Others

మహాత్మా మళ్లీ జన్మించవా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గాంధీజీ లాంటి వ్యక్తి ఈ భూమిపై రక్తమాంసాలతో నడిచాడంటే భవిష్యత్తు తరాలవారు నమ్మరేమో!’’అంటూ ప్రసిద్ధ శాస్తవ్రేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ వ్యాఖ్యానించాడు. నేడు గాంధీజీ బొమ్మ కరెన్సీ కాగితాలకే పరిమితం అవడం చూస్తుంటే ఆ వ్యాఖ్యలు నిజమేనని అనిపించక మానదు. గాంధీజీని ‘అర్ధనగ్న ఫకీరు’’ అని ఇంగ్లాండు మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ పరిహసించినా కృంగిపోలేదు. ఆయనను ‘మహాత్మా’ అని పలువురు పిలిచినా ఘనత గాంధీజీకే దక్కింది. అయితే గాంధీజీ వ్యక్తిత్వంపై నేటి యువతరంలో కొన్ని అపోహలు వున్నాయి. విప్లవవీరులు అయిన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ను బ్రిటీష్‌వారు ఉరి తీస్తుంటే గాంధీజీ వౌనంగా వున్నారని, మన దేశంలో నివసిస్తున్న బహుజనుల మరియు నిమ్నవర్గాల హక్కులకొరకు బ్రిటీష్‌వారి దగ్గర తన గళాన్ని గట్టిగా వినిపించలేదని, ఉధృతంగా కొనసాగుతున్న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎవరితోనూ సంప్రదించకుండా అకస్మాత్తుగా నిలిపివేసారని నేటి తరంలో కొందరు అభిప్రాయపడుతున్నారు. అహింస, సత్యాగ్రహాలనే భావనలు గాంధీజీనే ప్రారంభంకాకపోయినా, వాటికి అత్యంత ప్రాచుర్యం కల్పించిన వ్యక్తులలో గాంధీజీ అగ్రగణ్యుడు. గాంధీజీ మన దేశంలో ఉన్నత సామాజిక వర్గంలో జన్మించినా, దక్షిణాఫ్రికాలో వివక్షతను ఎదుర్కొన్నారు. ఫలితంగా అక్కడ నల్లజాతీయుల హక్కులకోసం ఆయన పోరాడి విజయం సాధించారు. గాంధీజీ మన దేశానికి వచ్చాక దేశవ్యాప్తంగా పర్యటించి ఇక్కడ సామాజిక, రాజకీయ పరిస్థితులను అధ్యయనంచేసిన తరువాతనే 1917లో చంపారన్ ఉద్యమం వంటి వాటిని చేపట్టి కొన్ని స్థానిక సమస్యలపై పోరాడి సత్ఫలితాలను సాధించారు. జలియన్ వాలాబాగ్ దురంతాలకు నిరసనగా, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ 1920లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమానికి అన్నివర్గాల వారినుండి మద్దతు లభించింది. బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా మన దేశంలో పెద్దఎత్తున జరిగిన మొట్టమొదటి ఉద్యమం ఇదే. అయితే చౌరీచౌరాలో జరిగిన హింసాత్మక ఘటనతో అప్పటివరకు శాంతియుతంగా సాగుతున్న ఉద్యమం మరోరూపంలోకి మారుతుందేమోనన్న సందేహంతో గాంధీజీ ఈ ఉద్యమాన్ని ఆపారు. గాంధీజీ అహింసావాది, హింసను ఆయన ఏ రూపంలోనూ స్వాగతించలేదు. ఒకవేళ ఉద్యమం హింసారూపం దాలిస్తే కొన్నివర్గాలవారు ఉద్యమానికి దూరమయ్యే ప్రమాదం వుందని ఆయన భావించారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం దీర్ఘకాలం కొనసాగాలంటే ఆర్థిక వనరులు, వ్యక్తిగత సమయం కూడా ముఖ్యమని గాంధీజీ భావించారు. ఈ ఉద్యమ విరమణ తరువాతే విప్లవవీరులైన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లు తమ పోరాటపంధాను మార్చారు. వారి త్యాగ నిరతిని ఎవ్వరూ కాదనలేరు. వారిని ఉరితీసే విషయంలో పునరాలోచించమని గాంధీజీ లార్డు ఇర్విన్‌ను కోరారు. వ్యక్తిగతంగా ఆయనకు లేఖను కూడా రాసారు.
