Others

డాక్టర్ ఆనంద్ (ఫ్లాష్‌బ్యాక్@ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిటింగ్: అక్కినేని సంజీవి
కళ: ఎస్ కృష్ణారావు
మాటలు: ఆత్రేయ
ఫొటోగ్రఫీ: సి నాగేశ్వరరావు
నృత్యం: హీరాలాల్, పసుమర్తి కృష్ణమూర్తి, చిన్ని సంపత్
సంగీతం: కెవి మహదేవన్
నిర్మాత: డి వెంకటపతిరెడ్డి
సహదర్శకులు: పిసి రెడ్డి
దర్శకత్వం: వి మధుసూదనరావు

కృష్ణా జిల్లా ఊడ్పుగల్లుకు చెందిన వి మధుసూదనరావు విద్యార్థి దశలో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ‘ప్రతిమ’ నాటకంలో స్ర్తి పాత్ర పోషించారు. 1945లో ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. తరువాత సుప్రసిద్ధ దర్శకులు ఎల్‌వి ప్రసాద్, కెఎస్ ప్రకాశరావు, తాతినేని ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావులవద్ద ఫిల్మ్ డ్రాప్ట్‌లోని అంశాలు ఆకళింపు చేసుకున్నారు. 1959లో నటుడు చదలవాడ కుటుంబరావు నిర్మించిన ‘సతీతులసి’ పౌరాణిక చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. తరువాత జగపతివారి తొలి చిత్రం ‘అన్నపూర్ణ’తో విజయపరంపర ప్రారంభించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు. పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించిన దర్శకునిగా విక్టరీ బిరుదు సాధించారు.
‘లక్షాధికారి’ చిత్రానికి సహ నిర్మాత అయిన డి వెంకటపతిరెడ్డి వికసించిన గులాబి లోగోతో రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై వి మధుసూదనరావు సహకారంతో రూపొందించిన చిత్రం -డాక్టర్ ఆనంద్. ఈ చిత్రానికి వి మధుసూదనరావు దర్శకత్వం వహించడమేకాక, ఆత్రేయతో కలిసి కథను సమకూర్చారు.
***
హైద్రాబాద్‌లోని ఆనంద్ నర్సింగ్ హోమ్‌లోని డాక్టరు ఆనంద్ (ఎన్.టి.రామారావు) అతని భార్య మాధవి (అంజలీదేవి) క్యాన్సర్ వ్యాధికి లోనయి, భర్త ఆనంద్ మమతానురాగాలవల్ల పిల్లలు పాప (కుట్టి పద్మిని) బాబుల, ఆప్యాయతలతో జీవిస్తుంటుంది. ఒకనాడు నగరంలో జరిగిన నృత్య ప్రదర్శనలో గాయపడ్డ విజయ (కాంచన)కు తన హాస్పిటల్‌లో ఆనంద్ వైద్యం చేస్తాడు. వైద్యరీత్యా తాను వివాహితుడనని ఆమెకు తెలియనివ్వడు. కీర్తిప్రతిష్టలు, ధనం తప్ప అయినవాళ్ళు ఎవరూ లేని విజయ, ఆనంద్‌పై ఆశలు పెంచుకుంటుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాక మద్రాసు వెళ్లిన విజయ, ఆనంద్‌ను తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ ఉత్తరం వ్రాస్తుంది. తన వృత్తివల్ల, భార్య అనారోగ్యం కారణంగా ఒత్తిడికి లోనైన ఆనంద్, కొంత మానసిక ఉపశమనం కోసం విజయను కలవాలని మద్రాసు బయలుదేరుతాడు. అనూహ్య సంఘటనతో తనతో ప్రయాణిస్తున్న ఓ అజ్ఞాత వ్యక్తి చనిపోవడంతో, తన దుస్తులు అతనికి మార్చి కారు వదిలిపెట్టి మద్రాసు వెళ్లిపోతాడు. అక్కడ విజయతో కలిసి జీవిస్తుంటాడు. ఆనంద్ మరణించాడని భార్య పిల్లలు దుఃఖంతో కృంగిపోతారు. ఒకసారి వైద్యం కోసం మద్రాసు వచ్చిన భార్య పిల్లలను చూసిన ఆనంద్‌లో అంతర్మథనం మొదలవుతుంది. అతన్ని గుర్తించిన ఓ స్నేహితునివల్ల విజయ అసలు విషయం తెలుసుకుంటుంది. అతడిని భార్య పిల్లల వద్దకు వెళ్లిపొమ్మంటుంది. దారిలో యాక్సిడెంటుకు గురైన వ్యక్తిని కాపాడిన విజయ, మరోసారి అతను హత్యానేరం మీద అరెస్టు కాగా తెలివిగా డాక్టరు ఆనంద్ చేత అతని భార్యకు ఆపరేషన్ చేయించి నిజం నిరూపిస్తుంది. ఆ భార్యాభర్తల వద్ద సెలవు తీసుకొని, ఆనంద్ పేరిట తాను నిర్మించిన అనాథ శరణాలయంలోకి విజయ ప్రవేశించటంతో చిత్రం ముగుస్తుంది.
