Others

కాలం వాలిపోతున్న వైపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం వాలిపోతున్న వైపు
రచన : ‘మెర్సీ మార్గరెట్’
ప్రతులకు : 9052809952
మెర్సీ మార్గరెట్ 1-4-61/12, రంగానగర్
ముషీరాబాద్, హైద్రాబాదు-80
*
అనేక పడిగాపులు మధ్య కొట్టుకుంటున్న కాలం గుండె చప్పుడే ఆమె ప్రతిబింబం. నిరంతర గాయాల ఒడిలో పడిలేస్తూ తల్లడిల్లుతున్న వౌన అక్షరాల నిట్టూర్పుల చప్పుడు ఆ కవిత్వ చిరునామా.. ‘‘కాలం వాలిపోతున్న వైపు’’గా ఎగిరొచ్చి ఇప్పుడు దగ్ధ సౌందర్యంగా మన ముందు వాలింది. దళిత స్వరం మంటలు రగిలించే ఆ కవయిత్రి ‘మెర్సీ మార్గరెట్’. మాటల మడుగు‘కి’ కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కారాన్ని పొందింది. పదాల పెదాలు తెగుతుంటే ఈమె కట్టలు తెంచుకుంటున్న జ్వాలా ప్రవాహమై మనల్ని చుట్టుముడుతుంటుంది. నూట పది కవితలున్న ఈ కవితా సంపుటిలో తనదైన ప్రత్యేక ముద్ర కనిపిస్తుంది. కదిపి చూస్తే అంతరంగం ఉప్పెనలా సాంద్రతతో సున్నితంగా ఎగిసిపడుతుంది. గూడు కట్టుకున్న స్తబ్ధతలోంచి నిత్య చైతన్య దీపాల్సి వెలిగిస్తుంది. ‘‘వౌనం తర్వాత..’’ అని శీర్షికలో కవయిత్రి అంతర్వేదన ఇలా మాటల రూపంలో బద్ధలవుతుంది.
‘‘వౌనం అంచులా చుట్టూ
పళ్లెం అంచులా పరుచుకొని
గుప్పిట పట్టిన సందిగ్ధతల్ని
నిప్పుల పాత్రలో శుద్ధిచేసి
చీకటి మీదకి యుద్ధానికి తోలుతుంది’’ అంటున్నప్పుడు ఊగిసలాడుతున్న జీవ సంఘర్షణ యదార్థ దృశ్య చిత్రంలా తోస్తుంది. పైకి కనీ కనిపించని పెనుగులాట రణగొణ ధ్వనుల మధ్య రక్తబీభత్సాన్ని సృష్టించి, అంతిమ సారాన్ని ఆదేశ ఉపదేశంగా పరుస్తుంది. చీకటిని చీల్చే వెలుగు రూపాన్ని ప్రసాదిస్తుంది. ఇది మెర్సీ మార్గరెట్ ఊహాత్మక వ్యూహ పద విమోచనానికి ప్రతీక. ‘‘చెట్టు లిపి’’ కవితలో అనంత సాక్షాత్కార వీక్షణం దర్శనమిస్తుంది.
‘‘రక్తాన్ని దర్శించిన కళ్ళు/ చీకట్లను తవ్వుతూ వెళ్లి/ ఏదో ఓ చెట్టు కింద జ్ఞానోదయం కోసం/ ధ్యానం చేస్తాయి’’ అంటుందామె. జ్ఞానానే్వషణ జీవిత పరమావధిగా మారినప్పుడు, వర్ణాల జాడని పసిగట్టని ఆదిమ చెట్టు మూలాల్లోకి వెళ్ళినప్పుడు, అంతర్గత ప్రపంచాన్ని తడిమి చూసే లక్షణం కనిపిస్తుంది. ఈ పదునైన లోచూపే విశ్వమానవీయతకు అద్దం పడుతుంది. ఇది మార్గరెట్ విశ్వాసానికి ఒక ఆత్మ పతాక.
‘‘కోఠి సాక్షిగా’’ శీర్షికలో దైవత్వం పట్ల విముఖత ఊరేగింపు సమయంలో బయటపెడుతుంది మెర్సీ.
