Others

కాళోజీ యాదిలో ‘ఆ ఇద్దరు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వ ర్గీయ కాళోజీ నారాయణరావు ఆత్మకథ ‘ఇదీ నా గొడవ’ను నేను గత పది-పదిహేనేళ్లలో అనేక సార్లు చదివాను. అందులో ఆయన చెప్పిన ప్రతి అంశమూ, పది మంది తెలుసుకోవాల్సిందే! మొన్నీ మధ్య చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, కాళోజీని అతి దగ్గరగా ఎరిగిన ఒక పెద్ద మనిషి తనకా పుస్తకం చదవాలని ఎనే్నళ్లగానో ఉన్నప్పటికీ, ఆ పుస్తకం లభ్యం కానందున వీలుపడలేదన్నాడు. అప్పుడనిపించింది.. అందులోని విషయాలను కనీసం కొన్నైనా, ఎందుకు పంచుకోకూడదని. ఆ పుస్తకంలోని కొన్ని విషయాలు...ఒక్కొక్కటే...
సర్దార్ జమలాపురం కేశవరావంటే కాళోజీకి అమితమైన గౌరవం. ఆయన మాటలు, చేతలు ఆయనకెంతో నచ్చాయి. తనతో ఆయన జైల్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటనను, ఆయన ఉదాత్తతను వివరించడంతో పాటు ఆయన ఆంధ్ర మహాసభ అధ్యక్షుడైనప్పుడు తను రాసిన గేయాన్ని ఆత్మ కథలో ప్రస్తావించారు. తానూ, జమలాపురం ఒకేసారి వరంగల్ నుంచి ఎన్నికల బరిలో దిగిన విషయం, ఓడిన విషయం కూడా చెప్పారు. ‘నేను వరంగల్ జైల్లో (1947) ఉన్నప్పుడు నిజాం మీద కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ఉద్యమాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నయి. వాటితో పాటు ప్రభుత్వ నిర్బంధం పెరిగి పోయింది. నా మీద పెట్టిన కేసు తీర్పు ప్రకారం నాకు సంవత్సరంన్నర శిక్ష. ఆ తీర్పొచ్చే సమయానికి తొమ్మిది నెల్ల నుంచీ నేను జైల్ల వున్న. చిన్న కట్టెపుల్లకి జెండా పెడ్తె నేను పోయి పక్కనె నిలబడ్డను. జెండా వందనం చేస్తినని నా మీద కేసు. నిజానికి నేను నిలబడ్డనె గాని వందనమైతె చెయ్యలేదు. ఇది వాస్తవం. శిక్ష ఖాయం చేసి నన్ను బారక్‌ల వేసిన్రు. జమలాపురం కేశవరావు, హీరాలాల్ మోరియా, వల్లభి (అయితరాజు) రామారావు, పాల్వంచ రంగారావు, ఊటుకూరు నారాయణ రావు, సి. వెంకట రావు, అప్పి వెంకట రాజ య్య-ఇలా పది, పదిహేను మంది ఉన్నం లోపట. ఈ పదిహేను మందితోనె గడపాలె....బాగా తినె టోళ్లం. ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం నాలుగు వరకు చదువుకునెటోండ్లం.అందరికంటె పెద్దవా డు, మొదటి నుంచీ ఉద్యమంల ఉన్నవాడు కష్ట నష్టాలు ఓర్చినవాడు జమలాపురం కేశవ రావు. వల్లభాయ్ పటేలుకి లాగానే ఈయనక్కూడా సర్దార్ బిరుదుండేది. అందరి బదులు తనొక్కడే పని చేస్తుం డేవాడు. చెత్తగిన పడివున్నప్పుడు ఎవరికి చెప్పినా వూడుస్తరు. కానీ ఎవరికి చెప్పకుండా చీపురు తీసుకుని తనె వూడ్చెటోడు. ఒకరోజు నేను లోపలికి పోయి చూసేవరకు ఆయన వూ డుస్తున్నడు. వల్లభి రామారావు అనే ఆయన కూచుని వున్నడు. ’ఏమయ్యా రామారావ్! పెద్దన్న అట్ల వూడుస్తుంటే నువవు కూచున్నవ్?’ అని అడిగిన. ’ఆ! అన్ని పనులూ తనే చేస్తున్నననే గొప్పదనం, కీర్తికోసం చేస్తున్నడు. చెయ్యనీ’ అని ఆయన అనగానే. ఈడ్చి చెంప మీద కొట్టిన. రామారావును ఓదార్చి నన్ను కోప్పడ్డరు కేశవ రావు. అదీ ఆయన ఉదాత్త!....కందిలో సర్దార్ జమలాపురం కేశవరావు అధ్యక్షతన ఆఖరి ఆంధ్ర మహాసభ (1946 మే 10, 11 తేదీలలో) జరిగింది. నేనందులో పాల్గొన నందువల్ల కేశవరావు గురించి ఒక గేయం రాసి మిత్రులతోటి అక్కడ చదవమని చెప్పి పంపిన. ఆ గేయం...
