వీక్లీ సీరియల్

ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం.. సమయం తొమ్మిది.
షణ్ముగం పూజ గదిలోనుండి హాల్‌లోకి వచ్చాడు.
‘నమస్కారమండీ’ అని విన్పించింది.
తలెత్తి చూశాడు.
బదులుగా ప్రతి నమస్కారం చేశాడు.
తన ఆగమనంతో లేచి నిలబడిన ఆ అపరిచిత వ్యక్తిని కూర్చోమని సైగ చేస్తూ, ఆ వ్యక్తికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు షణ్ముగం.
‘‘నాపరు దశరథ నాయుడంటారండి. ఇప్పటిదాకా ఉల్లి వ్యాపారం చేసి నాలుగు రాళ్ళు సంపాదించానండి. ఏనాటికైనా ఓ సినిమా తయాలన్న కోరికొకటి బలంగా నాటుకుపోయిందండి. సరిపడా డబ్బు చేతిలో పడగానే ఆ కోరిక వటవృక్షమై విస్తరించడంతో వచ్చి హైద్రాబాద్‌లో పడ్డానండి.
శివనాగేశ్వరరావు దగ్గర పలు సినిమాలకు కోడైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం సంపాదించిన మా వూరి గురుమూర్తిని డైరెక్టర్‌ని చేస్తూ ఓ కామెడీ పిక్చర్ లోబడ్జెట్‌లో తీసినానండి.. ఆలీ, కొత్తమ్మాయి హీరో హీరోయిన్లండి.
అరవై అవుద్దేమోననుకున్నానండి. ఎనభై లక్షలు దాటిందండి. ఇంకో పదిహేనయితేగానీ ప్రసాద్ లాబ్‌నుండి బయటపడి రిలీజ్ అయ్యేట్టులేదండి. అందుకని మీ సాయం కోసం పరుగెత్తుకొచ్చానండి’’ వినయంగా తన గోడు వెళ్ళబోసుకుంటూ వాపోయాడు చోటా నిర్మాతగా మారిన ఆ ఉల్లిగడ్డల వ్యాపారి.
అతని మాటల్లోని నిజాయితీ గుర్తించాడు షణ్ముగం.
దశరథ నాయుడు చెప్పిందంతా ఓపిగ్గా, సావధానంగా విన్న షణ్ముగం అతన్ని ప్రశ్నించాడిలా.
‘‘చేసేది, చేయించేది అంతా నేనే- అనేది శ్రీకృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్. మన చేతల్లో ఏముంది? అయినా నీ సినిమాకి బయ్యర్స్ లేరా?’’
‘‘లేకేం? ఉన్నారండీ! వాళ్ళు చెబితేనే సినిమా మొత్తం రామోజీ ఫిలింసిటీలో తీశాను కదండీ. కొత్త డైరెక్టర్ కదా! ప్లానింగ్ లోపంతో సినిమా బడ్జెట్ గ్రాఫ్ అనుకోకుండా పెరిగిందండీ. కొనుగోలుదార్లేమో పిక్చర్ మొదలెట్టినప్పుడెంత ఒప్పందం కుదిరిందో అంతకంటే ఒక్క నయాపైసా ఎగస్ట్రా ఇచ్చేది లేదని ఖరాఖండీగా చెప్పేసినారండీ. మీరే ఎలాగైనా ఆదుకోవాలండి’’ ప్రకంపిత కంఠంతో ప్రాధేయపడ్డాడు దశరథనాయుడు.
‘‘ఇతులకి అర్థంకాని వ్యక్తుల’’ గురించి సర్వే చేసి, ఆ సేకరణలో మొట్టమొదటి పేరుగల వ్యక్తిగా షణ్ముగమే దర్శనమిస్తాడు.
‘‘మీరు.. మరేమీ ఆలోచించకండి. గుంటూరులో నాకో పాతి లక్షల బిల్డింగుదండి.. ఎలాగైనా మీరే డబ్బు సర్దాలండి. మీరు సాయపడితేనే ఆ సినిమా బయటపడి.. రిలీజైతేనే నేను గట్టెక్కేదండి. లావాదేవీలు మీరెలాగంటే అలాగే చూసుకుందామండి. మీరు కాదంటే మాత్రం పత్తి రైతుల ఆత్మహత్యల పరంపరలా. సినిమా రిలీజే చేసుకోలేని చోటా నిర్మాతల ఆత్మహత్యల లిస్టులో నా పేరు ఫస్టుంటుందండి’’ అంటూ కాళ్ళమీద పడ్డంత పనిచేయబోయాడు.
