Others

ఆంగ్లంపై వ్యామోహం.. స్వాతంత్య్ర స్ఫూర్తికి విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాథమిక స్థాయి నుండి ఆంగ్లభాషను మాధ్యమంగా చేయదలచుకుని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు ఏవేవో గగన కుసుమాల్ని చూపిస్తూ ఆంగ్లభాషపై మోజును పెంచడం దురదృష్టం. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి రాజకీయ ప్రముఖులు వారి పిల్లలను ఏ మాధ్యమంలో చదివించారో ఆలోచించాలని ప్రజలను రెచ్చగొట్టి, ఆంగ్ల మాధ్యమాన్ని ఎలాగైనా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు కనబడుతోంది. ప్రజలు కోరుతున్నారు కనుక మన విధానాలను ఇలా మార్చుతున్నాననేవారు నాయకులెలా అవుతారు? పరాయి పాలనలో మనం ఏమి కోల్పోయాము? దేశ ఉజ్వల భవిష్యత్తుకు ఏ విధానాల్ని అనుసరించాలని ఆలోచనగల వాడే దూరదృష్టిగల నాయకుడు.
దేశ స్వాతంత్య్రం కోసం అలనాడు త్యాగాలు చేసిన నాయకులు స్వాతంత్య్రానంతరం పాలనాధికారంపై ఆశలు పెట్టుకున్నారేకాని, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలని తగినంతగా ఆలోచించినట్లు లేదనిపిస్తోంది. పర్యవసానంగా దేశంలో అనేక వ్యవస్థలు కుంటుపడ్డాయి. అందులో విద్యావ్యవస్థ ఒకటి. ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వాటిలో చదువు సరిగా వ్యవస్థీకరింపబడలేదు. చాలా బడుల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు చిన్న పదాలను సైతం వ్రాయలేక పోతున్నారని, పదవ తరగతి విద్యార్థులు చిన్నపేరా డిక్టేషన్ చెప్తే మాతృభాషలో కాని, ఆంగ్లంలో కాని వ్రాయలేకపోతున్నారని పత్రికలలో చదువుతున్నాం. పాలకులకు విద్యాలయాల గౌరవాన్ని పెంచడం తొలి ప్రాధాన్యత కావాలి. ఇందుకు విరుద్ధంగా క్రమేపీ ప్రభుత్వ పాఠశాలల పరపతి తగ్గుతూ వస్తున్నది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలలు, వదాన్యుల ఔదార్యంతో నడిచే పాఠశాలలు ఉండేవి. మాతృభాషలోనే విద్యను అందించేవారు. మెకాలే తయారుచేసి, మనపై రుద్దిన విద్యావిధానమే శరణ్యమైంది.
మన రాజ్యాంగంలో 19(జి) ఆర్టికల్ ప్రకారం ప్రతి పౌరునికీ తను ఎంచుకున్న వృత్తిని చేపట్టడానికి హక్కును ప్రాథమిక హక్కులతో చేర్చారు. అందుచేత ఉద్యోగం దొరకని వ్యక్తి ప్రయివేటు పాఠశాలను పెట్టి విద్యను నేర్పించవచ్చు. తన పొట్టను పోషించుకోవచ్చు. ఏ కారణం వల్ల ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించినా, ఒకసారి ఉపాధ్యాయుడైన తర్వాత ఈ వృత్తికి అనుగుణంగా తన ప్రవృత్తిని మార్చుకోవాలి. 1) తాను నిరంతర అధ్యయనశీలి కావాలి. 2) విద్యగరపడం ద్వారా వ్యక్తి నిర్మాణం చేస్తున్నానని జ్ఞాపకముంచుకోవాలి. స్వామి వివేకానందుడు తెలిపినట్లు ప్రతి విద్యార్థిలో బీజ రూపంలోనున్న దైవత్వాన్ని వికసింపజేసి దివ్యపురుషునిగా తయారుచేస్తున్నాననే దృష్టికావాలి. 3. అధ్యాపక వృత్తిని వినియోగించుకుని విపరీతంగా ధనాన్ని కూడబెట్టకూడదని నిర్ణయించుకోవాలి. వీటిని మరచిపోవడం వల్లనే విద్య వ్యాపార వస్తువైంది. కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టుకొచ్చాయి.
