Others

పగబట్టిన పొగమేఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానగరాలు.. ఆకాశహర్మ్యాలు.. రోడ్లపై విరామం లేకుండా రివ్వుమంటూ దూసుకుపోయే వాహనాలు.. ఇవన్నీ అభివృద్ధికి చిహ్నాలని సంబరపడుతుంటే కాలుష్యభూతం మన వెన్నంటే కోరలు చాస్తోంది. వాహనాల పొగ కారణంగా నైట్రేట్, సల్ఫేట్, కార్బన్, సోడియం క్లోరైడ్, కాడ్మియం, పాదరసం అణువులు మన దేహాల్లోకి పోయి ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. ప్రమాదకరమైన వాయువుల్ని పీల్చడంతో ఎంతోమంది ఆస్తమా, క్షయ, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వాయుకాలుష్యమే కారణమని రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ ప్రకటించింది. అతి నీలలోహిత కిరణాల్లో ఉండే క్యాన్సర్ కారక కార్సినోజెన్‌లు పొగ, దుమ్ములో కూడా ఉన్నాయని ఆ సంస్థ హెచ్చరించింది. ట్రాఫిక్, పరిశ్రమలు, నిర్మాణరంగం వల్ల పొగ, దుమ్ము వ్యాపిస్తున్నాయి.
పొగ, దుమ్ము, ధూళి, వాహన శబ్దాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గాలిలో టోలిన్, బెంజీన్ అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఉన్నవారు క్యాన్సర్, రక్తహీనత, టీబీ వ్యాధుల బారినపడుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సల్ఫర్ డయాక్సైడ్ శ్వాసకోశాలను నాశనం చేసి బ్రాంకైటీస్‌కు కారణమవుతోంది. నైట్రోజన్ డయాక్సైడ్‌తో కళ్లు, ముక్కు భాగాల్లో మంట పుడుతుంది. శ్వాసకోశాలకు చికాకు కలుగుతుంది. అమ్మోనియా మోతాదు పెరగడం వల్ల కళ్ల మంటలతో పాటు శ్వాసకోశ భాగాలన్నీ దెబ్బతింటాయి. వాయు కాలుష్య సాంద్రత, ధూళి రేణువుల వ్యాప్తి ఆందోళనకరంగా ఉందని బ్రిటన్‌లోని సర్రే యూనివర్శిటీ పరిశోధకులు విశే్లషించారు. కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ పొగబెడుతున్నాయని కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. సాధారణంగా గుట్కా, వక్కపొడి తినేవారు ఖాళీ ప్యాకెట్లను ఎక్కడపడితే అక్కడ పడేస్తుంటారు. షాంపూలు, బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలకు సంబంధించిన ప్లాస్టిక్ కవర్లను అలాగే వదిలేస్తుంటారు. ఇవేవీ పునర్వియోగానికి పనికిరావు గనుక వీటిని చెత్త కాగితాలు ఏరుకునేవారు సైతం ముట్టుకోరు. ఫలితంగా ప్లాస్టిక్ వ్యర్థాలు మన పరిసరాలను ముంచెత్తుతున్నాయి.
ఓ అధ్యయనం ప్రకారం- గంటసేపు ట్రాఫిక్ రద్దీలో ప్రయాణం చేసినవారు చురుకుదనం కోల్పోయి ఒళ్లంతా మగత, నొప్పులతో బాధపడుతున్నారు. ట్రాఫిక్ రద్దీలో రహదారులను కమ్మేస్తున్న దుమ్ముతో చాలామందిలో శ్వాసకోశాలు దెబ్బతింటున్నాయి. అస్తమా, బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం వాయుకాలుష్యమే. ఇక, చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ కాల్చివేస్తుండటంతో వెలువడే పొగతో ఎంతోమంది శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. రసాయన పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలు నీటిలో కలిసి జలచరాలకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. భూమి పొరల్లోకి ప్లాస్టిక్ పాతుకుపోతే ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. పాలిథిన్ కవర్ల వినియోగం వల్ల టన్నులకొద్దీ పాలిథిన్ భూమిలోకి చేరుతోంది. ఫలితంగా భూసారం దెబ్బతినడంతో పాటు డ్రైనేజీల్లో మురుగు పారుదలకు ఆటంకం ఎదురవుతోంది. భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. కొన్ని చోట్ల జలం అడుగంటుతోంది. వర్షపు నీరు భూమిలో ఇంకకుండా వ్యర్థపదార్థాలు అడ్డుపడుతున్నాయి. కలుషిత జలాలను తాగడంతో కాలేయ, శ్వాస సంబంధ వ్యాధులు విజృంభిస్తున్నాయి. చెత్తాచెదారాలు పేరుకుపోయి రోడ్లపై, జనావాసాల్లో నీరు రోజుల తరబడి నిల్వ ఉండడంతో దోమలు, ఇతర క్రిమికీటకాలు గుడ్లను పెడతాయి. దోమల వల్ల మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. నీటి కాలుష్యం వల్ల జలచరాలకూ హాని జరుగుతోంది. చనిపోయిన చేపలను తినటం వల్ల మన ఆరోగ్యం పాడవటం, రోగనిరోధక శక్తి తగ్గడం జరుగుతోంది. నగరాల్లో అయితే మరోదారి లేక కలుషిత జలాలనే తాగాల్సిన దుస్థితి నెలకొంది.ఇక, ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆశించినంతగా అమలు కావడం లేదన్నది నగ్నసత్యం. పాలకులు ఎన్ని చట్టాలు చేసినా, పర్యావరణాన్ని కాపాడుకోవడంపై ప్రజల్లోనూ అవగాహన పెరగడం లేదు. మోటారు వాహనాలకు బదులు సైకిళ్ల వినియోగాన్ని పెంచితే ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యాన్ని నివారించే వీలుంది. ప్లాస్టిక్ గ్లాసులకు బదులు స్టీల్‌గ్లాసులు వాడితే మంచిది. పారేసిన పాలిథిన్ కవర్ల వల్ల పశువుల ఆరోగ్యం దెబ్బతింటోందని తెలిసినా వాటిని ఇంకా వినియోగిస్తునే ఉన్నారు. కాలుష్యరహిత సమాజం కోసం కృషి చేస్తామని ఎవరికివారు ప్రతిన పూనితే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదన్నది కాదనలేని వాస్తవం.

-మాధురీ లక్ష్మి