింది.. నెమ్మదిగా సుభద్ర చుబుకం ఎత్తి కళ్లతో కళ్లు కలుపుతూ ఇంకొంచెం దగ్గరగా జరిగాడు సులక్షణ్.
‘సుభద్రా.. ఏ కాపురమైనా కలకాలం సంతోషంగా ఉండాలంటే..’ అంటూ సుభద్రని తదేకంగా చూస్తూ ఆగిపోయాడు. సుభద్ర కళ్లతోనే ‘ఉండాలంటే..’ అన్నట్లు సులక్షణ్‌ని చూసింది.
చెప్పనా.. అన్నట్లు సులక్షణ్ సుభద్ర వైపే చూశాడు. ‘ప్లీజ్.. చెప్పండి. ఉండాలంటే...’ అంటూ ఆసక్తి వ్యక్తపరచింది.
‘సింపుల్.. ప్రేమ.. నమ్మకం.. పరస్పర గౌరవం..’ అంటూ ముగించాడు.
‘దానే్న.. నేను మరోలా చెప్పనా’ అంది సుభద్ర అత్యుత్సాహంగా.
‘చెప్పు.. చెప్పుచెప్పు.. ప్లీజ్’ ఇంకా దగ్గరగా జరిగాడు సులక్షణ్ సుభద్రకి.
‘అలా ప్రేమ, నమ్మకం కుదిరిన జంట.. పరస్పరం గౌరవించుకుంటూ.. భార్య మనసు ఏది కోరుతుందో భర్త అదే చేస్తూ.. భర్త తన నుంచి ఏది ఆశిస్తున్నాడో, ఏది శ్వాసిస్తున్నాడో.. అది భార్య చేసేస్తూ వెళ్తే ఆ దాంపత్యం.. నూరణాల పచ్చని తోరణమై ప్రకాశిస్తూ పసిడి కాంతులిస్తుంది. అయితే అవతలి వాళ్లు ఏం కోరుకుంటున్నారో మనకెలా తెలుస్తుంది అని మటుకు అడక్కండి. అది తెలిసేలా ట్రాన్స్‌పొనెంట్‌గా జీవించడమే అన్యోన్య దాంపత్యంలోని అసలు సిసలైన రహస్యం..’ అంటూంటే అమితానందంతో సులక్షణ్ సుభద్రతో కరచాలనం చేసి, వెనె్నల్లా.. ఒకరిలో ఒకరు కలిసిపోయారు.. తీయని రాత్రిలా కరిగిపోయారు.
అక్కడ దివ్యానుభూతిని పొందిన సులక్షణ్‌లానే సుభద్ర కూడా అదే తొలిరాత్రిని మననం చేసుకుంటూ టెర్రస్‌లో.. విరబూసే వెనె్నట్లో.. జాబిల్లిలో సులక్షణ్‌ని చూసుకుంటూ తను తారకలా.. మురిసి మెరిసిపోతోంది. అప్పుడే సుభద్రని వెతుకుతూ వచ్చిన అత్తమామలు.. ఏకాంతంలో.. ఏ కాంత.. మురిసి మెరిసినా.. వారిని డిస్టర్బ్ చేయటమెందుకని తారా జాబిలి మబ్బుల మాటున దాగినట్లు జారుకున్నారు.
రేయైనా.. పగలైనా.. కలల అలల.. కల.. వరింతలా.. నాటి మూడు రాత్రులు ముద్దుమురిపాల.. ఆనాటి సుభద్ర.. ఈనాటికి.. డెబ్బై వసంతాల మీదటికి.. సులక్షణ్ రాకకై ఎదురుచూస్తూ.. నిదురకాస్తూ.. నిరీక్షణలో.. నిశీధిలో.. ఒళ్లంతా కళ్లు చేసుకు వెతుకుతోంది.. శూన్యంలో.. కానీ అతని జాడ పున్నమి.. అమవాసల.. నడుమ నలిగే జాబిల్లి.
సుభద్ర మానసిక వ్యవస్థకి చేరని చేదు నిజం.. తను ఎదురుతెన్నులు చూసే తన సుందరాంగుడు.. మరువగలేని ఆ సుందరాంగుడు.. యు.ఎస్. నుంచే కదా, మరెక్కడ నుంచి రాలేడన్న పచ్చినిజం.. మింగుడు పడని సుభద్ర సులక్షణ్ తనతో ఉన్నప్పటికి జ్ఞాపకాలలోనే బ్రతికేస్తోంది.
ఆ అబద్ధమే సుభద్రకి ఆపద్ధర్మమై.. ఆమె పెదవులపై చెక్కుచెదరని చిరునవ్వై.. ఎన్నటికి వాడని పువ్వై.. నవ వసంతమై.. ‘మనసు నిలవదోయ్.. మధు వసంతమోయ్.. సుందరాంగ మరువగలేనోయ్.. రావేలా.. నా అంద చందములు దాచితి.. నీకై.. రావేలా..’ పాట సాగుతూనే ఉంది నవ జీవన వాహినిలా - కలల.. అలల.. తేలెను.. మనసు మల్లెపూవై..

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505