Others

యువతే దేశానికి వెనె్నముక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేవండి.. మేల్కోండి..
గమ్యం చేరే వరకూ విశ్రమించకండి..
లేవండి.. మేల్కోండి..
మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని,
ఇతరులనూ మేల్కొల్పండి..
మీరు మరణించేలోపు
జీవిత పరమావధిని సాధించండి..
లేవండి.. మేల్కోండి..
గమ్యం చేరేవరకు ఎక్కడా నిలవకండి..
ఎప్పుడూ జాగృతగానే ఉండండి..
బలమే జీవితం.. బలహీనతే మరణం..
ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలంటూ యువతరాన్ని కోరుకున్నాడు. ప్రాక్ పశ్చిమ దేశాలన్నింటిలోనూ వేదాంత భేరిని మోగించిన స్వామి వివేకానందుడి ప్రతి మాట, ప్రతి సందేశం ఆయన జీవితానుభవంలోంచి వచ్చినవే.. అందుకే అవి సమాజంపై అంత ప్రభావం చూపించాయి. ప్రతి మనిషికీ భారతీయ తత్త్వచింతన వెలుగులో కొత్తదారి చూపాయి.
కలకత్తాకు చెందిన ప్రసిద్ధ న్యాయవాది విశ్వనాథ దత్తా, ఆయన సతీమణి భువనేశ్వరీదేవి దంపతులకు 1863 జనవరి 12వ తేదీ, మకర సంక్రాంతి పర్వదినాన నరేంద్రనాథ్ జన్మించారు. ఆ శిశువే అనంతరం స్వామి వివేకానందుడిగా ప్రపంచ ప్రసిద్ధి చెందారు. ఆయన చిన్నతనంలోనే అతడి తల్లి చెప్పే భారత, రామాయణ ఇతిహాసాలను చాలా శ్రద్ధగా వినేవాడు. మూఢనమ్మకాలను నమ్మేవాడు కాదు. అయితే అతడి జ్ఞాపకశక్తిని, అసాధారణ మేధాశక్తిని చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యపడేవారు.
నరేంద్రుడు చిన్నప్పుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. ఆయన సన్యాసుల పట్ల, యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. అయితే చరిత్ర, సైన్స్‌తో పాటు పాశ్చాత్య తత్త్వశాస్త్రాన్ని కూడా ఔపోసిన పట్టిన ఆయనకి రోజురోజుకీ మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగాయి. అలా మూఢనమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. అతడి సందేహాలన్నింటినీ ఎందరో పండితుల దగ్గర ప్రస్తావించినప్పటికీ వారి జవాబులు ఏవీ కూడా ఆయన్ని సంతృప్తి పరచలేదు. ఇటువంటి చిక్కు పరిస్థితిలో కలకత్తాకు కొద్ది దూరంలో దక్షిణేశ్వరంలో ఒక సాధువు ఉన్నాడని, తన ఆచార్యుడైన విలియం హేస్టీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ విధంగా 1881లో ఆధునిక భారతదేశపు దివ్యద్రష్ట అయిన శ్రీరామకృష్ణునికి, అతని సందేశ ప్రచారకుడైన నరేంద్రునికి పరిచయం కలిగింది. అప్పుడు నరేంద్రుడు ఆయనను ‘అయ్యా! మీరు దేవుణ్ణి చూశారా?’ అని ప్రశ్నించాడు. అందుకు రామకృష్ణులు ‘ఔను! నేను భగవంతుణ్ణి చూశాను! నిన్నిప్పుడు చూస్తున్న దానికన్నా స్పష్టంగా చూశాను’ అని సమాధానమిచ్చారు. అలా తన సొంత అనుభూతి ద్వారా దేవుణ్ణి దర్శించిన ఒక స్వామీజీ నరేంద్రునికి లభించాడు. అప్పటి నుంచి నరేంద్రుని అనుమానాలు తొలగిపోయి రామకృష్ణులవారికి శిష్యునిగా శిక్షణ ప్రారంభించాడు. నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణుల వారికి ఎంతో సమయం పట్టలేదు. కాళికా దేవి ఆయనకు మార్గనిర్దేశం కూడా చేస్తుంది. కానీ నరేంద్రుడు మాత్రం ఆయనను పరీక్షించే వరకూ గురువుగా నిర్ణయించుకోకూడదనుకున్నాడు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్ర్తిలని, ధనాన్ని, వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు. నరేంద్రుడు ఆయనకు ప్రియతమ శిష్యుడు. అలాగని నరేంద్రుడు చెప్పిన అన్ని విషయాలతో ఆయన ఏకీభవించేవాడు కాదు. విగ్రహారాధన చేసేవారిని నరేంద్రుడు బాగా విమర్శించేవాడు. అద్వైతాన్ని కూడా వ్యతిరేకించాడు. అలౌకిక అనుభవాల మీద అంతగా నమ్మకం లేదు. నేనే బ్రహ్మను, నేనే శివుణ్ణి అనే వాక్యాలేవీ అతనిని అంతగా ప్రభావితం చేసేవి కావు. కానీ ఎప్పటికప్పుడు రామకృష్ణులవారు నరేంద్రుని సరైన మార్గంలోకి తీసుకొచ్చేవారు. రామకృష్ణులవారు చివరి రోజుల్లో నరేంద్రుడిని పిలిచి ఆయన్ని చాలా మృదువుగా తాకి, ఆయన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోసి, అతనికి ఇలా చెప్పారు. ‘నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడువు.. వీళ్ళంతా నా బిడ్డల వంటివారు. వీరికి చూసుకోవాల్సిన బాధ్యత నీదే’ అన్నారు. అలా రామకృష్ణులవారు పరమపదించాక గంగా నది ఒడ్డుకి దగ్గరలో ఉన్న రామకృష్ణులవారి సమాధి దగ్గర రామకృష్ణమఠం స్థాపించారు నరేంద్రుడు. అక్కడ ఉండే యువ సన్యాసులకి రెండే లక్ష్యాలు ఉండేవి. ఒకటి ప్రజలకు సేవ చేయడం, రెండు ముక్తిని సాధించడం. ఇలా మారిన నరేంద్రుడు రామకృష్ణ మఠానికి నాయకుడయ్యాడు.
