Others

నాగరిక నిరక్షరాస్యులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జనాభా లెక్కల్లో పేర్కొన్నట్టు తెలుగులో సంతకం చేయగలవారందరూ చదువు వచ్చినవారే.. అని ఒప్పుకున్నా, తెలుగువారిలో చదువున్నవారు వేయింటికి డెబ్బయి ఐదుగురు మాత్రమే. అంటే వేయిమందికి 925 తెలుగువారు మాత్రమే సంతకమైనా చేయలేరు అన్నమాట. పోస్టుకార్డు మీద చిన్న ఉత్తరమైనా వ్రాయలేని వారు, ‘రైల్వే టికెట్’మీద ఏ ఊరి పేరున్నదో చదువుకోలేనివారు వెయ్యిమందికి 925 ఉన్నపుడు తెలుగు జాతివారు నాగరికులని చెప్పడానికి నాలుక తిరుగుతుందా? యూరపు ఖండంలో ఈ కాలంలో న్యూస్ పేపర్ చదవలేని వారిని కిరాతులుగా ఎంచుకొంటారు. అంతమటుకు చదవడం, వ్రాయడం అక్కడ సర్వసామన్యమైనవి...’
... పైమాటలు వ్యవహారిక భాషోద్యమకర్త గిడుగు రామమూర్తి పంతులు తన ‘నేటి తేట తెలుగు’ వ్యాసంలో వ్రాసినవి. ఈ వ్యాసాన్ని వందేళ్ళ క్రితం అంటే 1913లో ఆయన వ్రాశారు. ‘కిరాతుడు’ అంటే బోయవాడు. అంటే ఆటవిక దశలో వున్న అనాగరికుడు. వందేళ్ల క్రితం అప్పటి సామాజిక స్థితితి అనుసరించి మన దేశంలో అధిక శాతం ప్రజలు వారి వారి వృత్తులలో వంశపారంపర్యంగా జీవనం సాగించేవారు. కాబట్టి ఎక్కువమందికి చదవడమూ, వ్రాయడమూ రాని నిరక్షరాస్య స్థితి అప్పటి సమాజంలో సహజం. నేటి సమాజంలో ఎన్నో రకాల మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నో రంగాలలో చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించాము. అయినప్పటికీ గిడుగు రామమూర్తి పేర్కొన్న ‘కిరాతులు’ అనగా నిరక్షరాస్యులు నేటికీ మన సమాజంలో ఉన్నారు. నాటి సంఖ్యతో పోలిస్తే వీరి సంఖ్య తక్కువేమీ కాదు. వీరెవరిలోనూ పూర్వపు వృత్తి విద్యా వాసనలు లేవు. అవంటే ఏమిటో కూడా వీరికి తెలియదు. పైగా వీరు నాగరికులు. వీరికి ఆంగ్లమును ఉగ్గుపాలతో పట్టిస్తారు. హిందీ వంటి ఇతర భారతీయ భాషలను వీరు చక్కగా చదవగలరు, వ్రాయగలరు. వారి వారి పాఠ్యాంశాలలో తోటి వారితో పోటీపడుతూ ఎప్పటికప్పుడు తమ నైపుణ్యానికి పదునుపెట్టుకుంటారు. కానీ, వీరు తెలుగులో నిరక్షరాస్యులు.
‘ఆధునిక నిరక్షరాస్యులైన’ వీరు నేటితరం బాలబాలికలు. వీరంతా మోడ్రన్ మమీల ఒడిలో ఆధునిక ఆంగ్ల కలల సౌధాలను నిర్మించుకున్నవారు. వీరి తల్లిదండ్రులకు తెలుగుపై నామోషీ కన్నా ఆంగ్లంపై వ్యామోహం ఎక్కువ. తమ పిల్లలను ఆంగ్లంలో ముంచి తరింపజేయడానికి తెలుగుకు తగినంత దూరంలో ఉంచాలనుకుంటారు. నేటి విద్యా విధానం కూడా ఆంగ్లోపాసనతోనే రూపుదిద్దుకున్నది. ‘మీకు తెలుగు చదవటం వచ్చా?’ అని అడిగితే ‘అబ్బా.. తెలుగా?’ అని చులకనగా మూతి విరిచే పిల్లలు. ‘అయినా తెలుగు ఎందుకు పనికొస్తుంది?’ అని అసహ్యపువెటకారాన్ని చిట్లించే తల్లిదండ్రులు... ఇదీ నేటి పరిస్థితి.
