Others

సిఏఏపై ‘మిడతల దండు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోకి పాకిస్తాన్ నుంచి భారీ ఎత్తున ‘మిడతల దండు’ వచ్చి పంటలను సర్వనాశనం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ), జాతీయ పౌర పట్టికను వ్యతిరేకించేవారు అదే రీతిలో మిడతల దండులా దాడి చేస్తున్నారు. ప్రజల ఆలోచనలను, అభిప్రాయాలను కలుషితం చేస్తున్నారు. ఉత్పాదకతను దెబ్బతీస్తున్నారు. ఈ చట్టం అమలుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తమ జ్ఞానాన్ని గంగలో కలిపేసి మాట్లాడుతున్నారో, మూసీనదిలో నిమజ్జనం చేసి వ్యవహరిస్తున్నారో తెలియదు కానీ ఇంత అర్థరహితంగా, ఇంత దిగజారుడుతనంతో మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. గణతంత్రదినమైన ఈ రోజు కూడా ఆ చట్టంపై ఒవైసీ విషం చిమ్మేందుకు సిద్ధమయ్యారు. దశాబ్దాలుగా సామాజిక కార్యకర్తగా వ్యవహారాలు నడుపుతున్న మేధాపట్కర్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక ద్వారా ప్రజల ఆస్తులను లాగేసుకునే కుట్ర జరుగుతోందని హెచ్చరించారు. వివిధ పత్రికలలో ఆ ‘‘వార్త’’ ప్రచురితమై ప్రజలను ఆందోళనకు గురిచేసింది. గత నెల నెలన్నర రోజులుగా ఉద్యమాలు జరుగుతున్నా ఈ రకమైన హెచ్చరిక ఎవరూ చేయలేదు. సామాజిక కార్యకర్తగా, నర్మదాబచావో ఆందోళన్ ఉద్యమకారిణిగా పనిచేసిన ఆమె ఈ హెచ్చరికలు, అభూతకల్పనలతో కూడిన మాటలు మాట్లాడవచ్చా? ఇంత ‘దుర్మార్గం’గా వాస్తవాల్ని వక్రీకరించడం తగునా? ఇంత దిగజారిపోయి అవాస్తవాల్ని ప్రచారం చేయడం సబబేనా?
సిఏఏ భారతీయ పౌరులనుద్దేశించిన చట్టం కానే కాదు. దశాబ్దాలుగా ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వాలు దీనిపై అనేక ఆలోచనలు చేశాయి. ఆయా పార్టీలు చాలా లోతుగా ఈ విషయాలను పరిశీలన చేశాయి. గతంలో ఆ చట్టం చేసి ‘క్రెడిట్’ కొట్టేయాలని కాంగ్రెసు ప్రభుత్వం ప్రయత్నించిన విషయం విస్మరించరాదు. ఇంత జరిగాకనే పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ దేశాలలోని అల్పసంఖ్యాక బాధిత వర్గాలవారు ఐదు సంవత్సరాల క్రితం శరణుకోరిన వారికి భారత పౌరసత్వం కల్పించేదే సిఏఏ. ఇంతటి సాధారణ విషయంలో భారత ముస్లింలు గాని, మరొకరు గానీ ఏవిధంగా ఇబ్బందుల పాలవుతారో ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా ప్రజల ఆస్తులను ప్రభుత్వం లాగేసుకునే కుట్ర అందులో దాగుందని విష ప్రచారం చేయడం భావ్యమా? అందులోనూ జాతీయస్థాయిలో పేరున్న వ్యక్తి, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని ‘‘ఒపినీయన్ మేకర్’’గా గుర్తింపుపొందిన మేధాపట్కర్ లాంటి మహిళ ఇలా రెచ్చగొట్టవచ్చా? విద్యాధికురాలు ఇంత బాధ్యతారహితంగా ప్రజలను పక్కదారి పట్టించడం, గందరగోళానికి గురిచేయడం, భయాందోళనలను పెంచడం ఏరకంగా సమర్థనీయం?
