AADIVAVRAM - Others

‘వర్ణం’ ఆర్ణవమైతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం పట్టణానికి చెందిన చిత్రకారిణి భార్గవి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలైన పాలపిట్ట, తంగెడు పూవు, బతుకమ్మ, జమ్మిచెట్టు బొమ్మలను చిత్రించి కొంతకాలం క్రితం ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు. అంతేగాక తాను పని చేసిన గోల్కొండ పబ్లిక్ స్కూల్‌లో 8 ఇంటు 6 అడుగుల పెద్ద సైజులో గోల్కొండ కోటను సహజత్వం ఉట్టిపడేలా చిత్రించారు. ఇలా తెలంగాణ ప్రాంత జీవితాన్ని, పరిసరాలను, ప్రకృతిని ఆమె కాన్వాసుపైకి తర్జుమా చేశారు, చేస్తూ ఉన్నారు.
ఆమె రూపొందించిన పాలపిట్ట చిత్రం ప్రత్యేకత ఏమిటంటే.. అది కాగితాలను మడతపెట్టి చేసినట్టు కనిపిస్తుంది. ఈ రకమైన శైలి తనకే సొంతం. గతంలో ఇలాంటి ‘స్టైల్’లో ఎవరూ బొమ్మలు చిత్రించలేదని ఆమె గర్వంగా చెబుతున్నారు. నిజంగానే అందులో గర్వించదగ్గ సహజత్వం రంగుల సోయగం, పొందిక నయనానందకరంగా కనిపిస్తోంది. ఇది తన సిగ్నేచర్ శైలిగా చిత్రకారిణి చాటుకుంటున్నారు.
‘పేపర్ ఫోల్డ్ పద్ధతి’గా పిలిచే ఈ శైలిలో చిత్రకారిణి అసంఖ్యాక బొమ్మలు సృజించారు. ఈ రకమైన సృజన ప్రముఖుల మన్ననలు పొందింది. తనదైన ‘మార్క్’ను చిత్రకళా రంగానికి అందించానన్న తృప్తి తనకుందని ఆమె అంటున్నారు.
ఈ శైలి ప్రయోగాత్మకమైనది. వినూత్నమైనది. ఓ స్ర్తి దుస్తులు దండెంపై ఆరేస్తున్న దృశ్యాన్ని చిత్రకారిణి ఈ శైలిలోనే చిత్రించి చూపరులను ఆకర్షించారు. మహిళ శరీర భాగాలు, దుస్తులు, ఆరేసిన బట్టలు ఇవన్నీ కూడా మడిచిన కాగితం రూపంలో చూపించడమంటే సరికొత్త ప్రయత్నం.. అపయోగం. అలాగే ధ్యానంలో కూర్చున్న బుద్ధుడిని పాదాలు, వస్త్రం అన్నీ ఈ విధంగానే దర్శనమవుతాయి. ఆడపిల్లను బతికించుకుందాం (సేవ్ గర్ల్ చైల్డ్) అన్న శీర్షికతో పెద్ద కాన్వాసుపై గీసిన చిత్రం కూడా ఇదే తరహాలో దర్శనమిస్తుంది. అందులో మహిళలు, పిల్లలు, మొక్కలు, ఆకులు అన్నీ ఆ స్టైల్‌లో వొదిగిపోవడం వల్ల వినూత్న, విశిష్ట భావన చూపరులకు ఏర్పడుతుంది. ఒక్కోసారి పేపర్ ముక్కలే కత్తిరించి పెట్టారా? అన్న భ్రమ కలుగుతుంది. కానీ వాస్తవానికి కాన్వాసుపై గీసిన రంగుల చిత్రమది.
అందమైన జింక పిల్లను గీసినా నేపథ్యంలో పచ్చదనమంతా మడిచిన కాగితాల దొంతర.. కానీ అదంతా అరణ్యమన్న భావన వీక్షకులకు కలుగుతుంది.
ఇలా విశేష శైలిలో తనదైన సిగ్నేచర్ పనితనంతో ఆమె అసంఖ్యాక చిత్రాలు గీశారు. అందులో ఆధ్యాత్మిక భావనతో కూడినవి, సాంఘిక జీవనంపై గీసినవి ఉన్నాయి. ఆ విధంగా సమాజంలోని అన్ని తరగతుల వారిని ఆమె తన చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు.
1962లో ఖమ్మంలో జన్మించిన భార్గవి అక్కడే పాఠశాల, కళాశాల విద్య నభ్యసించారు. 1985లో చిత్రలేఖనంలో డిప్లొమా చేశారు.
