Others

నిరాడంబరమే అన్నింటా మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన ఎప్పుడూ సేవకులను నియమించుకోలేదు, శారీరకమైన పనులన్నీ ఆయనే స్వయంగా చేసేవాడు. మట్టి గుడిసెలలో ఉండటానికే ఇష్టపడేవాడు. భారతదేశమంతా అనేకసార్లు మూడో తరగతి రైలుపెట్టెలో తిరిగాడు. తనవద్ద వున్న అదనపు బట్టల జత, లేదా పత్రికల కట్టనే ఆయన రైల్లో తలగడగా ఉపయోగించేవాడు. ఆయన పక్కమీద స్వదేశీ రగ్గులు, ఖాదీ దుప్పట్లు ఉండేవి. ఒకసారి ఆయన దోమతెర లేకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. ఒళ్లంతా దుప్పటి కప్పుకొని ముఖానికి కిరోసిన్ రాసుకుని పడుకున్నాడు. గ్రామాల్లో దోమతెరలు కూడా కొనుక్కోలేనంత పేద రైతులు ఉన్నారని ఆయన విని, వారిలా ఉండేందుకు ప్రయత్నించాడు.
బ్రిటీషువారు భారతదేశానికి నిజంగా స్వాతం త్య్రం ఇద్దామనుకుంటున్నారో లేదో తేల్చుకొనేందుకు ఆయన నాలుగోసారి ఇంగ్లాండు వెళ్లినపుడు ఓడలో డెక్ మీదే ప్రయాణించాడు. తమతోపాటు పెద్ద పెట్టెల నిండా దుస్తులు తేవద్దని ఆయన తన కార్యదర్శికీ, సహాయకులకూ సూచించాడు. ఇంగ్లాండులో కూడా భారతీయ శైలిలో కుర్తా, ధోవతి, చెప్పులు ధరించమని ఆయన వారిని కోరాడు. ఓడ ప్రయాణంలో ఉండగా ఒక స్నేహితుడు గాంధీకి 700 రూపాయల ఖరీదైన మంచి నాణ్యమైన శాలువాను బహూకరించాడు. ‘‘పేదలకు ఏకైక ప్రతినిధిగా నేను చేయగలిగింది ఇదే’’ అంటూ ఆ శాలువాను అక్కడే 7000 రూపాయలకు అమ్మేశాడు.
‘‘నాకు బహుమతిగా వచ్చిన శాలువాలన్నిటితో ఒక దుకాణం నడపవచ్చు’’ అనేవాడాయన. శాలువాలను అమ్మగా వచ్చిన సొమ్మును హరిజన సంక్షేమానికి వినియోగించేవాడు.
గాంధీ ఫ్రాన్సులో దిగినప్పుడు అంగవస్త్రంలో వున్న ఆయనను చూసి అక్కడి ప్రజలు విస్తుబోయారు. ఆయన నవ్వుతూ ‘‘నాలుగు వరసల దుస్తులు ధరిచడం మీ దేశంలో మీకు అలవాటు, కానీ నాలుగు ముక్కలే ధరించడం నాకు ఇష్టం’’ అన్నాడు. చలిదేశంలో కోట్లూ, సూట్లూ వేసుకున్నవారి మధ్య ఉండీ లేని దుస్తులతో ఆయన ఇలాగే తిరుగుతాడా, ఇలా ఇంగ్లాండు రాజుగారి దర్శనానికి వెళతాడా అని కొందరు అనుమానిస్తూనే ఉన్నారు. ‘‘మా ఇద్దరికీ సరిపడా బట్టలు రాజుగారే వేసుకున్నారు’’అని ఆయన చిలిపిగా మెరిసే కళ్ళతో వారికి జవాబిచ్చాడు. నాటు చెప్పులు, అంగవస్త్రం, మాసికలతో వున్న శాలువతోనే ఆయన రౌండు టేబిల్ సమావేశానికి హాజరయ్యాడు, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలను, బకింగ్‌హామ్ పాలెస్‌నూ సందర్శించాడు. బ్రిటీష్ ప్రధాని చర్చిల్ కోపంగా ఆయనను ‘్భరతదేశపు అర్థనగ్న సన్యాసి’గా సంబోధించాడు. గాంధీ దాన్ని గౌరవంగా భావించి గర్వించాడు. లండన్‌లో ఆయన రోజువారీ భోజన ఖర్చు 12 అణాలు దాటలేదు.
ఏ రకమైన వృధా అయినా గాంధీని ఇబ్బంది పెట్టేది. పాత బట్టలు పేలికలను కూడా అమ్మవచ్చనీ, పళ్లు తోముకునేందుకు వాడిన పుల్లలను కడిగి ఎండబెట్టి పొయ్యిలోకి వాడవచ్చనీ ఆయన సూచించేవాడు. రోజులో 24 గంటలను వివిధ కార్యక్రమాలకు వినియోగించేవాడు. ఆయన సమయపాలనలో కచ్చితంగా ఉండేవాడు, ఏ కార్యక్రమానికీ ఆలస్యంగా వచ్చేవాడు కాదు. అలాగని ఏ పనీ కంగారుగా చేసేవాడు కాదు. మాటల్లో కూడా పొదుపు పాటించాలని ఆయన నమ్మేవాడు. ఆయన చాలా ఉపన్యాసాలిచ్చాడు, చాలా వ్యాసాలు రాసాడు కానీ అతిశయోక్తులు వాడేవాడు కాదు.
ఒకవైపు రాయకుండా వున్న ఉత్తరాలను, కవర్లనూ, కాగితాలనూ ఆయన సేకరించేవాడు. సైజులవారీగా వాటిని పొత్తికలుగా పెట్టి ఉత్తరాలు రాసేందుకు వాడేవాడు. ముఖ్యమైన ప్రకటనలు, రాతప్రతులు, వైస్రాయిలకు, రాజకుమారులకు, బ్రిటిష్ ప్రధానమంత్రికీ ఇచ్చే జవాబులు అలాంటి కాగితాలమీదే రాసేవాడు. ఒకసారి ఒక బాలుడు బహుమతిగా ఇచ్చిన చిన్న పెన్సిల్, ఆయన చాలా రోజులుగా వాడుతున్న చెరుపురాయి (రబ్బరు) కనిపించకపోతే అవి కనిపించేదాకా అగ్గగ్గలాడిపోతూ చాలాసేపు వెతికి పట్టుకున్నాడు. స్వాతంత్య్రం తరువాత మంత్రులు ఎంతో ఖరీదైన కాగితం, ముద్రణతో కూడిన అధికారిక లెటర్ పాడ్‌లను వ్యక్తిగత ఉత్తరాలకు వాడుతున్నందుకు ఆయన మందలించాడు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614