Others

వినువీధిలో క్షీర సాగర శయనుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాసశివరాత్రి పేరున సంవత్సరంలో ప్రతినెలా వచ్చే కృష్ణ త్రయోదశినాడు శివారాధన చేసే శైవులకు మాఘమాసంలో వచ్చే శివరాత్రి ఎంతటి మహా పర్వదినమో శుద్ధ ఏకాదశులలో విష్ణ్వారాధన చేసే వైష్ణవులకు పుష్య ఏకాదశి అంతటి మహా పర్వదినం. దీనికే వైకుంఠ ఏకాదశి అన్న పేరు కూడా ప్రసిద్ధమైయుంది. కారణం ఆకాశంలో ప్రత్యక్ష దైవంగా సూర్యనారాయణుడు ప్రతిదినమూ దర్శనమిస్తున్నట్లుగా వైకుంఠవాసి అయిన శ్రీమన్నారాయణుడు స్వధామమై వైకుంఠంతో సహా లోకానికి ప్రత్యక్ష దర్శనభాగ్యాన్ని ప్రసాదించే సంవత్సరంలో ఏకైక మహాపర్వదినం పుష్య శుద్ధ ఏకాదశి కావడమే. దీనినే ముక్కోటి ఏకాదశీ అనీ అన్నారు. ఈనాడు దర్శనమిచ్చే విష్ణుస్వరూపం. భిన్న భిన్న రూపాలుగా సంవత్సరంలోని పండ్రెండు శుద్ధ ఏకాదశులలోని ఐదు ఏకాదశులలో నింగిలో సాక్షాద్దర్శనమవుతుంది. ఆ శ్రీహరి ఐదు రూపాలను వైష్ణవులు ఐదు పర్వదినాలుగా భక్తిగా ఆచరిస్తారు. అవి -
1.ఆషాఢ శుద్ధ ఏకాదశి -
శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి
2.్భద్రపద శుద్ధ ఏకాదశి- పరివర్తన ఏకాదశి
3.కార్తీకశుద్ధ ఏకాదశి- బోధన ఏక్దశి లేదా ఉత్థాన ఏకాదశి.
4.మార్గశిర శుద్ధ ఏకాదశి - గీతాజయంతి
5.పుష్యశుద్ధ ఏకాదశి - వైకుంఠ ఏకాదశి
ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి వివిధ రూపాలుగా క్రమ వికాసం చెందుతూ ఈ వైకుంఠ ఏకాదశినాడు పరిపూర్ణంగా తూర్పున ఆకాశంలో దర్శనమిచ్చే ఈ విష్ణువు ఎవరు? అన్నది తెలుసుకోవాలంటే ‘బ్రహ్మసంహిత’ అనే గ్రంథాన్ని పరిశీలించవలసి వుంటుంది. ఇది నిజానికి నూరధ్యాయాల గ్రంథం. దీనిని చైతన్య మహాప్రభువు కేరళ పర్యటనలో ఉండగా ఈ గ్రంథాన్ని సేకరించారు. దురదృష్టమేమంటే ఆయనకు కూడా నూరు అధ్యాయాల పూర్తి బ్రహ్మసంహితా గ్రంథం లభించలేదు. కేవలం ఒక్క ఐదవ అధ్యాయమే లభించింది. అదే నేడు బ్రహ్మసంహిత అన్న గ్రంథంగా ప్రచారంలో ఉంది. కేవలం అరువది రెండు శ్లోకాలకు పరిమితమైన ఈ గ్రంథంలో నింగిలో దర్శనమిచ్చే క్షీర సాగర శయనుని గూర్చి ఎన్నో విషయాలు తెలుపబడ్డాయి.