వద్దని వారంచాడు షణ్ముగం.
‘‘చేసేది చేయించేది అంతా నేనే- అనేది శ్రీకృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్. నేను నిమిత్తమాత్రుడను’’ అన్నాడు.
‘‘అయ్యయ్యో అలాగనకండి. నన్నీ ఆపదనుండి రక్షించండి’’ దీనంగా వేడుకున్నాడా నిర్మాత.
షణ్ముగం పెదాలపై సన్నని నవ్వు.
‘‘సర్సరే. మళ్లీ సాయంత్రం కలువు. నేను అత్యవసరంగా ఓ కాన్ఫరెన్స్‌కి అటెండ్ కావాల్సి వుంది’’ అన్నాడు తప్ప ఖచ్చితంగా మాటివ్వలేదు షణ్ముగం.
ఎవరికైనా అభయం ఇచ్చాడంటే అదెంత కష్టతరమైనా చేసిపెడతాడు. అది షణ్ముగానికి పుట్టుకతో వచ్చిన సుగుణం. అయితే ఈ నైజేమే భవిష్యత్‌లో తనని నిలువునా ముంచేస్తుందని అతనికి కలలో సైతం ఊహకందని విషయం
ఆ సమాధానం విని దశరథనాయుడి కళ్ళు మెరిశాయి.
బుర్రమీసాల తలనాడిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ‘్థంక్సండీ!’ అనేసి బయటకు నడిచాడు.
‘సేమ్ టూ యూ’ అని చెప్పి లోపలికెళ్లిపోయాడు షణ్ముగం.
అంత క్యాష్ స్పాట్‌లో షణ్ముగం దగ్గర లేక కాదు, ఆ నిర్మాతకి సాయంత్రంవరకూ గడువు పెట్టింది.
నమ్మకమైన వ్యక్తి చేత ఈలోగా దశరథ నాయుడి బయోడేటా సేకరించబడుతుంది. ఆ ఇన్‌ఫర్మేషన్ ఆధారంగా దశరథనాయుడికి సాయం చేసేది లేనిది నిర్ణయించుకంటాడు షణ్ముగం.
అదీ అతని పాలసీ!
ఒక వ్యక్తి తనని అవసరార్థం కలిసాడంటే అతని పుట్టుపూర్వోత్తరాలు మొత్తం షణ్ముగం కంప్యూటర్ మైండ్‌లో నిక్షిప్తమై ఉండాల్సిందే.
అలా జరగనిదే అతను మనుషుల్తో మనీ చదరంగం ఆడలేడు!
***
4
విశ్వవ్యాప్తమై విస్తరించినవిజ్ఞానం మానవమస్తిష్కంలో వెలుగురేఖల్ని విరజిమ్ముతున్న దశలో.. సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ నూతన శతాబ్దంలో...
ఎందరో మూఢ నమ్మకాలను విశ్వసించడం అర్థం లేని విషయమే కావచ్చు. ఎలాంటి ప్రమాదం ముంచుకు వస్తుందోననే భ్రమలో పడి వాస్తవాల్ని విస్మరించి, అనవసరపు ఆలోచనలకి తావివ్వడం అర్థంలేని నైజమే కావచ్చు.
వీటిని సమాంతరంగా పుణికి పుచ్చుకున్న నివేదిత ప్రస్తుత మానసిక స్థితి మాత్రం డోలాయమానంగా ఉంది.
అఖిల్ విచిత్ర ప్రవర్తన ఆమెని మనోదౌర్భల్యంవైపుకి నెట్టేసింది.
అది ఎవరో చేసిన చేతబడో.. శక్తిపూనడమో కావచ్చనే భ్రమ వైపే మొగ్గు చూపుతోంది.
అందుకే తన అనుమానాన్ని భర్త వసంత్‌కి వెల్లడించింది.
బదులుగా బిగ్గరగా నవ్వాడతను.
