Others

అవి మధురానుభూతులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా/జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా.. హాయిగా ఆలూమగలై కాలం గడపాలి.. శివగోవింద గోవింద/ హరి గోవింద గోవిందలాంటి పాత పాటలు వింటుంటే పిల్లతెమ్మెరలాంటి పాప కళ్లముందు మెదలాడక మానదు.
1956-63 మధ్య స్వర్ణయుగపునాటి తెలుగు తమిళ చిత్రాల్లో అగ్రతారలతో పోటీపడి నటించిన ఆమె పాప పేరే -బేబి శశికళ. అప్పటి మద్రాస్ మేయర్ డాక్టర్ కెవి స్వామి తనయ. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం సొంతూరు. తల్లి సతీతులసి సంగీతంలో దిట్ట. ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ భార్య -బేబి శశికళకు పినతల్లి. ఆరుగురు అన్నదమ్ముల మధ్య ఒక్కతే ఆడబిడ్డగా గారాబంగా పెరిగినా కళలు, చదువును ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. దేవదాసు నిర్మాత డిఎల్ నారాయణ ప్రోత్సాహంతో బాలనటిగా చిరంజీవులు సినిమాతో తెరంగేట్రం చేసిన శశికళ, అనేక తెలుగు, తమిళ భాషల చిత్రాల్లో నటించారు. తర్వాత తల్లం రవిశంకర్‌ను పెళ్లాడి లండన్‌లో స్థిరపడ్డారు. బాలనటిగా పాత చిత్రాల్లో నటించిన అనుభవాలను ప్రస్తుత 60 ఏళ్ల శశికళ వెనె్నలకు పంచిన ముచ్చట్లు ఇవి.
తొలి సినిమా నేపథ్యం?
- ఐదేళ్ల వయసులో వినోదవారి చిరంజీవులు చిత్రంలో తొలిసారి కనిపించా. ఆంధ్ర మహిళా సభలో ఓ కార్యక్రమానికి వెళ్లినపుడు మారాం చేసి మరీ డాన్స్ చేశాను. అక్కడ నిర్మాత డిఎల్ నన్ను చూశారు. ఆ పరిచయంతో చిరంజీవులు చిత్రంలో చిన్ననాటి జమున వేషాన్ని నాచేత వేయిస్తానన్నారు. సంగీతం, కళలంటే ఇష్టపడే అమ్మ కాదనకపోవడంతో శారదగా ఆ చిత్రంలో కనిపించాను.
తొలి షూటింగ్ అనుభవాలు..
-ఆ చిత్రంలో చిన్ననాటి ఎన్టీఆర్ -బాబ్జీ అనే నటుడు. ఐదేళ్ల వయసులో నాకేం తెలీదు కనుక అమ్మతో స్టూడియోకు వెళ్లి వచ్చేదాన్ని. ప్రొడక్షన్ సిబ్బంది బిస్కెట్లు కొనిపెట్టేవారు. స్టూడియోలో పెద్ద లైట్ల కాంతిలో నాచేత చిన్న చిన్న డైలాగులు బట్టీపట్టిస్తూ, ఎలా చేయాలో చేసి చూపించేవారు. భయం లేకుండా చెప్పినట్టే చేసేదాన్ని. అప్పట్లో సెట్లో చెప్పిన డైలాగులే రికార్డయ్యేవి.
తమిళ వెర్షన్‌లోనూ నా డైలాగులు నేనే చెప్పా. సినిమాలో టైటిల్స్ పూర్తయ్యాక నేను, బాబ్జీ వడివడిగా మెట్లు దిగి రావడం తొలి సన్నివేశం. తినేందుకున్నాయి.. కొనేందుకున్నాయి.. రా అనే పాటతోనే సినిమా మొదలవుతుంది. ఇదే నాపై చిత్రీకరించిన తొలి సన్నివేశం.