సమస్త సృష్టి రచనాధ్యక్షుడు, సచ్చిదానంద స్వరూపుడు, త్రిగుణాతీతుడు అయిన పరమాత్మ శ్రీకృష్ణుడొక్కడే. ఆయన నివసించే అప్రాకృత లీలావిలాస భూమే గోలోకం. ఆ దివ్యధామంలో నిత్యమూ అనపాయినియై (ఎన్నడూ విడిచి యుండలేనిది) వర్తించే చిచ్ఛక్తి స్వరూపిణియైన శ్రీ రాధాదేవితో శ్రీకృష్ణ భగవానుడు క్రీడిస్తూ ఉంటాడు. సుదీర్ఘమైన మహాప్రళయ కాలానంతరం ఆత్మ వినోదార్థంగా ఆ శ్రీకృష్ణుని యందు సృష్టి సంకల్పం కలిగింది. ఫలితంగా ఆయన నా నుండి మూడు అవతారమూర్తులు క్రమంగా ఉద్భవించాయి. 1.కారణోదకశాయి 2.గర్భోదకశాయి 3.క్షీరోదకశాయి. ఈ మూడుమూర్తులు విష్ణు స్వరూపాలే. సమస్త సృష్టి ఈ మూర్తిత్రయం నుండే క్రమ వికాసం పొందింది. ఈ మూడు మూర్తులుగా యోగనిద్రను వహిస్తాడు శ్రీకృష్ణుడు. అంటే ఏమిటి అనపాయినిగా తనయందే అవ్యక్తంగా వున్న చిచ్ఛక్తితో కూడి సృష్టి రచనోన్ముఖుడు కావడమని అర్థం.
కారణోదకశాయి విష్ణువు
సృష్టిలో బీజరూపమైన జలధియే కారణోదక జలమైన ఈ జలధిలో యోగనిద్రను పొందే విష్ణువు (ఇతడు త్రిమూర్తులలోని విష్ణువు కాదు) కుడి పార్శ్వంనుండి హిరణ్యగర్భుడు (ప్రజాపతి), ఎడమ పార్శ్వం నుండి విష్ణువు (ఇతడు త్రిమూర్తులలోని విష్ణువు కాదు) కనుబొమలనుండి శంభువు ఉద్భవిస్తారు. ఈ సృష్టి ప్రథమ దశలో సృష్టి రచన చేసేది ఈ మువ్వురే. స్వభావతః ఈ సృష్టి జడాత్మకం.
గర్భోదకశాయి విష్ణువు
జడాత్మకమైన ఆ బ్రహ్మాండాలలో దివ్య చైతన్యాన్ని సృజియించేందుకు గోలోకవాసియైన శ్రీకృష్ణుడే మరల విష్ణువుగా అవతరిస్తాడు. ఆ సమయంలో తన శరీరం నుండి స్రవించిన స్వేదజలాన్ని జలధిగా చేసి శ్రీ మహాలక్ష్మీ సమేతుడై మరోసారి యోగనిద్రను వహిస్తాడు. ఈ దశలోని విష్ణువునే గర్భోదకశాయి విష్ణువుగా వ్యవహరింపబడుతున్నాడు. ఈయన నుండి హిరణ్యగర్భుడను ప్రజాపతి, మరియు శంభువు జనించి బ్రహ్మాండాలను దివ్య చైతన్యవంతం చేస్తారు. ఈ దిశలోనివే మనమందరం ఉన్నతంగా భావించే స్వర్గాది దివ్యలోకాలు. సృష్టి రచనలో ఇది ద్వితీయ దశ.
క్షీరోధకశాయి విష్ణువు
ఆ దివ్యలోక సృష్టి రచనతో తృప్తి చెందని గోలోక కృష్ణుడు చైతన్యవంతమైన జీవలోక సృష్టికై మరల క్షీరోదకాన్ని సృజించాడు. అందుకు మహాలక్ష్మితో కూడి జీవ సృష్టికొరకై యోగనిద్రను వహిస్తాడు. మూడవది అయిన ఈ విష్ణ్వావతారమే క్షీరోదకశాయి విష్ణువుగా బ్రహ్మసంహిత పేర్కొంటూంది. ఈ దశలో విష్ణువు నాభి కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మ, ఆయన కనుబొమలనుండి సృష్టి సహాయకుడుగా ‘రుద్రుడు’ జనించి అనంతకోటి జీవసృష్టి రచనను చేస్తారు.
తొలి ఏకాదశి నాడు విష్ణువు యోగనిద్రకు పూనుకొంటాడని వైష్ణవులు చెప్పేమాట గోలోకవాసియైన శ్రీకృష్ణుని ఈ త్రివిధ విష్ణ్వావతారాలే. మొదటి రెండూ దివ్యలోక సంబంధమైనవి కాబట్టి మానవుల చర్మ చక్షువులకు అగోచరమైనవి. ఇక జనులకు గోచరమయ్యేది మూడవ క్షీరోదకశాయియన విష్ణువే. ఈయనయే వివిధ ఏకాదశీ తిథులలో శయన, పరివర్తన, ఉత్థాన మూర్తులుగా వినువీధిలో దర్శనమిస్తూ సకల జనులచే ఆరాధింపబడుతున్న వైకుంఠవాసియైన శ్రీమహావిష్ణువు.