‘ముస్తాబు చేసుకుని మోటర్ల వూరేగు మురిపెంబు నీ కేమి లేదన్నా...మొండి చేతుల అంగి మోకాలు దాక నీ మొలగుడ్దతోటి తిరుగు కేశన్న...పల్లె బాటల బాధ ప్రజలతో బాటు నీ బరికాళ్లకె (చెప్పులు లేని కాళలు) బాగ
గురుతన్నా!...సర్దారు నామంబు సహజ నామంబుగా సరిపోయింది నీకు
కేశన్నా!...దిద్ది తీర్చని జుట్టు, ముద్దులొలకని మోము, పెద్దవానికి లోటు కావన్నా!...జబ్బులేని ఒళలు, డబ్బులేని జేబు, మబ్బులేని మనసు నీదన్నా!’
జమలాపురం కేశవరావుకి వెంకటపతి, నాగేశ్వర్రావు అని ఇద్దరి శిష్యులుండెటోళ్లు. ఈ ముగ్గురూ కలిసి తెలంగాణలో ఊరూరా తిరుగుతూ, (అటుకులో, బొంగు పేలాలో, బుక్కుకుంటూ, బెల్లం నములుకుంటూ) ఆంధ్ర మహాసభ గురించి ప్రచారం చేసిండ్రు. జమలాపురం కేశవరావు ఆజానుబాహుడు. మంచి ఆహార పుష్టిగల మనిషి. ఏది దొరికితే అది తిని, నేలమీద పడుకునీ, బండలమీద పడుకునీ, కాగితాలు పరచుకుని వాటిమీద పడుకుని తిరిగినవాడు. ప్రహ్లాదునిది హరి భక్తి. వీండ్లది ప్రజా భక్తి. ప్రజాసేవకు సర్వం అంకితం చేసిచేసి తిరిగెటోళ్లు. పట్టుదల, కార్యదీక్ష, చొరవ, త్యాగం గల వాండ్ల కృషి వల్లనే ప్రజా ఉద్యమాలు నడిచినై. అసలు కార్యకర్తలు మాత్రం జమలాపురం లాంటి వాళ్లే. జమలాపురం ఉత్తమో త్తముడు. సామాన్యుల్లో సామాన్యుడు. అసామాన్యుల్లో అసామాన్యుడు. 13 వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడాయనే. తర్వాత కాంగ్రెస్ లో కూడా ప్రముఖుడయిండు. జిల్లా కాన్ఫరెన్సులకి అధ్యక్షుడయిండు. ఆ మహానుభావుడు తాను అధ్యక్షుడిగా ఉన్న చోట, సహచరులతో పాటు పదేసి రోజులు క్యాంపు వేసి కూర్చుని గుంజలు పాతడం, తడికలు కట్టడం దగ్గర్నుంచీ ప్రతిదీ చేసెటివాడన్న మాట. అతన్ని ‘పెద్దన్నా’ అని పిల్చె టోన్ని.
1952లోవరంగల్లులో నేను పార్లమెంటు అభ్యర్థిగా నిలబడ్డా. ఆ పా ర్లమెంటరీ నియోజక వర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా వర్ధన్నపేట నుంచి సర్దార్ జమలాపురం పోటీ చేసిండు కాంగ్రెస్ అభ్యర్థిగా. అటువంటి మహా నుభావుడు, త్యాగి, ఉద్యమ శక్తిగలవాడు, కాంగ్రెస్ లోపట ఉండే టువంటి కుళ్లు, ద్వేషంతోటి ఓడిపోయిండు. కమ్యూనిస్ట్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు గెలిచిండు. పార్లమెంటు సీటూ గెలిచిండు. అది ఉంచుకుని అసెంబ్లీ సీటు రిజైన్ చేసిండు. వర్ధన్నపేట బై ఎలక్షన్‌లో కేశవరావు నిలబడి ఓడిపోయిండు. కాంగ్రెస్‌లో భేదాభిప్రాయాల వల్ల కేశవరావు ఓడిపోయిండు. కేశవరావు స్థానికుడు కాదు. ఆయనకి మధిరలోనో, ఎర్రుపాలెంలోనో టికెట్ ఇస్తే తప్పకుండా గెలిచెటోడు. కాని టికెట్లు ఎలాట్ చేసినోండ్లు కుట్ర చేసిన్రు. హయగ్రీవా చారికి, బొమ్మకంటి సత్యనారాయణకి టికెట్లు రాకపోవడం గమనించాలె. కేశవరావు నడి వయసులోనె చచ్చిపోయిండు...’
