AADIVAVRAM - Others

బహుజనుల రాజ్యాధికార నిలువుటద్దం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో బహుజనుల రాజ్యాధికారానికి అత్యంత బలాన్ని చేకూర్చే యుద్ధం ‘్భమా కోరేగావ్ యుద్ధం’. చరిత్రలో ఎన్నో యుద్ధాలు ప్రపంచ వ్యాప్తంగా జరిగినాయి. యుద్ధాలన్నీ ఏదో ఒక ఫలితాన్ని ప్రతిఫలాన్నీ అధికారాన్ని ఆధిపత్యాన్ని ఆశించి జరిగినవే. కానీ భీమా కోరేగావ్ యుద్ధం మాత్రం ‘మూల భారతీయుల చరిత్రలో మహోన్నత ఆత్మగౌరవ పోరాటంగా చరిత్రలో నమోదు చేసుకుంది’’. ఇతరులు ఎవరైనా ఈ యుద్ధాన్ని మిగిలిన యుద్ధాల్లాగా జాతీయవాదం- వలసవాదంలాగా చూడవచ్చు. కానీ అంబేడ్కరిస్టులు మాత్రం అలా చూడడంలేదు. దానిని ఆత్మగౌరవ పోరాటంగా పరిగణిస్తున్నారు. మనిషిని మనిషిగా గుర్తించని బ్రాహ్మణవాదం పాలనమీద చెలరేగిన దళిత బహుజన విముక్తి పోరాటంగా గుర్తిస్తున్నారు. 1818 జనవరి 1 తారీకు భీమా నది (మహారాష్ట్ర) ఒడ్డున 500 మంది బహుజన సైనికులు వీరోచితంగా పోరాడి బ్రాహ్మణవాద పీష్వా రెండో బాజీరావు 28000 మంది సైనికులను మట్టి కరిపించారు. అంతవరకు మాంగులను, చమార్లను, మహార్లను అంటరానివారుగా, అవమానియంగా చూసే పీష్వా అంతుచూడటానికి సుమారు 49 మంది ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడి వీర మరణం పొందారు. వారిలో ఎక్కవగా మహర్ల్, చమారులు 24మందికాగా, ముస్లింలు ముగ్గురు, తక్కినవారు వెనుకబడిన వర్గాలు వున్నారు.
పూనె నుండి అహ్మద్‌నగర్ వెళ్లే దారిలో భీమా నది ఒడ్డున కోరేగావ్ విజయ స్తంభం నిటారుగా నీలి ఆకాశాన్ని తాకేలా, మూలభారతీయుల పోరాట స్ఫూర్తికి చిహ్నంగా నిటారుగా నిలబడి ఉంటుంది. ప్రతి ఏటా జనవరి ఒకటిన వేలాదిమంది అంబేడ్కరిస్టులు దేశవ్యాప్తంగా తరలిచ్చి తమ పూర్వీకుల ఆత్మగౌరవ పోరాటానికి వినమ్రంగా నివాళులు అర్పిస్తారు. తమ భవిష్యత్ పోరాటాలకు అంతులేని స్ఫూర్తిని నింపుకొని వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. మహాత్మా జ్యోతిరావు ఫూలే మాటల్లో... ‘‘్భమా కోరేగావ్ యుద్ధం తరువాతనే నాకు చదువుకునే అవకాశం వచ్చింది. నేను చదువుకున్నాక బ్రాహ్మణ కుట్రలు తెలుసుకున్నాను. చదువులేమివల్లే ఇదంతా జరిగింది. అందుకే శూద్ర - అతిశూద్ర జాతుల చదువుల కొరకు పాఠశాలలు స్థాపించాను’’. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో తెల్లదొరలు వ్యాపారం చేసుకోవడానికి భారత్ వచ్చారు. వీళ్లు వచ్చేనాటికి భారత్‌లో మూలా భారతీయులైన బహుజన జాతులను ఓడించి బ్రాహ్మణులు, రాజపుత్రులు, విదేశీ ముస్లిం రాజుల ఆధీనంలో ఆరువేల జాతులుగా విభజించబడిన వీరు ఆరు వందల పైగా రాజరిక పరిపాలనలో అణిగిమణిగా ఉన్నారు. రాజవంశీయులల్లో ఏ మూలన దేశభక్తిగాని, భారతీయతగాని అస్సలు లేదు. ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకుంటూ కన్నతండ్రిని, తోబుట్టువులను చంపి పీఠాలను అధిష్ఠించిన ఘోరమైన చరిత్ర వీరిది, వీళ్లంతా విదేశీయులు. మూల భారతీయులైనా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బహుజన జాతులను ఓడించి తమ దేశంలో కట్టు బానిసలుగా మార్చుకొని శూద్ర-అతిశూద్రగా ముద్రవేసి రాజ్యానికి దూరంగా నెట్టివేశారు.
