Others

సత్యదీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సత్యమేవ జయతే’ సత్యమే జయిస్తుందని ఇతిహాసాలు స్మృతులు ఎలుగెత్తి చాటుతున్నాయి. ఎలాం టి పరిస్థితులు ఎదురైనా అంతిమ విజయం సత్యా నిదే. ‘‘సత్యం వధ, ధర్మం చర’ అన్నారు పెద్దలు. సత్యాన్ని మాట్లాడు, ధర్మానే్న ఆచరించాలని వేదాలు సయితం ఘోషిస్తున్నాయి.
సత్యానికి మారుపేరుగా హరిశ్చంద్రుణ్ణి పేర్కొంటారు. సత్యం విలువను తెలుసుకోవాలన్నా, లేక సత్యానికే కట్టుబడి ఉండాలనే స్ఫూర్తి కలుగాలన్నా సత్యహరిశ్చంద్రుని జీవిత చరిత్రను తెలుసు కోవా లంటారు పెద్దలు. సత్యం కోసం తన విశాల సామ్రాజ్యాన్ని, సిరి సంపదలను త్యాగం చేసిన మహానుభావుడు సత్య హరిశ్చంద్రుడు. తన భార్య చంద్రమతిని, ఏకైక కుమారుడు లోహితాస్యున్ని అమ్ముకోవడం కూడా సత్యాన్ని విడనాడకుండా ఉండడానికే.
చివరకు తన్ను తాను కూడా వీరబాహునికి అమ్ముకొని కాటికాపరిగా వ్యవహరించాడు హరిశ్చంద్రుడు. ఓసారి లోహితాస్యుడు దర్భలకోసం అడవికి వెళ్ళినపుడు పాము కరచి చనిపోతాడు. భార్య చంద్రమతి ఆ బాలుని (కుమారుని) మృతదేహాన్ని స్మశానానికితీసుకొని వెళ్లగా కాటి సుంకం చెల్లించనిదే చితిపెట్టడానికి వీల్లేదని హరిశ్చంద్రుడు కరాఖండీగా చెబుతాడు. ఆమె తన సతీమణి అని, బాలుడు తన కుమారుడని తెలిసినప్పటికీ కాటికాపరిగా తన విధిని చిత్తశుద్ధితో నిర్వహిస్తాడు. సత్యపథాన్ని వీడలేదు. అది సత్యహరిశ్చంద్రుని దీక్ష.
అసత్యం అనేక అనర్థాలకు దారితీస్తుంది. కర్ణుడు ప్రపంచంలోనే గొప్ప వీరుడు కావాలని, అర్జునుని మించిపోవాలని కలలు గంటాడు. దీనికి అసత్యానే్న ఆయుధంగా తీసుకొన్నాడు. పరశురాముని వద్ద శుశ్రూష చేసి విశ్వవీరుడు కావాలనే దృఢమైన ఆకాంక్షతో అతని వద్ద శిక్షణకు సిద్ధమయ్యాడు. పరశురాముడు బ్రాహ్మణులకు తప్ప ఇతరులకు మంత్రోచ్చారణ చేస్తూ ప్రయోగించాల్సిన అస్త్రాల మర్మాలను చెప్పనని చెప్పితే వెంటనే కర్ణుడు అబద్ధాన్ని తోడు చేసుకొని, బ్రాహ్మణ వేషం వేసుకొని పరశురాముణ్ణి మెప్పించి శిష్యునిగా చేరాడు. అస్త్ర, శస్త్ర ప్రయోగాల్లో కర్ణుడు బాగా ఆరితేరిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఓ రోజున కర్ణుని తొడపై పరశురాముడు తలను పెట్టి నిద్రపోయాడు. ఓ కందిరీగ కర్ణుని తొడ కింది భాగాన్ని దూరి తొలుచుకుంటూ లోపలికి ప్రవేశించింది. కర్ణుడు కదిలితే గురువుకు నిద్రాభంగమవుతుందని అలానే కదలకుండా ఎంతో నిగ్రహంతో బాధను సహించాడు.
కొంతసేపు గడిచాక అతని తొడ నుంచి రక్తప్రవాహం వచ్చి పరశురాముని తల కింద చేరింది. దీంతో ఆయనకు తెలివి వచ్చింది. ఎంతో ఆశ్చర్యంతో రాధేయుణ్ణి (కర్ణుని) అణువణువునా పరీక్షిస్తూ చూశాడు. ‘‘ఎవరు నీవు? ఏమిటి నీ కథ, వెంటనే చెప్పమని గద్దించాడు. నీవు భూసురుడవు కావు. ఇంతటి రక్తపాతాన్ని కేవలం ఒక్క క్షత్రియుడు మాత్రమే తట్టుకోగలడని పేర్కొన్నాడు. ఆ సమయంలో కర్ణుడు దాచిపెట్టిన నిజాన్ని బయటకు కక్కాడు. స్వామీ! నన్ను పెద్దమనస్సుతో క్షమించండి. మీ వద్ద అన్ని విద్యలు నేర్చుకోవాలనే తపనతో అసత్యమాడాను. దాంతో పరశురాముడు అగ్గిమీద గుగ్గిలంలా కర్ణునిపై ఆగ్రహించాడు. నీవు అసత్యం పలికావు, నన్ను మోసగించావు. నీవు నేర్చుకున్న విద్య అవసరమైనప్పుడు పనిచేయదని శపిస్తాడు. అందుకే కర్ణుడు ఓడిపోయాడు. చివరకు ప్రాణాలను కూడా వదిలేయవలసి వచ్చింది. నిజజీవితంలో కూడా అబద్ధాలు బాగున్నట్టు కనిపిస్తాయ. కానీ చివరకు అపకీర్తి, దారిద్య్రం చుట్టుముట్టుకుంటుంది. కనుక అసత్యాలకు దూరంగా ఉండాలి.

- లక్ష్మి