ఎవరైనా తమకు అవమానం జరిగినప్పుడు ఏ విధంగా తమ కింద వారి మీద ప్రతీకారం తీర్చుకుంటారో తెలిపే విషయాన్ని సోదాహరణంగా వివరించారు కాళోజీ. అదే విధంగా కలిమి లేముల తేడా పాటించే విధానాన్ని కూడా చెప్పారు. ‘నా షష్టి పూర్తి హైద్రాబాదులో కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో జరిగింది. పి.వి. నరసింహారావు అప్పుడు మాజీ మంత్రి. కాంగ్రెస్‌లో ఉన్నడు. సంచికకో గేయం రాసిండు. ఆ సభలో మాట్లాడు తూ...‘కాళోజీ నాకంటె వయసులో ఆరేళ్లు పెద్ద. చదువులో మాత్రం మూడు సంవత్సరాలె. చదువుకుంటున్నప్పుడు సీనియర్స్‌కీ, జూనియర్స్‌కీ కూడా ఆయన నడవడి ఉత్సాహం, ఉత్తేజం కలిగించేటివి. అయితే మా పెద్దలు (పి.వి. భూస్వామి వర్గానికి చెందిన వాడు) కాళోజీ దగ్గరకు పోకండి, ఆయనతో మాట్లాడకండి, సావాసం పట్టకండి, అతను ఖతర్ నాక్ మనిషి అని చెప్పే వాండ్లు’ అన్నడు. ఇదన్నదెవరు? ముస్లిములు కాదు. ప్రభుత్వాధికారులు కాదు. పీవీ నరసింహారావు పెద్దలు. వారు భూస్వాములు, పట్వారీలు, పెత్తందార్లు. తమ పిల్లల్ని స్నేహితానికైనా కాళోజీ దగ్గరకు పోవద్దు అనెటోళ్లన్నమాట. ఇక్కడ నైజాం సర్కార్, స్థానిక ముస్లిములు కాక మూడో ప్రమాదం పెత్తందార్ల నుంచీ కూడా ఉండేది.......హిందువుల్లో కాపువాడు, రెడ్డి వాడు ఒకే దిక్కున కూర్చుని భోంచేయరు. దేశ్ ముఖ్ రెడ్డి, మామూలు రెడ్డిని పక్కన కూర్చో పెట్టుకోడుగ! బ్రాహ్మణ దేశ్‌ముఖ్ తన పక్కన కరణాన్ని (బ్రాహ్మలు) కూర్చో బెట్టుకు భోంచేయడు. ఒకే కులం వాండ్లల్లో కూడా కలిమి లేముల తేడా పాటించేటప్పుడు, వేరే కులం వాండ్లల్లో కూడా కలిమి లేముల తేడా పాటించేటప్పుడు, వేరే కులాల వాండ్లతో కలిసి మెలిసి ఉండడం కలలో మాట. హిందువులలో ప్రతివారూ కూడ కొందర్ని గొప్ప వాండ్లని వాండ్లకి లొంగిపోవడం, కొందర్ని చిన్నవారని వాండ్లని లొంగదీసుకోవడం పరిపాటి. ఒకనితో తన్నులు తినేటోనికి ఇంకొకరిని తంతేగాని తృప్తిగాదు. దీనికో కథ చెప్తరు. ఒక తాశీల్దారు పేష్కారును తిట్టిండట. ఆ పేష్కారు గిర్దావరును తిట్టిండట. గిర్దావరు పటేలు, పట్వారీలను తిట్టిండట. వాండ్లు సుంకరివాడిని కొట్టి వాడి మీద విరుచుకు పడ్డరట. అతను ఇంటికి పోయి భార్యను కొట్టిండట, ఆ భార్య ఏం చేసిందీ? కుండలు బద్దలు కొట్టి తానే ఏడ్చిందట. అంటే ఎవరైనా సరే తమకు అవమానం జరిగినప్పుడు ప్రతీకారం తమ కింది వాని మీద తీర్చుకుంటరన్న మాట. తరతమ బేధాలు సమసిపోతే తమ పెత్తనం పోతుందని ఈ పెత్తందార్ల భయం...’
*
(నేడు కాళోజీ 17వ వర్ధంతి)
స్కెచ్: శంకరనారాయణ
*

-వనం జ్వాలా నరసింహారావు