సమాజంలో వైదిక వ్వయస్థ సృష్టించిన అవమానియ కట్టుబాట్లు అట్టడుగు అంటరాని వర్గాల ప్రజానీకం విలవిలలాడిపోయింది. ముఖ్యంగా అంటరాని జాతి అయిన నిమ్న వర్గాలు జంతువులకన్నాహీనంగా జీవనం సాగించే అధ్వాన్న పరిస్థితులు కల్పించేవారు. అతిశూద్రులు అయిన అంటరానివారు విధుల్లోతిరిగే వీలు లేదు. పగటిపూట మహర్, మాంగుల సంచారం నిషేధం,. వారి నీడ తమ మీద తమ వస్తువులమీద, ఇండ్లమీదా పడటంవల్ల అపవిత్రం అవుతాయి. సంచారం లేని వీధుల్లో అస్పృశ్యులు వస్తుంటే బ్రాహ్మణర్గాలు ఎదురైతే వెంటనే అస్పృశ్యులు మొహం చూపకుండా నేలమీద పడుకోవాలి. అతిశూద్రులు ఉమ్మి వీధుల్లో పడకుండా మెడకు ముంతలు కట్టుకొని తిరగాల్సి వచ్చేది. తమ అడుగులు తుడుచుకుంటూ రావటానికి వీలుగా వీపు వెనుక భాగంలో చీపుర్లు, ఆకుల్లాంటివి కట్టుకోవాల్సి వచ్చేది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా దుర్భర పరిస్థితులు ఉండేవి. సనాతనంగా వస్తున్న అణచివేతను ఎదుర్కొనేందుకు ఈ యుద్ధం బహుజనులకు ఒక ప్రతీకారం వచ్చింది.
ఈ భీమా కోరేగావ్ యుద్ధం గురించి డా బాబాసాహెబ్ అంబేద్కర్‌గారి మాటల్లో...
క్రీ.శ.1757లో ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలకు - బెంగాల్ నవాబ్ సిరాజుద్దీన్ దౌలా సైన్యాలకు మధ్య యుద్ధం జరిగింది. ఇందులో బ్రిటీష్ దళాలు గెలిచాయి. చరిత్ర దీనికి ప్లాసి యుద్ధం అని పేరు పెట్టాయి. చివరి యుద్ధం క్రీ.శ.1818లో జరిగింది. ఇదే భీమా కోరేగావ్ యుద్ధం. ఈ యుద్ధంలో మరాఠా పీష్వా బ్రాహ్మణ సామ్రాజ్యం ధ్వంసమై భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యం స్థాపించబడింది. 1757-1818 మధ్యకాలంలో దుసాదుల నుండి మహర్ సైనికుల వరకు అందరూ మూల భారతీయ సైనికుల సహాయంతోనే సాధ్యమైంది.
చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ బ్రాహ్మణులకు- దళిత బహుజన జాతులకు మధ్య జరిగినవే. అందుకే డా.అంబేద్కర్‌గారు భారతదేశ చరిత్ర అంటే.. బ్రహ్మనిజానికి, బౌద్ధిజానికి మధ్య జరిగిన యుద్ధమే అన్నారు. గత చరిత్ర అంతా మనువాద చరిత్రనే దాన్ని మన చరిత్రగా భ్రమింపజేస్తున్నారు.