అంతేగాక ఈ పద్ధతిలో ఆదివాసీల, దళితుల, ముస్లింల ఆస్తులను ప్రభుత్వం లాగేసుకుందని కూడా ఆమె పేర్కొన్నారు. ఇదే తరహా కుట్ర గుజరాత్‌లో జరిగిందని, ఆ కుట్రను దేశవ్యాప్తంగా అమలుపరిచేందుకే సిఏఏని తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు. సిఏఏ కిందకు ఆస్తుల జప్తు లేదా లాగేసుకునే అంశం ఎలా వస్తుందో ఆమెకే తెలియాలి. దేశం నలుమూలల ఈ విషయమై ఆందోళనలు జరిగినా ఎవరూ ఆస్తులు లాగేసుకునే అంశం ఆ బిల్లులో.. చట్టంలో ఉందని పేర్కొనలేదు. భయాందోళనలు వ్యక్తంచేయలేదు. మేధాపట్కర్ మాత్రం బహిరంగంగా ఆ విషయం చెప్పారు. ఎవరికి కనిపించని అంశాలు, వాక్యాలు, పదాలు ఆ చట్టంలో ఆమెకు మాత్రమే ప్రత్యేకంగా ఎలా కనిపించాయో తెలియదు. అంతేగాక.. నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్ (ఎన్‌ఆర్‌సి), ఎన్‌పిఆర్ రూపొందించేందుకు చేసే భారీ ఖర్చు మురికి కూపం పాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ధనాన్ని ఇతర ప్రజాప్రయోజన కార్యక్రమాలపై ఖర్చుచేస్తే ఎంతో ఉపయోగముంటుందని ఓ ఉచిత సలహాఇచ్చారు. అంతర్జాతీయ వేదికలపై, వివిధ దేశాల అత్యున్నతస్థాయి సమావేశాలలో పాల్గొనే, ఆర్థిక నివేదికలను అధ్యయనంచేసే, ‘గ్రోత్ ఇంజన్ల’ గూర్చి అవగాహన ఉన్న మహిళ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ప్రతి పది సంవత్సరాలకోసారి దేశ జనాభాను లెక్కించే ప్రక్రియ దండగ అన్న విద్యావంతురాలు బహుశ ఈమె ఒక్కరే అయి ఉంటుంది!
ప్రతి దేశ ఆర్థికప్రగతికి అవసరమైన ప్రణాళికలను ఆ దేశ ప్రజల స్థితిగతులపై, సంఖ్యపై ఆధారపడి రూపొందిస్తారు. తరతరాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.. ప్రపంచమంతటా ఈ క్రతువు జరుగుతుంది. ఆ గణాంకాల ప్రకారమే ఏ ప్రజాప్రయోజన ప్రణాళికను చేపట్టాలో తెలుస్తుంది. ఈ సూక్ష్మ విషయాన్ని సైతం రాజకీయం చేసేందుకు, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఉపయోగించుకోవడం ఎంత నీచమైన చర్య?
సమాజంలో అంతరాలున్నాయని, ఆర్థిక వ్యత్యాసాలున్నాయని ఇందుకై పోరాటంచేయాలని ఆమె పనిలోపనిగా పిలుపునిచ్చారు. అంతరాలు లేని సమాజం ఓ ఊహ... ఓ కల... ఉటోపియన్ భావన మాత్రమే. ఈ అంతరాలు తగ్గించేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టేందుకే జాతీయ పౌర పట్టిక అన్న ఇంగిత జ్ఞానం లేకుండా విశృంఖలత్వంతో మాట్లాడితే గొప్ప మేధావిగా ఆమెను ప్రజలు గుర్తిస్తారా? ఎన్‌ఆర్‌సిని పూర్తిగా తిరస్కరించి జాతీయ ప్రతిఘటనా ఉద్యమానికి సిద్ధం కావాలని కూడా ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ కొత్త వేదికను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఉద్యమకారులందరూ ఒకే గొడుగు కిందకు రావాలని కోరారు. అంతేగాక ఆమె కులతత్వం గూర్చి, మతతత్వం గూర్చి, కార్పొరేటీకరణ గూర్చి తన ‘‘అమూల్య భావాలు’’ పంచుకున్నారు. సకల సమస్యలకు పరిష్కారం ప్రతిఘటన పోరాటంలోనే ఉందని ఆమె ఉవాచ.
