Others

పెద్ద బాలయోగి జీవన సందేశం ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నేను చివరి జన్మలో ఉన్నాను. నా తండ్రి చేసుకున్న పుణ్యంవల్ల నేను వారి పుత్రునిగా జన్మించాను. నాది తీవ్రమైన తపస్సు. కనుక భక్తులెవరూ నా తపస్సుకు భంగం కలిగించరాదు. ఎంత గొప్పవారు వచ్చినా తలుపులు తీయరాదు. నిజానికి వచ్చినవారు అంత గొప్పవారు అయితే వారి రాకతో తలుపులు అవే తెరుచుకుంటాయి’’ అని ధ్యానంలో కూర్చున్న శ్రీ ముమ్మిడివరం పెద్ద బాలయోగిగారు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని, తన తపస్సు లక్ష్యాన్ని 27 మార్చి 1949న ముగ్గురు ప్రభుత్వ ఉన్నతాధికారులు శ్రీ వ్యాసం సత్యంరాజు, గాదె అప్పారావు, గరిమెళ్ళ కృష్ణమూర్తిగార్ల ముందు తెలియజేశారు. అప్పటికే వారు తపస్సు ప్రారంభించి రెండు సంవత్సరాలయింది. 22 జూన్ 1946న శ్రీకృష్ణుని పటం ముందు పెట్టుకుని వారు తపస్సు ప్రారంభించారు. రోజు ఉదయం నాలుగు గంటలకు ఒక గంటసేపు భక్తులకు వౌనం గా దర్శనం ఇచ్చేవారు. ప్రారంభంలో మంచినీరు, రోజుకు ఒక గ్లాసు పాలు తాగేవారు. రోజంతా ధ్యానమే. తర్వాతి కాలంలో రోజూ దర్శనం ఇవ్వడం మానుకున్నారు. ఆహారమూ మానివేశారు. అనేక సంవత్సరాలు శివరాత్రి తర్వాతి రోజు దర్శనం ఇచ్చేవారు. ఆరోజు ఒక గ్లాసు పాలు సేవించేవారు. ఆరోజు అర్థరాత్రి వరకు భక్తులకు దర్శనం ఇచ్చేవారు. అత్యంత నిరాడంబర ప్రవృత్తి వారిది. వారి తపస్సు విషయం వారి మాటల్లోనే...
తత్త్వోపదేశం 11:
ఆహారం వలన ఇంద్రియములకు బలము కలుగును. ఇంద్రియములను లోబరచుకొనుటకు ఆహారమును తగ్గించవలెను, మానవలెను. అప్పుడు ఇంద్రియములు లోబడును. అప్పుడు పంచభూతములు అగ్నిలో అణిగిపోయి ఎరుక లేకపోవును. ఎరుక లేనప్పుడు ఆహారము అవసరం లేదు. అందువల్ల జీవాత్మపరమాత్మలో లీనమయును.
తత్త్వోపదేశము 12:
ఆహారము తీసుకొనుచూ తపస్సు చేయవచ్చును. కానీ దానివల్ల బాధలు ఉన్నవి. సంసారంలో ఉండియు, చక్రవర్తితనము చేయుచు భగవంతుని స్మరణ చేయవచ్చును. కానీ నిలకడ ఎక్కడనుండి వచ్చును? చలనము కలుగుచుండును. ఒక్కొక్కప్పుడు అఖండమైన బాధలు కలుగుచుండును. ఆ బాధలను జయించగలిగితే భగవంతునకు అఖండమైన (సాధనము) జాలి కలుగును. (్భక్తునికి ముక్తి లభించును)
ఆధునిక కాలంలో అత్యంత నిరాడంబరంగా శ్రీరామకృష్ణులు, రమణులు తపస్సుచేసిన తీరులోనే శ్రీ పెద బాలయోగిగారు తపస్సును కొనసాగించారు. తన పేరుతో ధన సేకరణకు వారు అంగీకరించలేదు. భక్తులకు అన్నదానం చేయమన్నారు. 16వ ఏట తపస్సు ప్రారంభించిన శ్రీ పెద్ద బాలయోగిగారు శివరాత్రి తర్వాత రోజు మాత్రమే భక్తులకు దర్శనం, మిగిలిన 364రోజులు ఏకాంతంగా తపస్సు- ఈవిధమైన ఘోర తపస్సును 39 సంవత్సరాలు చేశారు. 19 జూలై 1985న వారు ముక్తిని పొందారు. ఆధునిక కాలంలో ఇలాంటి ఘోరమైన తపస్సు చేసినవారు మనకు కనపడరు.
తన అన్నగారు 16వ యేట తపస్సులో కూర్చోవటం చూసిన వారిచ్చిన తమ్ముడు నాగభూషణం (శ్రీ చిన్న బాలయోగిగారు) తన ఎనిమిదవ ఏట తపస్సు ప్రారంభంచి, 28 అక్టోబర్ నెల 1991లో సమాధి పొందారు.
ఇలాంటి పెద బాలయోగి, చిన బాలయోగి ఎవరు? వారి జీవన విశేషాలు ఏమిటి?
