Others

ఆర్‌టిసి సమ్మె - మానవీయకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత నెల పదిహేను రోజులుగా జరుగుతున్న ఆర్.టి.సి. సమ్మె రెండు మదించిన ఆంబోతుల మధ్య యుద్ధమన్నట్టుగా కొనసాగుతుంది. ఆవులావులు కొట్లాడితే లేగల కాళ్ళిరిగినట్టు సమ్మె ఫలితమెలా ఉన్నా ఈ రెండు ఆంబోతులకేమీ కాదు. కాళ్ళిరిగి, తలలు పగిలి ఆకలి మంటల్లో మాడిపోయేది సామాన్య కార్మికులు. ఇప్పటికే నలభై మంది వరకు కార్మికులు ఆత్మహత్యలు, గుండెపోటులతో మరణించారు. అయినా ఈ ఆంబోతులు దిగిరావు. ఎందుకంటే ఆ కార్మికులు తమ వర్ణానికి, వర్గానికి చెందినవాళ్ళు కారు. ఆంబోతులుగా ఉన్న ప్రభుత్వం, యూనియన్ నాయకులు ఒకే వర్ణం, ఒకే వర్గానికి చెందినవారు. బస్సు ముఖంకూడా చూడనివారు. కార్లలో, హెలికాఫ్టర్లలో, విమానాల్లో పయనించేవాళ్ళు. డ్రైవర్ పట్టే హాండిల్, కండక్టర్ ఎస్సార్, మెకానిక్ పానా అంటే కూడా తెలియనివారు. ఆర్.టి.సి.కార్మికుల జీవన నేపథ్యాలు, మూలాలు అసలే తెలియనివారు. ఈ ఆంబోతులు రెండూ రాజకీయ పార్టీలకు చెందినవే. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉంటే రెండవ ఆంబోతు చేస్తున్నట్టే చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలో ఉంటే మొదటి ఆంబోతు చేస్తున్నట్టే చేస్తుంది. అలా చేసాయి కూడా. ఇరువురికీ రాజకీయాలు కావాలి. తమతమ ఆధిపత్యం కావాలి. సమ్మెను అణచివేయడం ద్వారా ఒకరు, సమ్మెను పొడిగించడం ద్వారా మరొకరు తమతమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని చూస్తున్నారు. ఆత్మహత్యలతో, గుండెపోట్లతో మరణిస్తున్న కార్మిక కుటుంబాల గురించి కానీ, అంతంత మాత్రంగానే ఉన్న జీతాలుకూడా రాకుంటే ఆకలితో అలమటిస్తున్న కార్మికుల దీనస్థితి గురించి కానీ రెండు ఆంబోతులకూ పట్టదు. అలా పట్టించుకొని ఉంటే ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి అన్ని కుంటిసాకులు చెప్పేది కాదు. కార్మిక నాయకులు అన్ కండిషనల్‌గా చర్చలకు పోయేవారు. కాని ఇవేవీ జరుగడంలేదు. రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు కూడా కార్మికులకు న్యాయం చేయలేని దుస్థితి.
కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్కని ముద్రవేయాలి. ఓ సంస్థను, కర్మాగారాన్ని మూసివేయాలంటే అవి నష్టాల్లో నడుస్తున్నాయని ప్రచారం చేయాలి. ఇదే ప్రభుత్వ పాలసీగా నడుస్తుంది. ఈ పాలసీని అనుసరించే కేంద్ర ప్రభుత్వం 2002 డిసెంబర్‌లో రామగుండంలో ఉన్న ఎరువుల కర్మాగారాన్ని మూసివేసింది. అమానవీయంగా వేలాది మంది ఉద్యోగులను రోడ్లపై నిలబెట్టింది. మూడు వేజ్ బోర్డులు ఏదీ ఇవ్వకుండానే బలవంతంగా వాలంటరీ రిటైర్‌మెంట్ చేయించింది. అప్పుడెవరూ సమ్మెచేసి ఉత్పత్తికి నష్టం కలిగించిందీ లేదు. నష్టాల్లో నడుస్తుందని, ఎందుకో ఏమిటో ఏదీ ఆలోచించకుండా ఒక్క కలం పోటుతో వేల మంది ఉసురు పోసుకుంది. ఆ షాక్‌ను భరించలేక ఒక్క సంవత్సరం లోపే 70, 80 మంది కార్మికులు గుండెపోటుతో మరణించారు. చెట్టుకొకరు పుట్టకొకరుగా కార్మిక కుటుంబాలు దేశమంతటా బతుకు వెతుక్కుంటూ వెళ్లారు. కనీసంగా మెడికల్ ఫెసిలిటీ లేదు. పెన్షన్ లేదు. వాళ్ళంతా ఎలా బతకాలి? బతకలేక చచ్చిపోయిన వాళ్లెందరో..? నానాయాతనలు పడుతూ కుటుంబాలను పోషించుకుంటున్న వాళ్ళు కొందరు. ఆ బాధితుల్లో నేనూ ఒకణ్ణి. ఇప్పటికీ వేలాది