కొన్ని వారాల క్రితం మరో ప్రముఖ మహిళ, రచయిత్రి అరుంధతీరాయ్ పౌరసత్వ సవరణ చట్టంపై, జాతీయ పౌర పట్టికపై ఇలాగే అవాకులు చవాకులు పేలారు. తన అజ్ఞానాన్ని మేధాపట్కర్ లాగే మీడియా ముందు ప్రదర్శించారు. జాతీయ పౌర పట్టికకోసం అధికారులు ఇళ్ళ వద్దకు వస్తే తప్పుడు పేర్లు చెప్పి పూర్తి తప్పుడు సమాచారం నమోదుచేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు మేధాపట్కర్ ప్రజల ఆస్తులను లాగేసుకునే కుట్ర సిఏఏ, ఎన్‌ఆర్‌సిలో దాగుందని చెబుతున్నారు. అసలు వీరికి ప్రజలంటే, దేశమంటే, ప్రగతి అంటే ఇంత చులకన భావమా? భారత పార్లమెంట్ చేసిన చట్టం సమాజాన్ని బలహీనపరిచేదిగా ఉందని, దాన్ని వ్యతిరేకించాలని, రద్దుచేసేలా ఉద్యమించాలని రెచ్చగొట్టడంలో ఏమైనా అర్థం ఉందా?
సిఏఏ ఓ నల్ల చట్టమని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు- అండ్ వెల్ఫేర్ పార్టీకి చెందిన సయ్యద్ కాసిం రసూల్ ఇలియాస్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రకటించారు. అలాగే నల్సర్ విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. తెలంగాణ మైనార్టీస్ కమిషన్ ప్రభుత్వానికి ఓ లేఖ రాస్తూ సిఏఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌పై తన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేసింది. ఇక ఒవైసీ అయితే పట్టపగ్గాలు లేకుండా హైదరాబాద్ నగరాన్ని సిఏఏ వ్యతిరేక ఉద్యమ కేంద్రంగా రూపొందించేందుకు ఓవర్‌టైం పనిచేస్తున్నారు. జనవరి 4న మిలియన్ మార్చ్, జనవరి 10న తిరంగా జెండా ర్యాలీ జరిపారు. నిన్న (25న) చార్మినార్‌వద్ద భారీ బహిరంగ సభ జరిపారు. ఈరోజు దాని కొనసాగింపు ఉంది. 30న బాపూఘాట్ వద్ద మానవహారం చేపట్టనున్నారు. అసలు చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అందులో పాల్గొన్న వారెవరికీ తెలియదు. అసదుద్దీన్ సైతం ఓ ఊహాఆధారంగా ఇదంతా చేస్తున్నాడు తప్ప నిర్దిష్టమైన సత్యం, వాస్తవం ఏదీ ఆయనదగ్గర లేదు. విషం గక్కడం తప్ప!
ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఏర్పాటుచేసిన ‘ప్రెస్‌మీట్’లో మాట్లాడుతూ దేశంలోని ఒక్క పౌరుడికైనా సిఏఏ ద్వారా అన్యాయం జరుగుతుందని తేలితే, ఇబ్బంది ఎదుర్కొంటాడని నిరూపిస్తే ఆ చట్టాన్ని మార్చుతామని మాట ఇచ్చారు. అమిత్‌షా సైతం సవాల్ విసిరారు. ప్రతిపక్షాలు దీనిపై స్పందించక విష ప్రచారం చేస్తున్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రధాని పదే పదే చట్టంలోని విషయాన్ని వివరిస్తున్నారు. చివరికి ఆ చట్టం అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వివేకంతో, విజ్ఞతతో, వివేచనతో, దూరదృష్టితో, ఆధునికత ఆసరాతో, ప్రపంచ పోకడల ఆధారంగా ప్రజలు ఓ నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరముంది. మిడతల దండులా వ్యవహరించడం సబబుకాదు.

- వుప్పల నరసింహం, 9985781799