‘‘పొడవైన ఊరేగింపు/ ఊరేగింపుకు ముందుగా రథం/ రథం మీద మనిషి/ మనిషి చేతిలో బొమ్మ/ బొమ్మే దేవుడు’’ అంటూ తీర్మానించినపుడు సాధారణ వచనాన్ని కూడా కవిత్వం చెయ్యడం మార్గరేట్‌కే చెల్లింది. సున్నితమైన అంశాన్ని గంభీరంగా చెప్పడం కవిత్వ శిల్ప లక్షణాలలో ప్రధానమైనది. ఆ ఒడుపు సహజసిద్ధంగా ఒంటబట్టింది కవయిత్రికి. దైవత్వానికి మానవీయ కోణంలో శాశ్వత పరిష్కార మార్గ అనే్వషణ దీనిలో వ్యక్తమవుతుంది.
‘‘రాజ్యమా ఉలికిపడకు’’ కవితలో ‘నల్లధనం రద్దు’ సమయంలో దేశవ్యాప్తంగా సంభవించిన పర్యవసాన ఫలితాలను చాలా వ్యంగ్యస్పృహతో ఎండగడుతుంది ఈ కవయిత్రి. ‘‘కన్నీళ్లు/ కరెన్సీ నోట్ల ముందు/ మంచుగడ్డలై వౌనం వహిస్తుంటే/ కుబుసం విడిచిన రాజ్యం/ కొత్త నవ్వులు నవ్వుతుంది’’ అని చెబుతున్నప్పుడు విముద్రీకరణ ఛాయలు నోట్ల రద్దు సందర్భంలోని కాషాయ వర్ణ పతాకం తీరుతెన్నుల్ని లోలోతుల్లోంచి ప్రతిఫలింప జేస్తుంది. అంతర్లీన వ్యతిరేక ధ్వనిని కళ్లకి కట్టిస్తుంది.
ఇలాంటి కవిత్వపు తళుకులు ఈ సంపుటి నిండా ప్రతిధ్వనిస్తాయి. వీటిలో... ‘తీరంలో ఎవరో కళ్లు వదలివెళ్లారు’, దిగమింగిన బాధల సాక్షిగా దుఃఖపు బావుటా’, ‘ఊరు మళ్లీ చిగురించాలని/ ఆకాశం బీజం నాటింది’, ‘నాగలి మోస్తూ తోబుట్టువులైన పశువులు’, ‘ఇరుకు ఇళ్ల మధ్య/ విశాల హృదయాల అల్లిక’, ‘చెట్టులా మారిన గొంతిప్పుడు/ ప్రపంచ శాంతి కపోతం’, ‘వౌనం మనసుకు కనబడని కంచె’, ‘ఆత్మ ఋతువు తొడిగే చిగురు భాష’, ‘నరికిన నా చేతులిప్పుడు భూమిని చీల్చే ఆయుధాలు’, ‘ఎండిన నేలలపై మానవ బీజం మొలకెత్తిస్తూ’, ‘సమయం గుప్పిటనుంచి జారిపోతుంటే’, ‘ఆకాశాన్ని కళ్లలోకి వొంపేసుకుని’, ‘కాలం మంచులా కురుస్తున్నపుడు’, ‘కళ్ల పొరల కింద నిదురించే సూర్యుడు’, ‘పూలు రాలిన అలజడి’, ‘ఈడుస్తున్న కాళ్ల కింద చీలుతున్న నీడ’, ‘మనిషికి లిపి లేదు’, ‘తవ్వబడ్డ చేతుల్లో/ కొత్త ఆకాశం’, ‘అతనిది నక్షత్రంలా వెలిగే ముఖం’, ‘నీడగా రాలిపోయిన కాలం’, ‘అతడు తిరిగొచ్చేప్పటికి ఆమె అడివైంది’, వంటి వాక్యాల మెరుపులు కవిత్వ ప్రేమికుల్లో కొత్త ఊపిరిని నింపుతాయి. కవితాశీర్షికల్లో వైవిధ్యానికి దర్పణం పట్టే వాటిలో- ‘సీతాకోక రెక్కల వర్షం’, ‘మంచుదీపం’, ‘చెమట నోటీసు’, రెక్కల శ్లోకం, ‘కాలం వేళ్ల చివర’, ‘కల కనబడని చోట’, ‘చివుళ్లు తొడిగిన మేఘం’ మున్నగునవి అక్షర లోకానికి కొత్త చూపునిస్తాయి. ఆధునిక తెలుగు కవిత్వానికి ఇలా తనదైన వచన కవితాబాటని పరచడంలో ఆరితేరిన కవితాకారిణి మెర్సీ మార్గరెట్‌కి స్వాగతిస్తూ సాహిత్యాభినందనలు తెలియజేస్తున్నాను.

- మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910