మంది బతుకుబండి నీడ్వలేక అరగోసపడుతున్నారు. మా ఫ్యాక్టరీతోపాటు దేశవ్యాప్తంగా అనేక కర్మాగారాలను మూసేసి లక్షల మందిని రోడ్డుపైకి విసిరేసింది వాజపేయి ప్రభుత్వం. ఎంతోమంది ఉసురుపోసుకుంది. అప్పటి ప్రభుత్వ మొండివైఖరి, అమానవీయ చర్య లక్షలాది మందిని అనాధలను చేసింది. నిస్సహాయులను చేసింది. ప్రభుత్వ మొండివైఖరికి కార్మిక నాయకుల లాలూచీ మనస్తత్వం తోడయింది. మూసివేతలోని దుర్మార్గాన్ని స్వయంగా అనుభవించాను కాబట్టే నాకు ఆర్.టి.సి. కార్మికుల బాధలు తెలుసు. ఈ వయసులోనూ ఎర్రబస్సే నాకు దిక్కుగా ఉంది కాబట్టే దాని ప్రాధాన్యత తెలుసు. ఆర్.టి.సి. విషయంలో ప్రభుత్వం, నాయకులు సరిగ్గా అప్పట్లాగే ప్రవర్తిస్తున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణను రహస్య ఎజెండాగా ప్రభుత్వం, ప్రభుత్వాన్ని కూలగొట్టడం రహస్య ఎజెండాగా కార్మిక నాయకత్వం పనిచేస్తున్నాయి. రామగుండం ఎరువుల కర్మాగార ఉద్యోగులకు పట్టిన దుస్థితి ఆర్.టి.సి. కార్మికులకు పట్టకూడదు. అందుకోసం తల్లీ, తండ్రి లాంటిదైన ప్రభుత్వం దిగిరావాలి. కార్మికులను ఉద్యోగాల్లో చేర్చుకోవాలి. సమ్మె రోజులను ఎర్న్‌డ్(సంపాదిత) లీవ్‌ల నుంచి మినహాయించాలి. కార్మిక నాయకులు రాజకీయాలు వదిలి ఆర్.టి.సి. కార్మికులు పనుల్లో చేరేట్టు చూడాలి.
లక్షలాది మంది కార్మికుల బతుకులను బండలపాలు చేసిన మరో సంఘటన గత శతాబ్ది 8-9 దశాబ్దుల మధ్య జరిగింది. అదే బొంబాయి, సూరత్, భివండి, షోలాపూర్ ప్రాంత బట్టల మిల్లు కార్మికుల సమ్మె. వందలాది ప్రైవేటు బట్టల మిల్లుల్లో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్లల్లో చాలామంది తెలంగాణ జిల్లాలనుంచి, కొంతమంది ఆంధ్ర ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలనుంచి పొట్ట చేతబట్టుకొని బతుకడానికి వెళ్ళినవాళ్లే. మరాఠీ, గుజరాతీ కార్మికులు చాలామందే ఉన్నారు. యజమానులంతా మరాఠీ, గుజరాతీ సేట్లు..కార్మికుల స్వేదంతో వందలు, వేల కోట్లు సంపాదించుకున్నవారు. లక్షలాది కార్మికులు ఒకేసారి సమ్మెకు దిగారు. వారికి నాయకత్వం వహించింది ప్రముఖ కార్మిక నాయకుడు దత్తాసామంత్. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ దత్తాసామంత్ మంచి కార్మిక నాయకుడిగా ఎంతోమందికి స్ఫూర్తి. కారణాలేవైనా సమ్మెరోజులు దాటింది నెలలు దాటింది. సంవత్సరం దాటింది సమస్య పరిష్కారం కాలేదు. ఫ్యాక్టరీలన్నీ మూతపడ్డాయి. లక్షలాది మంది మిల్లుల కార్మికులు రోడ్డున పడ్డారు. వందలాది ఆత్మహత్యలు, పొట్ట చేతబట్టుకొని బతుకడానికి పోయిన కార్మికులు కట్టుబట్టలతో, మాడుత్నున పేగులతో తెలంగాణ జిల్లాలకు తిరిగివచ్చారు. ఏడ్పులు, పెడబొబ్బలు, ఆకలి చావులు, నానా బీభత్సం. దత్తాసామంత్ హత్య గావించబడ్డాడు. ఇక్కడ తప్పెవరిదన్నది కాదు ప్రశ్న. ఫలితం ఎవరనుభవించారన్నది. లక్షలాది కార్మికులు అన్నమో రామచంద్రా అంటూ అలమటించారు. కూలీలయ్యారు. రిక్షా కార్మికులయ్యారు, వాచ్‌మన్లయ్యారు, కూరగాయలమ్ముకున్నారు, కొందరు వ్యభిచారులూ అయ్యారు. ఆ సమయంలో ఎఫ్.సి.ఐ.రామగుండంలో కార్మికుడిగా పనిచేస్తున్న నేను ప్రత్యక్షంగా చూసాను. అలాంటి పరిస్థితి ఆర్.టి.సి.కార్మికులకు రాకుండా అటు ప్రభుత్వం, ఇటు కార్మిక నాయకులు జాగ్రత్తపడి తగిన చర్యలు తీసుకోవాలి. ఈ సుదీర్ఘ సమస్యకు సత్వర పరిష్కారం వెతుకాలి.
