Others

కూర్చున్న చెట్టునే నరుకుతున్నారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల వారు, సూడో సెక్యులరిస్టులు, మేధావులుగా చెలామణి అయ్యే ‘లిబరల్స్’ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధపడుతున్నారు. దేశ ప్రయోజనాలను కాపాడే బిల్లులను వ్యతిరేకించడంలోనే కాదు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకల చర్యలను సమర్ధించేందుకు వీరంతా పడరానిపాట్లు పడుతుంటారు. దేశాన్ని వెయ్యిముక్కలు చేయాలని పిలుపునిచ్చే కన్నయ్య కుమార్‌లను వీరు అక్కున చేర్చుకుంటారు. మక్బుల్ భట్, అఫ్జల్ గురు, కసబ్, యాకూబ్ మెమన్‌ల ప్రతిరక్తపు బొట్టునుండి ఉగ్రవారసులు పుట్టారని కలలుకనే కంసులకు మద్దతునిస్తారు. ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పట్ల విషం చిమ్ముతున్నారు. ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకంగా లేదు, వారికి సంబంధించిందే కాదు అని ఢిల్లీ జామామసీదు ఇమాం బుఖారి లాంటి ముస్లిం మతపెద్దలు మొత్తుకుంటున్నా కాంగ్రెస్-కమ్యూనిస్టు మేధావుల చెవికెక్కడం లేదు. ముస్లింలను ఈ దేశం నుంచి వెళ్లగొట్టడానికే మోదీ, అమిత్ షాలు కుట్ర పన్నుతున్నారంటూ, సీఏఏతో పాటు ఎన్‌ఆర్సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) అమలుచేస్తే వారు వెళ్లిపోవాల్సిందేనని అపోహలు సృష్టిస్తున్నారు.
పాకిస్తాన్ ఏర్పడే నాటికి అక్కడ 20 శాతానికి పైగా ఉన్న హిందూ తదితర మతాలకు చెందిన జనాభా నేడు 1.9 శాతానికి పడిపోయింది. ‘హిందూ ముస్లిం భారుూ భారుూ’ అన్న జిన్నా కపట మాటలను నమ్మి, అంబేద్కర్ సమకాలీన దళిత నేత జోగేంద్రనాథ్ మండల్ కూడా పాక్ చేతిలో మోసపోయాడు. జోగేంద్రనాథ్ పాక్ తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. హిందువులు, సిక్కులు, బౌద్ధులు తదితర మైనారిటీలపై పాక్‌లో ముస్లింలు జరిపిన మారణకాండలో 10 లక్షల మందికి పైగా మరణించారు. ఆడపిల్లలను ఎత్తుకుపోయారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఊళ్లకు ఊళ్లను తగులబెట్టారు. 400 దేవాలయాలను ధ్వంసం చేశారు. బలవంతపు మత మార్పిడులు మానవతకు మచ్చగా మిగిలాయి. 1947 సెప్టెంబర్ 20న మహాత్మా గాంధీ- ‘పాక్‌లో నివసిస్తున్న హిందువులు, సిక్కులు తదితరులు అక్కడ సుఖంగా నివసించలేకపోతే వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిరభ్యంతరంగా భారత్‌కు రావచ్చు వారు మన సోదరులే..’ అన్నారు. సర్దార్ పటేల్, మొదటి రాష్టప్రతి రాజేంద్రప్రసాద్, నెహ్రూ కూడా ఇదే అభిప్రాయాలను వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా శరణార్థులకు భద్రతనిచ్చి వారిని అక్కున చేర్చుకుంటామని తీర్మానించింది. పాక్ పెట్టే చిత్రహింసలకు అనేకమంది భారత్ శరణుజొచ్చారు. దళితులను భారత్‌కు వెళ్లనివ్వమని, వారు వెనక్కి వెళితే మా కరాచీ నగరం చెత్తతో నిండిపోతుందని, ఇక ఎవరు శుభ్రం చేస్తారని అప్పటి పాక్ ప్రధాని లియాకత్ అలీ ప్రశ్నించారు. పాక్‌లో అఘాయిత్యాలను చూడలేక ఆ దేశ న్యాయశాఖ మంత్రి జోగింద్రనాథ్ మండల్ భారత్‌కు శరణార్థిగా వచ్చారు. పాకిస్తాన్ తన న్యాయశాఖ మంత్రికే అన్యాయం చేసింది. 