‘‘పల్లెటూరి దానిలా ఏమిటా పిచిచ్పిచ్చి ఆలోచనలు.. ఎవరైనా వింటే మెంటల్ కేస్‌అనుకుంటారు. సైన్స్ గ్రాడ్యుయేట్‌వి, మీ అభిప్రాయాలిలా ఉండొచ్చా? అయినా పిక్‌నిక్‌లో జరిగిందోకటి, మేడమ్స్ వచ్చి నీతో చెప్పింది మరొకటై ఉంటుంది. మనవాడసలే క్వశ్చన్ బాంబర్! వాళ్ళందర్నీ హడలుగొట్టే ప్రయత్నం చేసుంటాడు..’’
పూర్తిగా వినకుండా నివేదిత అడ్డు తగిలింది.
‘‘అది కాండీ!
ఆమెని చెప్పనివ్వకుండా తిరిగి తనే కంటిన్యూ చేశాడు.
‘‘నువ్వు బెంబేలెత్తిపోయి భూతాలంటూ అభూతకల్పనలు చేస్తూ నన్ను అనవసరంగా కంగారు పెట్టేయకు. వాడినీ ఇబ్బంది పెట్టకు. అఖిల్ కేమీ జరగలేదు. జరగదు. జరగబోదు. నిక్షేపంగా ఉన్నాడుగా!
అంతగా నీకు అనుమానంగా వుంటే ఏ డాక్టర్‌కో సైకియాట్రిస్ట్‌కో చూపెడదాం. ట్రీట్‌మెంట్‌తో సమస్య సెటిలైపోతుంది. అంతేగానీ నువ్వు దీన్ని జటిలం మాత్రం చేయకు. ఏమంటావ్?’’ ఆమెలోని భయాన్ని పారద్రోలాలన్న సంకల్పంతో కాస్త ధైర్యం నూరిపోయే ప్రయత్నం చేశాడు.
‘‘నా అనుమానం నాది. మీ అభిప్రాయం మీది. ముందోసారి నన్ను మా అమ్మా వాళ్ళ ఊరికి వెళ్ళనివ్వండి.
అదో ప్రయత్నం! వాడికి నయమయ్యిందా ఫర్వాలేదు. ప్రయత్నం ఫలించలేదనుకోండి, మీరన్నట్లుగా డాక్టర్‌కి చూపెడదాం. ప్లీజ్! కాదనకండి’’ వేడుకోలుగా అంది.
‘‘సరే! నీమాటెందుకు కాదనాలి. అలాగే కానివ్వు. కానీ నిట్టూగాడికేం తెలియనీయకు. మళ్లీ దీని మీద రీసెర్చి చేసినట్టు ప్రశ్నలు వేసి చంపుకుతింటాడు. అలాగే మీ అమ్మా నాన్నలని కూడా అనవసరంగా భయపెట్టకు. అసలే వాళ్ళకి నువ్వన్నా, మన బాంబ్‌గాడన్నా పంచ ప్రాణాలు’’.
భార్యకి జాగ్రత్తలు చెప్పి తను ఆఫీసుకు వెళ్లిపోయాడు.
నివేదిత తన తల్లిగారి ఊరైన గోదావరిఖని వెళ్లాలని తీసుకున్న నిర్ణయం అఖిల్ భవిష్యత్తుని ఎన్ని మలుపులు త్రిప్పడానికి దారితీసిందో.. ఆ క్షణంలో ఆమె ఊహకందని విషయం.
***
చిన్న బ్రీఫ్‌కేసులో బట్టలు సర్ది అఖిల్‌ని వెంటేసుకుని బస్టాండ్‌కి వెళ్లింది నివేదిత. బస్‌లో అఖిల్ వౌనంగా ఉండటానికి వాడికో కామిక్స్ బుక్ కొనిచ్చింది.
బస్ రెడీగా వుంది. వెయిటింగ్ బాధ తప్పిందని ఎక్కి కూచుంది. ఆలస్యం చేయకుండా బస్ గోదావరిఖనికి బయల్దేరింది.
అప్పటివరకూ జాడలేని మేఘాలు ఒక్కచోట సమావేశం అవుతున్నట్టు సూచనగా ఆకాశాన్ని అల్లుకుపోసాగాయి. అయితే బలహీనంగా వీచే గాలులవల్ల అంతలోనే చెల్లాచెదురవుతూ తేలికైపోతున్నాయా మేఘాలు.
