Others

పరహితమే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటీషు ప్రభుత్వానికి గాంధీ రూపంలో మోసకారితనం కంటే దోపిడీనే గొప్పదని నిరూపించగల గట్టి ప్రత్యర్థి ఎదురయ్యాడు. బ్రటీషువారు భారతదేశానికి వర్తకులుగా వచ్చారు. వారు అన్యాయమైన మార్గాలద్వారా భారత మార్కెట్‌ను ఆక్రమించుకున్నారు, ఒకప్పుడు ప్రపంచానికి అసూయ పుట్టించేస్థాయిలో ఉన్న ఇక్కడి చేనేత, నూలు పరిశ్రమను నాశనం చేశారు. రాట్నాలు, మగ్గాలు ఖాళీగా ఉండిపోయాయి. కొంతమంది చేతి వృత్తి పనివారు వ్యవసాయంలోకి మళ్లారు, మరికొంతమంది కూలీలుగా మారారు. సమృద్ధితో నిండిన దేశంలో పేదరికం విస్తరించింది. మాంచెస్టరు నుంచి, లాంక్‌షైరు నుంచి దిగుమతి చేసుకున్న వస్త్రాలు భారతదేశం నుంచి కోట్లాది రూపాయలు పట్టుకుపోయాయి. పనిలేక భారతీయ వర్తకుని చేతుల్లోని కొలతబద్ద అలంకారప్రాయంగా మిగిలిపోయింది.
విదేశీ వస్త్రాలను, మద్యాన్ని, బ్రిటీషు వస్త్రాలను బహిష్కరించాలనే ఆలోచన గాంధీకి వచ్చింది. స్వయంగా నూలు వడికి, నేత నేసి తయారుచేసుకున్న ఖాదీ వస్త్రాలనే వాడమని దేశ ప్రజలకు విసుగులేకుండా విజ్ఞప్తి చేశాడు. ఆయన విజ్ఞప్తికి బ్రహ్మాండమైన స్పందన లభించింది. చేతితో నూలు వడకటానికి, చేనేతకు మళ్లీ గాంధీ ప్రాణం పోయగలిగాడు. విదేశీ వస్త్ర దుకాణాలు, మద్యం దుకాణాల వద్ద నిరసన ప్రదర్శనలు చేయడానికి ఒక మహిళా కార్యకర్తల దళాన్ని గాంధీ ఏర్పాటుచేశాడు. నగరాల్లోనూ, గ్రామాల్లోనూ అనేక సభల్లో ప్రసంగించాడు. విదేశీవస్త్రాలతో భోగిమంటలు ఏర్పాటుచేశాడు. దిగుమతి వర్తకం ఊహించనంతగా పడిపోయింది. బ్రిటీషు యాజమాన్యంలోని బట్టల మిల్లులు చాలావరకూ మూతపడ్డాయి. చేతి నూలు కట్టల రూపంలోని గాంధీ బుల్లెట్లు బ్రిటీషు వస్త్ర కార్మికులకు గట్టిగా తగిలాయి. వేలాదిమంది నిరుద్యోగులయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత గాంధీ లాంక్‌షైరు వెళ్లినపుడు అక్కడి మిల్లు కార్మికుల సమావేశంలో పాల్గొన్నాడు. ‘‘ఇక్కడ నిరుద్యోగం ఎక్కువగా ఉన్నందుకు నేను బాధపడుతున్నాను. మీ వద్ద ముప్ఫైలక్షల మంది నిరుద్యోగులుంటే మా వద్ద ముప్ఫైకోట్లమంది ఏడాదిలో ఆరునెలలు నిరుద్యోగులుగానే ఉంటున్నారు. మీ వద్ద సగటు నిరుద్యోగ భృతి 70 షిల్లింగులు. మా వద్ద నెలసరి సగటు ఆదాయం ఏడు షిల్లింగుల, ఆరు పెన్నీలు మాత్రమే. భారతీయ నూలు కార్మికులు, నేత కార్మికులు వారి పిల్లల నోళ్లనుంచి లాక్కున్న రొట్టెముక్క ద్వారా మీ ఆకలి తీర్చుకోవాలనుకుంటున్నారా? కావాల్సిన బట్టలు ఉత్పత్తి చేసుకొనే శక్తి భారతదేశానికి ఉన్నా, లాంక్‌షైర్ నుంచి దిగుమతి చేసుకొని తీరాలా? పేద భారతీయుల సమాధులమీద మీరు అభివృద్ధి చెందాలని అనుకుంటున్నరా?’’ అని ప్రసంగించాడు. ఆయన నిర్మొహమాటమైన ప్రసంగం బ్రిటీషు కార్మికులకు నచ్చింది, వారు చప్పట్లతో ఆయన్ను అభినందించారు.
ధనికులకూ పేదలకూ మధ్య ఉన్న అంతరాలను తగ్గించేందుకు గాంధీ అన్ని రకాలుగా ప్రయత్నించాడు. ఒకసారి వీధులూడ్చే పనివాళ్ల సమావేశంలో ఒక మహిళా తన చేతికి వున్న రెండు బంగారు గాజులూ గాంధీకి ఇచ్చి ‘‘ఈ రోజుల్లో భర్తలు భార్యల కోసం చాలా తక్కువ సొమ్ము కేటాయిస్తున్నారు. అందుకనే నేను తమకు ఇంతకంటే ఇంకేమీ ఇచ్చుకోలేకపోతున్నాను. ఇవే నా వద్ద మిగిలిన ఆఖరి ఆభరణాలు, వీటిని హరిజనుల సేవకు వినియోగించండి’’ అంది. ‘‘నేను అనేకమంది వైద్యులనూ న్యాయవాదులనూ, వర్తకులనూ బిచ్చగాళ్ళుగా చేశాను. ఇందుకు నేనేమీ పశ్చాత్తాపడటంలేదు. ఒక పైసా సంపాదనకోసం మనుషులు మైళ్ళ కొద్దీ నడిచి వెళ్లాల్సి వస్తున్న భారతదేశంలో ఖరీదైన ఆభరణాలు ధరించడం ఎవరికైనా శోభవివ్వదు’’ అని గాంధీ అనేవాడు. కొన్ని సందర్భాలలో చేతుల నుంచి గాజులు రానపుడు ఆయన వాటని కోసి తీసికొనేవాడు. సామాజిక కార్యక్రమాల కోసం ఆడవాళ్ల వద్దనుంచి ఇలా ఆభరణాలు దానంగా తీసుకోవటం గురించి ఆయనను చాలామంది విమర్శించారు. కానీ గాంధీ ఈ విషయంలో మొండిగా వుండేవాడు. ‘‘వారికున్నదంతా కాకపోయినా కనీసం వారు ధరించిన నగలైనా నాకు ఇద్దామని నా నా సభలకు హాజరయ్యే తోబుట్టువులు చాలామంది నాకున్నారు’’ అనేవాడాయన.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614