‘‘మన చరిత్ర సరిగా పరిశోధించకపోతే మనువు ధర్మశాస్త్రం చరిత్రను అంతం చేయలేము’’. వర్తమానంలో 1818 యుద్ధ విజయాలను బహుజన దృష్టి కోణంలో చూడవలసిన అవసరం ఎదురైంది. భీమా కోరేగావ్ విజయాన్ని మూలాభారతీయుల పోరాట విజయంగా చరిత్రలో నమోదు చేయాల్సిన అవసరం వుంది. 202 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు రాబోవు తరాల కోసం దళిత బహుజన చరిత్రను మనకందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలుగా పిలువబడే బహుజన జాతులదే. ఈ దేశంలో భూమి మనది, దేశ సంపద మనది, ఈ దేశ సంస్కృతి మనది, ఒకనాడు పాలకులం మనం. మనది క్షత్రియ జాతి అని సాక్ష్యాధారాలతో నిరూపించినా నమ్మే ఆసక్తిలో మనం లేం. మహాత్మా జ్యోతిరావు పూలే, డా.అంబేద్కర్, మాన్యశ్రీ కాన్షిరాంలు జీవితకాలమంతా పోరాటంచేసిన దేశం మనది. మీరు ఈ దేశానికి పాలకులని చెప్పారు. ఆది జాంబవంతుడు నాటినుండే మనం ఈ దేశంలో గణరాజ్యాలు ఏలామనే వాస్తవం ఎర్ర ఉపాళి పాటలల్లో, డక్కలి పురాణంలో కూడా స్పష్టంగా ఉంది. బుద్ధుడు, అశోకుడు కాలాల్లో కూడా వౌర్యవంశం, నంద వంశం మంచి పరిపాలన అందించిన వంశీయులుగా.. అశోక శిలా శాసనాలు చెబుతున్నాయి.
ఆంగ్లేయులు ఈ దేశంపై దండయాత్రలు చేసి ఆక్రమించినవారిలో ప్రధానంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. ముందుగా మనువాద బ్రాహ్మణులైతే రెండోవారు విదేశీ మొఘల్స్, మూడవవారు ఆంగ్లేయులు. ఏది ఏమైనప్పటికీ మనువాద కబంధ హస్తాల కింద ఇంకా అట్టడుగు, దళిత, బలహీన వర్గాలు ఇంకా బానిసత్వంలో, కులతత్వాన్ని పులుముకొని, మతం ముసుగు మూలుగుతూనే ఉన్నాయి. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ మనువాద బ్రాహ్మణ ఉక్కు పాదాల కింద నుండి విముక్తి జరగాలంటే, మను చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ‘‘చరిత్ర తెలియనివాడు చరిత్ర నిర్మించలేడు’ అన్నాడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్. 70 ఏళ్ళ స్వాతంత్య్ర భారతంలో బహుజనులు బానిసలుగానే ఉన్నారు సుమీ.
మనువాద బ్రాహ్మణ చరిత్రకారులు మన మూల భారత చరిత్రను వక్రీకరించి రాశారు. హిందూయిజం అంటేనే బ్రాహ్మణిజం. బహుజనుల సమాజ చరిత్రనంతా పరాజితుల చరితను నమోదు చేశారు. మన చరిత్ర అంతా పరాజితుల బానిసత్వం చరిత్రగా నిలిచింది. భారతదేశంపై ఏ దేశం దండెత్తి వచ్చిన ఆయా దేశాల రాజ్యం, రాజులతో జతకట్టింది. అందులో అంతర్భాగం అయింది మనువాద బాపనిజం. వరుసగా తురుష్కులు, మొఘల్స్, పోర్చుగీస్, ఫ్రెంచ్, డచ్, చివరగా ఆంగ్లేయుల ఆక్రమణదారులు ఎవరొచ్చినా వారితో జతట్టింది. వారి రాజకీయ, శాసన, కార్యనిర్వహణ మొదలగు అన్ని విషయాల్లో బ్రాహ్మణులు భాగస్వామ్యం అయ్యారు. ముఖ్యంగా కార్యినిర్వహణ విధులన్నీ బ్రాహ్మణ మంత్రులే. ఔరంగజేబు సేనాపతి అఫ్జల్‌ఖాన్ ఉంటే, మంత్రిగా కులకర్ణి వున్నాడు.