ఈ చిత్రంలో హాస్పిటల్‌లో డాక్టరుగా రమణారెడ్డి, పేషెంటు కోటయ్యగా చదలవాడ, అతని కూతురు మతిగా రమాప్రభ, ఆమె జంట చలపతిగా పద్మనాభం, కాంపౌండర్‌గా రాజబాబు నటించారు.
భార్య భర్త ప్రియురాలు.. ఈ మూడు పాత్రలు, వాటి మనోభావాల కలబోతగా సాగిన చిత్రంలో ఎన్టీఆర్ అద్భుత నటన ప్రదర్శించారు. వృత్తిపట్ల నిబద్ధత, భార్య సంతానంపై ఎనలేని ప్రేమాభిమానాలు, నృత్యకళాకారిణి విజయ ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఆపై ఆమెపట్ల ఆకర్షణ, డాక్టరుగా పొందలేని ఆనందాన్ని వ్యక్తిగా పొందాలన్న ఆరాటం, తరువాత అంతర్మథనం ఇలా సన్నివేశాలకు అనుగుణమైన భావోద్వేగాలను సమన్వయంతో పండించి మెప్పించారు ఎన్టీ రామారావు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో భర్త సుఖం కోసం మరో వివాహం చేసుకొమ్మని అర్థించే అనురాగమయి భార్యగా అంజలీదేవి సున్నితమైన నటన ప్రదర్శించారు.
కళాకారిణిగా సున్నిత హృదయం, నిష్కల్మషంగా తనతో తోడు నీడగా నిలిచే వ్యక్తికోసం ఆరాటం, ఆ వ్యక్తి వివాహితుడని తెలిశాక అతని పట్ల అభిమానాన్ని చంపుకొని కుటుంబంతో అతన్ని కలపాలన్న ఆరాటపడే సన్నివేశ భావాలను పరిణితతో మెప్పించింది కాంచన.
సున్నితమైన ఇతివృత్తాన్ని సుతిమెత్తని సన్నివేశాలతో సహజసిద్ధంగా దర్శకుడు మధుసూదనరావు రూపొందించిన విధానం ఆకట్టుకుంటుంది. మరో వివాహం చేసుకోమని భర్తను కోరిన సందర్భంలో ‘ఉన్నప్పుడు కాదులే లేనప్పుడు తెలుస్తుంది దాని విలువ’ అని డాక్టర్ ఆనంద్ తిరస్కరించిన సన్నివేశం దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. మొదట విజయను కళాకారిణిగా ఒక ఎమోషనల్ అని విసుగు చూపిన ఆనంద్, ఆమెకు వైద్యం చేస్తూ నడక తెప్పించటం, ఆమె సాహచర్యం గుర్తుకు తెచ్చుకుంటూ ఆమె వ్రాసిన ఉత్తరం చదివి పరవశం పొందటం, భార్యాబిడ్డలు కనిపించాక అంతర్మథనంలాంటి సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. విజయ తిరస్కరించిన సందర్భంలో ఆనంద్ భావోద్వేగంతో యాక్సిడెంట్‌కు గురికావటం, హాస్పిటల్‌లో నెలకొల్పిన తన శిలావిగ్రహం చూసి, ఆపైన ఇంటికొచ్చి భార్యాపిల్లల స్థితిని, విరిగిపోయిన బొమ్మరిల్లును చూసి భర్తగా స్పందన, తనకు బదులు మరో అమాయకుడు శిక్ష అనుభవించకూడదని అరెస్టు కావడం -లాంటి సన్నివేశాలను ఆర్ద్రతతో మనోరంజకంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు దర్శకుడు.
