Others

కశ్మీర్ తిరిగి కళకళలాడగలదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశ్మీరం.. జ్ఞాన తుషారం. సమున్నత సాహిత్య-సంగీత సిద్ధాంతాలకు కేంద్రం. రస ప్లావిత గ్రంథాలకు ఆలవాలం. సంస్కృత భాష-వ్యాకరణం శిఖరాగ్రం తాకిన నేల.. అభినవ గుప్త పుట్టి పెరిగిన భూమి, ‘సంగీత రత్నాకరం’ రాజ్యమేలిన ధరణి, భరతముని నాట్యశాస్త్రం పరిఢవిల్లిన ప్రాంతం.. నేడు ఏమైంది? అవును ఏమైంది? శోక సంద్రమైంది. విస్థాపనకు గురైంది. కనీస అవసరాలు లేకుండా ఆ జ్ఞాన, విజ్ఞాన విశారదుల వారసులు శరణార్థులయ్యారు. దశాబ్దాలుగా తమ దేశంలో తామే దిక్కులేని పక్షులయ్యారు. తల దాచుకునేందుకు సరైన నీడ లేక కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఎంతటి ఘోరమిది? 21వ శతాబ్దంలో మానవ మస్తిష్కం ఎంతో ఉన్నతస్థాయికి చేరిందని భావిస్తున్న తరుణంలో, మానవ హక్కులకు, గౌరవానికి, జ్ఞానానికి, విజ్ఞానానికి, విజ్ఞతకు, విద్వత్తుకు అపార విలువనిచ్చే సందర్భమని గొప్పలు పోతున్న సమయంలో వాటికి ప్రతిరూపాలుగా నిలిచిన కశ్మీర్ పండిట్ల విస్తాపన, వలసలు, మహావలసల గూర్చి కించిత్ దుఃఖం.. ప్రకటించకపోవడం, పిసరంత సానుభూతి.. సహానుభూతి చూపించకపోవడం అమానవీయమే.
మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ జిహాదీల కర్కశత్వానికి, రాక్షసత్వానికి, క్రూరత్వానికి గురై చెట్టు మీది పక్షుల్లా కట్టుబట్టలతో రాత్రికి రాత్రి పలాయనం చెందడం, పిల్లాపాపలు.. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు అన్న తేడాలేకుండా మత విద్వేషం నరనరాన నింపుకుని మసీదుల్లో మకాం వేసిన మిలిటెంట్లు ఆధునిక తుపాకులతో, తూటాల్లాంటి తిట్లు - నినాదాలతో తెగబడి, కశ్మీర్ ఇక పాకిస్తాన్, పాకిస్తాన్‌లో ముస్లింలే ఉండాలి, హిందువుల్లారా.. మతం మార్చుకోండి, లేదా పారిపోండి, చనిపోండి.. అని మూడు దశాబ్దాల క్రితం నిస్సిగ్గుగా కశ్మీర్ బజార్లలో రాక్షస గుంపులు తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేస్తూ, ఆస్తులను ధ్వంసంచేస్తూ, దేవాలయాలను నేలమట్టం చేస్తూ రాక్షసానందంతో తిరుగుతూ, ఆడవారిపై అత్యాచారాలు చేస్తూ విశృంఖలత్వం యథేచ్ఛగా కొనసాగగా మాన, ప్రాణాలను రక్షించుకునేందుకు లక్షలాది కశ్మీర్ పండిట్లు కశ్మీర్ లోయనుంచి వలసదారి పట్టారు.
స్థిరచరాస్తులు, విలువైన వస్తువులు, బ్యాంకుల్లో, పోస్ట్ఫాసుల్లో దాచుకున్న ధనాన్ని-ద్రవ్యాన్ని వదులుకుని ప్రాణాలు అరచేత పట్టుకుని పయనమవడమంటే ‘రాజ్యం’ ఉన్నట్టా, లేనట్టా? కడుపులో పెట్టుకుని కాపాడవలసినవారు వౌనం వహించడం, నిస్తేజంగా, నిర్వీర్యులై చూస్తుండటం నిజంగా దారుణం.. దారుణాతి దారుణం.
ఓ ప్రజాస్వామ్య దేశం.. రాజ్యాంగం సర్వోన్నతం అని భావించిన సందర్భం, మానవ హక్కులు సర్వోత్కృష్టమని ఐక్యరాజ్యసమితి మొదలు అన్ని మానవీయ సంస్థలు అంగీకరిస్తున్నవేళ ఈ నరసంహారం, మతం పేర నరమేధం, రాక్షసత్వం కొనసాగడం దేనికి చిహ్నం?
1990 జనవరిలో ప్రారంభమైన ఈ మానవ విధ్వంసం, విస్థాపన, విలాపం, శోకం, క్లేశం ఇంకా కొనసాగడం దుర్మార్గం తప్ప మరొకటి కాదు.
నాగరీకులమని, నాజూకుదనం.. నైపుణ్యం.. నిజాయితీ.. నింగికి ఎగురుతున్న సందర్భమని చెప్పుకుంటున్న సమయంలో ఏమిటీ గోస.. ఘోష... ఆర్తి- ఆవేదనని మతంపేర మానవ హననం 21వ శతాబ్దపు వైజ్ఞానిక సందర్భంలో తగునా?
