Others

సృజనకారులు కొండవీటివారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండవీటి వేంకట కవి.. తెలుగు సువర్ణాక్షరాల్లో లిఖించదగ్గ పేరు. వీరు పేరుకు తగ్గట్టు కొండల్ని పిండి చేస్తూ కొండంత ఇంకా చెప్పాలంటే ఆకాశమంత సాహిత్యాన్ని తెలుగు సాహితీ వినీలాకాశానికి అందించిన సాహితీ సుగంధ పుష్పం. ఈ సాహితీ సుగంధ పుష్పం సుప్రసిద్ధ కవి. హేతువాదీనూ. చలనచిత్ర సంభాషణల రచయిత. సృజనకారులు కూడా. ఇవే కాదు ముఖ్యంగా కొండ్రెడ్డి వారు సంఘ సంస్కర్తలు. మట్టిని, మనిషిని ప్రేమించిన ఈయన మానవతావాది. చక్కని సృజన్మాతకత శక్తితో సాహితీవీధిలో రాణించారు.
‘కవిరాజు’, ‘కళాప్రపూర్ణ’ బిరుదులకు వనె్న తెచ్చినవారు. కొండవీటి వేంకట కవిగారు గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా విస్పర్ల గ్రామంలో నారాయణ, శేషమ్మ పుణ్య దంపతులకు అపురూప కానుకగా పుట్టారు. వీరు ప్రాథమిక విద్య తండ్రి వద్దనే నేర్చారు. సరికొండ నమ్మాళురాజు దగ్గర సంస్కృత కావ్య పఠనం, దువ్వూరి వెంకట రమణ వద్ద ఉన్నత విద్యను విజయవంతంగా పూర్తి చేశారు.
వీరు తన 14 ఏట నుంచి కవితా రచనకు శ్రీకారం చుట్టారు. తెలుగు పండితునిగా విద్యాబోధన చేశారు. 1936లో కిసాన్ -కాంగ్రెస్‌కు సహాయ కార్యదర్శిగా పనిచేశారు. వీరు చిన్నమ్మ గారిని వివాహం చేసుకొన్నారు. చిన్నమ్మగారు కూడా భర్తకు అనుగుణంగా ఉండే ఇల్లాలే.
1932లో కర్షకుల మీద, 1946లో చిన్న కేశవ శతకం రచించారు. బుద్ధుడు, వేమన, గాంధీజీ వీరి ముగ్గురి జీవితాలను వర్ణిస్తూ మూడు శతకాలను త్రిశతి పేరుతో విడుదల చేశారు. 1942లో హితబోధ, 1944లో ఉదయలక్ష్మీ నరసింహ తారావళిని కూడా రచించారు. భీవన్నా రాముని చరిత్ర గద్యకావ్యాన్ని, దివ్య స్మృతులు, నెహ్రూ చరిత్ర, సంస్కృతంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర సుప్రభాతం వంటి ఎన్నో అద్భుతమైన రచనలు చేశారు. ఇంకా వీరిని ఎన్నో అముద్రిత గ్రంథాలున్నాయి.
మరుగు పడిపోతున్న ప్రాచీన గ్రంథాలెన్నింటినో పరిష్కరించి ప్రచురించి ఎంతోమంది మరుగున పడిన కవులను వెలుగులోకి తెచ్చి వారికి కొత్త వెలుగు నిచ్చారు.