మరచిపోలేని సంఘటన
ఈ చిత్రంలో బాబ్జీ, నేను గుడికెళ్లినపుడు చిన్ననాటి పేకేటి శివరాం పాత్రధారి రత్నం అనే కుర్రాడు కోపంతో నాపై బురద చల్లాలి. ఈ సీన్ చిత్రీకరించే సమయంలో మా అన్న నా వెంబడి ఉన్నాడు. ఆ సన్నివేశం చూసి మా అన్నయ్యకు కోపమొచ్చింది. బురదజల్లితే కొడతానని అందర్నీ బెదిరించాడు. ప్రొడక్షన్‌వారు నచ్చచెప్పినా వినలేదు. చేసేదిలేక ఆ సన్నివేశాన్ని రెండు షాట్లుగా విభజించి, షూటింగ్ చేసి కలిపారు. అన్నయ్య గొడవ గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంటుంది.
భాగ్యరేఖలో లక్ష్మి
బిఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన భాగ్యరేఖ చిత్రంలో చిన్ననాటి జమున (లక్ష్మిగా) కనిపించా. పినతల్లి వద్ద పెరుగుతూ ఆమె పెట్టే బాధలను భరించే తల్లీదండ్రీలేని పిల్లపాత్ర నాది. ఎన్టీఆర్ చిన్ననాటి పాత్ర రవిగా మాస్టర్ వర్మ నటించారు. ఎన్టీఆర్ నన్ను చెల్లాయి అంటూ ఆప్యాయంగా పిలుస్తుండేవారు. షూటింగ్ జరిగినన్ని రోజులూ కూతురిలా చూశారు.
గోవిందరాజుల సుబ్బారావు తాతయ్య నన్ను ఎత్తుకు తిప్పేవారు. భాగ్యరేఖలో నటించేటప్పుడు నాకు ఆరేళ్లు. బిఎన్ రెడ్డి అంటే ఎవరో తెలీని వయసు. చాక్లెట్లు ఇచ్చేవారు. ఇష్టం లేకున్నా తీసుకునేదాన్ని. దాన్ని గమనించిన రెడ్డిగారు, ఆ తరువాత నాకేం ఇష్టమో అమ్మని కనుక్కుని అవే కొనిపెట్టేవారు. నాకు ఏది కావాలంటే అది కొనిపెట్టమని షూటింగ్‌లో ప్రొడక్షన్ వాళ్లకి ఆర్డర్ వేశార్ట.
జమున అక్కయ్యతో..
మా అమ్మది తెనాలి కావడంతో -జమున అక్కయ్య మా కుటుంబానికి బాగా పరిచయం. షూటింగ్‌ల్లో జమునవుంటే నాకు బెరుకుండేది కాదు. బాలనటిగా దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించా. భాగ్యరేఖ, మాంగల్యబలం, వెలుగునీడలు వంటి చిత్రాలు సమాంతరంగా తమిళంలోనూ రూపొందించారు. పెద్ద తారల మార్పు తప్పితే నాలాంటి చిన్నవాళ్ల పాత్రల్లో మేమే ఉండేవాళ్లం. ఓ డైరెక్ట్ తమిళ చిత్రంలోనూ నటించిన గుర్తుంది.
ఎన్నో కబుర్లతో అక్కినేని
చంగయ్య దర్శకత్వంలో వచ్చిన దొంగల్లో దొర చిత్రంలో రేలంగి కూతురిగా నటించా. నాకు జతగా మాస్టర్ మురళి చేశాడు. మురళి తల్లిలేని గుమ్మడి కొడుకు. అతనే పెద్దయ్యాక అక్కినేని. మా నాన్నా, నాగేశ్వరరావు మంచి స్నేహితులు. షాట్ విరామ సమయంలో అక్కినేని నాకు ఎన్నో కబుర్లు చెప్పేవారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా జూపిటర్ వారు రూపొందించిన వాల్మీకి (1963) చిత్రంలో చివరిగా నటించా.