1950లో మన ప్రధాని నెహ్రూ, పాక్ ప్రధాని లియాకత్ నడుమ ఒప్పందం జరిగింది. శరణార్థులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దు, ఎత్తుకుపోయిన స్ర్తిలను, దోచుకున్న సొత్తును తిరిగి ఇవ్వాలి, బలవంతపవు మత మార్పిడులకు గుర్తింపునివ్వరాదు, మైనారిటీల హక్కులను కాపాడాలని ఒప్పందం కుదిరింది. కాని పాకిస్తాన్ వీటిని అమలుపరచలేదు. 1964లో అప్పటి కేంద్రమంత్రి స్వరణ్‌సింగ్ పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, నెహ్రూ-లియాకత్ ఒప్పందాన్ని పాక్ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. 1950లోనే నెహ్రూ పాకిస్థాన్ నుండి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇస్లాం అవసరమైతే చట్టాన్ని మారుస్తామని అది మన బాధ్యత అని పార్లమెంట్‌లో ప్రకటించారు. 1964లో సీపీఐ నేత భూపేశ్ గుప్తా పాకిస్తాన్‌లోని మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ వారి భద్రత పట్ల మనం బాధ్యత నుండి తప్పించుకోలేమని అన్నారు.
2013లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు మన్మోహన్ సింగ్ శరణార్థుల పౌరసత్వం గురించి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 2012లో సిపిఎం నాయకుడు అప్పటి ప్రధానికి రాసిన లేఖలో మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అడిగిన శరణార్థులకు పౌరసత్వం విషయంలో మీరెందుకు చర్యలు తీసుకోవడంలేదని, మీరు వెంటనే పాక్‌నుండి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా అన్ని పార్టీల నాయకులు ఆయా సందర్భాలలో మాట్లాడిన అంశానే్న పౌరసత్వ చట్టసవరణ రూపంలో నేడు మోదీ సీఏఏను తెచ్చారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్‌ల నుండి మెజారిటీ మతస్థుల చేత తరిమేయబడ్డ హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్సీ, క్రిస్టియన్ మతస్థులకు పదకొండేళ్ల నిబంధనకు బదులుగా 5 ఏళ్లకు పౌరసత్వాన్ని ఇచ్చేవిధంగా పౌరసత్వ సవరణ చట్టం-2019(సీఏఏ)ను కేంద్రం తెచ్చింది. మేధావులుగా చెలామణి అయ్యేవాళ్లు, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఎమ్‌ఐఎమ్ పార్టీల రాజ్యాంగంపై దాడి జరిగిందంటూ, మన సెక్యులరిజం ప్రమాదంలో పడిందని, పొరుగు దేశాల నుండి వచ్చే ముస్లింల పట్ల వివక్ష చూపుతున్నారని, ముస్లింలను ఈ దేశం నుండి వెళ్లగొట్టడానికే కేంద్రం కుట్ర పన్నుతున్నదని నానా యాగీ చేస్తున్నారు. విపక్ష పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ముస్లింలలో అనుమానపు విషబీజాలు నాటుతున్నారు.
చట్టబద్ధ డాక్యుమెంట్లు, పాస్‌పోర్టు, వీసాలతో నిత్యం అనేకమంది పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్‌నుండి, ఆప్ఘనిస్థాన్ నుండి వస్తున్నారు. వారిలో కొంతమంది చట్టబద్ధంగా భారత పౌరసత్వాన్ని పొందే వీలుకూడా ఉంది. దానిని మోదీ తొలగించలేదే? ఈ దేశాన్ని అస్థిరత్వం పాలుజెయ్యాలని ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మార్చాలని అస్సాం, పశ్చిమ బెంగాల్‌లకు వలస వచ్చే అక్రమ వలసదారులకు పౌరసత్వం ఇవ్వాలా? మన పార్లమెంట్‌పై దాడులకు కుట్ర పన్నిన అఫ్జల్ గురు అనుచరులకు పౌరసత్వం ఇవ్వాలా?
