Others

జీవితసత్యాలే కథనాలు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పుస్తకం దాదాపుగా భారతీయ భాషలన్నింటిలోకి, ఇంగ్లీషు, ఫ్రెంచి, రష్యన్, జర్మన్, చైనీస్, జపనీస్ భాషల్లోకి అనువాదమయ్యింది.
ఆయన రచనలన్నీ సత్యాన్నీ, ఉన్నత నైతిక విలువలనూ సమర్థిస్తాయి. అలా అని అవి రసహీనమైన ప్రవర్తనావళులుగా ఉండవు. ఆయన ‘బాలపోతి’ అనే ప్రాథమిక వాచకాన్ని, ‘నీతిధర్మ’ అనే పేరుతో పిల్లలకోసం నీతి పుస్తకాన్ని రాశాడు. పిల్లలు ఆచరణలో పెట్టలేని అంశాలను వాళ్లకు బోధించడం ఆయనకు ఇష్టంలేదు. ఆయన ఆశ్రమంలోని పిల్లలకు రాసిన ఉత్తరాలు సరదాగానూ, మార్గదర్శకంగానూ కూడా ఉంటాయి. ఆయన చాలా ఎక్కువ పరిమాణంలో రాసేవాడు, ఒకరోజులో సాధారణ రాతలో 50 పేజీలు రాసేవాడు. ఆయన రాసిన సుమారు లక్ష ఉత్తరాలు ఆయన రచనలలో ప్రధాన భాగంగా ఉన్నాయి.
కళ కళకోసం అనే వాదనకు గాంధీ వ్యతిరేకి. ఆయన ఉద్దేశంలో అన్ని కళలూ సత్యంపై ఆధారపడి ఉండాలి. రచనలన్నీ మానవ ఔన్నత్యం కోసం సహాయపడేవిగా ఉండాలి. అర్థాకలితో ఉన్న పేదలకు సరళమైన చిన్న కథలు కావాలి, రైతులు తమ ఎడ్లబళ్లమీద ఇంటికి తిరిగి వెళుతూ పాడుకుంటూ తమ బాధల్ని మరిచిపోయేలా చేసే గేయ కథలు కావాలి. ఒక సాహిత్య సమావేశంలో రచయితలతో ‘ఈ లక్షలాది నిరుపేదల ఆకలి, ఆశలను మీరేమైనా పట్టించుకుంటున్నారా? మన సాహిత్యమంతా ఎవరికోసం?’’ అని ప్రశ్నించాడు. ఇంగ్లాండులోని సామాన్యులు అర్థం చేసుకొనే స్థాయిలో డీన్ ఫరారు రాసిన ‘క్రీస్తు చరిత్ర’ను ఆయన ఆదర్శంగా చూపించేవాడు. గుజరాతీ ఇండియన్ ఒపీనియన్‌లో ఆయన చాలామంది ప్రఖ్యాత వ్యక్తుల గురించి సంక్షిప్త చరిత్రలు రాసేవాడు. ఆయన అభిమాన కవి, తత్వవేత్త రాయ్‌చంద్ భాయి జీవిత చరిత్ర రాయమని అన్నపుడు ‘‘ఆయన జీవిత చరిత్ర రాయాలంటే నేను ఆయన నివసించిన ఇల్లు, ఆటస్థలం చూడాలి. ఆయన స్నేహితులతో, బంధువులతో, అనుచరులతో మాట్లాడాలి’’ అన్నాడు. అంటే ఇక్కడ కూడా ఆయన సత్యంమీదే ఆధారపడదామనుకున్నాడు కానీ కల్పన మీద కాదు.
గాంధీ తరచుగా భారతీయ పురాణాల నుంచి, రాముడు, కృష్ణుడు, మహ్మద్‌ల జీవితాలనుంచి సంఘటనలను, ఉదాహరణలను, నీతులను ఉటంకిస్తూ ఉండేవాడు. దానితో ఆయన భావాలు సామాన్య ప్రజలకు తేలికగా అర్థమయ్యేవి. వారి హృదయాలను హత్తుకొనే శక్తి ఆయన మాటలకు లభించేది. అంటరానితనం, రాళ్ళతో కొట్టి చంపడం, తెల్లవాళ్ల దురుసుతనం వంటి వాటిని విమర్శించడంలో ఆయన చూపించే ధైర్యం, స్వార్థంతో దిగజారిపోతున్న కాంగ్రెస్ నాయకులను తెల్లబట్టల గూండాలతో పోల్చడం వంటివి ఘాటుగా, దిశా నిర్దేశంగా ఉండేవి. ‘‘సత్యం అనే ఆదర్శం చాలావరకూ పాశ్చాత్య దేశాలలో పుట్టినదే’’ అని లార్డ్ కర్జన్ అన్న మాటలను ఖండించడానికి ఆయన రామాయణ భారతాలు, వేదాలు, పురాణాలలోంచి అనేక ఉదాహరణలు చూపి భారతదేశంలో సనాతన కాలం నుంచి సత్యాన్ని దైవ స్వరూపంగా ఆరాధిస్తున్నారని నిరూపించాడు. ఒక ఇంగ్లీషు పెద్దమనిషిగా కర్జన్ తన ఆధారం లేని అవమానకరమైన మాటలను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. ఒకసారి ఆయన ‘‘మహ్మద్, ఆయన ప్రవచించిన శాంతి సందేశం ఎక్కడున్నాయి? ఇప్పుడు కానీ మహమ్మద్ భారతదేశం వచ్చి చూస్తే ఆయన అనుచరులమని చెప్పుకొనే చాలామందిని తిరస్కరించి, నన్ను నిజమైన క్రైస్తవునిగా గుర్తిస్తాడు. పాశ్చాత్య దేశాలలో క్రైస్తవం మాయమయ్యింది. అది అమలులో ఉండి వుంటే ప్రపంచ యుద్ధాలు ఎందుకు వస్తాయి?’’ అన్నాడు.
ఒక సందర్భంలో ‘‘కవి తాను సొంతంగా సృష్టించుకున్న ఊహా ప్రపంచంలో బందీగా ఉంటాడు’’ అన్నాడు గాంధీ కానీ ఎవరో సృష్టించిన రాట్నానికి ఆయన తన్ను తాను బందీగా చేసుకొన్నాడు. గాంధీ ఆలోచనలు, భాషలోని సౌందర్యం ఆనాటి కొందరు గొప్ప వ్యక్తులపై గాఢమైన ప్రభావం చూపింది. ఆయన రచనలలోని చాలా పేరాలు ఆయన అక్షరాలతో ఎంత సజీవమైన చిత్రాలను సృష్టించగలడో నిరూపిస్తాయి. ‘‘నేను మైసూరులో రాతిలో తొలిచిన ఒక ప్రాచీన దేవాలయంలో నాతో మాట్లాడుతోందా అనిపించేంత సహజంగా వున్న చిన్న విగ్రహాన్ని చూసాను. అది తను దుస్తులను సర్దుకుంటూ వున్న ఒక అర్ధనగ్న స్ర్తి ప్రతిమ. తేలు రూపంలో పాదాల వద్ద పడి వున్న మన్మథుని బాణాల నుంచి తప్పించుకొనేందుకు ఆమె ప్రయత్నిస్తోంది. ఆమెలో వున్న వేదనను, తేలు కుట్టిన బాధను నేను చూడగలిగాను’’- ఇది గాంధీ రాసిన ఒక పేరా.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధి నెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614