ఇంతకీ ప్రభుత్వం చెబుతున్నట్టు ఆర్.టి.సి. కార్మికులు బాగా జీత భత్యాలతో ఎంజాయ్ చేస్తున్నారా? ఆర్.టి.సి. నష్టాల్లో నడుస్తుందా? అయితే కారకులెవరు? కార్మికులా? అధికారులా? మరెవరు? పరిశీలిద్దాం. పాతికేళ్ళ సర్వీసు దాటిన డ్రైవర్, కండక్టర్, మెకానిక్‌లకు కూడా నలభైవేల మించి జీతంలేదు. రిటైర్‌మెంటు దగ్గరున్న వాళ్ళకు కొందరికి యాభైవేల దగ్గరుండొచ్చు. రిటైరయినంక వాళ్ళకు ప్రభుత్వోద్యోగుల్లా పెన్షన్ లేదు. వాళ్ళు చెల్లించిన డబ్బులోంచే కంట్రీబ్యూటరీ పెన్షన్‌గా నెలకు వెయ్యి, పదిహేను వందలొస్తుంది. ఇది నెల రోజులు టీ తాగడానికైనా సరిపోతుందా? ఇదే పరిస్థితి ఎఫ్.సి.ఐ. పెన్షనర్లది. ఇక జీతాలు ఎక్కువెక్కడున్నాయి? ఉంటే అధికార్లకుండొచ్చు. చుట్టపుచూపుగా వచ్చిపోయే నామినేటెడ్ ఛైర్మన్‌లకుండొచ్చు. ఇక నష్టాల గురించి. ఆర్.టీ.సి. బస్సులెప్పుడూ క్రిక్కిరిసి ఉంటాయి. ఫుట్‌పాత్‌లపై డోర్లకు వేలాడుతూ ప్రయాణం చేస్తారు. అలా ప్రయాణంచేసే నేను గత సంవత్సరం ఆక్సిడెంటుకు గురయి చెయ్యి విరిగి ఆరునెలలు సిక్ అయ్యాను. వీళ్ళంతా టికెట్ లేక ప్రయాణం చేసే వాళ్లేంకాదు. రెవెన్యూ ఉద్యోగుల్లా ఆర్.టీ.సి. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు లంచాలు తీసుకునే అవకాశంలేదు. టికెట్ ఇవ్వకుండా ప్రయాణాలు బస్సుల్లో అసలే కనబడటం లేదు. మరి నష్టాలెందుకొస్తున్నాయి? రాజకీయ పార్టీలు బస్సులను వాడుకొని ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంవల్ల. విద్యార్థులకివ్వాల్సిన రీ ఇంబర్స్‌మెంట్ ఆర్.టీ.సి.కి సరిగ్గా చెల్లించకపోవడం వల్ల. మోతుబరులు, రాజకీయులు బస్సులను వాడుకొని ఆర్.టి.సి.కి సరిగ్గా చెల్లించకపోవడంవల్ల ఇలాంటి బకాయిలే మూడువేల కోట్ల వరకున్నాయని వార్తాపత్రికల్లో రోజూ వార్తలు. ఇంకా బస్సులు, టైర్లు, సామాన్ల కొనుగోళ్ల విషయంలో పై అధికారులు, కార్మిక నాయకులు, రాజకీయ నాయకులకు వాటాలు ఇవ్వడానికి, తామూ మిగుల్చుకోవడానికి చేసే అవకతవకలవల్ల నష్టాలు రావచ్చు కానీ చిన్న ఉద్యోగులవల్ల కాదు. ఆర్.టీ.సి. కండక్టర్, డ్రైవర్, మెకానిక్‌గా చేసి ఎంతమంది ఎన్ని బంగ్లాలు కట్టుకున్నారో పరిశీలించండి. వాళ్ళ బతుకువెతలు తెలుస్తాయి. ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ లాంటి సమర్ధవంతుడు, మానవతావాదియైన అధికారికి ఆర్.టి.సి. బాధ్యతలు అప్పజెప్పితే రెండు సంవత్సరాల్లో లాభాల బాటలో పయనిస్తుంది. అప్పజెప్పి చూడండి.
ఎక్కడా లేని ఆర్టీసి తెలంగాణలో ఉందంటే తన ప్రజలకు రవాణా సౌకర్యం కల్గించడానికి నైజాం నవాబు తీసుకున్న మంచి నిర్ణయాలే కారణం. దానిని అలాగే కొనసాగనివ్వడం ప్రభుత్వ బాధ్యత. ముఖ్యమంత్రిగారు పెద్దమనసు చేసుకొని ఆర్.టి.సి. కార్మికులను తమ బిడ్డలుగా భావించి సమస్యను పరిష్కరిస్తారని ఆశిద్దాం. ఈ విషయంలో సమ్మె నడుపుతున్న నాయకులూ భేషజాలూ వదిలి కార్మికుల బతుకులనాదుకోండి.

- డా. కాలువ మల్లయ్య 9182918567