వీరిద్దరూ తూర్పుగోదావరి జిల్లా, అమలాపురానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ముమ్మిడివరం గ్రామంలో షెడ్యూల్డ్ కులము (మాల)కు చెందిన కటకదల గంగయ్యగారికి సుబ్బారావు, నాగభూషణంలుగా జన్మించారు. శ్రీ సుబ్బారావు 23 అక్టోబర్ 1936న జన్మించారు. శ్రీ నాగభూషణం 3 నవంబర్‌న 1941లో జన్మించారు.
వీరిద్దరూ పాఠశాలకు వెళ్ళే అవకాశానికి నోచుకోలేదు. అంటరానితనం తీవ్రంగా ఉన్న రోజులవి. గుళ్ళు, ప్రవచనాలకు మరింత దూరం. 15 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు పెద బాలయోగి పశుపాలన చేశారు. గ్రామంలోని రైతులందరిచే మంచి బాలునిగా మన్ననలు పొందారు.
హిందూ సమాజంచే అనేక తరాలుగా ‘అంటరానితనం’ పేరుతో అవమానపరచబడిన నిమ్నవర్గాలలో పెద బాలయోగి, చిన బాలయోగి జన్మించారు. సనాతన ధర్మంప్రకారం ఎవరైనా ముక్తిని పొందాలంటే అనేక జన్మలు సాధనచెయ్యాలి. బౌద్ధ జాతకకథలలో కూడా బుద్ధుడు జ్ఞానం పొందడానికి ముందు అనేక జన్మలలో సాధన చేసినట్లు తెలిపియున్నది.
పెద్ద బాలయోగిగారి మాటలమేరకే వారు అనేక జన్మలలో సాధన చేస్తూ, సాధనామార్గం సోపానం మెట్లు ఎక్కుతూ చివరకు మనందరం అస్పృశ్య వర్గాలుగా అవమానపరుస్తున్న కులం(మాల)వారి ఇంట బాలయోగులిద్దరూ జన్మించారు. ముక్తిని పొందారు. అంటే దీని సందేశం ఏమిటి? అంటరాని కులం మనం అక్రమంగా ఏర్పరచుకున్నది, సృష్టించింది. భగవంతుని దృష్టిలో అది నిమ్న కులం కాదు. అంటరానితనం అనే భావనకు భగవంతుని సమర్థన లేదు. శ్రీరామకృష్ణులు, రమణుల వలె బాలయోగులు ఇద్దరూ మనకు దర్శనమిచ్చారు.
ఒక వ్యక్తికి భక్తి, జ్ఞానం కలిగి ఉండటం వేరు. పేద, బాలయోగులు చేసిన ఘోర తపస్సు అందరికీ సాధ్యమా? మనం సమాజంలోని కొందరు సోదరులను మనం అంటరానితనం పేరున ముద్రవేయడం, అవమానపరచడం ‘అధర్మం’ అని మనకు తెలపడానికే భగవంతుడు ఆ చిన బాలయోగిలను ఈ మాల కులములో జన్మింపజేశాడు. ఈ సందేశం మనం అర్థం చేసుకోవద్దూ?
గతంలో 600 సంవత్సరాల క్రితం చర్మకార కుటుంబంలో, కాశీలో జన్మించిన సంత్ శిరోమణి రవిదాస్, 20వ శతాబ్దంలో తెలుగునాట జన్మించిన ఆదోని లక్ష్మమ్మ, కురుమద్దాలి పిచ్చమ్మ (కృష్ణాజిల్లా) మాదిగ కక్కయ్య (కడప జిల్లా) దున్న ఇద్దాసు (నల్గొండ జిల్లా)- ఇలా ఎందరో ఎస్సీ కులంలో జన్మించి భగవద్దర్శనం పొందిన గొప్ప అవధూతల ఈ కోవలోని వారు.
పెద బాలయోగిగారు మనకు అందించిన 18 సందేశాలను పరిశీలిస్తే మన సనాతన ధర్మంలోని అనేకమంది ఋషులు అందించిన జ్ఞానానే్న వారు మనకు తిరిగి అందించారు. సనాతన ఋషులు బోధనలకు వారు ఎక్కడా దూరంగాపోలేదు. వారి కోరల్లో ఇప్పటికీ అమలుకాని కోరిక వారి దేవాలయ ప్రాంగణంలో ఒక వేద పాఠశాల ప్రారంభం కావాలన్నది. శ్రీ ముమ్మిడివరం పెద బాలయోగిగారిని భక్తులు శ్రీకృష్ణుని అవతారంగా భావిస్తారు.
ముమ్మిడివరంలోని ఆ స్మారక దేవాలయాలను హిందూ శ్రద్ధా కేంద్రాలుగా, వేద పాఠశాల సహితంగా తీర్చిదిద్దడం మన హిందూ భక్తుల బాధ్యత.
ఈ సంవత్సరం ఫిబ్రవరి 22న సంత్ శిరోమణి రవిదాస్, శ్రీ ముమ్మిడివరం పెద, చిన బాలయోగుల జీవన సందేశం ప్రజలకు తెలియజేయడానికై ధార్మిక సభ ఏర్పాటయింది.

- కె. శ్యాంప్రసాద్, 9440901360