AADIVAVRAM - Others

రంగుల యజ్ఞం... రసజ్ఞ హృదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రకారుడు గాదె ప్రమోద్‌రెడ్డి పౌరాణిక పాత్రలను కాన్వాసుపై చిత్రించి అలరిస్తున్నారు. ఆ బొమ్మలతో ఆస్తికులు ఆనంద పరవశులవుతే... నాస్తికులు ఆ రంగులు... రేఖలు, మార్మికత, సోయగం, సృజనను ఆస్వాదించి సంతోషపడుతున్నారు. పరమాత్ముని వివిధ రూపాలు, వివిధ చేష్టల, వాటి నేపథ్యం తనదైన ప్రత్యేక శైలిలో పామరులను సైతం ఆకట్టుకునేలా, చిత్రకారుడు చిత్రిక పట్టారు.
ఇంతవరకు ఎందరో చిత్రకారులు భగవంతుడి వివిధ రూపాలను చిత్రించినా ప్రమోద్‌రెడ్డి తనదైన ప్రత్యేక శైలిలో వాటిని చిత్రించి ప్రజల ఆదరణ పొందుతున్నారు. శ్రీకృష్ణుని మోహనరూపం, మనోహర చూపు, గోవులు, పిల్లనగ్రోవి, నెమలి పింఛం, సమ్మోహనకర రంగుల్లో నయనానందకరంగా, అనిర్వచనీయ అనుభూతిని కలిగించే రంగుల మిశ్రమంతో ప్రతివారు ‘్ఫదా’ అయ్యేలా కాన్వాసుపైకి తీసుకొచ్చారు.
ద్వాపరయుగంలోని గోపాలుడు, గోవులు, పచ్చదనం... పరిసరాలు, ప్రకృతిని చిత్రకారుడు పట్టిచూపేందుకు ప్రయత్నించి సఫలమయ్యారు. చిత్రకారుడి ఊహకు, సృజనకు, రంగుల రంగరింపునకు గరిష్టంగా వీలు కల్పించే శ్రీకృష్ణుడి రూపం చిత్రకారులకు సదా సవాల్‌గానే నిలుస్తుంది. ఆ సవాల్‌ను స్వీకరించిన చిత్రకారుడు గాదె ప్రమోద్‌రెడ్డి అద్భుతమైన, ఆ మోహనాకారుని ‘పోట్రేట్’ ప్రజల ముందు పెట్టారు. అలంకార ఫ్రియుడుగా పిలిచే శ్రీకృష్ణుని ఛాతీ భాగం, భుజాలు, మెడ దగ్గర సైతం వివిధ ఆకృతులు, తామరలు, లతలు, గోవులు లేత రంగుల్లో చిత్రించి మోహన రూపాన్ని మరింత ద్విగుణీకృతం చేసి ‘ఆర్ట్ లవర్స్’ను మంత్రముగ్ధుల్ని చేశారు. చిత్రకారుడి చైతన్యం, సృజన, పనితనం, రసహృదయం, నాజూకుతనం అంతా ఇలాంటి సందర్భంలోనే బహిర్గతమవుతుంది. ప్రమోద్‌రెడ్డి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనలోని ప్రతిభను పదిమంది ముందు పరిచారు.
శ్రీకృష్ణుని తలకు రంగు రంగుల ‘పసిడి’, కిరీటం, అందులో నెమలిపింఛం... చెవులకు ఆభరణాలు, ఉంగరాల జుట్టు, నుదుట విష్ణునామం, మెడలో కంటె, పూలహారం, చేతివేళ్లకు గోరింటాకు, మృదువైన ఆ వేళ్ల మధ్యన పిల్లన గ్రోవి, బంగారు ఉంగరాలు, విశేష ఆకర్షణీయ చూపు, మత్తు ఎక్కించే కనుకొలకులు, నేపథ్యంలో మోరచాచిన గోవులు, గోధూళిని తలపించే రంజితం, ఆకాశాన్ని కప్పుకున్నట్టు శ్రీకృష్ణుని నీలవర్ణ శరీర ఛాయ, నేపథ్యంలో లీలగా ఆకుపచ్చని పర్వతం... మొత్తంగా లీలా మానుష స్వరూపం కళ్ల ముందుకు తీసుకొచ్చి వీక్షకులు తమని తాము మరచిపోయేలా చిత్రకారుడు చేయడమంటే తన ‘విద్య’లో విద్వత్‌ను ప్రదర్శించినట్టే లెక్క.