మధ్యాహ్నం మూడు గంటల వేళప్పుడు బస్ గోదావరిఖని చేరింది.
రకరకాల ఆలోచనలతో బస్ ప్రయాణం కొనసాగించిన నివేదిత బస్‌స్టాప్‌లో బస్ ఆగడంతో అఖిల్‌తోపాటు దిగింది.
తమని చుట్టుముట్టిన ఆటోవాళ్ళని, రిక్షావాళ్ళని వదుల్చుకుంటూ రామ్‌నగర్ కాలనీ వైపు నెమ్మదిగా నడక సాగించింది.
బస్‌స్టేషన్ నుండి కాస్త దగ్గర్లోనే ఉంటుందా కాలనీ. వెళ్తూ వెళ్తూ మార్గమధ్యంలో కలిసే పరిచయస్థుల్ని పలకరించుకుంటూ పోవాలని ఆమె అభిలాష.
ఆకాశంలో క్షణక్షణానికీ మార్పు చోటుచేసుకోసాగింది.
అప్పుడే సన్నగా ఎండ తెరవడం.. మరుక్షణం ఎండ మాయమై ఆకాశాన్ని మేఘాలు కమ్మేయడం.. వెంటనే చల్లని గాలులు వీచడం.. అన్నీ కలిసి దోబూచులాడుకుంటున్నట్టుంది వాతావరణం.
ఏ నిమిషంలోనైనా తుంపర్లుగా గానీ.. భారీగా కాని వర్షం కురియొచ్చు అన్నట్లుగా వెనువెంటనే మార్పులకి లోనవుతోంది వాతావరణం.
ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతోంది నివేదిత.
తల్లి చేయి పట్టుకొని సరదాగా నడుస్తున్న అఖిల్ ఆకాశాన్ని శ్రద్ధగా పరిశీలిస్తున్నాడు.
అదే క్షణంలో...
***
నివేదిక ఇంట్లో ఫోన్ రింగవుతోంది!
పాండవీయం భార్య ప్రణీత తన ఇంట్లోనుండి నివేదిక ఫోన్ నెంబర్‌ని డయాల్ చేస్తోంది.
రెండుమూడుసార్లు రీడయల్ చేసి, అవతలి వైపునుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తన ప్రయత్నాన్ని విరమించుకుంది.
***
వాతావరణ మార్పులకి భీతిల్లి సహజంగానే తలో దిక్కుగా ఎగిరిపోతున్న పక్షుల గుంపుల కేసి ఆసక్తిగా చూపుని సారించాడు అఖిల్.
‘అమ్మా! అమ్మా! మరే అలా ఆకాశంలో పక్షులు ఎలా ఎగుర గలుగుతున్నాయి?’ అంటూ తల్లిని ప్రశ్నించాడు తన ఆసక్తికి అక్షర రూపమిస్తూ.
‘పక్షులకి రెక్కలుంటాయి. ఆ రెక్కల్ని గాల్లో రెపరెప లాడిస్తూ వాటి సాయంతో ఎంత దూరమైనా ఎగుర్తూ ప్రయాణించగలవు’
‘ఇంకా వౌనంగానే ఉండి పోయాడేంటబ్బా?’ అని నివేదిక అనుకుంటుండగానే, క్వశ్చన్ బాంబ్‌ని విసరడంతో వాడి సందేహ నివృత్తి గావించిందామె.
‘వాటికి రెక్కలున్నాయ్! అందుకే అలా ఎగుర గలుగుతున్నాయన్న మాట’ అంటూ అర్థమైనట్లు సాలోచనగా తలూపాడు.
‘అవును. మనకి రెక్కలు లేవు కనుకే మనం గాలిలో ఎగరలేక పోతున్నాం’ తర్వాత మరో ప్రశ్న వేయకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా సమాధానమిస్తూ తన దృష్టిని పరిసరాల వైపు సారించింది.
చాలా కాలం తర్వాత అమ్మానాన్నల దగ్గరకు వెళ్తుండటంతో కాస్త ఉత్సాహంగా ఉందామెకు.
