Others

మహాశివరాత్రి మహత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి. మాఘం అంటే (మ+అఘం) పాపం లేనిది. పాపం అంటనిది అని భావం. ఈ రోజున బ్రహ్మమురారుల మధ్య వారి తగవును తీర్చడానికి జ్యోతిర్లంగమై ఆవిర్భవించాడని శివపురాణ కథనం. ‘శివ’ అంటే ‘‘ఏది కాదో ఏది లేదో అది’’ అని శాస్త్రార్థం. శూన్యమే శివం. ఆకాశరూపం. అన్నిటినీ తనలో లయ చేసుకునే శక్తిని పొందినది. శివుడు జగమంతానే అయినవాడు. అన్నీ తానే అయినవాడు. రూపం లేని వాడు. వేదమయ స్వరూపుడు. జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన శివుని బ్రహ్మమురారులే తొలుతగా శివరాత్రినాడు అర్చించారు. యోగము, భోగము రెండూ శివుడే. పిపీలికాది బ్రహ్మపర్యంతము తన ప్రేమామృతాన్ని పంచి ఇస్తాడు. అతనికి తర తమ భేదాలు కానీ, ఎక్కువ తక్కువలని కానీ పట్టింపు లేదు. శివుని మతం సమభావం. అందుకే శివుడు అందరికీ పరమాప్తుడు. గర్భగుడుల్లో మహాభిషేకాలందుకుంటున్న శివుడు ప్రతి ఒక్కరి గుండె గుహలో ఉన్న ఆ పరమాత్ముని భక్తి అనే అమృతధారలతో అభిషేకిస్తున్నారు. ఆచరణ సన్నిధికి చేరుకోవాలనుకుంటాడు.
శ్రీ ఆదిశంకరాచార్యుల వారు శివానందల హరిలో ‘‘పరమేశ్వరా! దేవ మానవ జన్మలుగానీ, గిరి వనాదులలో మృగజన్మగానీ, చీమ, దోమ, క్రిమి కీటకాదులు గానీ, పశు పక్ష్యాది ఏ జన్మ లభించినా లభించనీ, కానీ నీ పాదపద్మముల నుండి ప్రవహించే లహరిలో విహరించగల ఆసక్తినివ్వు’’ అంటారు (శివానందలహరి శ్లో.10). ‘‘నన్నుమించిన దీనుడు లేడు. నిన్ను మించిన దేవుడూ లేడు.’’ ఇదే మన బంధుత్వానికి ప్రతీక. నువ్వు రక్షించడానికి, నేను కాపాడబడి, నిరీక్షణ పొందడానికి ఇది చాలునంటారు. ఆ వరుసలోనే ఆ మార్గంలోనే మన శివారాధన కొనసాగాలి.
శివతత్త్వాన్ని గురించి, మహాత్మ్యాన్ని గురించి పలు పురాణాలు ఉటంకించాయి. ప్రధానంగా శివపురాణం విస్తృతంగా వివరించింది. ఇక శంకరాచార్యుల వారి ‘శివానందల హరి’ని గురించి చెప్పేదేముంది?
శివుడు నిర్గుణుడు. సగుణుడు కూడా. అంతటా నిండి ఉన్న అతనికి ఒక రూపం అవసరం ఏముంది? అయినా భక్తుల కోసం వివిధ రూపాలలో దర్శనమిస్తున్నాడు. అవి లీలా రూపాలు. వాటి ద్వారానే అనుగ్రహిస్తున్నాడు. ఆ లీలారూపాలు అరువది అయిదున్నాయంటారు. వాటిలో 24 రూపాలు ప్రధానమైనవని, అందులో మూడు రూపాలు అతి ముఖ్యమైనవని పెద్దలు ప్రవచిస్తున్నారు. ఈ మూడూ శివతత్త్వాన్ని అర్థం చేసుకోడానికి ఆలంబనంగా ఉంటాయి. శివార్చనలో వీటిని నామాలుగా పరిగణిస్తారు.
మొదటి నామం ‘శివుడు’ అంటే మంగళకరుడు. సదాశివుడని కూడా అంటారు. ఎల్లప్పుడూ ఉపకారం చేయడం, శుభాలను కలిగించడం తప్ప మరో పరమార్థం తెలియనివాడు.
మరో నామం సద్యోజాతుడు. శివా! అని ఎలుగెత్తి పిలవగానే తక్షణం వచ్చి ఆర్తిని తీర్చువాడు. భక్తితో ఒక్క నమస్కారం చేస్తే పొంగిపోతాడు. ఉదారవత్త్వానికి ప్రతీకయైన నామం సద్యోజాతుడు.
మూడవది అశుతోషుడు. భక్తితో ఏ చిన్న సేవ చేసినా సంతోషిస్తాడు. ఆ సేవ అపచారంలా కనిపించినా, భక్త్భివానే్న మిన్న గా ఎంచి ఉపచారంగా స్వీకరించి అనుగ్రహిస్తాడు. కాళహస్తీశ్వర మహాత్మ్యం, కన్నప్ప కథ, నాయనార్ల కథలు దీనికి సాక్ష్యంగా నిలుస్తాయి.