నింగిలో విష్ణు మండలం
పైన పేర్కొనబడిన ఆ విష్ణురూపాలన్నీ యోగనిద్రా సమయంలో వైకుంఠ లోకంలో సంభవించేవని ఇంతకాలం మేము నమ్ముతున్నాం. మరి ఇప్పుడు ఆకాశంలోనే జనులందరికి దర్శనమిచ్చే విష్ణురూపాలని నేను చెబుతుంటే మీ కాశ్చర్యం కలగడం సహజం. కాని ఇది నిజం. కానరాని అనంత దూరంలో విష్ణు నివాసమైన వైకుంఠలోకముందని సహజంగా అందరూ భావిస్తూ ఉంటారు. కాని ఆ వైకుంఠం ఆకాశంలో మనకు కనబడే లోకమే. అది భూలోకంలోని నగరాల వలె భౌతిక పదార్థాలతో నిర్మింపబడినట్టిది కాదు. అందు నివసించే దేవతలు కూడా మనవలె పంచభూతాల చేత నిర్మింపబడిన శరీరాలు కలవారు కారు. వారు, వారి లోకాలు దివ్యాలు. అంటే కాంతి స్వరూపాలు. వేదంవారిని వర్ణిస్తూ ‘నక్షత్రాణి రూపం. అహోరాత్రే పార్శ్వే’ అని నిర్దేశించింది. నక్షత్రాలు కాంతిమయమైనవియే కదా. అలాంటి నక్షత్ర రూపమైన వైకుంఠలోకం మనకు కనబడే ఆకాశంలోనే ఉంది. అదే అశ్వని, భరణి మొదలైన ఇరువది యేడు నక్షత్రాలలో స్వాతి నుండి శ్రవణా నక్షత్రం వరకుగల ఎనిమిది నక్షత్రాల మధ్య ఉత్తరాకాశంలో వ్యాపించిన వైకుంఠుని విష్ణులోకం. దీనిని మనం సులభంగా గుర్తించవచ్చు. ఊర్థ్వోత్తరంగా సప్తర్షి మండలం, పడమరగా స్వాతి నక్షత్రం, తూర్పున బ్రహ్మలోక నక్షత్రం (ఎప్సిలాన్), దక్షిణ దిశగా సర్వదైవత్యమైన ఆశే్లషా నక్షత్రం, ఈ విష్ణులోకానికి చుట్టూ ప్రకాశిస్తూ ఉంటాయి.
విష్ణుమండలాన్ని గుర్తించే మరొక విధానముంది. అదేమంటే- ఈ లోకం ధృవ నక్షత్రమండలానికి ఉత్తరంగా కనబడుతుంది. ఆ దిశలో ఋక్షాకారంలో (ఎలుగుబంటి) రెండు నక్షత్రాలున్నాయి. మొదటిది పెద్ద ఋక్షము (అర్సామేజరు), రెండవది చిన్న ఋక్షం (అర్సామైనరు). ఈ రెండింటిలో పెద్ద ఋక్ష సమీపంగానే సప్తర్షి మండలముంది. దీనికి ఊర్థ్వోత్తరంగా విష్ణుమండలముంది.ఈ విష్ణుమండలానికి చివరగా శ్రవణా నక్షత్రముంది. ఈ నక్షత్ర సమూహం ఒక గరుడపక్షి ఆకారంలో కనబడుతుంది. ఇది చివరగా ఉన్న కారణంగా విష్ణులోకమంతా ఈ శ్రవణా నక్షమ్రీద నిలబడి ఉన్నట్లు చూడగానే అనిపిస్తుంది. అందుకే విష్ణువు గరుడవాహనుడు అని ప్రసిద్ధి వహించాడు.
