Others

అయ్యప్ప దర్శనం.. సర్వైశ్వర్యప్రదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళలోని శబరిమల క్షేత్రం అయ్యప్ప క్షేత్రంగా ఎంతో ప్రాముఖ్యత పొందింది. ‘శబరిమల’ అయ్యప్ప దీక్షకు ప్రధాన స్థానం అయితే, శబరిమల అయ్యప్ప క్షేత్రంతో కలిసి పంచ అయ్యప్ప క్షేత్రాలు ఉన్నాయి. వాటిని తెలుసుకొందాం.
1. కుళిత్తుపుళా క్షేత్రం
తిరువనంతపురం నుంచి 60 కి.మీ దూరంలో ఉన్న క్షేత్రమే కుళిత్తుపుళాక్షేత్రం. ఈఆలయంలో స్వామి బాలకుని రూపంలో కనిపిస్తాడు. ఆలయం అంతా కేరళ సాంప్రదాయరీతిలో కనబడుతుంది. ఒక చేతిలో విల్లును, రెండో చేతిలో బాణాన్ని పట్టుకుని బాలుని రూపంలో ఉన్న అయ్యప్ప, పులి పాలు తేవటానికి గాను ఈ ప్రాంతానికి వచ్చి, కొంత సమయం ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారట. అందుకే ఈ ఆలయంలో స్వామి బాలుని రూపంలో దర్శనం ఇస్తాడని అయ్యప్పభక్తులు నమ్ముతారు.

2) అరియంగావు-
తిరువనంతపురం నుంచి 85 కి.మీ దూరాన ఉంటుంది అరియంగావు. ఈ ప్రాంతంలో యువకుడుగా ఉన్న అయ్యప్ప కొంతకాలం గడిపినట్లుగానూ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.ఇక్కడ స్వామి ఆలయం వెలయడానికి వెనుక ఒక కథ ఉన్నట్లుగా భక్తులు చెబుతారు. ఒక బట్టల వ్యాపారి ప్రతి సంవత్సరం తన వ్యాపార నిమిత్తంగా, కేరళ రాజధాని అయిన తిరువనంతపురంలోని మహారాజుకు నూతన వస్త్రాలను సమర్పించేవాడు. ఆ ఆనవాయితీని పాటిస్తూ, ఒక సంవత్సరం తన కూతురిని తీసుకుని బయల్దేరాడు. రాజధానికి చేరుకునేలోపే చీకటి పడటంతో, ఆ రాత్రి ఆలయంలో విశ్రమించారు. తండ్రీ కూతురు. ఉదయం వ్యాపారి కూతురిని ప్రయాణానికి సిద్ధంకమ్మని చెప్పాడు. తండ్రి తిరిగి వచ్చేంతవరకూ తాను ఆలయంలోనే ఉంటానని, అందుకు అనుమతిని ఇవ్వమని వ్యాపారి కొతురు తండ్రిని అభ్యర్థించింది. అందుకు అంగీకరించిన ఆ వ్యాపారి, ఆమెను పూజారికి అప్పగించి తాను తిరువనంతపురానికి వెళ్ళిపోయాడు. వ్యాపారి ఒంటరిగా ప్రయాణం చేస్తూండగా, ఏనుగులు అతనిపై దాడి చేసాయి.
ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక యువకుడు అక్కడకు వచ్చాడు. ఆ యువకుడే ఏనుగుల బారినుంచి ఆ వ్యాపారిని రక్షించాడు. తనను రక్షించినందుకు కృతజ్ఞతగా, అతనికి ఏ బహుమతి కావాలో కోరుకోమని చెప్పాడా వ్యాపారి. అప్పుడా యువకుడు, ‘‘నాకు వేరే బహుమతి ఏదీ వద్దు. నీ పుత్రిక ‘పుష్పకళ’నిచ్చి నాతో వివాహం జరిపించు అని చెప్పాడు. అందుకు సమ్మతించిన ఆ వ్యాపారి, ఆ యువకునికి, ఒక పట్టు వస్త్రాన్ని బహూకరించాడు. ఆ వ్యాపారి రాజువద్దకు వెళ్ళి తాను తెచ్చిన నూతన వస్త్రాలను ఆయనకు వినమ్రంగా సమర్పించాడు. తిరిగి అరియాంగావుకు చేరుకున్నాడు. తాను యువకునికి బహూకరించిన పట్టువస్త్రంతో, దేవాలయంలోని స్వామివారు దర్శనమివ్వడంతో, తనను రక్షించిన యువకుడు అయ్యప్పస్వామేనని గ్రహించాడు, ఆ వ్యాపారి. తాను మాట ఇచ్చిన ప్రకారంగా, స్వామివారితో తన కూతురి వివాహాన్ని జరిపించాడు. ఇక్కడి అయ్యప్ప స్వామివారికి వివాహం జరిగినట్లుగా, స్వామివారి ఎడమవైపున దేవేరి పుష్పకళ కొలువై ఉన్నది.
3. అచ్చన్ ఆలయం-
తిరువనంతపురం నుంచి 90 కి.మీ దూరంలో ఈ అచ్చన్ కోవెల ఉంది. ఈ ఆలయం అయ్యప్పస్వామి వారిని, పరశురాముడు ప్రతిష్ఠించినట్లుగాచెప్తారు. పూర్వం, పరశురాముడు, ఈ ప్రాంతానికి వచ్చి, అక్కడ పర్యటిస్తున్నప్పుడు రాత్రి అయంది. అపుడు ఆ పరశురాముడు ఈ ఆలయంలో విశ్రమించాడు. ఆ సమయంలో ఆ ప్రదేశం అంతా అరణ్య ప్రాంతంఅవడంతో పరశురాముడు సంచరిస్తున్నప్పుడు, ఒక విష కీటకం పరశురాముడిని కుట్టింది. ఆ బాధ తీవ్రమై ఆయన కదలలేకపోయాడు. బాధను భరించలేక పోతున్న సమయంలో ఒక యువకుడు పరశురాముని వద్దకు వచ్చి, తన చేతిలో ఉన్న పాత్రను ఆయనకు ఇచ్చి అమృతం లాంటి ద్రవాన్ని త్రాగమని చెప్పాడు. పరశురాముడు, ఆ బాలుడు చెప్పినట్లే చేశాడు. వెంటనే ఆయన బాధ తొలగిపోయింది. ఇక ఏ బాధలేదని ఆయన ఆ రాత్రి ఆ ప్రదేశంలోనే నిద్రించాడు. ఆయనకు స్వప్నంలో అయ్యప్పస్వామి ఆయనకు దర్శనమిచ్చారు. అందుకనే పరశురాముడు ఈ ఆలయాన్ని అయ్యప్ప స్వామి చెప్పినట్లుగానే నిర్మించాడు. అందుకే ఈ ఆలయం కేరళ సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా కాకుండా తమిళ సాంప్రదాయ రీతిలో కట్టినట్టు కనబడుతుంది.