‘మరే రెక్కలుంటేనే గాలిలో ఎగుర వచ్చన్నమాట’
‘అవును. ఎగిరే ప్రతి పక్షికీ తప్పనిసరిగా రెక్కలుంటాయి. అవి లేకపోతే ఎగురలేవు’
తాను తన ఫ్రెండ్స్‌తో కలిసి జల్సాగా తిరిగిన ఆ పరిసరాల్ని, వాటి తాలూకు అనుభూతుల పుటల్ని మరోసారి మనోగ్రంథంలో తిరగేసుకుంటూనే అఖిల్‌తో సంభాషణ కొనసాగిస్తోంది.
‘మరే ఆంజనేయ స్వామి గాలిలో ఎగురుతూ వెళ్లి సంజీవనీ పర్వతాన్ని తెచ్చాడని మేడమ్ చెప్పిందిగా. మనింట్లో ఉన్న ఫొటోలో ఆంజనేయ స్వామికి రెక్కలు లేవుగా! మరెలా ఎగిరాడమ్మా’ తన చిన్న బుర్రని నిలువునా ఊపుతూ సందేహంగా అడిగాడు.
కాస్త తటపటాయించిందా ప్రశ్నకు. ఎలా చెప్పి వాడిని సమాధానపరచాలో క్షణకాలం బోధపడలేదు. అందుకే ఆలోచనల్లో పడింది కాసేపు. అయినా జవాబు తట్టలేదు.
వాడితో వచ్చే చిక్కే ఇది. ఎక్కడో మెలికపెట్టి ప్రశ్నలు వేస్తుంటాడు. తోచిన సమాధానం చెప్పేస్తే ఊరుకోడు. సరైన సమాధానం వచ్చేవరకు ఒక పట్టాన

వదిలిపెట్టడు.
తను చెప్పే సమాధానం వాడిని సంతృప్తి పరిచినా వదలడని తెలిసీ ‘ఆయన దేవుడు కనుక అలా సులభంగా గాలిలో ఎగురగలిగాడు’ అంది.
‘దేవుడైతే మాత్రం రెక్కల్లేకుండానే ఎలా ఎగిరాడు? మనం కూడా ఆ దేవుడిలా ఎగరాలంటే ఏం చేయాలి’ ప్రశ్న మీద ప్రశ్న సంధించాడు.
‘దేవుడిలో మహత్తు ఉంటుంది. కాబట్టి రెక్కల్లేకపోయినా ఎగురగలడు. తమ మహత్తులోనే దేవుళ్లు ఏం చేయాలనుకున్నా చేసేస్తారు. కానీ మనం మానవులం. మనలో ఆ మహత్తు ఉండదు కనుక ఎగరాలనుకున్నా ఎగరలేం’ చెప్పింది నివేదిత.
వాడి దృష్టిని సందేహాల నుండి మరల్చాలన్న ఉద్దేశంతో ‘అదిగో అటు చూడు. దేవుడనగానే ఆంజనేయస్వామి దేవాలయం వచ్చింది. పద అక్కడికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుందాం’ అంటూ పక్కకి కదిలింది.
రామనగర్ కాలనీ ఏరియా దాటి లాల్‌బహదూర్ వీధిలోకి ఎంటరయ్యారు వాళ్లిద్దరు.
అక్కడ గుడి అంటూ లేదు గానీ, రోడ్డు పక్కగా చిన్న మైదానంలో వేపచెట్టు నీడన వెలసిన హనుమాన్ రాతి విగ్రహమది.
పూజారితో ప్రత్యేకంగా పూజా పునస్కారాలుండవు. అయినా ప్రతి మంగళ, శనివారాల్లో మాత్రం భక్తుల కోలాహలం అధికంగా ఉంటుందక్కడ.
భక్తులు కోరిన కోర్కెలు వెంటనే తీర్చే దేవుడిగా ఆయనకి పేరుండటంతో మారుమూల ప్రాంతాల వారు సైతం తమ మొక్కులు తీర్చుకొని, ఆయనని దర్శించుకోవడానికి అక్కడికి వచ్చి పోతుంటారు.
దారిలోనే స్వామి దర్శన భాగ్యం కలగడం శుభసూచకంగా భావించింది నివేదిత. దేవున్ని దర్శించుకొని పోదామని విగ్రహం వైపు అడుగు వేసింది.