అన్నపూర్ణతో అనుబంధం
మాంగల్యబలం, వెలుగునీడలు వంటి ఆదర్శవంతమైన చిత్రాలను రూపొందించిన అన్నపూర్ణ సంస్థలో నటించడం వరమే. ఈ రెండు చిత్రాలకు ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. మాంగల్యబలంలో చిన్ననాటి సావిత్రి వేషం. బాబ్జీ నాకు తోడుగా నటించాడు. బొమ్మల పెళ్లిలో జరిగే బాల్య వివాహం పెద్దయ్యాక కూడా కొనసాగాలన్న సందేశంతో చిత్రీకరించిన ‘హాయిగా ఆలూ మగలై కాలం కడపాలి’ అనే పాట నాకు చాలా ఇష్టం. వెలుగు నీడల్లో ఎస్వీఆర్ కూతురిగా, రేలంగి దంపతుల పెంపకంలో పెరిగే సరోజగా నటించాను. ఈ చిత్రంలోనే రేలంగితో శివగోవింద గోవింద అనే పాటలో నటించడం తియ్యని అనుభూతి.
పారితోషికం లేదు
నేను ఇన్ని చిత్రాల్లో నటించినా ఏనాడూ మా నాన్న పారితోషికం తీసుకోలేదు. ఆయన నన్ను సరదాగా నటింపచేశారు అంతే. దుక్కిపాటి మధుసూధనరావు మాత్రం పారితోషికం కింద ఓ బ్యాంక్ చెక్కును పంపారు. అందుకు నాన్న ఒప్పుకోలేదు. నిర్మాత సూచనమేరకు ఆ డబ్బును నా పేరిట బ్యాంకులో వేశారు. నటి రాజసులోచన బృందంలో డాన్సు చేసినందుకు ఆమె కూడా నగదు పంపితే నాన్న తిప్పి పంపేశారు. ‘డబ్బుకోసమైతే శశికళను మీతో పంపను’ అని సున్నితంగా చెప్పేవారాయన.
కలచివేసిన సంఘటన
-మాంగల్యబలం షూటింగ్‌లో నాపై పెళ్లి సన్నివేశం. ఓవైపు మా అమ్మ నిండు గర్భిణిగా ఆస్పత్రిలో చేరడంతో సిజేరియన్ చేశారు. ఆరో రోజు అమ్మ చనిపోవడం నా జీవితాన్ని కలచివేసిన సంఘటన. మా అమ్మ చనిపోయిన విషయం తెలిసి షూటింగ్ క్యాన్సిల్ చేసి యూనిట్ మొత్తం ఆస్పత్రికి వచ్చింది.
శభాష్‌రాముడు విశేషాలు
ఈ చిత్రంలో ఎన్టీఆర్, దేవిక కూతురిగా నటించాను. బాబాయిగా రమణమూర్తి నటించారు. బాబాయిని నాన్న రిక్షాతొక్కి చదివిస్తే, ఓ హత్యానేరంపై నాన్నను అరెస్టు చేయడానికి బాబాయి వస్తాడు. అప్పుడు అన్నా, వదిన మాట్లాడకపోతే ‘నువ్వైనా నాతో మాట్లాడవా.. అమ్మా నీకు కూడా నామీద కోపమేనా?’ అని నన్ను అడుగుతాడు. అప్పుడు ఓవైపు బాబాయిపై ప్రేమ, మరోవైపు తండ్రిని అరెస్టు చేస్తున్నాడన్న కోపం రెండూ నా ముఖంలో ప్రతిఫలించాలి. బాబాయి చెంపమీద కొట్టి ‘చిన్నాన్నా’ అంటూ కావలించుకోవాలి. దర్శకుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ నిజంగానే రమణమూర్తి చెంపను చెళ్లుమనిపించాను. ఆయన చెంప ఎర్రబడింది. అయినా ననే్నమీ అనలేదు. ఆమధ్య ఆయన్ని కలుద్దామనుకున్నాను కానీ, కలవలేకపోయాను.
చదువు సంధ్యలు
చిన్నప్పటినుంచి కానె్వంట్‌లో చదువుకున్నా నటన, నాట్యం, సంగీతంపై అభిరుచి ఉండటంతో ఆంధ్ర మహిళా సభవారు నిర్వహించే బడిలో చేర్చారు. అక్కడ వెంపటి జగన్నాధశర్మ నాకు తొలి గురువు. కూచిపూడి నాట్యం వెంపటి చినసత్యం వద్ద నేర్చుకున్నాను. ఇందిరారాజన్ శిష్యరికంలో భరతనాట్యంలో మెళకువలు అభ్యసించాను. బిఏ ఎకనామిక్స్ పూర్తి చేశాను.