ఆ స్థాయికి చేరుకోవడానికి కారణం తన తల్లి సుగుణ అని ఆమె చెబుతున్నారు. తన తల్లి స్వతహాగా చిత్రకారిణి కావడం, అనేక కుట్లు అల్లికలతో పరిచయం, ప్రవేశం కలిగి ఉండటం, ముఖ్యంగా ముగ్గులు వేయడంలో సృజనాత్మకత ప్రదర్శించడం, అవి ముగ్గులుగా కాక వివిధ రంగుల్లో భూమీద వేసిన బొమ్మలుగా ఉండటం అందరినీ ఆకర్షించేవనీ, అలా బాల్యంలోనే తనపై తన అమ్మ వేసే ‘ఆర్ట్’ ప్రభావం పడిందని భార్గవి చెప్పారు. ఖమ్మం పట్టణంలో ఆ రోజుల్లోనే తన తల్లి చిత్రలేఖనం తరగతులు నిర్వహించి ఎందరికో నేర్పించేదని, అలా ఆయా తరగతుల్లో తానూ కూర్చొని తల్లి చెప్పింది ‘శ్రద్ధ’గా చేసేదానిననీ, అలా చిత్రలేఖనంపై మనసు లగ్నమైందని భార్గవి వివరించారు. తన తల్లి ‘మల్టీ టాలెంటెడ్ వుమన్’ అని ఆ విద్యలన్నీ తనకూ అబ్బాయని అందుకే తాను తైలవర్ణ చిత్రాలనే గాక కార్టూన్లు వేస్తానని, ఆభరణాలు డిజైన్ చేస్తానని అంటున్నారు.
తాను చాలాకాలం వరంగల్‌లోని ఓ పాఠశాలలో ఆర్ట్ టీచర్‌గా పని చేశానని, పిల్లలతో కలిసిపోవడం తనకిష్టమని అనంతరం గోల్కొండ పబ్లిక్ స్కూల్‌లో, కేంద్రీయ విద్యాలయాల్లో ఆర్ట్ టీచర్‌గా పని చేశానని ఆమె వివరించారు.
తనలోని నైపుణ్యాన్ని, సృజనను మరింత మెరుగుపరచుకునేందుకు 2012 సంవత్సరంలో దూరవిద్య ద్వారా మైసూరు విశ్వవిద్యాలయం నుంచి చిత్రలేఖనంలో ఎంఎఫ్‌ఏ కోర్సు పూర్తి చేసానని ఆ సాధన - అభ్యాసం సందర్భంలోనే కాగితం మడత టెక్నిక్‌తో బొమ్మలు గీయాలన్న సరికొత్త ఆలోచన తట్టిందని అంటున్నారు.
2017 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర పక్షి, చెట్టు, పుష్పం తదితర బొమ్మలతో రవీంద్రభారతి ఆవరణలో సోలో షో నిర్వహించానని, అంతకు ముందు - తరువాత స్ర్తి సమస్యలపై ప్రజల్ని జాగృతం చేసేలా సృజనాత్మకంగా చిత్రాలు చిత్రించానని, అందులో వరకట్న దురాచారం గూర్చిన బొమ్మలున్నాయని ఆమె చెప్పారు. ముఖ్యంగా సేవ్ గర్ల్ చైల్డ్ శీర్షికతో గీసిన చిత్రాలు చాలామందిని ఆకట్టుకున్నాయని ఆమె వివరించారు. అలా 12 సోలో ప్రదర్శనలు ఆమె ఏర్పాటు చేశారు.
తాను ఆయిల్, అక్రలిక్, వాటర్ కలర్స్.. ఇట్లా మల్టీ మీడియాలో పని చేస్తానని చెప్పారు.
మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, బాగ్‌లింగంపల్లిలోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీ ఇలా పలు గ్యాలరీలలో తన చిత్రాలు ప్రదర్శితమయ్యాయని, అనేక చోట్ల జరిగిన గ్రూప్ షోలలో పాల్గొన్నానని ఆమె తెలిపారు.
విచిత్రమేమిటంటే తన తల్లి, తన భర్త, కొడుకు, సోదరి ఇలా అందరూ చిత్రకారులు కావడం.. వారివారి స్థాయిలో వారు గొప్ప సృజనకారులని, కుటుంబంలో అందరూ ఈ రంగుల లోకంలోనే మునిగిపోవడం యాదృచ్ఛికమని ఆమె అంటున్నారు.
కార్టూన్ రంగంలో ఆర్.కె.లక్ష్మణ్ అంటే తనకు ఇష్టమని ఆయన స్మారకార్థం ఏర్పాటు చేసిన బహుమతిని అందుకున్నానని కూడా ఆమె చెప్పారు. వ్యంగ్యం వొలికించడం తన సహజ లక్షణమని కూడా ఆమె అంటున్నారు.
ఏది ఏమైనా ముగ్గులు.. రంగోలితో బాల్యంలో ప్రారంభమైన చిత్రకళా జీవితం ఇప్పుడు హైదరాబాద్‌లో వర్ణ ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహణతో కొనసాగుతోందని, తన ఇన్‌స్టిట్యూట్‌కు పిల్లలు పెద్దలు, ఆసక్తిగల వృద్ధులు అందరూ వస్తారని వారికి చిత్రకళను, రంగుల లోకాన్ని పరిచయం చేస్తున్నానని, గతంలో అనేక బహుమతులు, ప్రశంసలు లభించాయని, ఇటీవల (2019 సంవత్సరం) బతుకమ్మపై ‘ఆర్ట్ క్యాంప్’ నిర్వహిస్తే పాల్గొన్నానని, అలా ఎన్నో ఆర్ట్ క్యాంపుల్లో చురుగ్గా పాల్గొన్నానని, ఆ రకంగా ఇప్పటికీ చిత్రకళకు అంకితమై, అదే లోకంగా బతుకుతున్నానని భార్గవి చెప్పారు. చిత్రకారిణికి ఇంతకన్నా కావలసిందేముంటుంది?
బార్గవి.. 9392433222

-వుప్పల నరసింహం 9985781799