మరో సందేహం బుర్రలో గిర్రుమని సుడులు తిరుగుతుంటే బయటకు కక్కలేక చప్పున నోరు మూసుకొని బుద్ధిగా తల్లి వెంట నడిచాడు అఖిల్.
అఖిల్‌ని విగ్రహం ముందుకి తీసుకెళ్లి ‘దేవుడికి దండం పెట్టు’ అంది.
తను కళ్లు మూసుకొని రెండు చేతులు జోడించింది.
తల్లిని అనుకరిస్తూ చెప్పులు ఓ పక్కగా వదిలి తన వంచి భక్తితో కళ్లు మూసి భగవన్నామస్మరణం చేశాడు.
ఒకే ఒక్క సెకను.
అనంతరం -
అఖిల్ ముఖం వివర్ణమవసాగింది. ముక్కు పుటాలదిరాయ్. కళ్లల్లోంచి వింత కాంతి ప్రసరిస్తోంది. శరీరంలోని అణువణువూ రెట్టింపు చైతన్యాన్ని సంతరించుకుంటున్న భ్రాంతి.
తన మెదడులోకి సంకేతాలెన్నో ఇంజక్టవుతుంటే భారంగా తలపట్టుకున్నాడు. చెవుల్లో శబ్ద తరంగాల హోరు.
కణతల్ని చిట్టిచేతుల్తో నొక్కుకుంటూ వేదనగా అరిచాడు ‘వొద్దొద్ద’ని.
ఆ అరుపు విని చప్పున కళ్లు తెరిచింది నివేదిత.
వాడినా స్థితిలో చూసి భీతిల్లిన నివేదిత ‘ఏమైంది నాన్నా’ అంటూ చేయి పట్టి కుదుపబోయింది.
కానీ ఆమె చేయి లేపలేకపోయింది. అసంకల్పితంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.
‘నిట్టూ’ అని ఓ కేక మాత్రం వేయగలిగింది.
కన్నతల్లి పిలుపు విన్పించిందో లేదో తెలీదు.
అఖిల్ ఉలుకూ పలుకూ లేకుండా అలాగే నిలబడ్డాడు. కాకపోతే వేదన తొలగి.. ఒక పవిత్రమూర్తిలా ఉన్నాడు.
అఖిల్ అరుపుకి, నివేదిత కేకకి పరుగు పరుగున వచ్చారు జనం. తల్లీ కొడుకుల్ని మార్చి మార్చి చూడసాగారు వాళ్లిద్దరి చుట్టూ గుమిగూడి.
నెమ్మదిగా, నెమ్మదిగా నెమ్మదిగా..
తనను మరచి పెదాలు విప్పాడా కుర్రాడు.
పోగైన జనం గురించి ధ్యాసే లేదామెకు. తన కన్నపేగుకి ఏమైందోనన్న ఆతృత తప్ప. నివేదిత కనుపాపల ఉపరితలాలపై సన్నటి నీటి పొర.
కంటి పొరల ముందు ఏవో దృశ్యాలు లీలగా కదలాడుతుంటే..
ఎప్పుడో ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాడా కుర్రాడు.
* * *
సాయంత్రం.
సుమారు నాలుగ్గంటల వేళ.
బ్యాంక్‌లో తన కంప్యూటర్ చాంబర్‌లో ఒంటరిగా కూర్చున్నాడు పాండవీయం. కంప్యూటర్ ఆపరేట్ చేస్తూనే తన మస్తిష్కానికి పదును పెడ్తున్నాడు.
మనీ మనీ బ్యాంక్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వీలు చిక్కినప్పుడల్లా కంప్యూటర్‌తో కుస్తీ పడుతున్నాడు. అయినా అతని ఆలోచనలు ఓ కొలిక్కి రాలేదు.
దోపిడీకి ముందు బ్యాంక్ టర్నోవర్ ఎంత?
దోపిడీకి గురయిన అనంతరం టర్నోవర్ ఎంత తగ్గింది?
ప్రస్తుత టర్నోవర్ ఏ స్థాయిలో ఉంది?
ఇంకా టర్నోవర్ రేంజ్ ఏ మేరకు పెంచాల్సి వుంది.
- వంటి అంశాల్ని పాండవీయం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాడు.
**
(ఇంకా వుంది)

-ఎనుగంటి వేణుగోపాల్ 9440236055