Others

అవిశ్రాంత రచయిత అక్కిరాజు రమాపతిరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డా.అక్కిరాజు రమాపతిరావుగారు పేరెన్నికగన్న రచయిత. తరతరాలుగా పండితులు, విద్వత్కవులు వెలసిన ‘అక్కిరాజు’ వంశం వీరిది. ముఖ్యంగా వీరి పెద తాతగారు అక్కిరాజు ఉమాకాంతశేఖరులు నవద్వీపంలో ‘విద్యాశేఖర’ బిరుదాంకితులు. మహాపండితులు, ఉన్నతశ్రేణి విమర్శకులు, ‘నేటికాలపు కవిత్వ’ గ్రంథకర్త. రమాపతిరావుగారి తమ్ముడు అక్కిరాజు సుందర రామకృష్ణగారు. కవి, గాయకుడు, నాటక ప్రయోక్త. నాటకాలలోను, సినిమాలలోను నటించిన ప్రముఖ నటుడు. ఇంతటి ప్రశస్తిగల వంశంలో పుట్టిన అక్కిరాజు రమాపతిరావుగారు ప్రధానంగా సృజనాత్మక రచయిత. కథ, నవల వంటి సృజనాత్మక రచనలనేగాక జీవిత చరిత్రలు, సాహిత్య చరిత్రలు, అనువాదాలు, పదకోశాలు, నిఘంటువులు, సంకలన గ్రంథాలు, సంపాదక గ్రంథాలు.. ఈ విధంగా శతాధిక గ్రంథాలు రచించిన మహారచయిత. ఎన్నో పత్రికలలో కాలమిస్ట్‌గా, ఎన్నో ధారావాహిక శీర్షికలను నెలల తరబడి నిర్వహించడంలో వారి కలం సమధికోత్సాహంతో పనిచేసింది. ముఖ్యంగా పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం, పండితారాధ్య చరిత ద్విపద కావ్యాలను సరళ సుందర వచనంలో అందించిన ఘనాపాటి. ఎందరో రచయితల గ్రంథాలకు పీఠికలను సంతరించిన పెద్దన్న. గ్రంథ సమీక్షలు చేసి ప్రోత్సహించిన సహృదయుడు. ఎప్పటికప్పుడు పత్రికలలో సాహిత్య, సామాజిక, ఆధ్యాత్మిక విషయాలపైన సహస్రాధికంగా వ్యాసాలను రాస్తూ పాఠకులకు ఎంతో విజ్ఞానాన్ని అందించిన మహామేధావి. ఇంతెందుకు ఒక్క మాటలో చెప్పాలంటే నిరంతర సాహితీ కృషీవలుడు. వారు రాసిన వాటినన్నిటినీ ఒకచోట చేర్చితే లక్ష పుటలకు పైగానే ఉంటుంది. అంతటి సాహిత్య వారాశి అక్కిరాజువారిది. రాశిలోనే గాక, వాసిలోగూడా సమున్నతమైనదే. బతికున్న రచయితలల్లో అక్కిరాజు వంటి అక్షర కోటీశ్వరుడు లేడనుకొంటాను. ‘మంజుశ్రీ’ కలం పేరుతో తొలినాళ్లలో కథలు, నవలలు రాసినా తరవాత అసలు పేరుతో అక్కిరాజు రమాపతిరావుగానే ప్రసిద్ధుడైనాడు. మంజుశ్రీగా పది నవలలు, ఆరు కథాసంపుటాలు వెలువరించినారు. వీరి కథల్లోను, నవలల్లోను దాదాపు పాత్రలన్నీ సున్నితమైన మనస్తత్వమున్నవి, సంస్కారవంతమైనవి. మంజుశ్రీగారు కూడా సున్నిత మనస్కులు, సంస్కారవంతులు. చెడును నిరసిస్తారు, మంచిని గుండెకు హత్తుకొనే ఉత్తమ మనస్వి.