బహుజనుల పోరాట యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ ఈ దేశ స్వాతంత్రయం కోసం పోరాడితే బ్రాహ్మణులకు నచ్చలేదు. శివాజీకి పట్ట్భాషేకం చేయమంటే ‘నీవు శూద్ర రాజువు. నీకు పట్ట్భాషేకం చేస్తే నిన్ను ముట్టుకొని వీర తిలకం దిద్దితే మేము మైలపడతాము. అది మా బ్రాహ్మణ ధర్మానికి వ్యతిరేకం అని పట్ట్భాషేకం వ్యతిరేకిస్తే, గంగాభట్ అనే బ్రాహ్మణ పూజారి డబ్బు తీసుకొని ఖాళీ బొటనవేలితో శివాజీ నుదుటిపై తిలకం దిద్దాడు. ఇంతకంటే ఘోరమైన అవమానం మరేదీ ఉండదు. మత సంస్థలను తమ అదుపులోకి తీసుకుని బ్రాహ్మనీకరణ చేశారు. ఇస్లాంను బలహీనపరిచేందుకు, దాని ప్రభావము తగ్గించేందుకు ఎన్నో పథకాలు వేసి ముస్లింలు సాన్నిహిత్యం పొంది వారిని ప్రసన్నం చేసుకొని అల్లా ఉపనిషత్తులు రచించారు. క్రైస్తవంలోకి మారి చర్చిని, ఆస్తులు సొంతం చేసుకున్నారు. క్రైస్తవుణ్ణి బ్రాహ్మణున్ని చేశారు. వారికి ఆస్తులు, ఐశ్వర్యం లభిస్తే, బహుజనులకు బైబిలు పఠనం, ప్రచారం, ఆరాధనలకు పరిమితం అయ్యారు. ప్రతి రంగంలోనూ అడుగు అడుగున తమ కుటిల నీతిని ప్రదర్శిస్తున్నారు.
వాస్తవంగా చరిత్ర భీమా కోరేగావ్ యుద్ధం ఎన్నటికీ బహుజనులకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. 150 సంవత్సరాలు ఆంగ్లేయుల పక్షాన పోరాడినది అంటరాని భారతీయుల సైన్యం. 1828 భీమా కోరేగావ్
యుద్ధం కేవలం 6 బ్రిటీషర్లు, 500 మంది పదాతి దళం మరియు 300 మంది అశ్విక దళంతో పీష్వాలు యుద్ధం చేశారు. 25000వేల పదాతి దళం, 5వేల అశ్విక దళం కల్గిన పీష్వా సైన్యమును 12 గంటలు జరిగిన యుద్ధంలో భీమా నది ప్రవహిస్తున్నప్పటికి మంచినీళ్లుకూడా అందనంత దూరంగా చిత్తు చిత్తుగా మహర్ రెజిమెంట్ ఓడించింది. గత చరిత్రను అధ్యయనం చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ 1832 గుండుబల్ల సమావేశం తరువాత సర్వహక్కులు దళిత బహుజనులకు సిద్ధిస్తాయనే నమ్మకంతోనే.. మీరు పాలకులు కాబోతున్నారు. మీ తెల్లటి సున్నపు గోడలపై బొగ్గులతో రాసుకోండి అని బలంగా దృఢంగా చెప్పాడు.
పీష్వా బ్రాహ్మణ రాజ్యంలో శూద్ర అతిశూద్ర పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో జ్యోతిరావు పూలే పుస్తకాలు తృతీయ రత్న, గులంగిరి, రైతు కొరడాలల్లో బ్రాహ్మణ దుర్మార్గపు వ్యవస్థను గూర్చి తేటతెల్లం చేశారు. అదనునుచూసి మూల నివాసులు భీమా కోరేగావ్ యుద్ధంలో బ్రాహ్మణులను చావుదెబ్బకొట్టారు. తరువాత 1857 సిపాయి తిరుగుబాటులో బ్రాహ్మణ ఆధిపత్యం చూపించి, బహుజనుల భర్తీ కాకుండా చేశారు. ఆంగ్లేయులతో చేతులు కలిపి అట్టడుగు, అణగారిన వర్గాలకు అధికార బదిలీ లేకుండా చేశారు. చివరి దశలో బాపని, బానియా, రాజపుత్రులు కలిసి తెల్లోళ్లకు మేము మీకు సేవకులుగా ఉంటామని చెప్పి బహుజనులను.. ఆధిక్యాన్ని దూరంగా నెట్టివేశారు. 1885 డిసెంబర్ తరువాత పుట్టిన కాంగ్రెస్‌తో బ్రిటీష్ వారిని ముందు పెడుతూ తిరిగి స్వాతంత్య్ర పోరాటాల పేర తిలక్, గోఖలే, మోతిలాల్, నెహ్రూ, రాజేంద్రప్రసాద్, గాంధీజీ మొదలగు వారు కలిసి దళిత బహుజనుల హక్కులకు, అభివృద్ధికి అటు రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బకొట్టారు.