పోనీలే చదవటం, వ్రాయటం రాకపోయినా మాట్లాడటమైనా తెలుగులో చేస్తున్నారు కదా.. అనుకుంటే ఆ సంతోషం కూడా ఎక్కువ కాలం నిలిచేట్టులేదు. ఆమధ్య- ఒక స్కూల్‌లో ఇద్దరు చిన్నారులు విరామ సమయంలో తెలుగులో మాట్లాడుకున్నారని తెలిశాక ఆగ్రహం చెందిన ఓ ఉపాధ్యాయిని- ‘తెలుగులో మాట్లాడటం మేము చేసిన తప్పు. ఇకమీద అలా చేయం’ అని వ్రాసిన పలకలను వారి మెడలో వేలాడదీయించింది. మరొక పాఠశాలలో తెలుగులో మాట్లాడిన నేరానికి ఒక విద్యార్థినిపై హెడ్మాస్టర్ వాతలు పెట్టాడు. ఇటువంటి సంఘటనలు మనం తరచుగానే చూస్తుంటాం.
తెలుగులో మాట్లాడిన నేరానికి తమ పిల్లలను శిక్షించినందుకు వారి తల్లిదండ్రులు ఆయా పాఠశాలల యాజమాన్యాలపై పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదులు చేస్తారు. మీడియాలో శాపనార్థాలు పెడతారు. అయినా స్కూళ్ల యాజమాన్యాల వారేం తక్కువ తిన్నారా? ఈ గొడవంతా ఎందుకని అనుకొన్నారేమో. కొత్త పద్ధతి మొదలుపెట్టారు. అదేమిటంటే- విద్యార్థులు తెలుగులో మాట్లాడితే వారికి జరిమానా విధిస్తున్నారు. ప్రతిసారీ జరిమానా కట్టాలంటే ఎలా? కాబట్టి తల్లిదండ్రులే తమ పిల్లల్ని బడికి పంపించేటపుడు ‘తెలుగులో వద్దు, ఇంగ్లీషులోనే మాట్లాడుకోండమ్మా..’ అని జాగ్రత్తలు చెప్పి మరీ పంపిస్తున్నారు. తెలుగు మాట్లాడకపోతే పోయె. పిల్లలకు అయ్యవార్లు వేసే శిక్షలన్నా తప్పుతాయి కదా. మరి నేటి తల్లిదండ్రులు నిర్మించుకున్నవి ఇంగ్లీషు కలల సౌధములాయె. ఈ స్థితి నేడు పల్లెటూళ్ళలోనూ వుంది.
ఆమధ్య ఒక టీవీ చానెల్‌లో ఓ వార్తాకథనం ప్రసారమైంది. గుంటూరు జిల్లాలో యూదు సంతతికి చెందినవారు 40మంది వరకూ ఉంటున్నారు. వారు కొన్ని తరాల క్రితమే అక్కడ స్థిరపడ్డారు. వారు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతారు, చదువుతారు, వ్రాస్తారు. అయినా తమ మాతృభాష అయిన హిబ్రూపై మమకారం కొద్దీ ఇజ్రాయిల్ నుండి ఒక టీచరును పిలిపించుకుని మరీ శ్రద్ధగా ఆ భాషలో చదవటం, మాట్లాడటం, వ్రాయటం నేర్చుకుంటున్నారు. బడికెళ్లే పిల్లలు రోజులో ఎక్కువ సేపు గడిపేది పాఠశాలలోనే. అక్కడ ఏ వాతావరణం వుంటుందో అదే వారి జీవితాలపై ప్రభావాన్ని చూపుతుంది. మరి తెలుగే లేని పాఠశాల వాతావరణం మన పిల్లలపై ఏ ప్రభావాన్ని చూపుతుంది? వారు ఎటువంటి పౌరులుగా రూపొందుతున్నారు? రేపు వినడానికైనా వారికి నాలుగు తెలుగు మాటలు అర్థమవుతాయా?
ఇదీ గిడుగు రామమూర్తి తన భావాలను వెలిబుచ్చి వందేళ్ళు గడిచిన తరువాత- మనం సాధించిన ఆధునిక ప్రగతి, మనం మురిసిపోతున్న నాగరికత. మన బడులలో మనమే రూపొందించుకున్న విద్యావిధానంతో ఎంచక్కా తెలుగు నిరక్షరాస్య కిరాతులను తయారుచేసుకుంటున్నాం. ‘ఒక సంస్కృతిని నాశనం చెయ్యడానికి ఆ సంస్కృతికి చెందిన గ్రంథాలను తగులబెట్టనవసరం లేదు. అక్కడి ప్రజలు వాటిని చదవకుండా చేస్తే సరిపోతుంది’ అని అమెరికాకు చెందిన ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత రే బ్రాడ్‌బరీ అంటారు. మన పిల్లలు తెలుగు చదవకుండా, వ్రాయకుండా, కనీసం మాట్లాడకుండా చేస్తున్నాం. మరి మన సంస్కృతికి చెందిన విలువలను, మన సాహితీ వైభవాన్ని తరువాత తరాలకి ఎలా అందించగలం? తెలుగు భాషకు ప్రాచీన హోదా సంపాదించుకున్నామని మురిసిపోతున్న మనం అసలు తెలుగే వినబడని వాతావరణాన్ని భద్రంగా భావితరాల చేతులో పెడుతున్నాం కదా!

-ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690