శ్రీకృష్ణుడి ఒకే ఒక ‘పోట్రేట్’ గాక వివిధ రూపాల్లో రూపు కట్టించారు. ఆ వైవిధ్యం, ఆ సోయగం, నిరాడంబరత, నిర్మలత్వం, మార్మికత, మోహనత్వం, కొంటెదనం, చిలిపిదనం అన్నీ కలబోసిన చిరునవ్వుల చెలికాడి రూపం పట్టి చూసి పరవశింపజేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ చిత్రకారుడు ప్రమోద్‌రెడ్డి మాత్రం అలవోకగా, అపురూపంగా, అద్వితీయంగా, ఆథ్యాత్మికత ఉట్టిపడేలా రంగుల రసగంగలో వీక్షకులను ఓలలాడించడంలో కృతకృత్యులయ్యారు.
కాళిందిపై తాండవ నృత్యం లాంటి శ్రీకృష్ణలీలను సైతం చిత్రకారుడు చిత్రిక పట్టారు. రాధ... గోపికలు, మీరా ఇట్లా అనేక మందితోనూ శ్రీకృష్ణుడి సాంగత్యం చిత్రకారుడు కనుల ముందు నిలిపారు. నెమలి, కలువలు, తామరాకులు, కొలను, గోవులు... మోహనరాగానికవి మోరలు చాపి, చెవులు రిక్కించి వేణుగానం వినడం, తాథాత్మ్యం చెందడం అదంతా ఓ మనోహర, మధుర భావన. మాటలకందని ఓ అనుభూతి, ఓ అద్భుతం... దాన్ని కాన్వాసుపైకి తర్జుమా చేయడం, అంకిత భావంతో, ఆరాధనా భావంతో శ్రీకృష్ణ లీలలు చిత్రించడం సాధారణ అంశం కాదు. ప్రకృతే తాను.. .తానే ప్రకృతి, అందులో గోవులున్నాయి. గంగిగోవులున్నాయి. గడ్డి భూములున్నాయి. వీటినన్నింటిని రేఖల్లో... రంగుల్లో, రసాత్మకంగా, జ్ఞాన చక్షువులను ప్రేరేపించేట్టుగా కాన్వాసుపై పొందుపరచడం చిత్రకారుడికి అందిన రంగు వరం!
‘‘్ఫగరేటివ్’ పద్ధతిలో పలు విధాలుగా శ్రీకృష్ణుడినే గాక, గోపికలను ఫోర్‌గ్రౌండ్‌లో నిలిపి నేపథ్యంలో శ్రీకృష్ణుడిని చిత్రిక పట్టడం మరో విశేషం. ఆ గోపికల విరహం...తపన... అన్నీ వారి మదిలో మెదులుతున్న భావనలా, నేపథ్యంలోని సన్నివేశం. ‘‘ఫేడ్ అవుట్’’ పద్ధతిలో చిత్రించి, గోపికను, రాధను రంగుల జలపాతంలో, భావాత్మక రూపంలో చిత్రించి ఆ పాత్రలకు ప్రాధాన్యత కల్పించారు. కొన్నిచోట్ల ‘‘కృష్ణం వందే జగద్గురుమ్...’’ అన్న మాటలకు, అక్షరాలకు ఆకృతినిచ్చారు. కొన్ని చిత్రాల్లో వర్తమాన స్ర్తి రూపం, ఆధునిక కృష్ణ భక్తురాలిని చిత్రించి వేల ఏళ్ల ప్రేమ పరంపరను సజీవం చేశారు. అమలిన శృంగారభావనకు ‘ఫ్రేమ్’ కట్టారు. ఆరాధన భావానికి అద్దం పట్టారు. అంతిమంగా ‘కృష్ణతత్వం’తో కనులవిందు జేశారు. వైష్ణవ మాయను కప్పారు. దివ్యత్వానికి ప్రతిరూపంగా కాన్వాసులను మలిచారు. ఇదొక రంగుల యజ్ఞం... రసాత్మక హృదయం. హృదయాలు తన్మయత్వంతో మూర్చనలు పోయేందుకు దోహదపడే రసజ్ఞత జల్లుల హరివిల్లులు ఆయన బొమ్మలు.