1995లో ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్’ (ఎన్‌ఆర్‌సి) రూపంలో ఎవరెవరు భారత పౌరులనే పట్టికను రూపొందించారు. ప్రతి పది సంవత్సరాలకొకసారి రూపొందించాల్సిన ఈ పట్టికను ఓటుబ్యాంక్ రాజకీయాల కారణంగా అమలుచేయలేదు. 1950లలోనే బంగ్లాదేశ్ (అప్పటి తూర్పుబెంగాల్) నుండి అక్రమంగా వలసవచ్చే వారితో అస్సాం రాష్ట్రాన్ని నింపివేయాలనే కుట్రతో అనేకమంది బంగ్లా పౌరులు అస్సాం, పశ్చిమ బెంగాల్‌లకు పోటెత్తారు. 1979లో అక్రమ వలసదారులను వెళ్లగొట్టాలని, తమ ఉద్యోగాలు, తమ ఆస్తులు తమకే దక్కాలని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు) ఉద్యమించింది. ‘సేవ్ అస్సాం టుడే-సేవ్ భారత్ టుమారో’ అంటూ ఆ ఉద్యమాన్ని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) దేశవ్యాప్తంగా నిర్వహించింది. దాంతో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ‘ఆసు’ నేతలతో చర్చలు జరిపి ఎన్‌ఆర్‌సిని అమలుపరుస్తామని, అక్రమ వలసదారులను తిప్పి పంపిస్తామని సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తామని పలు ఒప్పందాలను కుదుర్చుకొన్నారు. కాని ఓటుబ్యాంక్ రాజకీయాల కారణంగా ఇవేవి అమలుకాలేదు. 2003లో సుప్రీం కోర్టు అక్రమ వలసదారులతో పాటు, ఈ దేశ పౌరులను గుర్తించి ఎన్‌ఆర్‌సి (జాతీయ పౌర పట్టిక) రూపొందించాలని ఆదేశించింది. ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. ఆ ప్రక్రియతో దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను గుర్తిస్తే బాగుంటుందని ప్రభుత్వం చర్చిస్తున్నది.
ఎన్‌ఆర్‌సీ లాంటి ప్రక్రియను బంగ్లాదేశ్ పాకిస్తాన్‌లు ఎప్పటినుండో చేపడుతున్నవి. మనం చేపడితే అభ్యంతరాలెందుకు? మన దేశమేమన్నా సత్రమా? రోహింగ్యాలు, ఐఎస్‌ఐ వాళ్లతో నింపెయ్యాలా మన దేశాన్ని?
నిత్యం మైనారిటీల హక్కుల కోసం గొంతు చించుకునే సెక్యులరిస్టులు లేనిపోని అనుమానాలు సృష్టించి పబ్బం గడుపుకునేకంటే, పాక్‌లో మైనారిటీలను తన్ని తరిమేసి, ఆడపిల్లలను ఎత్తుకుపోవడాన్ని రాహుల్ గాంధీ ఎందుకు ప్రశ్నించరు? జిహాద్ పేరుతో మారణహోమాన్ని సృష్ఠిస్తున్న తాలిబన్లను, ఐసిస్, ఐఎస్‌ఐ ముష్కర మూకలను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ సహా ఇతర ఉగ్ర దేశాలను ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు ప్రశ్నించరు?
మత సామరస్యం గురించి ఉరుకులాడే సీతారాం ఏచూరి ఒక్కసారి చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌ను ప్రశ్నిస్తే బాగుంటుంది- ‘మీ దేశంలో ముస్లింలు వాళ్ల పిల్లలకు ముస్లిం (మహ్మద్, ఇక్బాల్, కాశిం తదితర పేర్లు) పేర్లు ఎందుకు పెట్టుకోకుండా నిషేధించారని? ఇప్పటికైనా కాంగ్రెస్, కమ్యూనిస్టు సెక్యులరిస్టు మేధావులు తలాతోక లేకుండా మాట్లాడి మత వివాదాలను సృష్టించడం మానుకోవాలి. తమ గురించి ఈ దేశ యువత ఏం మాట్లాడుకుంటుందో, తామేం తప్పులు చేస్తున్నామో వీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ దేశ ప్రయోజనాలకనుగుణంగా పనిచేసిననాడే ఇక్కడి ప్రజల గుండెల్లో కొంతైనా చోటుదక్కుతుంది. లేదంటే మీరు కూర్చున్న చెట్టును మీరే నరుక్కుంటున్నట్టు అవుతుంది.

-డా. మాసాడి బాపురావు