ఈ నరహంతక వైఖరి ఇంకానా, ఇకపై చెల్లదని ఎన్నో అభ్యుదయ - విప్లవ పద్యాలు పాడుకున్నా.. పరిస్థితులు ఇంత ఘోరంగా మారడం, ఆటవిక ఆలోచనలు పెరగడం రాక్షసత్వాన్ని ఆవాహన చేసుకున్నవారిని అరికట్టకపోవడం విడ్డూరం.
కశ్మీర్ మూలవాసులు, సరస్వతీ నది ప్రాంతంలో జ్ఞానాన్ని ఉపాసించి శారదాదేవి పుత్రులుగా అత్యద్భుత ఎత్తులకు మానవుడిని తీసుకెళ్ళిన వారి వారసులను పండిట్ కుటుంబాలను కాపాడుకోలేని అశక్తులది క్షమించరాని నేరం!
పాలకులు ఏ కాలంలోనైనా ప్రజలను ఆపదలో కాపాడుకుంటారు. వేల సంవత్సరాల చరిత్ర దీన్ని చాటిచెబుతోంది. ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకున్న రాజుల గాథలను వేనోళ్ళ పొగిడినచోట.. భౌగోళిక స్వర్గంగా భావించే నేలను.. అక్కడి మూలవాసులను ఇలా తమమానాన తమని వదిలేస్తే అదెలా పాలకుల సుపరిపాలన అనిపించుకుంటుంది?
కట్టుబట్టలతో.. కన్నీళ్ళతో, కలలన్నీ బుగ్గిపాలవగా కనీస సౌకర్యాలు లేనిచోట పాములు - తేళ్లు గల ప్రదేశంలో పొద్దుపుచ్చుతున్నా ఎలా ఉన్నారని పలకరించని పాలకుల, సామాజికవేత్తల, మేధావుల వామపక్షాల, విప్లవవాదుల విచిత్ర వైఖరి వారి దుఃఖాన్ని మరింత పెంచింది. వేల సంవత్సరాల జ్ఞాన భాండాగారానికి వారసులని అంతకుముందు పొగిడిన వారే ఆపదలో ముఖంచాటేసి తిరిగిన వైనం దుర్మార్గమైనది.
తాముచేసిన తప్పేమిటో? ఇప్పటికీ వారెవరికీ అర్థంకాని పరిస్థితి.. మీవల్ల ఈ ఘోరం జరిగింది.. అందుకే ఈ స్థితి ఏర్పడిందని పాలకులు పేర్కొన్న పాపానపోలేదు. ఏ రాజకీయ నాయకుడు వివరించలేదు.
తాము చట్టానికి కట్టుబడి, పరోపకార బుద్ధితో జ్ఞానాన్ని పంచుతూ, రజో- తమోగుణాన్ని దరిచేరనీయకుండా సంపూర్ణ సత్వగుణంతో మనుషులను ప్రేమిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ కాలం గడపడమేనా వారు చేసిన నేరం? గతంలో ఇలాంటి విపత్తు ఎదురైనా మానవత్వం.. మంచితనం.. సభ్యత.. సంస్కారం, ప్రేమ కరుణ, ఆదరణ.. ఆప్యాయత, మానవీయ లక్షణాలు అందిపుచ్చుకుని అందరిలా జీవించకపోతారా? అని సకారాత్మక దృష్టితో జీవనం కొనసాగించడం నేరమైందా? ఇంతకుమించిన నేరం కశ్మీర్ పండిట్లు ఏం చేశారు? అప్పుడు గాకపోయినా ఇప్పుడైనా ఎవరైనా వివరించగలరా? వౌనంగా, దుర్మార్గాన్ని సహించేందుకు ఒక హద్దు ఉండాలి.. శతాబ్దాల తరబడి ఈ బార్బరికతను భరిస్తూ ఉండటం సాధ్యమా?
గతంలో ఇలాంటి అమానవీయ శక్తులను, ధూర్తులను దీటుగా ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. లక్షలాది మంది అమాయక ప్రజల ఉసురుతీసిన వారి భరతం పట్టిన భరతమాత ముద్దుబిడ్డలున్నారు. వారినెందుకు ఆదర్శంగా తీసుకోకూడదు? ఇంకానా, ఇకపై చెల్లదంటూ ప్రతిఘటించాల్సిన సమయమిది కాదా? జన్మభూమి స్వర్గంతో సమానమంటారు.. వాస్తవంగానూ స్వర్గంలాంటి కశ్మీర్ ప్రాంతం పండిట్ కుటుంబాలతో తిరిగినప్పుడు కళకళలాడుతుంది? అందుకోసం ప్రతి పౌరుడు తనదైన రీతిలో పాటుపడాల్సిన సమయమిది. మూకుమ్మడిగా కదిలి కాలానికి వంతెన కట్టాల్సిన సందర్భమిది.
(ఈ కథాంశంతో ‘షికార్’ అన్న హిందీ చలనచిత్రం నిర్మితమైంది.)

- వుప్పల నరసింహం, 9985781799