తమ చిన్నారులకి మంచి విద్యనందించాలనే తహతహ తల్లిదండ్రులలో జాగృతమైంది. ఆస్తిపాస్తులను విక్రయించైనా తమ పిల్లలకు మంచి విద్యనందించేందుకు సిద్ధపడ్తున్నారు. ప్రయివేటు సంస్థలు మరొక లాభాన్ని విద్యార్థులకు చూపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు ఏదయినా తరగతిలో సంవత్సరాంత పరీక్షల్లో ఉత్తీర్ణులు కానివారికి విద్యాసంవత్సరం నష్టపోకుండా పై తరగతి చదివించి విశ్వవిద్యాలయాలలో మెట్రిక్ పరీక్షకు కూర్చోపెట్టేవారు. ఇది ఒక ఆకర్షణ. మెట్రిక్ పరీక్ష రాష్ట్ర ప్రభుత్వపు ఎస్.ఎస్.ఎల్.సి. (సెకండరీ స్కూల్ లీవింగ్ సర్ట్ఫికెట్)తో సమానంగా గుర్తింపు పొందింది. అలా విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధిని పొందుటకు ఉద్దేశించబడిన పాఠశాలల నుండి ప్రయివేట్ పాఠశాలలవైపు మొగ్గుచూపడం ప్రారంభించారు. ఈ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో తరగతులను నడిపి స్వతంత్ర భారత్‌లో ఎంతో విలువైన మన భాషల వికాసానికి వెన్నుపోటు పొడిచారు.
ఆంగ్లంపై ఇంత మోజుపెంచిన కారణంగా ఎన్నో ప్రయివేటు పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలో పుట్టుకువచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు వాసి తగ్గింది. మాతృభాషాభిమానంతో ప్రారంభించబడిన పాఠశాలలు ఆంగ్లమాధ్యమ పాఠశాలలతో పోటీపడి నిలవలేక పోతున్నాయి. ఆదాయం తక్కువ అవడంవల్ల క్రమంగా అవి మూతబడడమో లేక ఆంగ్లభాష మాధ్యమానికి మార్చుకోవడమో జరిగింది.
విద్యార్థులకు అందుబాటులో మాతృభాషలో నడుస్తున్న మంచి పాఠశాలలు ఎక్కడున్నాయో ముఖ్యమంత్రి జగన్ చెప్పాల్సి ఉంది. తెలుగు మాతృభాషగా నడిచే పాఠశాలలు మూతపడడానికి గత 70 సంవత్సరాల నుండి ప్రభుత్వాలు, పాలకులు కారణం కాదా? ‘బీదవారు ఆంగ్ల మాధ్యమంలో చదువుకోనవసరం లేదా?’ అని ఇప్పుడు కొందరు మేధావులు వాదిస్తున్నారు. పేద, ధనిక అనే తేడాలేకుండా అందరూ ప్రాథమిక స్థాయి నుండి మాతృభాషా మాధ్యమంలోనే చదువుకోవాలి. ఆరవ తరగతి తర్వాత ఆంగ్లభాషకు అదనపు పీరియడ్‌లు, నాన్ డిటైల్డ్ పాఠ్యగ్రంథాలు పెట్టి, స్పోకెన్ ఇంగ్లీషు, మంచి ఇంగ్లీషు నేర్పే ఏర్పాటుచేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
‘మాతృభాషలు తిండిపెట్టవు.. ఉద్యోగావకాశాలు ఆంగ్లమాధ్యమంలో చదువుకుంటే వస్తాయి..’ అనే వాదనను కొందరు తెరపైకి తెస్తున్నారు. భాష ఎవరికీ తిండి పెట్టదు. శాస్ర్తియ పరిజ్ఞానం, సాంకేతికత వంటివి ఉద్యోగాల్ని కల్పిస్తాయి. సరైన పారిశ్రామికీకరణ విధానాన్ని ప్రభుత్వాలు అమలుచెయ్యాలి. ఉన్న వృత్తుల్ని, ఉద్యోగాలను పోగొట్టే పారిశ్రామికీకరణ మనకి వద్దు. కొత్త పరిశ్రమల ద్వారా ఉద్యోగావకాశాలు ఏర్పడితే వాటిని స్వీకరించి ప్రవేశపెట్టాలి.