వీరు గొప్ప సినీ సంభాషణల రచయిత నందమూరి తారకరామారావు స్వయంగా వీరిని పిలిపించి దాన వీర శూర కర్ణ చిత్రానికి సంభాషణలు రాయించుకున్నారు. ఆ తరువాత శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాకి కూడా సంభాషణలు ఈయనే రచించారు. తాండ్రపాపారాయుడు, ఏకలవ్య, విశ్వనాథ వంటి పత్రికలకు ముందు మాట వ్రాశారు. ‘‘పరదేశీ పాఠాలు’ పేరిట సుదీర్ఘ కాలం పత్రికల్లో కాలమ్ నడిపారు. తెలుగు సమాజాన్ని సంస్కరించే దిశగా ఎంతో దూరం నడిచి ఎంతోమందిని చైతన్యవంతం చేశారు. సుప్రసిద్ధ కార్టునిస్టు శ్రీధర్ గారు... సోక్రటీస్ లాగా తన ప్రపంచం తప్ప మరొకటి తెలియని వారు అతిసామాన్యంగా కన్పించే అసాధారణ తాత్వికుడు, వేదాంతి ఈ కొండవీటి’’ అని అన్నారు. తూమాటి దోణప్ప గారు కొండవీటిగారిని -సహృదసదనంగా సంస్కార ప్రతిపాదనంగా, సమాజ ప్రబోధ సాధనంగా నిర్దిష్టమైన సాధన సామగ్రితో సాహితీ సమారాధనమును సాగించిన 19 వ శతాబ్ది మేటి కవి అని మెచ్చుకున్నారు.
పద్యం రాసినా, గద్యం రాసినా, కొండవీటి వారి అది పాఠక హృదయాంతరాళాల్లోకి చొచ్చుకుపోవాల్సిందే. వారిలో హృదయస్పందన కలుగచేసి వారిని చైతన్యవంతులను చేయాల్సిందే. నందమూరి తారక ప్రాచీన కావ్యాలను కొత్తకోణం నుంచి వివేచన చేసి రాసిన విమర్శనాత్మక వ్యాసాలు ఆయనలోని నిత్య చైతన్యత్వాన్ని, తాత్వికతను తెలియపరుస్తాయి.
ప్రజల్లో చైతన్యం రావాలని వారు దొంగబాబాలను నమ్మకూడదని, విభజించి పాలించు అనే సూత్రాన్ని అనుసరించే రాజకీయ నేతలకు దూరంగా ఉండాలని ఎన్నో ఉపన్యాసాలిచ్చేవారు. కొండవీటి వారు పురోహితులై త్రిపురనేని రామస్వామి వారు రచించిన ‘పెళ్లి సూత్రాలు’ చదివి ఎంతోమంది జంటలను గృహస్థాశ్రమంలోకి పంపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికార భాషాసంఘం సభ్యునిగా కూడా ఉండి తెలుగుభాషకు ఎనలేని సేవ చేశారు.
సన్మానాలు, సత్కారాలు అవసరం లేదని చెప్పడానికి హాస్య ప్రియులైన వీరు తనకు ఏమాత్రం పెద్ద పెద్ద ఆశలులేవని కేవలం ఏనుగు మీద ఊరేగించి, కాలుకి గండపెండేరం తొడిగితే చాలు అనేవారు. పైగా ఈ ఏనుగు, గండపెండేరానికి మీరు గడ్డిఅనే పదార్థాన్ని వాడినా తనకు సమ్మతమే ననేవారు.
ప్రోలయ వేలమ ప్రోది చేసిన నేల
వామన భట్టు ......
కాటయ వేమన కత్తిపట్టిన చోటు
అనవేమ సార్వభౌమని విహార స్థలి
శ్రీనాథ సుకవి కాలూను వసతి
శంభు దాసుడు పదాబ్జములు మోపిన
యిక్క యోగి వేమన నిల్చు త్యాగభూమి ...
ఇటువంటి కొండవీటి సీమనుంచి ప్రభవించిన కొండవీటివేంకట కవి గారు 1991 ఏప్రిల్ 7న పరమపదించారు. కవిగా, వ్యాఖ్యాతగా, దేశకునిగా, భాష్యకారునిగా, వేదాంతిగా ప్రకాశించారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడు ఒక సంస్కర్త, సాహితీ, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో ఎవరెస్టు శిఖరం అయిన కొండవీటి వారిని స్మరిస్తూ వారి చూపిన బాటలో నడవడమే మనం వారికిచ్చే ఘన నివాళి.

- పింగళి భాగ్యలక్ష్మి 9398163836