అక్కిరాజు రమాపతిరావుగారు ‘వీరేశలింగం సమగ్ర పరిశీలన’ అనే అంశం మీద సాధికారికమైన సిద్ధాంత గ్రంథాన్ని రచించిన ఉత్తమ పరిశోధకుడు. ఆ తర్వాత కూడా పరిశోధన పథంలో పయనించి ‘వ్యావహారిక భాషా వికాసం-చరిత్ర’ (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి బహుమతి పొందినది.), ‘తెలుగు నవల’, తెలుగు సామెతలు-సాంఘిక జీవితం వంటి పరిశోధనాత్మకమైన గ్రంథాలెన్నో రచించారు. వీరు వివిధ రంగాలలో ప్రసిద్ధులైన వ్యక్తులమీద రాసిన జీవిత చరిత్రలు చాలా విశిష్టమైనవి. వాటిలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, ఆంధ్రకేసరి ప్రకాశం, వీరసావర్కర్, గిడుగు రామ్మూర్తి, తిరుమల రామచంద్ర, నాయని సుబ్బారావు, వావిలాల గోపాలకృష్ణ వంటి వారిమీద రాసిన జీవిత చరిత్రలు ముఖ్యమైనవి. ఇవిగాక ఆధునిక గుజరాత్ మహాకవి నానాలాల్, శరత్‌చంద్, నారాయణగురు, భోగరాజు పట్ట్భా సీతారామయ్య మీద ఇంగ్లీషులో రాసిన జీవిత చరిత్రలను తెలుగులోకి అనువదించారు. సుమారు 42 గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. అజోవిభో కందాలం ఫౌండేషన్ సమ్మానోత్సవ సంచికలారింటికి సంపాదకత్వం వహించారు. ఇలా ఎన్నిటికో, ఎందరికో తోడ్పడి తన సాహిత్య జీవితాన్ని చైతన్యవంతంగా మలచుకొన్నారు. తెలుగు మాండలిక పదాలను సేకరించి ‘మాండలిక పదకోశం’ను తెలుగు అకాడమి ప్రచురించింది. అట్లాగే తెలుగు అకాడమి సంకలనం చేయించిన ‘తెలుగు-తెలుగు నిఘంటువు’కు ముఖ్య సంపాదకులలో ఒకరు. తెలుగు అకాడమి ప్రచురించే తెలుగు త్రైమాస పత్రికకు కొన్నాళ్లు సంపాదకత్వం వహించారు. ఇలా తెలుగు అకాడమిలో సుమారు ముప్ఫ సంవత్సరాలు పైగా పనిచేసి తెలుగు భాషకు ఎనలేని సేవలందించారు. తన జీవిత చరిత్రను ‘జీవవాహినీ’అనే పేరుతో సమీక్షించుకొన్న సహృదయ సమన్వయి. అంతేకాదు వారి ‘సహస్ర చంద్ర దర్శనోత్సవ’ (వేయి పున్నమల వేడుక) సందర్భంలో వంద మంది రచయితలు, కవులు వారి సాహిత్యకృషిని సమీక్షిస్తూ, ప్రశంసిస్తూ రాసిన వ్యాసాల, కవితల సంపుటిని ‘స్వాత్మకథ’ అనే పేరుతో బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్‌వారు అభినందన పురస్కారంగా ఒక సంచికను ప్రచురించి ఆ మహారచయిత పట్ల ఉన్న గౌరవ ప్రతిపత్తులను చాటుకొన్నారు. వీరి రచనల మీద వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధక విద్యార్థులు సిద్ధాంత గ్రంథాలు రాసి ఎం.్ఫల్, పి.హెచ్‌డి పట్టాలు పొందారు. డా. అక్కిరాజు రమాపతిరావుగారు ఎన్నో జాతీయ అంతర్జాతీయ సెమినారులలో పత్ర సమర్పకులుగానో, అధ్యక్షులుగానో పాల్గొన్నారు. ఎందరో పరిశోధకులకు పర్యవేక్షకులుగా సలహాదారుగా సేవలందించారు. ఎందరో రచయితలను తీర్చిదిద్దారు. వీరు సాహిత్యంలో చేసిన అవిరళ కృషిని గుర్తించి ఎన్నో సంస్థలు అవార్డులిచ్చి సత్కరించాయి. వాటిలో ముఖ్యమైనవి కలకత్తాలోని భారతీయ భాషా పరిషత్తువారి సమగ్ర రచనా పురస్కారం, అమెరికా వంగూరి ఫౌండేషన్ వారి పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డ్, తెలుగు విశ్వవిద్యాలయం ఇచ్చిన మూడు పురస్కారాలు (మూడుసార్లు) వంటివి పేర్కొనదగినవి.
ఇప్పుడు ‘ఇరవై ఇరవై’ సంవత్సరం ఆరంభంలోనే భండారు చంద్రవౌళీశ్వరరావుగారి స్మారక పురస్కారాన్ని అందుకొంటున్న అక్కిరాజువారిని ‘లక్కీరాజు’ వారిగా అభివర్ణిస్తూ ఇరవై సంవత్సరాలు పైగా వారితో తెలుగు అకాడమిలో కలిసి పనిచేసిన భాగ్యశాలిగా ఈ ఆనందంలో పాలుపంచుకొంటూ, ఈ ఇరవై ఇరవైలోనే ఇతోధికంగా మరెన్నో ప్రతిష్ఠాకరమైన అవార్డులు రావాలని కోరుతూ ఈ సందర్భంలో రాజు (చంద్రు)నకో నూలుపోగులా అక్కిరాజువారికి ఈ చిరు వ్యాసాన్ని నూలుపోగులా సమర్పిస్తున్నాను. వారు శతాయుష్కులై, పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రశాంత జీవనం గడుపుతూ తమ పండిత విజ్ఞానాన్ని రచనల రూపంలో తెలుగు సాహిత్యాభిమానులకు పంచిపెట్టడంలో వారి కలం సమధికోత్సాహంతో ఆనందంతో పనిచేసి వారి శేష జీవిత శేముషీ శేవధినందిస్తుందనడంలో సందేహం లేదు.

- ఆచార్య జి. చెన్నకేశవరెడ్డి 94920 47027