Others

జగన్ ఒంటెద్దు పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు’ అన్న రీతిలో ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్‌రెడ్డి పరిపాలన సాగటం ఎ.పి. ప్రజల దురదృష్టం. సి.యం.గా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటినుండి ఆయన ఒంటెద్దు పరిపాలనకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప, ఏ కొత్త నిర్ణయంలోనూ, విధానంలోనూ ప్రజల్ని కానీ ప్రభుత్వ అధికారుల్ని కానీ ప్రతిపక్ష పార్టీలను కానీ స్వపార్టీలోని ముఖ్యులను కానీ భాగస్వాముల్ని చేయకపోవటం బాధాకరం. ముఖ్యమంత్రి జగన్ ‘ఏక్ నిరంజన్’ తత్వానికి ఇదో నిదర్శనం. సి.యం.గా జగన్ వచ్చీరాగానే ప్రజాధనంతో నిర్మితమైన ప్రజావేదికను ఒక్కరోజు వ్యవధిలో కూల్చేశారు. దీనికి సి.యం. పెట్టిన పేరు అక్రమ కట్టడం కూల్చివేత. ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ ఖర్చుతో నిర్మితమైన భవన సముదాయం ఎలా అక్రమమో ఎవ్వరూ నిర్వచించలేదు. నిర్మాణం జరిగి, వినియోగంలో ఉన్న భవనాన్ని నేలమట్టం చేసి ఆనందపడటాన్ని తెలుగు ప్రజలు చూసి విస్తుపోయారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదలను నియంత్రించటంలోనూ రాజకీయాలను చొప్పించారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతాన్ని ముంపునకు గురిచేశారు. రైతుల్ని నష్టపరిచారు. ఉచిత ఇసుక విధానాన్ని ఏకపక్షంగా రద్దు చేశారు. తత్ఫలితంగా ఐదునెలలపాటు భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. ఐనా ప్రభుత్వం ఎలాంటి చలనంకానీ, కనికరంకానీ చూపించలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లీషు విద్యాబోధన, పత్రికా స్వేచ్ఛపై జి.వో. 2340, చిన్న పత్రికపై జివో 42 వంటి వివాదాస్పద అంశాలలో ఎక్కడా ప్రజల భాగస్వామ్యం లేదు. ఈ నిర్ణయాలపై ఆయావర్గాలతో కానీ, సంబంధిత ప్రజాసమూహాలతో కానీ చర్చలు జరిపిన దాఖలాలు లేవు. తరచూ తెలంగాణా సి.యం. కేసీఆర్‌తో జరుపుతున్న చర్చల పట్లకూడా సీమాంధ్రుల్లో భిన్నాభిప్రాయం ఉందనే చెప్పాలి. తాజాగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని మూడు రాజధానుల ముచ్చటను ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ అన్న సర్వజనిత ఆమోదిత అంశాన్ని తల్లక్రిందులు చేసి పరిపాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి వికేంద్రీకరణ మంత్రం చేపట్టారు. తన మదిలోని ఆలోచనలకు మద్దతుగా కృష్ణా, గుంటూరు జిల్లాలలోని 33మంది స్వపార్టీ ఎమ్మెల్యేలను సైతం బుజ్జగించారు. ఒకప్రక్క రాజధాని కొరకు 33 వేల ఎకరాలను ఇచ్చిన 24 వేల మంది రైతుల్ని రోడ్డెక్కేలా చేశారు. వారాల వ్యవధిలోనే జి.యన్.రావు కమిటీ, బోస్ట్రన్ కమిటీ నివేదికలు తెప్పించటం, ఒకేరోజు క్యాబినెట్ ఆమోదం, అదేరోజు అసెంబ్లీలో చర్చ, సీఆర్‌డిఏ రద్దు, అధికార వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వ తొందరపాటు, ముఖ్యమంత్రి పంతం చెప్పకనే తెలుస్తుంది. గత ఐదేళ్ళు ఎ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని పరిపాలన సాగితే, ఇప్పుడు ఎ అంటే అలజడి, పి అంటే పంతం అన్నట్లుగా మారాయి. అత్యంత ముఖ్యమైన మరో విషయం ఏమిటంటే, శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులను శాసన మండలి చైర్మన్ సెలక్టు కమిటీకి పంపటం ముఖ్యమంత్రికి జీర్ణించుకోలేని అంశంగా మారింది. ఇంతకాలం గుర్తుకురాని మండలి ఖర్చులు ముఖ్యమంత్రికి గుర్తుకొచ్చాయి. ఏటా 60కోట్లు ఖర్చుపెడుతున్న శాసనమండలి రాష్ట్రానికి ఎందుకు? అనే ప్రశ్న వేశారు. శాసన మండలిలో ఉండే మేధావులు శాసనసభలోనూ ఉన్నట్లు సభ్యులకు గుర్తుచేశారు కూడా. అంటే తన నిర్ణయానికి అడ్డుపడే ఏ ప్రజాస్వామిక వ్యవస్థ కూడా ఉనికిలో ఉండకూడదనే ధోరణికి ఇది పరాకాష్ట. ఇలా ఒంటెద్దు పోకడలతో ప్రభుత్వం తన సంఖ్యాబలంతో పంతం నెగ్గించుకోవచ్చు కానీ ప్రజల ఆకాంక్షలకు ఏమాత్రం అద్దం పట్టకపోగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

- పోతుల బాలకోటయ్య, 9849792124