1932 ఆగస్టు 17న గుండుబల్ల సమావేశంలో డా.అంబేద్కర్ బ్రిటీష్ వారితో పోరాడి బహుజనులకు రాజకీయ హక్కులు సాధించి పెడితే, బ్రాహ్మణ, రాజపుత్ర, బానియా, జాతులు అగ్గిలంమీద గుగ్గిలం అయ్యారు. కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకగా మహాత్మాగాంధీ గారు నిరాహారదీక్ష చేస్తే 1932 ఆగస్టు 21న గాంధీజీ శూద్రుడైన వల్లభాయి పాటలకు ఉత్తరం రాస్తూ ‘‘ది పాజిబుల్ కాన్సిక్వెనె్సస్ ఆఫ్ సపరేట్ ఎలెక్టోరేట్స్ ఫర్ హరిజన్స్ ఫిల్ మి విత్ హర్రర్, అన్‌టచ్‌బుల్ హూలిగాన్స్ విల్ మేక్ కామన్ కాజ్ విత్ ముస్లిమ్ హూలిగన్స్ అండ్ కిల్ కాటిల్ హిందూస్’’- ‘‘హరిజనులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తే జరుగబోయే పరిణామాలు నన్ను భయకంపితుడిని చేస్తున్నాయి. అంటరాని గుండాలు, ముస్లిం గుండాలు ఒక్కటై సువర్ణ హిందువులను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల చంపేస్తారు..(కలెక్షన్ వర్క్స్ ఆఫ్ ఎం.క.గాంధీజీ, వా.101 పే.469) గాంధీజీ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలపై కక్షను వెళ్లగక్కాడు. అంటరాని జాతులైన మూల భారతీయులకు సాధించిన రాజకీయ హక్కులకు వ్యతిరేకంగా గాంధీజీ మొదటిసారి ఆమరణ నిరాహారదీక్ష ఎరవాడ జైలులో చేపట్టారు.
డా. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అడుగు అడుగున అడ్డుకున్నారు. అయినా మనోధైర్యం, సహనము కోల్పోకుండా డా.అంబేద్కర్ అంతిమంగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా వుంటూ సర్వహక్కులు బహుజనులకు అందించాడు. సమాన వయోజన ఓటు హక్కు, ప్రాథమిక హక్కులు, రాజకీయ హక్కులు సంపాదించి పెట్టారు. స్ర్తిల కొరకు 1955లో తానా న్యాయశాఖ పదవికి రాజీనామా చేశారు.
అదే బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలోనే నడిచి బహుజన కులాలను ఏకం చేసి రాజ్యాధికారం రుచి చూపించిన మాన్యశ్రీ కాన్షీరాం అలుపెరుగని పోరాటం చేశారు. దళిత జాతికి చెందిన మాయావతి అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారు. దీనికి అంతటికీ కారణం బీమా కోరేగావ్ యుద్ధం స్ఫూర్తితోనే.
నేడు మళ్లీ హైందవ పడగలు విప్పి బుసలుకొడుతోంది. దళిత బహుజనులై ఆహారంపై ఆంక్షలు, కులం పేర, మతం పేర మైనారిటీలపై దాడులు, పౌరసత్వం సాకుగా ముస్లింలను ఒంటరి చేయడం, విద్యా సంస్థలు నిర్వీర్యం చేయడం, దేశ సంపద కొంతమంది వ్యక్తుల పరం చేయడం, ప్రశ్నించిన మేధావులను ఖూనీ చేయడం, యూనివర్సిటీలలో నిత్యం అణచివేత దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
అందుకే ఒక్కసారిగా భీమా కోరేగావ్ యుద్ధాన్ని ఆవాహన చేసుకోవాలి. 1 జనవరి, 2020 నాటికి బ్రాహ్మణ పీష్వా రాజ్యాన్ని అంతమొందించి రెండు వందల రెండు సంవత్సరాల ఏళ్ళు పూర్తిఅవుతున్న సందర్భంగా మూల భారతీయులు ఈ దేశాన్ని ఏలిన పాలకులమని మరోసారి గుర్తుచేసుకునే అవసరముంది. బహుజనుల వీరులను, వారి పోరాటాలను స్మరించుకొని రాజ్యాధికారం దిశగా సాగుతూ ‘్భమా కోరేగావ్ యుద్ధమే’ పునాదిగా బహుజజన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా మునుముందుకు సాగాలి.
*

-మధుసూదన్ కాసర్ల 9885721263