ఇక స్వాతీ నక్షత్రం. ఇది వాయు దైవత్వం. ఖగోళంలో ఇది వానరాకారంలో దర్శనమిస్తుంది. అందుచేతనే వానరాకారంలో నున్న వాయుదేవుని చేత శ్రీమహావిష్ణువు సేవింపబడుతూ ఉంటాడు. వానరాకారంలో రాముణ్ణి సేవించిన హనుమ దీనికి ప్రతీకయే. చివరగా ఆశే్లషా నక్షత్రం. ఇది సర్ప దైవత్వం. ఇది విష్ణు మండలానికి తూర్పున ఉంటుంది. విష్ణువునకు శయ్యగా మరియున్న ఆదిశేషువు ఈ నక్షత్ర రాశియే. పాశ్చాత్యులు సర్పెన్స్‌గా వ్యవహరించేది దీనినే. విష్ణువు నాభినుండి జనించిన పద్మంలో బ్రహ్మ జన్మించాడన్నది సర్వపురాణ ప్రసిద్ధం. బ్రహ్మసంహిత కూడా ఈ మాటనే చెప్పింది. ఈ బ్రహ్మ కూడా విష్ణు మండలానికి ఉత్తరంగా పైన దివ్య కాంతితో ప్రకాశించు ఒక నక్షత్ర మండలమే. దానినే శాస్తజ్ఞ్రులు రింగ్ నెబ్యులా అని పేర్కొంటారు. దానిమధ్యలో ఎప్సిలాన్ అనే గ్రీకు అక్షరాకారంలో ఒక నక్షత్రముంది. దానిని సూక్ష్మంగా పరిశీలిస్తే అది ఒక నక్షత్ర మండలం కాదు. నాలుగు నక్షత్ర మండలాలు. ఈ నాల్గు నక్షత్రాల మండలమే చతుర్ముఖ బ్రహ్మ.
తొలి ఏకాదశి
బ్రహ్మసంసిత క్షీరోదకశాయి విష్ణువుగా పేర్కొన్నది ఈ విష్ణు నక్షత్ర మండలమే. ఈ నక్షత్ర మండలమంతా ఆకాశంలో ఉత్తర దిక్కుగా కనబడే రోజు ఆషాఢశుద్ధ ఏకాదశి. మొట్టమొదటగా కనబడటం చేత ఆ రోజు తొలి ఏకాదశిగా ప్రసిద్ధి వహించింది. సన్న్యాసులు చాతుర్మాస్య వ్రతాన్ని ఆరంభించేది ఈ రోజునే.
పరివర్తన ఏకాదశి
ఉదయించి దర్శనమిచ్చిన ఆ విష్ణు నక్షత్ర మండలం ఎల్లప్పుడూ ఆ ఉత్తర దిక్కునే ఉండడు. క్రమంగా సంచరిస్తూ పడమటి దిక్కున అస్తమిస్తుంది. అలా ఉత్తరం నుండి పడమరకు చేరడానికి రెండు నెలల కాలం పడుతుంది. అంటే భాద్రపద శుక్ల ఏకాదశినాడు పడమర అస్తమిస్తూ కనబడుతుంది. ఇలా ఉత్తరం నుండి పడమరకు చేరి అస్తమించడానికి విష్ణువు యోగనిద్రలో ఒక ప్రక్కనుండి మరో ప్రక్కకు ఒత్తిగిలి పడుకొన్నాడని భావించి ఆ రోజును పరివర్తన ఏకాదశిగా భక్తులు వ్యవహరించారు.
ఉత్థాన ఏకాదశి
చిత్రమేమంటే మరో రెండు నెలలకే అంటే కార్తీకశుద్ధ ఏకాదశి నాడు ఆ విష్ణు మండలం తూర్పు దిక్కున ప్రకాశిస్తూ కనబడుతుంది. ఆ సమయంలో విష్ణువు శిరస్సు దర్శనమిస్తుంది. ఆ కారణంగా విష్ణువు యోగనిద్రనుండి మేల్కొన్నాడని తలంచి ఉత్థాన ఏకాదశిగా భక్తితో వైష్ణవులు విష్ణ్వారాధన చేస్తారు.
