Others

లప్పాం టప్పాం సీతారాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముందుతరం హాస్యనటుల్లో తనదైన స్టయిలున్న నటుడు భీమన సీతారాం. ఊహ తెలిసినప్పటినుండీ నటనే ప్రాణంగా పెరిగాడు. విజయవాడ కొత్తపేట సెంటర్‌లో 1944 ముందునుండే నటన పిచ్చితో తిరుగాడినవాడు. ఆయనకొక స్నేహితుడు వాలిశెట్టి కోటేశ్వరరావు. ఇద్దరూ కలిసి నటనా పిచ్చితో ఎక్కడెక్కడ ఏ నాటకాలు జరిగినా అక్కడ వాలిపోయేవారు. కళ్ళు విప్పార్చి మరీ ఆ నాటకాలను చూసి ఆస్వాదించి ఇంటికొచ్చేవారు. ఇద్దరికీ ఆహార్యంలో తేడా ఉండేది. వాలిశెట్టి కోటేశ్వరరావు గిరజాల రింగుల జుట్టుతో, స్ఫురద్రూపం, కంచుకంఠంతో హీరోలా కనిపించేవాడు. ఆయనపక్క సన్నగా, రివటలా తేలిపోయేవాడు సీతారాం. ఎక్కడ ఏ పొరపచ్ఛం వారి హృదయంలో లేదు. ఇద్దరూ కలిసి అనేక స్టేజి నాటకాలు వేశారు. రంగూన్‌రౌడీ, సాని-సంసారి లాంటి నాటకాలలో వారికి మంచి పేరు వచ్చింది. రంగూన్‌రౌడీగా పేరుతెచ్చుకున్న వాలిశెట్టి కోటేశ్వరరావును అదే పేరుతో అనుకరిస్తూ కొత్తపేట రౌడీ అని పిలిచేవారు. హాస్యనటనకు ఓనమాలు దిద్దిననాటినుండే అనేక వేషాలు వేసినా, అత్తరుసారుూబు నటనకు ప్రజలు జేజేలు పలికారు. ఎక్కడికెళ్లినా సారుూబు అని పిలిచేవారు. ప్రేక్షకులిచ్చిన వెన్నుదన్నుతో ఇద్దరూ కలిసి మద్రాస్ రైలెక్కేసారు. చిన్నప్పటినుండీ వామపక్షభావాలతో ఎదిగిన సీతారాంకు అక్కడ భారీ పరిచయాలు కూడా ఉపయోగపడ్డాయి. తేనాంపేటలో ఓ గది అద్దెకు తీసుకున్నారు. మద్రాస్ ఆళ్వర్‌పేటలో మీర్జాపురం రాజావారి శోభనాచల స్టూడియోలో కోటేశ్వరరావు పర్మినెంట్ ఆర్టిస్టుగా నెల జీతంపై కుదిరారు. సీతారాంకు మాత్రమే ఎటువంటి అవకాశాలు కనిపించలేదు. సీతారాం మరీ బక్కపలచగా వుండడంతో వేషాలు రావడం కష్టమైంది. నాటకంలో తన అత్తరుసారుూబు వేషాన్ని మిమిక్రీకా చేసి హెచ్.ఎం.రెడ్డి ముందు ప్రదర్శించాడు. నాటకాలలో అత్తరు సారుూబుగా ఎంత పేరు తెచ్చుకున్నాడో, అంతేపేరును పరిశ్రమకు వచ్చాక పలువురు దర్శకుల దగ్గర ప్రదర్శించి గుర్తింపు తెచ్చుకున్నాడు. హెచ్.ఎం.రెడ్డి రూపొందిస్తున్న తెనాలి రామకృష్ణ చిత్రంలో తొలిసారిగా అదే అత్తరు సారుూబు నటన గుర్తింపు తెచ్చింది. అదే ఆయన తొలి చిత్రం. స్టేజీ ఆర్టిస్టు ఎస్.పి.లక్ష్మణస్వామి హీరోగా నటిస్తే, ఆ చిత్రానికి ఎల్.వి.ప్రసాద్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ నటించారు కూడా.