‘జరుగుతున్న రోజులు బరువైనపుడు, చేదయినపుడు జరిగిపోయిన తీయని రోజులు గుర్తుంచుకోవాలి’ (ళ్యూ జఒ దఖ్ఘౄశ, ఆ్య ఘజూౄజఆ జఆ జూజచిజశళ జడ్జి నాగయ్య) లాంటి బరువైన సంభాషణలు, పాటలతో ఆత్రేయ రంజింపజేశారు
ఇంటిబొమ్మను చూపుతూ ఎన్టీఆర్, అంజలీదేవి, పిల్లలపై చిత్రీకరించిన గీతం -చల్లని చక్కని ఇల్లు/ చక్కెర బొమ్మల పాపలు. ఆనంద సమయంలో ఘంటసాల, పి సుశీల బృందం పాడితే, విషాదంలో పి సుశీల బృందగానంలో వస్తుంది. వెనె్నలను చూపుతూ గదిలోను, ఆరుబయట ఎన్టీఆర్, కాంచనలపై చిత్రీకరించిన గీతం -పెరుగుతున్నది హృదయం/ తరుగుతున్నది ప్రాయము (పి సుశీల). కాంచన ముఖంలో భావాలను చూపుతూ, పాట పూర్తయ్యేసరికి నడక వచ్చి డాక్టర్ చేతుల్లో వాలినట్టు అద్భుతంగా చిత్రీకరించారు. కాంచన, ఎన్టీఆర్‌లపై చిత్రీకరించిన యుగళగీతం -నీలాల కన్నులతో ఎలాగో చూసేవు ఎందుకని (ఘంటసాల, పి సుశీల- సినారె). వీరిపైనే మరో గీతం -మదిలోని నా స్వామి ఎదురాయే నేడు (పి సుశీల- సినారె). పద్మనాభం, రమాప్రభలపై చిత్రీకరించిన హాస్యగీతం -తళుకు బెళుకు చీరదాన (పిఠాపురం, స్వర్ణలత- కొసరాజు). ఈ చిత్రంలోని ఎవర్‌గ్రీన్ హిట్ సాంగ్‌కు ముగ్గురు నృత్య దర్శకులు కంపోజిషన్ ఇచ్చారు. వారి సమష్టి కృషి ఫలితంతో రూపొందిన గీతం -నీల మోహన రారా/ నిన్ను పిలిచే నెమలి నెరజాణ. కాంచన అద్భుత నృత్య విన్యాసం, మహదేవన్ స్వర విన్యాసంతో వైవిధ్యభరితంగా (పి సుశీల బృందం -దేవులపల్లి కృష్ణశాస్ర్తీ) సాగుతుంది. దేవులపల్లి సాహిత్య గుబాళింపుతో పాట మరింత రక్తికట్టింది. డాక్టర్ ఆనంద్ చిత్రం ఆర్థిక విజయాన్ని సాధించకున్నా, కట్టిపడేసే సన్నివేశాలు, మనసును తాకే గీతాలతో రసజ్ఞ హృదయాల మెప్పుపొందింది. -నీలమోహన.. గీతం చిరస్మరణీయ ఆనందాన్నిచ్చేదిగా మిగిలింది.

-సివిఆర్ మాణికేశ్వరి