మధురస్మృతులు
ఉదయం షూటింగ్ మొదలయ్యేసరికి ఖచ్చితంగా పది గంటలయ్యేది. అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరి డైలాగులు వాళ్లకిచ్చేవారు. మాలాంటి పిల్లలకు డైలాగులను బట్టీ పట్టించేవారు. అది కంఠతా వచ్చాక ఎలా చెప్పాలో నేర్పేవారు. రిహార్సల్స్ చేయించేవారు. దర్శకుడు తుది సూచనలు ఇచ్చేవారు. డైలాగులకు డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ముందే అన్నీ సరి చూసుకునేవాళ్లు. సూర్యకాంతం, కన్నాంబవంటి సీనియర్ నటులు పెద్ద పెద్ద క్యారేజీలు ఇంటినుంచి తెప్పించి, అందరికీ పంచి తినిపించేవారు. మాకు వనభోజనాలు చేస్తున్న అనుభూతి కలికేది. కొంతసేపు విశ్రాంతి తర్వాత టచప్స్ చేసుకుని, మళ్లీ షాట్‌కు రెడీ అయ్యేవాళ్లం. ప్యాకప్ 8 గంటలకైతే ఇంటికి వచ్చి పాఠాలు వల్లెవేసేదాన్ని. మద్రాసులో కాలేజీ చదువులకు వెళ్లటం మొదలయ్యాక సినిమా పరిశ్రమలో అనేక మార్పులొచ్చాయి. ముఖ్యంగా అహంభావం నటీనటుల్లో ఎక్కువైంది. చదువుపై శ్రద్ధపెట్టి సినిమాలకు దూరంగా జరిగాను. ఆనాటి విషయాలన్నీ తలచుకుంటే విచిత్రమైన అనుభూతి మిగులుతుంది.
హాబీలు
నాకు కారు రేసులంటే సరదా. షోలింఘర్ కారు రేసు పోటీల్లో బహుమతి పొందాను. మహిళా విభాగంలో నేనే ఫస్ట్. బెంగుళూరు పాదల్ జింఖానా కారు రేసులో మగవారితో పోటీపడి 13వ స్థానంలో నిలిచాను. లండన్‌లో ఉంటూ యూరప్ మొత్తం కారులో తిరిగి చూశాను. మావారు తల్లం రవిశంకర్. ఆటోమొబైల్ ఇంజినీర్. ఆయనకూ కారురేసులు అంటే సరదా. ప్రస్తుతం కూచిపూడి నాట్యంలో అమ్మాయిలకు లండన్‌లోనే ఉండి శిక్షణ ఇస్తున్నా. ఇటీవల లండన్‌లోని వెంకటేశ్వరస్వామి దేవాలయానికి సాంస్కృతిక కార్యదర్శిగా, యూరోపియన్ తెలుగు సంఘానికి కోశాధికారిణిగా సేవలు అందిస్తున్నా. ‘శశికళ హృదయాంజలి’ పేరుతో ఓ మ్యూజిక్ ఆల్బమ్ విడుదల చేశాను. ఇదంతా నా ఆత్మసంతృప్తికోసం చేసిందే తప్ప వ్యాపారంకోసం కాదు.
కుటుంబం, బాధ్యతలు
మాది చింతలేని చిన్న కుటుంబం. లండన్ నగరంలో ఓ కార్ల కంపెనీకి ఆయన మేనేజర్‌గా ఉన్నారు. నాకు ఒక్కడే కొడుకు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఇంజినీర్. కళారంగంలో వ్యాపకాలు అనేకం నాకు ఉన్నాయి. ఎప్పుడూ ఖాళీగా ఉండను. లండన్‌లో ఉన్నా మాతృభూమిపై మమకారం ఎక్కువ. అవకాశం దొరికినప్పుడల్లా ఇక్కడికి వస్తూనే ఉంటాను. అలనాటి మధురస్మృతులు నెమరువేసుకుంటూనే ఉంటాను.

-సరయు, చారి