Others

వచ్చేవన్నీ కోట్లోత్సవాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినడానికే ఈ పదం గమ్మత్తుగా ఉంది కదూ! కానీ, బాలీ, టాలీవుడ్ పరిశ్రమల పరుగు చూస్తుంటే ఈ ఉపమానం కరెక్టే అనిపిస్తుంది. ఒకప్పుడు -సినిమా విజయమనేది, థియేటర్లలో ఆ సినిమా నడిచే కాలాన్నిబట్టి లెక్క తేలేది. సుమారు నాలుగైదు వారాలు ఆడితే యావరేజ్ అని, యాభై రోజులు నడిస్తే సక్సెసని, వంద రోజులు హౌస్‌ఫుల్ అయితే హిట్టని, రెండొందల రోజులకు చేరితే సూపర్ హిట్టని, ఒక సినిమా నాలుగైదు థియేటర్లలో ఏడాది నడిస్తే -ఆల్ టైమ్ రికార్డని.. ఇలా కాస్త అటూ ఇటుగా ఓ కొలబద్ద ఉండేది.
ఇప్పుడు అలాంటి హద్దులు చెరిగిపోయాయి. సరిహద్దులు మారాయి. శత దినోత్సవాలకి, రజతోత్సవాలకి ఎపుడో కాలం చెల్లింది. బహుశ కొత్త జనరేషన్‌కి శత, రజతోత్సవాల గురించి తెలిసి కూడా ఉండకపోవచ్చు. సినిమా పరిశ్రమకీ ఇలాంటి కబుర్లన్నీ పాచిపోయిన బువ్వలాంటివే! లేటెస్టంతా ‘్ఫస్టు’్ఫడ్డే మరి!
సినిమా ఎన్ని రోజులు ఆడిందన్నది కాదు, ఎన్ని థియేటర్లు ఆక్రమించిందన్నదే ఇప్పటి సినిమా లెక్క. ప్రపంచవ్యాప్తంగా నాలుగైదు వేల థియేటర్లలో విడుదలవడమే -లెటెస్ట్ ట్రెండ్. తొలిరోజు గ్రాసెంత? సెకెండ్ డేలో కలెక్షనే్లమిటి? మూడో రోజుకి చేరిన లెక్కెంత? నాలుగో రోజు వరకూ థియేటర్లలో ఉందా? వెళ్లిపోయిందా? ఇవీ తాజా సినిమా లెక్కలు. ఫస్ట్ వీక్ కలెక్షన్లు, టెన్ డేస్ గ్రాస్ అవౌంట్? ఓవరాల్‌గా సినిమాకు ఎంత వర్కవుటైంది? పెట్టినంత వచ్చిందా? భారీగా వసూలు చేసిందా? బాక్సాఫీస్ దగ్గర తనే్నసిందా? ఇదీ కౌంట్ ట్రెండ్. ఫైనల్‌గా.. అంతకుముందు మరో హీరో సెట్ చేసిన కలెక్షన్ రికార్డులని దాటిందా? దాటితే -ఈ హీరో సినిమా రికార్డులను ఎంత తిరగరాసింది? లేదంటే ఎక్కడ ఆగింది? అంటూ చర్చలు, సంబరాలు, సంతోషాలు, ప్రెస్‌మీట్లు వరుసగా నడిచిపోతున్నాయ. పోతే సినీ క్రిటిక్స్ పెదవి విరిచిన సినిమాలపై సైతం ప్రేక్షకులు కనక వర్షం కురిపించడం చూస్తుంటే -మారుతున్న ప్రేక్షకాభిరుచికి అద్దం పడుతోందని చెప్పక తప్పదు.
క్లాసిక్కా? కామెడీనా..? మాస్ మసాలా సినిమానా? థ్రిల్లరా- హారరా.. ఇలా జోనర్లతో సంబంధం లేకుండా.. కంటెంట్ కనెక్టైతే కాలక్షేపానికి చూస్తే తప్పేం లేదన్న ప్రేక్షకుడి ఆలోచనలు కూడా పైన ఉదహరించుకున్న మార్పునకు కారణమని చెప్పేవాళ్లూ ఉన్నారు. నిజానికి కథేమీ లేకుండా గ్రాండియర్‌గా రూపొందిస్తున్న సినిమాలకూ పట్టంగడుతున్న సందర్భాలు ఇటీవలి కాలంలో ఏన్నో. అందుకే కొన్ని సినిమాలు టైటిల్స్‌తో సంబంధం లేకుండా, సినీ సమీక్షల ప్రభావానికి ఎదురు నిలిచి సక్సెస్ ట్రాకెక్కి కోట్లు కొల్లగొడుతున్న సంఘటనల్ని మనం చూస్తూనే ఉన్నాం.
నిన్నటికినిన్న టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ సినిమా అతి తక్కువ సమయంలో వంద కోట్లు వసూలుచేసి రికార్డు సృష్టించిన సందర్భం... అంటూ చెన్నై ఫ్యాన్స్ రూ.100 కోట్ల ఉత్సవం ఘనంగా జరిపి కొత్త ఒరవడికి నాందీ ప్రస్తావన చేసి తెలుగు సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.
సరే, లెక్కల మాటెలావున్నా.. కలెక్షన్ల బాటెలెలావున్నా.. ‘శతదినోత్సవాలు’ మాయమై ‘వంద కోట్లోత్సవాలు’ మొదలయ్యాయన్నది సరికొత్త మ్యాటర్. కొత్తదనాన్ని స్వాగతిద్దాం! మున్ముందు జరుగబోయే పాతిక కోట్ల- యాభై కోట్ల ఉత్సవాలు (చిన్న సినిమాల విషయంలో), ‘వంద కోట్ల- వెయ్యి కోట్ల’ ఉత్సవాలు (పెద్ద సినిమాల విషయంలో) వంటివీ రొటీన్ అవబోతున్నాయన్నది రాన్రానూ వాస్తవం అవుతుందే తప్ప, విడ్డూరం అనిపించుకోదు. ఇదే సమయంలో ఓ చిన్నమాట-
జేబు ఖాళీ చేసుకొని సినిమాకి వచ్చిన ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకుంటే, అతడు మరోమారు టికెట్ చించి మరీ థియేటర్లోకి అడుగుపెట్టాలనుకుంటాడు. యథాప్రేక్షక తథా నిర్మాత! ప్రేక్షకుడి మనసుని రంజింపచేసే సినిమా తీసిన నిర్మాత కూడా గలగలమంటూ కాసుల వర్షంతో నిండుకుంటున్న బాక్సాఫీసు పెట్టెని చూసి, పెట్టిన పెట్టుబడికి ఫలితం భారీగా దక్కిందనుకుంటాడు. మరి ఈ సూత్రం సినిమావాళ్ళు విస్మరించరాదు. వారి జేబుల్ని ఖాళీచేసుకుని, నిర్మాతల జేబుల్ని నింపే ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని వారికి నచ్చిన సినిమాలు తీస్తే సరి! సర్వే సినిమా సుఖినోభవంతు!

-ఎనుగంటి వేణుగోపాల్