Others

ఎవరో వస్తారని.. (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమికోసం చిత్రం 1974లో వచ్చింది. అందులో ‘ఎవరో వస్తారని/ ఏదో చేస్తారని/ ఎదురుచూసి మోసపోకుమా’ అన్న మేల్కొలుపు పాట చాలా చాలా ఇష్టం. ‘నిజం మరచి నిదురపోకుమా’ అన్న సందేశంతో సాగే పాటలో కాచి వడబోసిన జీవితం కనిపిస్తుంది. రచయిత శ్రీశ్రీ ఐదు చరణాల్లో పాటకు పదును పెట్టారు. తన కలం బలంతో సామాజిక సమస్యలను స్పృశించారు. బడులే లేని పల్లెటూళ్లలో/ చదువే రాని పిల్లలకు/ చవుడు రాలే చదువుల బడిలో జీతాలు రాని పంతుళ్లను/ ఎవరో వస్తారు, ఏదో చేస్తారని అనుకోవద్దన్నారు. చాలీచాలని పూరి గుడిసెల్లో కాలే కడుపుల పేదలను, మందులు లేని ఆసుపత్రులలో పడిగాపులు పడే రోగులను ఎవరూ రక్షించరు అని విడమర్చి మరీ చెప్పారు. తరతరాలుగా మూఢాచారపు వలలో చిక్కిన వనితలను ఎవరు రక్షిస్తారు? అజ్ఞానానికి, అన్యాయానికి బలైపోయిన పడతులకు దిక్కెవ్వరు? అని ప్రశ్నిస్తుంది ఈ పాట. కూలి డబ్బుతో లాటరీ టికెట్లు కొని దురాశతో జీవితాలను వెళ్లదీసే అమాయకులను ఎవరు రక్షిస్తారు? దురలవాట్లతో బాధ్యత మరచి, ప్రవర్తించే వారికి ఎవరు మంచి మాటలు చెబుతారు? అని నిలదీస్తుందీ పాట. సేద్యంలేని బీడు నేలలో పనులే లేని వ్యవసాయదారులను, పగలూ రేయి శ్రమపడుతున్నా ఫలితం అందని కూలీలను ఎవరు ఆదుకుంటారు? అని నిగ్గదీసి మరీ ప్రశ్నించాడు శ్రీశ్రీ. ఈ గీతానికి స్వరం అందించిన ఘంటసాల, బాణీ కట్టిన పెండ్యాల సమ ఉజ్జీలే. గుమ్మడి ఈ పాటకు తగిన విధంగా హావభావాలను అద్భుతంగా ప్రదర్శించారు. పువ్వుకు తావి అద్దినట్టుగా అన్నీ సమంగా అమరాయి. ఈ ప్రబోధగీతం వింటున్నప్పుడల్లా సమకాలీన సమస్యలపై ఆలోచనలు వెల్లువెత్తుతాయి. పాట విన్న తర్వాత మనిషి ఎవరికోసమూ ఎదురుచూడడు. స్వయం ప్రకాశంతో, స్వయంకృషితో తనకుతాను ఎదిగి పదిమందికి మార్గదర్శకుడు అవుతాడు. అదే ఈ పాటకు సార్ధకత. ఈ పాటలో ప్రతి పదం మానవాళికి దిక్సూచి.

-మాధవరపుకృష్ణ, కాకినాడ