ఈవిధంగా కాషాయం ధరించి సన్యాసాన్ని స్వీకరించిన నరేంద్రుడు వివేకానందుడిగా మారాడు. ఆ తరువాత దైవ సాక్షాత్కారం కోసం నిరంతరం ధ్యానం చేశారు. పరివ్రాజకునిగా దేశసంచారం చేశారు. ఎన్నో క్షేత్రాలు తిరిగి భారతదేశంపై పూర్తి అవగాహనకు వచ్చారు. 1892లో స్వామి వివేకానంద కన్యాకుమారికి వెళ్లి అక్కడ ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసి ఈ ప్రదేశంలో నల్ల చలువరాతితో స్మారక కేంద్రాన్ని నిర్మించారు.
భక్తి అంటే..
భక్తి భగవధారాధన ఆలయంతో ప్రారంభమైతే ఫరవాలేదు. కానీ అక్కడితో ఆగిపోతేనే అసంపూర్ణం. కనిపించే ప్రతి జీవిలో భగవంతుడిని చూడటమే నిజమైన భక్తి. అంటే ఆలయాలు అనవసరమని, అర్చనలు చేయొద్దని స్వామి ఉద్దేశ్యం కాదు. మన పారమార్థిక ప్రయాణం అక్కడితో ఆగిపోకూడదని ఆయన మనోభావన. ఒకసారి బెంగాల్‌లో ముర్షీదాబాద్ ప్రాంతంలో నెలకొన్న కరువు కాటకాలు, చిన్నారుల ఆకలిచావుల గురించి సోదర సన్యాసి స్వామి అఖండానంద విదేశాల్లో ఉన్న వివేకానంద స్వామికి ఉత్తరం రాశారు. వెంటనే స్వామీజీ ఆయనను ఆ ప్రాంతంలోనే ఉండిపొమ్మని చెబుతూ.. ఏ ఆధ్యాత్మిక సాధనలూ అవసరం లేదు. వారి ఆకలి తీర్చే ఏర్పాటు చేయమని ఆదేశించారు. తమ గురుదేవులు శ్రీరామకృష్ణ పరమహంస బోధించిన ‘జీవ సేవే శివ సేవ’ అన్న నినాదాన్ని గుర్తు చేశారు. అఖండానంద ఆజన్మాంతం అభాగ్యుల సేవే భగవధారాధనగా భావించి ఆ సేవా కార్యక్రమాల్లోనే ఉండిపోయారు.
గురువంటే..
నా పేరు ప్రఖ్యాతుల్లో ప్రత్యేకత ఏమీ లేదు. నా గురుదేవులు తలుచుకుంటే మట్టిలోంచి నాలాంటి వివేకానందులను వేలాదిమందిని తయారుచేయగలరు. ఎంతటి కారణజన్ముడికైనా గురువు మార్గనిర్దేశం అనివార్యం అనేవారు స్వామి వివేకానంద. నిస్వార్థానికి, త్యాగానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే గురువు, అచంచల విశ్వాసం, అకుంఠిత దీక్ష ఉన్న శిష్యుడు రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తారంటారాయన. స్వయంగా స్వామి తన గురువు రామకృష్ణ పరమహంసకు శరణాగతులయ్యారు. ఆ గురువు ఆధ్యాత్మిక సంపదకు వారసుడిగా నిలిచారు. మనిషికి మేలు చేయి.. అదే మోక్షానికి మేలు దారి.. అంటారు వివేకానంద. ఆయన చెప్పిన కొన్ని సూక్తులను చూద్దాం.
* రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.
* నీ వెనుక ఏముంది? ముందు ఏముంది? అనేది నీకనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం.
* మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీన పరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.
* ఒక్కక్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.
* జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే.
* ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి.
* ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం.. ఇవి విజయాన్ని కాంక్షించేవారి ప్రాథమిక లక్షణాలు.
* విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు.. విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు..
* తనను తాను చిన్న బుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనులకంటే పెద్ద బలహీనత, తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు.
* లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి.
*
(నేడు స్వామి వివేకానంద జయంతి)

- సన్నిధి