శోభనాచలం స్టూడియోవారు ఓ ఇంగ్లీషు నవలను ఆధారం చేసుకొని రూపొందించిన చిత్రం పల్లెటూరి పిల్ల. ఈ చిత్రంలో నల్ల రామ్మూర్తి, సీతారాం హాస్య జంటగా పేరుతెచ్చుకున్నారు. లప్పాం టప్పాం అంటూ కనిపించే ఆ పాత్రల్లో గయ్యాళి భార్యకు భయపడుతూ ‘వద్దుర బాబోయ్ పెళ్లి వద్దుర నాయనోయ్, చిటపట చినుకులు’ అంటే సాగే పాటల్లో వారి అభినయానికి అందరూ అభిమానులౌతారు. ఆ రెండు పాటలు ఆ చిత్రంలో హిట్. అదే జంట మళ్లీ నల్లరామ్మూర్తి, సీతారాం హీరోలుగా 1951లో టింగు రంగ చిత్రం రూపొందించారు. అది సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో సీతారాం పరిస్థితి మొదటికొచ్చింది. అయినా కానీ కారెక్టర్ ఆర్టిస్టుగా అనేక చిత్రాల్లో నటించారు. గొల్లభామ చిత్రంలో యువరాజుకు స్నేహితుడిగా గుర్రంపై సీతారాం చేసిన విన్యాసం సరికొత్తగా ఆరోజుల్లో చెప్పుకున్నారు. బాలరాజు, స్వప్నసుందరి, అంతామనవాళ్లే, రోజులు మారాయి, భాగ్యదేవత, ఎత్తుకు పైఎత్తు, కుంకుమరేఖ, పెద్దరికాలు, కలసివుంటే కలదు సుఖం, మాంగల్యబలం, చెంచులక్ష్మి, బందిపోటు దొంగలు, జయసింహ, కదలడు-వదలడు, చివరకు మిగిలేది, మహాకవి కాళిదాసు, శ్రీలక్ష్మమ్మ కథ, అనార్కలి లాంటి చిత్రాలలో సీతారాం తనదైన నటనకు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా ఏఎన్నార్ దేవదాస్ చిత్రం క్లైమాక్స్‌లో బండివాడు పాత్రలో సీతారాం ఏఎన్నార్‌తో సమానంగా నటించారు. అలా పెద్ద హీరోలతో మొదటినుండీ నటించడం సాన్నిహిత్యం వుండడంతో ఆయా హీరోలను పేరు పెట్టి మరీ పిలవడం ఆయనకో ముచ్చట. రోజులు మారాయి చిత్రంలో షావుకారు జానకి తండ్రిగా మిలటరీ రిటైర్డ్ సిపాయిగా మాటిమాటికి తుపాకీ తుడుస్తూ ‘మాటంటే మాటే షూటంటే షూటే’ అనే ఊతపదంతో అలరించారు. కుంకుమరేఖ చిత్రంలో విలన్‌గా ఫైట్స్ చేశారు. రామవిజేత పతాకంపై కె.బాబురావు వారు రూపొందించిన అనేక చిత్రాల్లో అవకాశాలు కల్పించారు. వేషాలకోసం మద్రాస్ వీధుల్లో లాల్చీ పైజమా వేసుకొని ఓ పాత సైకిల్‌పై ఆఫీసుల చుట్టూ తిరిగిన ఆయనే, ఆ తరువాత ఆయన చుట్టే దర్శక నిర్మాతలు తిరిగేలా చేసుకున్నారు. ఆత్మాభిమానం ఎక్కువగా ఉండేది. షూటింగ్ వుంది, విమానంలో హైదరాబాద్ వచ్చేయండి అంటే మాత్రం రైల్లో రిజర్వేషన్ చేస్తేనే వస్తా అనేవారు. విమాన ప్రయాణం అంటే విముఖంగా ఉండేది. చదలవాడ కుటుంబరావు, నల్ల రామ్మూర్తి, సీతారాం, కస్తూరి శివరావు హాస్యనటులుగా ఓ ఊపు ఊపేశారు అలనాటి చిత్రాలలో. రేలంగి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్టార్ కమెడియన్‌గా మారాక సీతారాం కేరెక్టర్ ఆర్టిస్టుగా మారక తప్పలేదు. అందరికీ తలలో నాలుకగా ఉండేవారు. కమ్యూనిస్టు కనుక తన పిల్లలకు మహాకవి శ్రీశ్రీ సమక్షంలో స్టేజీ వివాహాలు చేశారు. ఎప్పుడూ ఎవరినీ సహాయం చేయమని అడగలేదు, ఒకరికి తానే సహాయంగా నిలిచారు తప్ప. దాదాపు 300పైచిలుకు చిత్రాల్లో పలు పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన 12-12-1981న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన లేకపోయినా ఆయన చిత్రాలతో సీతారాం చిరంజీవిగా నిలిచారు.

-ఎస్‌ఎస్