4) శబరిమల-
కేరళలోని కొట్టాయం నుంచి 70 కి.మీ. దూరంలో శబరిమల క్షేత్రం ఉంది. మణికంఠుడు రాజ్యాన్ని త్యజించి, తాను వానప్రస్థానాన్ని స్వీకరిస్తానని, తాను వదలిన శరం ఎక్కడ నేలను తాకితే,ఆ ప్రాంతాన తనకు గుడి కట్టించమని తండ్రికి చెప్పాడు. పుత్రుని కోరిక ప్రకారంగా, వందళరాజు, ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మింపచేసాడు. ఆ ఆలయంలో అయ్యప్పస్వామి తపోముద్ర భంగిమలో కొలువైభక్తులకు దర్శనం ఇస్తాడు.
5. కాంతమలై
ఈ ప్రాంతంలో కొలువై ఉన్న అయ్యప్పస్వామిని దర్శించటానికి భక్తులకు ప్రవేశం లేదు. మకర సంక్రాంతినాడు స్వామివారు జ్యోతి రూపాన భక్తులకు దర్శనమిస్తారు. స్థల పురాణాన్నిబట్టి, కాంతమలై విశ్వకర్మచేత నిర్మింపబడిన స్వర్ణాలయంగా తెలుస్తోంది. ఈ ఆలయంలో జ్ఞానపీఠంపైన స్వామివారు ఆశీనులై ఉన్నారు. దేవతలు స్వయంగా ఈ స్వామికిపూజలు జరుపుతారు. ఇక్కడి గుడి కేవలం దేవతలకు మాత్రమే కనిపిస్తుందని, ఏ మానవులకు కనిపించదని స్థల పురాణ గాథ చెప్తుంది.
స్వామి అయ్యప్ప ఈ క్షేత్రంలో భక్తులకు దూరంగా ఏకాంతంగా ఉంటాడు. కేరళ రాష్ట్రంలోనే నిర్మింపబడిన ఈ నాలుగు క్షేత్రాలలోని అయ్యప్పస్వామిని దర్శించి, ‘మకరజ్యోతి’ని దర్శించిన భక్తులు పునీతులవుతారు. అయ్యప్పభక్తులంతా జ్ఞానాన్ని, భక్తినీ, ఆధ్యాత్మిక భావాన్నీ, పవిత్రతను, ప్రశాంతతనూ, పుణ్యఫలాన్ని పొందుతారు, ‘స్వామియే శరణం అయ్యప్పా.’ స్వామి శరణం అయ్యప్ప శరణం.

- చోడిశెట్టి శ్రీనివాసరావు