వైష్ణవ మాయను ఆవాహన చేసుకున్న ప్రమోద్‌రెడ్డి నిజామాబాద్ జిల్లా, తిరుకొండ మండలం, తూంపల్లి గ్రామంలో 1970లో జన్మించారు. నిజామాబాద్ పట్టణంలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివారు. పాఠశాల చదివేప్పుడు చందమామ ఇతర కథల పత్రికలలో కథలకు దగ్గ బొమ్మలు ఆకర్షణీయంగా కనిపించడంతో వాటి పట్ల ఆకర్షితులయ్యారు. వాటిని నకలు చేసి చూసుకోవడం అలవాటైంది. ఈ సమయంలోనే చిత్రకళ కళాశాల హైదరాబాద్‌లో ఉందని తెలిసి హైదరాబాద్ వచ్చి 1988లో బి.ఎఫ్.ఏ కోర్సులో చేరారు. జె.ఎన్.టి.యు.లో చేరాక చిత్రకళలోని ప్రాథమిక అంశాలు బోధపడ్డాయని, నిరంతరం స్కెచ్‌లు వేసి నైపుణ్యం పెంచుకుని గ్రామీణ ప్రాంత జీవనాన్ని బొమ్మలుగా వేశానని ప్రమోద్‌రెడ్డి చెప్పారు. బి.ఎఫ్.ఎ పూర్తయ్యాక బరోడాకు వెళ్లి ఎం.ఎఫ్.ఏ. కోర్సు ఎం.ఎస్. యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు. అక్కడ మ్యూరల్ పెయింటింగ్ చేశారు. అనేక ల్యాంక్ స్కేప్ బొమ్మలు సిమెంట్, ఫైబర్, పి.వి.సి, తదితర వస్తు సామగ్రితో రూపొందించానన్నారు. 1999లో హైదరాబాద్‌కు తిరిగొచ్చాక నిజామాబాద్‌లో ఉంటూ అనేక బొమ్మలు చిత్రిస్తూ వివిధ గ్రూపు షోలలో పాల్గొన్నానని, కొన్ని సోలో షోలను ఏర్పాటు చేశానని ఆయన చెప్పారు.
1990 ప్రాంతంలో చినజీయర్ స్వామి నుంచి ఉపదేశం గ్రహించాక పౌరాణిక పాత్రలను తీసుకుని బొమ్మలు వేస్తున్నానని, అప్పటి నుంచి తనలో ఆథ్యాత్మిక భావనలు పెరిగాయని, అలా వేసిన అసంఖ్యాక పౌరాణిక పాత్రల బొమ్మలను హైదరాబాద్‌లోని ప్రముఖ ఆర్ట్ గ్యాలరీలలో ప్రదర్శించానని, బొంబాయి, జైపూర్ తదితర చోట్ల కూడా గ్రూపు షో ప్రారంభమైందని అందులోనూ తాను గీసిన చిత్రం ప్రముఖంగా కనిపిస్తోందని, అలా అసంఖ్యాక ‘ఆర్ట్ లవర్స్’ అభిమానం, ఆదరణ, ప్రేమను పొందానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రమోద్‌రెడ్డి రామంతాపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఆర్ట్ టీచర్‌గా పని చేస్తున్నారు.
*
*చిత్రాలు.. గాదె ప్రమోద్‌రెడ్డి.. 9704065593

- వుప్పల నరసింహం 99857 81799