ఇర్విన్ కూడా సానుకూలంగా స్పందించారు. ఇంతలోనే పంజాబ్‌లో విధులు నిర్వహిస్తున్న బ్రిటీష్ అధికారులు భగత్ త్రయాన్ని ఉరితీయాలని ఇర్విన్‌పై తీవ్ర వత్తిడిచేసారు. లేనట్లయితే భారత్‌లో తాము పనిచేయలేమని, భగత్‌సింగ్ వంటివారు జీవించి వుంటే తమ నైతిక స్థైర్యం దెబ్బతింటుందని బ్రిటీష్ అధికారులు తేల్చిచెప్పారు. భగత్‌సింగ్‌ను ఉరితీయడమనేది గాంధీజీ వైఫల్యంకంటే బ్రిటీష్ అధికారుల వత్తిడి ఫలితం అని చెప్పవచ్చు. గాంధీజీతో పోల్చుకుంటే అంబేద్కర్ మహాశయుడు తాను పుట్టిపెరిగిన సమాజంలో తీవ్ర వివక్షతను ఎదుర్కొన్నాడు. మన దేశంలో తరతరాలుగా నిమ్న వర్గాలవారి హక్కులు కాలరాయబడుతున్న మాట వాస్తవమే. అంటరానితనం, కుల వివక్షత మన వ్యవస్థలో ప్రధాన లోపాలు. పట్టణీకరణ జరిగితే పరిశ్రమలు స్థాపించబడి యువతకు ఉపాధి దొరకడం ద్వారా గ్రామాలలోవున్న కులం పునాదులు కూలిపోతాయని అంబేద్కర్ భావించారు.
‘గ్రామాలే దేశానికి వెన్నుముక’అని గాంధీజీ నమ్మారు. భారీ పరిశ్రమలు కాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలను గాంధీజీ స్వాగతించారు. ఆయన దేశ స్వాతంత్య్రానికి ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వగా, స్వాతంత్య్రంతోపాటు బహుజనుల హక్కులు కూడా చాలా ముఖ్యమని అంబేద్కర్ నొక్కిచెప్పారు. గాంధీజీతో భగత్‌సింగ్, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ లాంటివారు సిద్ధాంతరీత్యా విబేధించారు తప్ప, వ్యక్తిగత వైషమ్యంతో కాదనేది మనమంతా గమనించాల్సిన విషయం.
గాంధీజీ పేరును 5సార్లు నోబుల్ శాంతి పురస్కారానికి పరిశీలించి తిరస్కరించినా ఆయనేమి బాధపడలేదు. అన్ని రంగాలలో అసహనం వేగంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో గాంధీజీ పాటించిన అహింసా విధానం పలు సమస్యలు పరిష్కారానికి మేలైనమార్గంగా భావించవచ్చు. గాంధీజీ వారసులు ఎవరు నేడు రాజకీయాలలో లేరు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ అని, స్వాతంత్య్రం తీసుకురావడమే దీని ప్రథమ లక్ష్యం అని, స్వాతంత్య్రానంతరం ఈ సంస్థను రాజకీయ పార్టీగా మార్చవద్దని గాంధీజీ ఆయన సహచరులకు సూచించారు. తన జన్మదినాన్ని సెలవుగా ప్రకటించవద్దని గాంధీజీ స్వయంగా కోరారు. ‘‘నీవు ఆచరించేదే బోధించు, బోధించిందే ఆచరించు’’అని గాంధీజీ పలు ఉపన్యాసాలలో చెప్పేవారు. ఈ విషయాన్ని నేటి పాలకులు అవలంభిస్తే దేశం మరింత పురోగతి సాధిస్తుంది.’’

- యం.రాంప్రదీప్ 9492712836