సగుణరూపంలో త్రిశూలధారిగా దర్శనమిస్తాడు. త్రిశూలం త్రిగుణాలకు సంకేతం. ‘‘త్రైగుణ్యం శూలమేతస్య పరమసత్య నిష్ఠతః’ అంటుంది లింగపురాణం. సత్వ రజ తమో గుణాలను నియంత్రించేది శివుని చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. జ్ఞానానికి సంకేతం. శివుడు జ్ఞాన ప్రదాత. ఆదిగురువు అతడే. శిరస్సుపై చంద్రవంక మానసిక ప్రశాంతికి, మనస్సు నిశ్చలతకు గంగాదేవి చిహ్నాలు. ధరించే సర్పాలు జీవాత్మలు. అహంకారాన్ని త్యజించడానికి అన్నట్లు గజ చర్మధారణ పరిశుద్ధతను ప్రకటించడానికి విభూదిని సూచిస్తాడని అంటారు. శివుని చెంత జింక చతుర్వేదాలకు, నంది సాంగత్యానికి, ఫాలభాగంలో ఉన్న మూడో నేత్రం ధర్మ సంరక్షకుడని నిర్దేశించాయి పురాణాలు.
శివుడు భోగప్రదాత. తన విభూతులతో అనేక రూపాల్లో దర్శనమిస్తున్న శివుడు భోగాపవర్గములు పొందడానికి ఆలంబనంగా ఉన్నదే శివలింగం.
శివుడు సృష్టి స్థితి లయకారుడు. ప్రళయ కాలంలలో జగత్తును తనలో లయ చేసుకున్న శివుడు పిమ్మట బ్రహ్మ విష్ణువులను పరాశక్తి అంశలుగా సృష్టి స్థితులను కొనసాగించడానికి ఏర్పాటు చేసిన పరమేశ్వరుడే శివుడు. ఒక విధంగా ఇది అర్థనారీశ్వరతత్త్వం .
శివుడు జ్ఞాన ప్రదాత. స్థితికర్త అన్నది స్కాందపురాణం.
శివుడు అన్నప్రదాత. సకల జగత్తుకు అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవి శివపత్నియే.
శివుడు ఐశ్వర్యప్రదాత. ఐశ్వర్యం అంటే సిరిసంపదలే కావు. ఆయురారోగ్యములు కూడా సమకూర్చువాడు. పరమశివుని ఐశ్వర్యం అలాకాక స్వపర భోగ్యంగా విలసిల్లుతుంది. శివుడు స్మశాన వాసియైనా, ఒంటినిండా భస్మం పూసుకున్నా, అష్టైశ్వర్యములు ప్రసాదించే దేవదేవుడు. ఆ కారణంగానే మహాలక్ష్మి శివుని నిత్యం పూజిస్తుంది.
శివుడు ఆది గృహస్థుడు. అన్యోన్య దాంపత్యానికి శివపార్వతులే ప్రతీకలు. మహాలక్ష్మికి ప్రతీకయైన రుక్మిణి తన వివాహ సందర్భంగా ‘‘నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులని మిమ్ము పుణ్యదంపతుల’’ అని భాగవతంలో పోతన రుక్మిణి హృదయాన్ని ఆవిష్కరించారు.
జ్ఞాన సంపదనందించే లక్షణాన్ని తెలియజేసేందుకే దక్షిణామర్తిగా అవతరించి యోగాన్ని, భోగాన్ని అందించిన దయామూర్తి.
శివుని అర్చించడానికి చెంబుడు నీళ్లు, చిటికెడు విభూది, ఒక్క మారేడు దళం చాలు. సంతోషిస్తాడు. శివపంచాక్షరి ‘‘ఓం నమశ్శివాయ అని జపిస్తే చాలు పొంగిపోతాడు. ఆ ఐదు అక్షరాల్లోనే శివతత్త్వం శివ మహాత్మ్యం నిబిడీకృతమై ఉంది. ఏ భోగాలను, కానుకలను ఆశించడు.
అందుకే శివుడు అందరికీ ఆప్తబంధువు. యుగాల నుండి శివుడు పూజలందుకుంటున్నాడు. రామాయణంలో రాముడు బ్రహ్మ హత్యా దోష పరిహారార్థం (రావణ వధ) రామేశ్వరంలో శివలింగం ప్రతిష్ఠించాడని ఉంది. వేనవేల ఏళ్లుగా మన దేశంతో పాటు ఇతర దేశాలలో కూడా శివాలయాలున్నాయి. మక్కాలోని మసీదు శివాలయమేనని అంటారు. దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూత లింగాలు, పంచారామాలు వంటి ప్రసిద్ధ దేవాలయాలున్నాయి. దేశమంతటా నెలకొని ఉన్నాయి. ప్రతీ గ్రామంలో శివాలయాలున్నాయి.
శివార్చనకు అశక్తులైన వారికి ఆదిశంకరులు శివమానస పూజను అనుగ్రహించారు. అది అశక్తులకు ఆచరణ యోగ్యం. అటువంటి కరుణామయుడు. శివునికి ఏమివ్వగలం? శంకర భగవత్పాదుల మాటలలో ‘‘శివా! నీ చేతిలో బంగరుకొండ, సమీపంలో కుబేరుడు, కామధేనువు, కల్పవృక్షం, చింతామణి మున్నగునవన్నీ రాజిల్లుచుండగా శిరోభాగంలో చంద్రుడు, గంగ ఉండగా, సమస్త మంగళాలు నీ పాదాల వద్ద ఉండగా నేనేమివ్వగలను? అందుకే నా మనస్సును అర్పిస్తున్నాను’’ అన్నారు. అదే మన కర్తవ్యం.
ఓం శివాయ నమః

-ఏ. సీతారామారావు