నేడు ‘అందరికీ విద్య’ అన్న లక్ష్యాన్ని చేరుకొనేందుకు ప్రభుత్వాలు, సమాజం పనిచేస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను సాధ్యమైనంత తక్కువ వయస్సులోనే బడికి పంపడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రభుత్వం 5 ఏళ్ల వయసు తర్వాతనే పిల్లలను బడిలో ప్రవేశపెట్టడానికి తగిన విధానమని నిర్ధారించింది. చాలా ప్రయివేటు సంస్థలు ప్రీ ప్రైమరీ లేక కిండర్ గార్టెన్ స్కూల్స్ ప్రారంభించి, వాటిలో చిన్నారులను మూడేండ్ల వయస్సులోనే చేర్చుకోవడం ప్రారంభించాయి. ప్రభుత్వాలు ఈ తరహా పాఠశాలలను పట్టించుకోనూ లేదు. ఆ స్థాయి విద్యకుకావలసిన ప్రణాళికను గూర్చి ఆలోచించనూ లేదు. తల్లిదండ్రుల కోర్కెలను ప్రైవేటు పాఠశాలలు నెరవేర్చడం చూస్తున్నాం. నిజానికి ఈ పాఠశాలల్లో క్రమబద్ధం చేయబడిన బోధన ఉండరాదు. అవి చిన్నారులు ఆడుకోవడానికి, బడికి వెళ్ళే అలవాటును కలిగించడానికి ఉద్దేశించబడ్డాయి. కాని అందుకు భిన్నంగా నేడు ఆంగ్ల అక్షరాలను, ఆంగ్లంలో రైమ్స్‌ను నర్సరీ పాఠశాలల్లోని పిల్లలకు నేర్పుతున్నారు. దీనినే తల్లిదండ్రులు ఉత్తమమైన విద్యగా భావిస్తున్నారు. నిజానికి ఇది ఆంగ్లంపై మోజును పెంచే విధానం. ఒకసారి నర్సరీ బడులలో చేర్చబడిన విద్యార్థులు పై స్థాయి వరకు ఆంగ్లమాధ్యమంలోనే చదువును కొనసాగిస్తారు. ఆ విధంగా ఆంగ్లభాషా వ్యామోహానికి బందీలైపోతున్నారు.
ఆర్‌టిఇ (విద్యార్జన హక్కు) కూడా ఐదు నుండి 14 ఏళ్ల మధ్య బాల బాలికలకు ఉద్దేశించబడినది. నర్సరీ చదువు అందులోకి రాదు. ప్రభుత్వాలు నర్సరీ చదువును గుర్తించాలి. అంటే అన్ని గ్రామాల్లో నర్సరీ పాఠశాలల్ని ప్రారంభించమని కాదు. నడుస్తున్న నర్సరీ పాఠశాలల్లో వ్రాయడం, చదవడం కాక సంస్కారమిచ్చే పాటలు, పద్యాలు, ఆటలు నేర్పుతున్నారా? ఆంగ్లాన్ని దగ్గరకు రానీయకుండా మాతృభాషలో మాట్లాడడం, అర్థం చేసుకోవడంలో శిక్షణనిస్తున్నారా? అన్న విషయాలపై శ్రద్ధవహించాలి.
ప్రయివేటు నర్సరీ పాఠశాలల్లో పోటీపడి ఆంగ్లంపై మోజు పెంచుతున్నారు. ఆరు నెలల్లోపు నాలుగు రకాల ఏబీసీడీలను నేర్పుతాము, చక్కని రైమ్స్ నేర్పుతామని పోటీ పడుతున్నాయి. ఏమిటీ ఆ రైమ్స్? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్‌స్టార్, బాబా బ్లేక్ షీపీ, రైన్‌రైన్ గో ఎవే, హంప్టీ డంప్టీ సేట్ ఆన్ ఎ వాల్ వంటివి ఇంగ్లండులోనే అవుట్ డేటెడ్‌గా, నేడు ఇర్రిలవెంట్‌గా భావించి తొలగించబడినవి ఇక్కడ నేర్పుతారు. దీని ఉద్దేశం ఆంగ్లభాషపై మోజు పెంచడం మాత్రమే. మాతృభాషలో తమ పిల్లలకి విద్యనీయదలచిన తల్లిదండ్రులకు కూడ దగ్గరలో తెలుగు విద్యనిచ్చే మంచి పాఠశాలల్లేక పోవడంతో పిల్లలను ఆంగ్లపాఠశాలలకు పంపడం అనివార్యవౌతున్నది. ప్రపంచ దేశాలన్నిటిలో మాతృభాషలోనే విద్యను గరపుతున్నప్పుడు ఆంధ్రలోనే ఆంగ్లభాషలో విద్యను ప్రాథమిక స్థాయినుండి నేర్పడం అనుచితం. ప్రాథమిక స్థాయిలో ఆంగ్లమాధ్యమం అనే తలంపు మాని, మాతృభాషను అనివార్యం చేయాల్సిన అవసరం ఉంది.

-ఆచార్య దుగ్గిరాల విశే్వశ్వరం 94401 56018