గీతాజయంతి
సహజంగా సంచారం చేస్తూ మరో దిశకు చేరుకోవలసిన విష్ణు మండలం నెల రోజులు గడిచినా తూర్పు దిక్కునే ఉండి క్రమంగా పైపైకి సంచారం చేస్తుంది. అందువల్ల ఉత్థాన ఏకాదశి నాడు కనపడే విష్ణువు శిరోభాగ నక్షత్రాలతోబాటు నడుము భాగ పర్యంతంగల విష్ణు దర్శనమవుతుంది. అదే మార్గశిర శుద్ధ ఏకాదశి తిథి. ఆ రూపం రథంమీద కూర్చుని అర్జునుడికి గీతోపదేశం చేసే జగద్గురువు శ్రీకృష్ణుని రూపంగా అందరికి తలపిస్తూ ఉంటుంది. అందుకే ఆనాడు గీతా జయంతిని దేశమంతటా వైభవంగా భక్తులు జరుపుకొంటారు.
వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి
మార్గశిర శుద్ధ ఏకాదశినాడు నడుము భాగం వరకు దర్శనమిచ్చిన విష్ణువు నక్షత్ర మండలం మరో నెల వరకు అంటే పుష్యమాసం శుద్ధ ఏకాదశినాటివరకు ఏ దిక్కువైపునకు సంచారం చేయక తూర్పు దిక్కునే ఉండి మరింత పైపైకి పయనించి పైన పేర్కొన్నట్టి సంపూర్ణ విష్ణు నక్షత్ర మండలమంతా కనులకు గోచరిస్తుంది. అంటే నఖశిఖ పర్యంతం పరిపూర్ణ విష్ణు స్వరూప దర్శన భాగ్యం వైకుంఠ లోక నక్షత్ర సమేతంగా (శ్రవణ, స్వాతి, సప్తర్షి మండలం- అర్సామేజరు, ఆశే్లష) భూలోక వాసులకు సిద్ధిస్తుంది. ఇలా వైకుంఠథామంతో సహా పరిపూర్ణ విష్ణు దర్శనం కలిగే పుష్యశుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా లోకప్రఖ్యాతి పొందింది. ఈ కారణంగానే తక్కిన నాలుగు ఏకాదశులలో కంటె విశేష భక్తి ప్రపత్తులతో విష్ణ్భుక్తులు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. ఆనాటినుండి విష్ణు నక్షత్ర మండలం క్రమంగా ఉత్తర దిశాభిముఖంగా సంచారం చేసి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఉత్తరాకాశంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అందుకే విష్ణ్వాలయాలలో ఆనాడే ఉత్తర ద్వారాలు తెరుస్తారు. ఆ ద్వారాల గుండా భక్తజనులు ప్రవేశించి బయటకు వస్తారు. దీనర్థం ఉత్తర దిశాభిముఖంగా ప్రయాణించే విష్ణువు వెంట నడిచి భక్తితో సాగనంపడమే. ఈ సాగనంపటాన్ని భక్తులు ఒక దివ్యానుభూతిగా భావిస్తారు.
దేవతాకారంలో ప్రకాశిస్తూ నింగిలో సంచరించే నక్షత్ర మండలాలెన్నిటినో మహర్షులైన ప్రాచీన శాస్తజ్ఞ్రులు వేల ఏండ్ల క్రితమే కనుగొన్నారు. ఆ తర్వాత ప్రాచీన గ్రీకు శాస్తజ్ఞ్రులు, చైనా శాస్తజ్ఞ్రులు ఎందరెందరో శాస్ర్తియ పరిశోధనల ద్వారా కనుగొన్నారు. కాని మన వేద మహర్షులు ఒక అడుగు ముందుకు వేసి ‘‘తూర్పున ఆకాశంలో ఏ దేవతాకారంలో నక్షత్ర మండలముదయిస్తుందో అదే రోజున ఆ దేవతాకారాన్ని ఆరాధించాలని’’ ఋగ్వేదంలో స్పష్టంగా చెప్పారు. ఇలా జ్యోతి (నక్షత్ర)రాకారంలో ప్రకాశిస్తూనే దేవతాకారాన్ని ఆరాధించమని చెప్పడం ద్వారా విగ్రహారాధనను కాక కేవలం నిర్గుణారాధనను మాత్రమే వేదర్షులు ప్రధానంగా ఆదేశించారని ఎవరికైనా సులభంగా బోధపడుతుంది. అంతేగాక దైవారాధనకు విశిష్టమైన వైజ్ఞానిక ప్రామాణ్యాన్ని, వేదప్రామాణ్యాన్ని ప్రవచించిన వేదర్షులకు ఇవే కోటి కోటి దండాలు.

-పాలకోడేటి జగన్నాథరావు 9490620512